జహీరాబాద్ సభలో మాట్లాడుతున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్. చిత్రంలో గీతారెడ్డి తదితరులు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి, జహీరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ చెంచాగిరీ చేస్తున్నారని.. ఆయన పేరు చెబితేనే గజగజలాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షు డు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రంలో విభజన హామీల కోసం అక్కడి ఎంపీలు కొట్లాడుతుంటే.. ఇక్కడ కేసీఆర్ మాత్రం నోట్ల రద్దు, జీఎస్టీలను సమర్థిస్తున్నారని మండిపడ్డారు. టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాచైతన్య బస్సు యాత్ర బుధవారం సంగారెడ్డి జిల్లాలో సాగింది. ఈ సందర్భంగా జహీరాబాద్, నారాయణఖేడ్‌లలో జరిగిన బహిరంగసభల్లో ఉత్తమ్ ప్రసంగించారు.
‘‘మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా మైనారిటీలను ఇబ్బందులకు గురిచేస్తోంది. మైనారిటీలపై వేధింపులు పెరిగాయి. అలాంటి మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ చెంచాగిరీ చేస్తున్నారు. ఆయన పేరు చెబితేనే గజగజలాడుతున్నారు. పొరుగు రాష్ట్రంలో ఎంపీలు విభజన హామీల అమలు కోసం కొట్లాడుతుంటే.. ఇక్కడ కేసీఆర్ మాత్రం నోట్లరద్దు, జీఎస్టీ తదితరాలను సమర్థిస్తున్నారు..’’అని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే మోదీకి ఓటు వేసినట్లేనని.. మైనారిటీల హక్కుల రక్షణ, సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యమని అన్నారు.
కేసీఆర్‌ను ప్రజలే తరిమికొడతారు
రూ.500 కోట్లతో అధునాతన భవనం కట్టుకుని.. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు అ త్యంత విలాస జీవితం అనుభవిస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. నాలుగేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తాము అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, మహిళా సంఘాలకు రూ.లక్ష రివాల్వింగ్ ఫండ్, అభయ హస్తం పింఛన్ పునరుద్ధరణ, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి వంటివి అమలు చేస్తామని.. పంటలకు మద్దతు ధర అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
అధిష్టానం ఆదేశిస్తే
కేసీఆర్‌పై పోటీ చేస్తా: కోమటిరెడ్డి
అధిష్టానం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. జహీరాబాద్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ సర్వేల పేరు చెబుతూ బతుకుతున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు ఆనాడే మంత్రి పదవి ఇచ్చి ఉంటే తెలంగాణ గురించి మాట్లాడేవాడే కాదని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఇక కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై పార్టీలో గందరగోళం ఉన్నమాట వాస్తవమేనని, అయితే అధిష్టానం దగ్గర కొట్లాడి అయినా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని సీఎం చేస్తామని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పేర్కొన్నారు.
106 సీట్లు రాకపోతే కేసీఆర్ తప్పుకొంటారా..
‘‘వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పక్షంలో నేను నా కుటుంబంతో సహా రాజకీయాల నుంచి వైదొలుగుతా. 106 అసెంబ్లీ స్థానాల్లో గెలవకుంటే కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకొంటారా..’’అని ఉత్తమ్ సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వచ్చాక 2019–20లో ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్ రూ.1.90 లక్షల కోట్ల మేర ఉంటుందన్నారు. సాగు, తాగునీటి ప్రాజెక్టుల్లో సీఎం ఆరు శాతం కమీషన్ తీసుకుంటున్నారని.. తాము అధికారంలోకి రాగానే కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులపై పునః సమీక్ష జరుపుతామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment