పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్
మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి కృష్ణానదిలో 3గంటల బోటు ప్రయాణం
కొల్లాపూర్: నల్లమల కొండల మధ్య కృష్ణానదిపై బోటుప్రయాణం అద్భుతంగా.. ఆహ్లాదకరంగా ఉందని పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. శనివారం ఆయన కొల్లాపూర్‌లోని పలు ఆధ్యాత్మిక ఆలయాలు, కృష్ణానదీ తీరప్రాంతాన్ని జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్‌తో కలిసి సందర్శించారు. ముందుగా జటప్రోల్ మదనగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించి రాతిశిల్పాలను పరిశీలించారు. అనంతరం కొల్లాపూర్‌లోని మాదవస్వామి దేవాలయాన్ని సందర్శించి ఆలయవిశిష్టత తెలుసుకున్నారు. అక్కడినుంచి నేరుగా సోమశిలకు చేరుకుని లలితాంబికా సోమేశ్వరాలయంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు. సమీపంలోని కృష్ణానదీ తీరప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం కొల్లాపూర్‌లోని సురభిరాజుల బంగ్లాను తిలకించారు. బంగ్లాలో రాజులు వాడిన వస్తువులు, వారు వేటాడిని జంతుచర్మాలతో రూపొందించిన బొమ్మలు, అద్భుతమైన చిత్రకళా సంపదను చూసి ముగ్ధులయ్యారు. బంగ్లాలోని రాణిమహాల్, చంద్రమహాల్, మంత్రమహాల్, షాదీమహల్‌ను వీక్షించారు. సోమశిల సోమేశ్వరాలయం, కృష్ణాతీరప్రాంతం, జటప్రోల్ మద నగోపాలస్వామి ఆలయం, ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టును పర్యాటకప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకోసం ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యాటక మంత్రికి వివరించారు. బంగ్లా సందర్శన అనంతరం మంత్రులు సింగోటంలోని శ్రీవారి సముద్రం చెరువును తిలకించారు.
ఉల్లాసంగా పడవ ప్రయాణం..
సోమశిల నుంచి శ్రీశైలం వరకూ పర్యాటక బోట్లను ఏర్పాటుచేయాలని పర్యాటక శాఖ బావిస్తున్న నేపథ్యంలో తీరప్రాంతం అందాలను మంత్రులు తిలకించారు. శ్రీశైలం నుంచి తెప్పించిన పర్యాటక బోటులో మూడుగంటల పాటు ప్రయాణించారు. సోమశిల నుంచి 15కి.మీ దూరంలో ఉన్న అంకాలమ్మ కోట, చీమలతిప్ప దీవి వరకు బోటులో ప్రయాణించి వెనక్కివిచ్చేశారు. నదీ ప్రయాణంలో కోతిగుండు నుంచి ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టు చేరే బ్యాక్‌వాటర్‌ను తిలకించారు. అమరగిరి గ్రామ అందాలను కృష్ణాతీరం వెంట ఉన్న మత్స్యకారుల ఆవాసాలను, రాతికొండలను చూస్తూ ఉత్సాహంగా బోటుప్రయాణం సాగించారు. పాపికొండలను తలపించే రీతిలో నదీప్రవాహం ఉందని మంత్రులు అన్నారు. బోటు ప్రయాణం సాగినంతసేపూ మంత్రులు ఉత్సాహంగా గడిపారు.
అద్భుతం.. కృష్ణాతీరం
Published Sun, Mar 1 2015 1:02 AM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM
Advertisement
Advertisement