సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భార్య సవితా కోవింద్, కుమార్తె స్వాతిని అనుమతి లేని పడవలో కృష్ణా నదిలో విహారానికి తీసుకెళ్లడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై రాష్ట్రపతి భవన్‌కు నివేదిక ఇచ్చేందుకు వివరాలు సేకరిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి గుబులు పట్టుకుంది. ఆ ఒక్క బోటుకు అప్పటికప్పుడు అనుమతి ఇచ్చామనే వాదనను తెరపైకి తెచ్చింది. అస్పష్టమైన వివరాలతో ఉన్న ఆ ప్రకటన ప్రభుత్వ తప్పిదాన్ని చెప్పకనే చెబుతోంది.
కృష్ణా నదిలో ఇటీవలే అనుమతి లేని పడవ బోల్తాపడి 22 మంది పర్యాటకులు దుర్మరణం పాలయ్యారు. అయినప్పటికీ రాష్ట్రపతి కుటుంబ సభ్యులను అనుమతి లేని బోటులో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విజయవాడలోని పున్నమీ ఘాట్ నుంచి భవానీ ద్వీపానికి తీసుకువెళ్లింది. అనుమతి లేకుండా పడవలు నడుపుతున్న ‘చాంపియన్ యాచ్ క్లబ్’పై గతేడాది విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. బోట్లను సీజ్ చేసి జలవనరుల శాఖకు అప్పగించారు. తరువాత కృష్ణా జిల్లాకు చెందిన కీలక మంత్రి ఒత్తిడితో ఆ బోట్లను విడిచిపెట్టారు.
తాజాగా నవంబర్ 12న కృష్ణా నదిలో బోటు ప్రమాదం జరిగాక పర్యాటక శాఖ అధికారులు దాడులు నిర్వహించి బోట్లను సీజ్ చేశారు. ఇవేవీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతి సతీమణి, కుమార్తెను అదే చాంపియన్ యాచ్ క్లబ్ బోటులోనే పున్నమి ఘాట్ నుంచి భవానీ ద్వీపానికి తీసుకెళ్లింది. ప్రభుత్వ నిర్లక్ష్యంపై రాష్ట్రపతి భవన్ వర్గాలు తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. దీనిపై నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ ఉదంతంపై గురువారం ఆరా తీశాయి.
ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ
అనుమతి లేని పడవలో రాష్ట్రపతి కుటుంబ సభ్యులను తీసుకెళ్లడంపై కేంద్ర ప్రభుత్వం వివరణ కోరడంతో రాష్ట్ర ప్రభుత్వంలో గుబులు మొదలైంది. ఈ ఉదంతం ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ తెస్తుందని భావిస్తున్నారు. దీన్ని ఎలా కప్పిపుచ్చాలన్న దానిపై ప్రభుత్వం తర్జనభర్జన పడింది. ఎట్టకేలకు గురువారం సాయంత్రానికి ఓ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. రాష్ట్రపతి సతీమణి, కుమార్తెను భవానీ ద్వీపానికి తీసుకువెళ్లేందుకు అప్పటికప్పుడు, అంటే బుధవారం ఉదయం 11 గంటలకు ఆ బోటుకు తాత్కాలిక అనుమతి ఇచ్చామని తెలిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం కీలకమైన విషయాలను విస్మరించడం సందేహాస్పదంగా మారింది.
అప్పటికప్పుడు అనుమతి ఇచ్చారట!
నిబంధనల ప్రకారం బోటుకు మొదట రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు అనుమతి ఇవ్వాలి. బోటు నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉందా లేదా అన్నది రెవెన్యూ అధికారులు పరిశీలించాలి. ఏదైనా ప్రమాదం జరిగితే నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అన్నది అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీ చేయాలి. అనంతరం బోటు సైజు, సామర్థ్యాన్ని జలవనరుల శాఖ పరిశీలించి నిర్ణీత రూటులో ప్రయాణించేందుకు అనువైనదా కాదా అన్నది చూడాలి.
అన్నీ సురక్షితంగా, సక్రమంగా ఉంటేనే అనుమతి ఇవ్వాలి. రాష్ట్రపతి కుటుంబ సభ్యులు ప్రయాణించిన బోటు విషయంలో అన్ని నిబంధనలు పాటించారా లేదా అన్న విషయాన్ని ప్రభుత్వం తన ప్రకటనలో వెల్లడించలేదు. కేవలం జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అప్పటికప్పుడు తాత్కాలిక అనుమతి ఇచ్చారని పేర్కొనడం గమనార్హం. రాష్ట్రపతి కుటుంబ సభ్యుల విషయంలోనే ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ఇక సామాన్య పర్యాటకులు పరిస్థితి ఏమిటన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment