
సాక్షి, నాగాయలంక: కృష్ణా నదిలో పడవ బోల్తా పడిన సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది. కృష్ణాజిల్లా ఎదురుమొండి దీవుల నుంచి ప్రయాణికులతో వస్తున్న పడవ కృష్ణానదిలో బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న 20మందిని స్థానికులు కాపాడారు. కాగా, పడవలో రేవు దాటించేందుకు ఎక్కించిన 4 బైక్‌లు, ఇతర సామగ్రి నీటిపాలయ్యాయి.
దీవుల వద్ద నిత్యం ప్రయాణికులను దాటించే పంట్‌ను పడవ పోటీల కోసం నాగాయలంకకు అధికారులు తరలించడంతో నాలుగు పంచాయతీల ప్రజలు గత్యంతరం లేక నాటు పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. అయితే సామర్థ్యం మించి ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు. పడవ పోటీల కోసం స్థానిక ఎమ్మెల్యే, ఉపసభాపతి బుద్ద ప్రసాద్ ఆదేశాలతో పంట్‌ను తరలించారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకన్నా పడవ పోటీలకే అధికారులు ప్రాధాన్యత ఇచ్చారని విమర్శిస్తున్నారు.
గత నవంబర్ 12న కృష్ణా నదిలో అనుమతి లేని పడవ బోల్తాపడి 22 మంది పర్యాటకులు దుర్మరణం పాలయ్యారు. ఇంత జరిగినా అధికారులు కళ్లు తెరవడం లేదు. డిసెంబర్ 27న అనుమతి లేని పడవలో రాష్ట్రపతి కుటుంబ సభ్యులను విహారానికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలైంది.