edurumondi
-
తానే జీత ఇస్తానని యువతికి హామీ ఇచ్చిన మంత్రి పేర్నినాని
-
ఉత్తుత్తి వాగ్దానాల బాబు !
సాక్షి,అవనిగడ్డ : సాగర సంగమ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.. ‘ఏటిమొగ – ఎదురుమొండి మధ్య కృష్ణా నదిలో రూ.74 కోట్లుతో వారధి నిర్మిస్తాం.. చుక్కల భూములు, కండిషన్ పట్టాల భూముల సమస్య పరిష్కరిస్తాం.. ఇలా దివిసీమ వాసులకు ఇచ్చిన మరెన్నో హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటిపై రాతలుగా మార్చేశారు. ప్రతి సారీ మాట తప్పి నిన్ను నమ్మం బాబు అనే పరిస్థితి తెచ్చుకున్నారు. ఎదురుమొండి వారధి ఏమైంది? గత ఏడాది నవంబర్ 21వ తేదీ ఉల్లిపాలెం, చల్ల పల్లిలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటిమొగ – ఎదురుమొండి వారధి నిర్మాణానికి రూ.74 కోట్లు కేటాయించామని, టెండర్లు పూర్తికాగానే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అప్పటి నుంచి ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి మూడు నెలల సమయం ఉన్నా ఈ విషయంలో.. ఎలాంటి చర్యలు చేపట్టక పోవడం పట్ల దీవుల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2008లో రూ.45 కోట్లతో వారధి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు నిధుల కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపాదనలు పంపారు. ఆయన మరణం అనంతరం వీటిని ఎవరూ పట్టించుకోలేదు. ఈ నెల 19వ తేదీ అవనిగడ్డలో నిర్వహించిన బహిరంగ సభలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎదురుమొండి వారధి నిర్మిస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. పర్యాటక అభివృద్ధి శూన్యం పవిత్ర కృష్ణా నది సముద్రంలో కలిసే సాగర సంగమం ప్రాంతం చారిత్రక ప్రదేశంగా గుర్తింపు పొందింది. 2017లో నిర్వహించిన కృష్ణా పుష్కరాలు సందర్భంగా సాగర సంగమానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంతంలో నెలకొన్న అడ్డంకులను తొలగించి సాగర సంగమాన్ని ప్రత్యేక సందర్శన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, కూచిపూడి, శ్రీకాకుళం, ఘంటసాల, మోపిదేవి, అవనిగడ్డ, హంసలదీవిలను కలుపుతూ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగా ఇంతవరకూ ఎలాంటి చర్యలు లేవు. చుక్కలు చూపిస్తున్నారు దివిసీమలోని పలు మండలాల్లో కండిషన్ పట్టా భూములు రైతులకు చుక్కలు చూపిస్తున్నా పాలకులు స్పందించకపోవడంపై దివి రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ మండలాల్లో కండిషన్ పట్టా (సీపీ పట్టా), చుక్కల భూములు 34 వేల ఎకరాలు ఉన్నాయి. ఈ భూములన్నీ ఐదారు తరాల నుంచి రిజిస్ట్రేషన్ అవుతున్న భూములే అయినప్పటికీ కండిషన్ పట్టా లిస్టులో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితిలో పొలాలను అమ్ముకునేందుకు వీలు పడక, అప్పుల పాలవుతున్నారు. రక్షణ కేంద్రం ఏర్పాటయ్యేనా? దివిసీమలోని గుల్లలమోదలో క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు నాలుగేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 381.61 ఎకరాలు అటవీ భూములను కేటాయించారు. అప్పటి నుంచి పలు అవరోధాలు వల్ల ప్రాజెక్టు జాప్యం అవుతూ వస్తోంది. కేంద్రంలో బీజేపీతో టీడీపీ అంటకాగిన నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేకపోగా, టీడీపీ కేంద్రంతో తెగతెంపులు చేసుకున్నాక పలు అనుమతులు రావడం కొసమెరుపు సీఎం దివిసీమకు ఇచ్చిన హామీలు కోడూరు పీహెచ్‌సీని 24 గంటల వైద్యశాలగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మరచిపోయారు. కోడూరు, నాగాయలంక మండలాల్లో లింగన్నకోడు, ఇరాలి, రత్నకోడుపై చెక్‌డ్యాంలు (రబ్బర్ డ్యాంలు) నిర్మిస్తామని చెప్పారు. ఉత్తుత్తి హామీ చేశారు. విజయవాడ – మచిలీపట్నం నాలుగులైన్లకు ఉల్లిపాలెం వారధిని అనుసంధానం చేస్తామన్నారు. ఆ ఊసే మరిచారు. కేరళను తలదన్నే ప్రకృతి సుందర ప్రదేశమున్న దివిసీమను రాజధానిలో గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. అవనిగడ్డ నియోజకవర్గాన్ని జిల్లాలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆ తర్వాత పట్టించుకున్న పాపానపోలేదు. రూపాయి బోనస్ ఇవ్వలేదు గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు ఆరు ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట నీట మునిగి దెబ్బతింది. మొక్కజొన్న తడిసిందని క్వింటాల్‌కు రూ.150 తగ్గించి కొన్నారు. దీనివల్ల ఎకరాకు రూ.6 వేలు నష్టపోయాం. క్వింటాల్‌కు రూ.200 బోనస్ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఏడాది అయినా ఇంతవరకూ ఒక్క రైతుకు రూపాయి బోనస్ ఇవ్వలేదు. – గాజుల రాంబాబు, రైతు, బందలాయిచెరువు -
ఎదురుమొండి...మొండిబతుకులు!
సాక్షి, అవనిగడ్డ : బాహ్య ప్రపంచానికి దూరంగా.. కష్టాలు.. కన్నీళ్లు.. వలస బతుకులకు చేరువగా ఎదురుమొండి దీవుల ప్రజలు దీనావస్థలో కాలంవెళ్లదీస్తున్నారు. పాలకుల హామీలు నీటిమూటలు కాగా.. ఓట్ల రాజకీయం శాపంగా ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోయింది. కనీస మౌలిక వసతులు లేక జనం ఆకలికేకలతో పల్లెదాటి వలస కూలీలుగా మారుతున్న దురవస్థ. తమ కష్టాలు కడతేర్చే పాలన కోసం ఈ ప్రాంతం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. జిల్లాలో రవాణా సౌకర్యం లేని ఏకైక ప్రాంతం నాగాయలంక మండలంలోని ఎదురుమొండి దీవులు. మూడు పంచాయతీలున్న ఈ దీవులకు వెళ్లాలంటే ఫంటు, పడవ ప్రయాణమే దిక్కు. గతంలో ఎదురుమొండి, గొల్లమంద వద్ద జరిగిన పడవ ప్రమాదాల్లో 50 మంది మరణించినా పాలకుల్లో చలనం లేదు. గత ఏడాది నవంబర్‌లో దివిసీమ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటిమొగ –ఎదురుమొండి వారధి నిర్మాణానికి రూ.77 కోట్ల నిధులు ప్రకటించినా అతీగతీ లేదు. గుంటూరు జిల్లా రాజుకాలువ ప్రజల దయాదాక్షిణ్యాలే ఈ దీవుల సాగు, తాగునీరుకి ఆధారం. దీవుల్లో బంగారు పంటలు పండే రెండు వేల ఎకరాలు ఆయకట్టు ఉండగా, సాగునీరందక ఐదేళ్లలో రెండు సార్లు పంట విరామం ప్రకటించారు. ఎదురుమొండి – నాచుగుంట మధ్య నిర్మించాల్సిన రహదారి, అటవీ భూముల ఆంక్షల పేరుతో మూడు కిలోమీటర్ల మేర ఆగిపోయింది. గతంలో 50 మంది మృత్యువాత ఎదురుమొండి దీవుల్లో కృష్ణా నదిలో జరిగిన రెండు పడవ ప్రమాదాల్లో 50 మంది మృత్యువాతపడ్డారు. 1990లో ఎదురుమొండి వద్ద జరిగిన పడవ ప్రమాదంలో 20 మంది మరణించగా, 2004లో గొల్లమందలో జరిగిన పడవ ప్రమాదంలో 30 మంది చనిపోయారు. వీరంతా కూలి పనులకు, మండల కేంద్రాలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదాలు జరిగాయి. అప్పటి నుంచి ఎదురుమొండి దీవులకు వారధి నిర్మించాలని డిమాండ్ ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఎదురుమొండి దీవులను పట్టించుకోలేదని ప్రజలు చెబుతున్న మాట. వారధి నిర్మాణం కోసం రూ.74 కోట్లు ప్రకటించినా.. 2004, 2009, 2014 ఎన్నికల్లో ఏటిమొగ – ఎదురుమొండి వారధి నిర్మాణం అంశం ప్రధాన అస్త్రంగా సాగింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏటిమొగ – ఎదురుమొండి వారధి నిర్మాణం కోసం రూ.45 కోట్లు ప్రపంచ బ్యాంకు నిధుల కోసం ప్రతిపాదనలు పంపగా, అనంతరం మహానేత మరణంతో దీని గురించి పట్టించుకున్నవారే లేరు. గత ఏడాది నవంబర్ 21న ఉల్లిపాలెం, చల్లపల్లిలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటిమొగ – ఎదురుమొండి వారధి నిర్మాణం కోసం రూ.74 కోట్లు నిధులు మంజూరు చేసినట్టు ప్రకటించినా అతీగతీ లేదు. రెండుసార్లు సాగుకు విరామం ఎదురుమొండి దీవుల్లో 2 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇది కాకుండా మాజీ సైనికులు, ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మరో మూడు వేల ఎకరాల అటవీభూమి ఉంది. గుంటూరు జిల్లాలోని రాజుకాలువ వద్ద ఉన్న పంపింగ్ స్కీం నుంచి ఎదురుమొండిలోని చెరువులకు నింపి అక్కడ నుంచి పంట పొలాల సాగుకు రైతులు నీటిని వాడుకుంటుంటారు. 2014 – 15లో రెండేళ్లు సాగునీరందక దీవుల్లో రైతులు సాగుకు విరామం ప్రకటించారు. 2016 – 17లో అరకొరగా అందిన సాగునీటితో పంటలు సాగుచేసుకున్నారు. గత ఏడాది రాజుకాలువ రైతులు పంపింగ్ పథకాన్ని అడ్డుకోవడం, కృష్ణానది పాయలో వేసిన పైపులైన్ దెబ్బతినడంతో రెండు వేల ఆయకట్టుకుగాను 450 ఎకరాల్లో మాత్రమే సాగుచేయగలిగారు. ఎదురుమొండి రక్షిత మంచినీటి పథకం చెరువు నీరు పసర్లు కమ్ముకోవడంతో దిక్కులేని స్థితిలో ఈ నీటినే వాడుకుంటున్నారు. సాగునీరందక ఎండిపోయిన పంటను చూసి దిగాలుగా ఉన్న రైతులు ఆగని వలసలు ఎదురుమొండి దీవుల్లో సక్రమంగా సాగునీరు అందకపోవడం, ఇతర పనులు లేకపోవడం వల్ల ఈ దీవులకు చెందిన ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారు. ఏడాదిలో ఎనిమిది నెలలు విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు పనుల కోసం ఈ ప్రాంత ప్రజలు వలస వెళ్తుంటారు. గొల్లమంద, జింకపాలెం, ఎదురుమొండి నుంచి ఎక్కువగా వలసలు ఉంటున్నాయి. ఎదురుమొండి దీవుల్లోని ప్రజల సమగ్ర అభివృద్ధి పథకం కోసం 25 ఏళ్ల క్రితం ఎదురుమొండిలో వేసిన శిలాఫలకం ముళ్లకంప పెరిగి వెక్కిరిస్తోంది. మూడు పంచాయతీల్లో 8,785 మంది జనాభా.. ఎదురుమొండి దీవుల్లో ఎదురుమొండి, నాచుగుంట, ఈలచెట్ల దిబ్బ పంచాయతీలు ఉన్నాయి. ఎదురుమొండి పంచాయతీలో గొల్లమంద, జింకపాలెం, ఏసుపురం, కృష్ణాపురం, బ్రహ్మయ్యగారిమూల, బొడ్డువారిమూల, ఎదురుమొండి గ్రామాలు ఉన్నాయి. దీవుల్లోని ఈ మూడు పంచాయతీల్లో 8,785 మంది జనాభా ఉండగా, 3,513 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 95 శాతం మంది మత్స్యకారులే. ఓట్లు వేయలేదనే అక్కసుతో.. ఎదురుమొండి దీవుల ప్రజలు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు ఓట్లు వేయలేదనే అక్కసుతో ఈ దీవుల అభివృద్ధిని పట్టించుకోవడం లేదనే విమర్శలున్నారు. ఈ విషయాన్ని దివంగత శాసనసభ్యుడు అంబటి బ్రాహ్మణయ్య పలుసార్లు బాహాటంగానే చెప్పారు. 2009 ఎన్నికల్లో అప్పటి వరకూ మెజార్టీతో వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్, చివరిరౌండైన ఎదురుమొండి దీవుల్లో టీడీపీ అభ్యర్థి అంబటి బ్రాహ్మణయ్యకు 1504 అధిక్యంతో బ్రహ్మరథం పట్టారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బుద్ధప్రసాద్‌కు వైఎస్సార్సీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్‌బాబు కంటే కేవలం 365 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. రెండుసార్లు రెండు వేర్వేరు పార్టీలు మారినా దీవుల ప్రజలు తనను ఆదరించలేదనే కోపంతో ఎదురుమొండి దీవుల గురించి బుద్ధప్రసాద్ పట్టించుకోలేదని కొంతమంది దీవుల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఓట్లు వేయలేదని కక్ష గత రెండు ఎన్నికల్లో ఎదురుమొండి దీవుల్లో ప్రజలు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌కు ఓట్లు వేయలేదని మా దీవులపై కక్ష పెంచుకున్నారు. అందుకే దీవుల గురించి ఆయన పట్టించుకోవడం లేదు. రూ.74 కోట్లుతో ఎదురుమొండి వారధి నిర్మిస్తామని సీఎం ప్రకటించినా పనులు ప్రారంభించలేదు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తేనే మా దీవులకు మంచి రోజులు వస్తాయి. –నాయుడు అంకరాజు,ఎదురుమొండి, నాగాయలంక మండలం మా తాత కాలం నుంచి రోడ్డు ఉంది ఊరి పుట్టిన దగ్గర నుంచి నాచుగుంట – ఎదురుమొండి రోడ్డు ఉంది. గతంలో రెండు సార్లు వేశారు. ఇప్పుడు అటవీశాఖ అభ్యంతరాలు పెడితే ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. చినుకు పడితే ఈ రోడ్డుపై వెళ్లలేము. నదిలో నావపై నాగాయంక వెళ్లాలంటే 3 గంటల ప్రయాణం. ఎవరన్నా గర్భిణులు ఉన్నా, రోగస్తులున్నా నావపై తీసుకెళ్లాల్సిందే. – సైకం బస్వారావు, నాచుగుంట -
కృష్ణా నదిలో పడవ ప్రమాదం
-
కృష్ణా నదిలో పడవ బోల్తా
సాక్షి, నాగాయలంక: కృష్ణా నదిలో పడవ బోల్తా పడిన సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది. కృష్ణాజిల్లా ఎదురుమొండి దీవుల నుంచి ప్రయాణికులతో వస్తున్న పడవ కృష్ణానదిలో బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న 20మందిని స్థానికులు కాపాడారు. కాగా, పడవలో రేవు దాటించేందుకు ఎక్కించిన 4 బైక్‌లు, ఇతర సామగ్రి నీటిపాలయ్యాయి. దీవుల వద్ద నిత్యం ప్రయాణికులను దాటించే పంట్‌ను పడవ పోటీల కోసం నాగాయలంకకు అధికారులు తరలించడంతో నాలుగు పంచాయతీల ప్రజలు గత్యంతరం లేక నాటు పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. అయితే సామర్థ్యం మించి ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు. పడవ పోటీల కోసం స్థానిక ఎమ్మెల్యే, ఉపసభాపతి బుద్ద ప్రసాద్ ఆదేశాలతో పంట్‌ను తరలించారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకన్నా పడవ పోటీలకే అధికారులు ప్రాధాన్యత ఇచ్చారని విమర్శిస్తున్నారు. గత నవంబర్ 12న కృష్ణా నదిలో అనుమతి లేని పడవ బోల్తాపడి 22 మంది పర్యాటకులు దుర్మరణం పాలయ్యారు. ఇంత జరిగినా అధికారులు కళ్లు తెరవడం లేదు. డిసెంబర్ 27న అనుమతి లేని పడవలో రాష్ట్రపతి కుటుంబ సభ్యులను విహారానికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలైంది. -
కాలేజీలో హెడ్మాస్టర్ ఆత్మహత్య
మచిలీపట్నం: కృష్ణాజిల్లా అవనిగడ్డ డిగ్రీ కాలేజీలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ విషయాన్ని శనివారం కళాశాల సిబ్బంది గుర్తించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన డిగ్రీ కాలేజీకి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహన్ని మచిలీపట్నంలోని జిల్లా వైద్య ఆసుపత్రికి తరలించారు. మృతుడు నాగాయలంక మండలం ఎదురుమొండి హైస్కూల్ హెడ్మాస్టర్గా పోలీసులు గుర్తించారు. హెడ్మాస్టర్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.