ఎదురుమొండి దీవులకు ఈ బోటే ఆధారం
సాక్షి, అవనిగడ్డ : బాహ్య ప్రపంచానికి దూరంగా.. కష్టాలు.. కన్నీళ్లు.. వలస బతుకులకు చేరువగా ఎదురుమొండి దీవుల ప్రజలు దీనావస్థలో కాలంవెళ్లదీస్తున్నారు. పాలకుల హామీలు నీటిమూటలు కాగా.. ఓట్ల రాజకీయం శాపంగా ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోయింది. కనీస మౌలిక వసతులు లేక జనం ఆకలికేకలతో పల్లెదాటి వలస కూలీలుగా మారుతున్న దురవస్థ. తమ కష్టాలు కడతేర్చే పాలన కోసం ఈ ప్రాంతం వేయికళ్లతో ఎదురుచూస్తోంది.
జిల్లాలో రవాణా సౌకర్యం లేని ఏకైక ప్రాంతం నాగాయలంక మండలంలోని ఎదురుమొండి దీవులు. మూడు పంచాయతీలున్న ఈ దీవులకు వెళ్లాలంటే ఫంటు, పడవ ప్రయాణమే దిక్కు. గతంలో ఎదురుమొండి, గొల్లమంద వద్ద జరిగిన పడవ ప్రమాదాల్లో 50 మంది మరణించినా పాలకుల్లో చలనం లేదు. గత ఏడాది నవంబర్‌లో దివిసీమ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటిమొగ –ఎదురుమొండి వారధి నిర్మాణానికి రూ.77 కోట్ల నిధులు ప్రకటించినా అతీగతీ లేదు.
గుంటూరు జిల్లా రాజుకాలువ ప్రజల దయాదాక్షిణ్యాలే ఈ దీవుల సాగు, తాగునీరుకి ఆధారం. దీవుల్లో బంగారు పంటలు పండే రెండు వేల ఎకరాలు ఆయకట్టు ఉండగా, సాగునీరందక ఐదేళ్లలో రెండు సార్లు పంట విరామం ప్రకటించారు. ఎదురుమొండి – నాచుగుంట మధ్య నిర్మించాల్సిన రహదారి, అటవీ భూముల ఆంక్షల పేరుతో మూడు కిలోమీటర్ల మేర ఆగిపోయింది.
గతంలో 50 మంది మృత్యువాత
ఎదురుమొండి దీవుల్లో కృష్ణా నదిలో జరిగిన రెండు పడవ ప్రమాదాల్లో 50 మంది మృత్యువాతపడ్డారు. 1990లో ఎదురుమొండి వద్ద జరిగిన పడవ ప్రమాదంలో 20 మంది మరణించగా, 2004లో గొల్లమందలో జరిగిన పడవ ప్రమాదంలో 30 మంది చనిపోయారు. వీరంతా కూలి పనులకు, మండల కేంద్రాలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదాలు జరిగాయి. అప్పటి నుంచి ఎదురుమొండి దీవులకు వారధి నిర్మించాలని డిమాండ్ ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఎదురుమొండి దీవులను పట్టించుకోలేదని ప్రజలు చెబుతున్న మాట.
వారధి నిర్మాణం కోసం రూ.74 కోట్లు ప్రకటించినా..
2004, 2009, 2014 ఎన్నికల్లో ఏటిమొగ – ఎదురుమొండి వారధి నిర్మాణం అంశం ప్రధాన అస్త్రంగా సాగింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏటిమొగ – ఎదురుమొండి వారధి నిర్మాణం కోసం రూ.45 కోట్లు ప్రపంచ బ్యాంకు నిధుల కోసం ప్రతిపాదనలు పంపగా, అనంతరం మహానేత మరణంతో దీని గురించి పట్టించుకున్నవారే లేరు. గత ఏడాది నవంబర్ 21న ఉల్లిపాలెం, చల్లపల్లిలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటిమొగ – ఎదురుమొండి వారధి నిర్మాణం కోసం రూ.74 కోట్లు నిధులు మంజూరు చేసినట్టు ప్రకటించినా అతీగతీ లేదు.
రెండుసార్లు సాగుకు విరామం
ఎదురుమొండి దీవుల్లో 2 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇది కాకుండా మాజీ సైనికులు, ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మరో మూడు వేల ఎకరాల అటవీభూమి ఉంది. గుంటూరు జిల్లాలోని రాజుకాలువ వద్ద ఉన్న పంపింగ్ స్కీం నుంచి ఎదురుమొండిలోని చెరువులకు నింపి అక్కడ నుంచి పంట పొలాల సాగుకు రైతులు నీటిని వాడుకుంటుంటారు. 2014 – 15లో రెండేళ్లు సాగునీరందక దీవుల్లో రైతులు సాగుకు విరామం ప్రకటించారు. 2016 – 17లో అరకొరగా అందిన సాగునీటితో పంటలు సాగుచేసుకున్నారు. గత ఏడాది రాజుకాలువ రైతులు పంపింగ్ పథకాన్ని అడ్డుకోవడం, కృష్ణానది పాయలో వేసిన పైపులైన్ దెబ్బతినడంతో రెండు వేల ఆయకట్టుకుగాను 450 ఎకరాల్లో మాత్రమే సాగుచేయగలిగారు. ఎదురుమొండి రక్షిత మంచినీటి పథకం చెరువు నీరు పసర్లు కమ్ముకోవడంతో దిక్కులేని స్థితిలో ఈ నీటినే వాడుకుంటున్నారు.
సాగునీరందక ఎండిపోయిన పంటను చూసి దిగాలుగా ఉన్న రైతులు
ఆగని వలసలు
ఎదురుమొండి దీవుల్లో సక్రమంగా సాగునీరు అందకపోవడం, ఇతర పనులు లేకపోవడం వల్ల ఈ దీవులకు చెందిన ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారు. ఏడాదిలో ఎనిమిది నెలలు విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు పనుల కోసం ఈ ప్రాంత ప్రజలు వలస వెళ్తుంటారు. గొల్లమంద, జింకపాలెం, ఎదురుమొండి నుంచి ఎక్కువగా వలసలు ఉంటున్నాయి. ఎదురుమొండి దీవుల్లోని ప్రజల సమగ్ర అభివృద్ధి పథకం కోసం 25 ఏళ్ల క్రితం ఎదురుమొండిలో వేసిన శిలాఫలకం ముళ్లకంప పెరిగి వెక్కిరిస్తోంది.
మూడు పంచాయతీల్లో 8,785 మంది జనాభా..
ఎదురుమొండి దీవుల్లో ఎదురుమొండి, నాచుగుంట, ఈలచెట్ల దిబ్బ పంచాయతీలు ఉన్నాయి. ఎదురుమొండి పంచాయతీలో గొల్లమంద, జింకపాలెం, ఏసుపురం, కృష్ణాపురం, బ్రహ్మయ్యగారిమూల, బొడ్డువారిమూల, ఎదురుమొండి గ్రామాలు ఉన్నాయి. దీవుల్లోని ఈ మూడు పంచాయతీల్లో 8,785 మంది జనాభా ఉండగా, 3,513 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 95 శాతం మంది మత్స్యకారులే.
ఓట్లు వేయలేదనే అక్కసుతో..
ఎదురుమొండి దీవుల ప్రజలు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు ఓట్లు వేయలేదనే అక్కసుతో ఈ దీవుల అభివృద్ధిని పట్టించుకోవడం లేదనే విమర్శలున్నారు. ఈ విషయాన్ని దివంగత శాసనసభ్యుడు అంబటి బ్రాహ్మణయ్య పలుసార్లు బాహాటంగానే చెప్పారు. 2009 ఎన్నికల్లో అప్పటి వరకూ మెజార్టీతో వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్, చివరిరౌండైన ఎదురుమొండి దీవుల్లో టీడీపీ అభ్యర్థి అంబటి బ్రాహ్మణయ్యకు 1504 అధిక్యంతో బ్రహ్మరథం పట్టారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బుద్ధప్రసాద్‌కు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్‌బాబు కంటే కేవలం 365 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. రెండుసార్లు రెండు వేర్వేరు పార్టీలు మారినా దీవుల ప్రజలు తనను ఆదరించలేదనే కోపంతో ఎదురుమొండి దీవుల గురించి బుద్ధప్రసాద్ పట్టించుకోలేదని కొంతమంది దీవుల ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఓట్లు వేయలేదని కక్ష
గత రెండు ఎన్నికల్లో ఎదురుమొండి దీవుల్లో ప్రజలు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌కు ఓట్లు వేయలేదని మా దీవులపై కక్ష పెంచుకున్నారు. అందుకే దీవుల గురించి ఆయన పట్టించుకోవడం లేదు. రూ.74 కోట్లుతో ఎదురుమొండి వారధి నిర్మిస్తామని సీఎం ప్రకటించినా పనులు ప్రారంభించలేదు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తేనే మా దీవులకు మంచి రోజులు వస్తాయి.
–నాయుడు అంకరాజు,ఎదురుమొండి, నాగాయలంక మండలం
మా తాత కాలం నుంచి రోడ్డు ఉంది
ఊరి పుట్టిన దగ్గర నుంచి నాచుగుంట – ఎదురుమొండి రోడ్డు ఉంది. గతంలో రెండు సార్లు వేశారు. ఇప్పుడు అటవీశాఖ అభ్యంతరాలు పెడితే ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. చినుకు పడితే ఈ రోడ్డుపై వెళ్లలేము. నదిలో నావపై నాగాయంక వెళ్లాలంటే 3 గంటల ప్రయాణం. ఎవరన్నా గర్భిణులు ఉన్నా, రోగస్తులున్నా నావపై తీసుకెళ్లాల్సిందే.
– సైకం బస్వారావు, నాచుగుంట
Comments
Please login to add a commentAdd a comment