Nagayalanka
-
Mandali Venkata Krishna Rao: దివిసీమ గాంధీ
మండలి వెంకట కృష్ణారావు అవనిగడ్డ నుంచి 1972లో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యుడు, గాంధేయవాది. రాజకీయ విలువల్లో, భాషా భిమానంలో ఆయనకు వారసులు – మాజీ రాష్ట్రమంత్రి మండలి బుద్ధప్రసాద్. కృష్ణారావు 1926 ఆగస్టు 4న కైకలూరు మండలం పల్లెవాడలో జన్మించారు. వీరి స్వస్థలం నాగాయలంక మండలంలోని భావదేవరపల్లి. మండలి కృషి వల్లే దివిసీమలోని నిరుపేదలకు బంజరు భూము లను పంచే కార్యక్రమం ప్రారంభమైంది. 15 వేల ఎకరాల భూములను పేదలకు పంచారు. 1974లో ఆయన విద్యా, సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1975 రాక్షస నామ సంవత్సర ఉగాది నాడు ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాద్‌లో నిర్వహించారు. నిర్వహణ కమిటీకి మండలి కార్యనిర్వాహక అధ్యక్షునిగా వ్యవహరించారు. ‘అంతర్జాతీయ తెలుగు కేంద్రం’ సంస్థను 1975లో నాటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ ప్రారంభించారు. మండలి ఈ సంస్థకు ప్రథమ అధ్యక్షులుగా వ్యవహరించారు. (చదవండి: ప్రగతిశీల వైద్య శిఖామణి) ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల కార్యనిర్వాహక అధ్యక్షులుగా, అంతర్జాతీయ తెలుగు కేంద్రం ప్రథమ అధ్యక్షులుగా వ్యవహరించిన మండలి కృషిని గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంతర్జాతీయ తెలుగు కేంద్రం పేరును ‘మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం’గా మార్చారు. దివిసీమలోని పులిగడ్డ – పెనుమూడి వంతెనకు మండలి పేరు పెట్టారు. ‘దివిసీమ గాంధీ’గా ప్రజల మన్ననలు అందుకున్న మండలి 1997 సెప్టెంబర్ 27న మరణించారు. ‘బాధలలో ఉన్న వారిని మనమే వెళ్లి ఓదార్చాలని’ వారు ఆచరించి చెప్పిన మాటలు దివిసీమ ప్రజలకు భగవద్గీతలా వినిపిస్తూనే ఉంటాయి. (చదవండి: మనువును జయించిన విశ్వనరుడు) – డా. జె. వి. ప్రమోద్ కుమార్, పైడిమెట్ట (సెప్టెంబర్ 27న మండలి వెంకట కృష్ణారావు 25వ వర్ధంతి) -
క్షిపణి ప్రయోగ కేంద్రానికి మోక్షం
సాక్షి, నాగాయలంక(అవనిగడ్డ): కృష్ణాజిల్లా నాగాయలంక మండలంలోని గుల్లలమోద సముద్రతీరంలో కేంద్ర రక్షణశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న రక్షణ కేంద్రానికి అవరోధాలు తొలగిపోయాయి. 289 హెక్టార్లలో వెయ్యి కోట్ల వ్యయంతో డీఆర్డీవో నెలకొల్పనున్న గుల్లలమోద (నాగాయలంక) మిస్సైల్ లాంచింగ్ సెంటర్ ఏర్పాటుకు ఈనెల చివరి వారంలో శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం. ఇందుకోసం జిల్లా కలెక్టర్ ఎండీ ఇంతియాజ్ ఆదివారం నాగాయలంకలో పర్యటించి డీఆర్డీవో అధికారులతో కలిసి పరిశీలించారు. ఈనెల 26న రక్షణ కేంద్రానికి శంకుస్థాపన? రక్షణ కేంద్రం ఏర్పాటుకు ఈనెల 26న శంకుస్థాపన చేయనున్నట్టు తెలిసింది. ఈ కార్యక్రమం కోసం కలెక్టర్ ఎండీ ఇంతియాజ్ ఆదివారం నాగాయలంకలో అకస్మిక పర్యటన చేశారు. డీఆర్డీవో అధికారులు లెప్టినెంట్ కల్నల్ తిమ్మయ్య, బందరు ఆర్డీవో ఉదయభాస్కర్తో కలిసి ఆయన నాగాయలంకలో పర్యటించారు. దేశరక్షణశాఖకు చెందిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు శంకుస్థాపనకు కేంద్ర రక్షణశాఖా మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ నాగాయలంకకు రానున్నట్టు అధికారులు చెప్పారు. కేంద్ర రక్షణ మంత్రి పర్యటన కోసం నాగాయంలక సమీపంలోని వక్కపట్లవారిపాలెం ఓఎన్జీసీ హెలీపాడ్‌ను కలెక్టర్ పరిశీలించారు, అనంతరం బహిరంగసభ కోసం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ, గుల్లలమోద గ్రామంలో స్థలాలను అధికారులు పరిశీలించారు. అయితే శంకుస్థాపన వివరాలు అధికారులు గోప్యంగా ఉంచారు. సాకారం కానున్న దివి తీరప్రాంత ప్రజల అభివృద్ధి కల దివిసీమ తీరప్రాంత ప్రజల అభివృద్ధి కల సాకరం కానుండటంతో హర్షాతిరేకాలు వ్యక్త మవుతున్నాయి. ఈప్రాజెక్టకు కీలకమైన క్లియరెన్స్ చేయడంలో గత ఏడాది ఆగస్టులో అప్పటి కేంద్రప్రభుత్వ సైంటిఫిక్ అడ్వయిజర్ సతీష్‌రెడ్డి, ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ కమిషనర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ అనుమతుల పరంగా చేసిన విశేష కృషి చేశారు. అనుమతుల్లో అతికీలకమైన సుప్రీంకోర్టు క్లియరెన్స్, కేంద్రఅటవీశాఖ అనుమతులు, అమెండ్మెంట్ టూ సీఆర్‌జెడ్ రెగ్యులేషన్‌తో పాటు ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ లాంటివి ఈనెల మొదటివారంలో పూర్తయ్యాయి. ఈ రక్షణ కేంద్రానికి ఆరేళ్లుగా డీఆర్డీవో అధికారులు, అటవీశాఖ అత్యున్నత అధికారులు గుల్లలమోద, లైట్‌హౌస్ ప్రాంతాల్లో పలుమార్లు పర్యటించి అవసరమైన వనరుల పరిస్థితిని అధ్యయనం చేశారు. సముద్రతీరంలో గాలివేగం, అత్యాధునిక సాయిల్ టెస్ట్‌లు ముగించారు. ప్రాజెక్టు ఏర్పాటుకు తొలుత ఆటంకాలుగా ఉన్న అటవీశాఖ, రెవెన్యూవర్గాల ఒప్పందాలు క్లియర్ కావడంతో ప్రాజెక్ట్‌కు అవసరమై కేటాయించిన 381ఎకరాల భూమి అటవీశాఖ కింద ఉండటంతో పరస్పర భూముల అప్పగింత కార్యక్రమం రెండేళ్ల క్రితం పూర్తయింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూములకు 112మంది రైతులకు రూ.5కోట్ల పైచిలుకు పరిహారాన్ని 2018లో క్లియర్ చేశారు. సాగరమాల పథకంద్వారా తీరప్రాంత భవిష్యత్ మార్గాలు? గుల్లలమోద(నాగాయలంక)క్షిపణి ప్రయోగకేంద్రం నేపథ్యంలో కేంద్రప్రభుత్వ సాగరమాల పథకంద్వారా తీరప్రాంత ప్రధాన రహదారులన్నీ నాలుగు లేన్ల మార్గాలవుతాయని అంటున్నారు. పులిగడ్డ నుంచి నుంచి గుల్లలమోద వరకు, కోడూరుమండలంలో నూతనంగా నిర్మితమైన ఉల్లిపాలెం–మచిలీపట్నం వంతెన నుంచి గుల్లలమోద వరకు సాగరమాల కింద భవిష్యత్మార్గాలు ఏర్పడనున్నాయని అధికారులు అంచనావేస్తున్నారు. ప్రాజెక్టు పనులు మొదలయితే వేలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి కలగనుంది. దేశంలో రూపొందించే రెండో మిస్సైల్ లాంచింగ్ ప్యాడ్ సెంటర్ ఇదే కావడంతో కృష్ణాజిల్లాకు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఒడిస్సా రాష్ట్రం లోని బాలాసూర్ ధీటుగా ఇక్కడి ప్రాజెక్ట్ నిర్మాణం కానుందని అధికారులు చెబుతున్నారు. కలెక్టర్ పర్యటనలో మండల స్పెషలాఫీసర్ రామభార్గవి, తహశీల్దార్ ఎం.వెంకట్రామయ్య , ఈఆర్వోలు ఇతర అధికారులు పాల్గొన్నారు. డీఆర్డీవో ప్రాజెక్ట్‌తో కృష్ణాజిల్లాకు గుర్తింపు డీఆర్డీఓ ప్రాజెక్ట్ ఏర్పాటుతో కృష్ణా జిల్లాకు ప్రపంచపటంలో గుర్తింపు దక్కనుంది. ముఖ్యంగా దివిసీమ తీర ప్రాంతవాసులు కల త్వరలో సాకారం కానుంది. ప్రధానమైన అనుమతులు పూర్తయి త్వరలో ప్రధాని శ్రీకారం చుట్టబోవడం సంతోషం. డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సతీష్‌రెడ్డి, ఇతర కేంద్ర ప్రభుత్వశాఖల ఉన్నతవర్గాల కృషి ఫలించింది. – డాక్టర్ అర్జా శ్రీకాంత్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈవో -
ఎదురుమొండి...మొండిబతుకులు!
సాక్షి, అవనిగడ్డ : బాహ్య ప్రపంచానికి దూరంగా.. కష్టాలు.. కన్నీళ్లు.. వలస బతుకులకు చేరువగా ఎదురుమొండి దీవుల ప్రజలు దీనావస్థలో కాలంవెళ్లదీస్తున్నారు. పాలకుల హామీలు నీటిమూటలు కాగా.. ఓట్ల రాజకీయం శాపంగా ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోయింది. కనీస మౌలిక వసతులు లేక జనం ఆకలికేకలతో పల్లెదాటి వలస కూలీలుగా మారుతున్న దురవస్థ. తమ కష్టాలు కడతేర్చే పాలన కోసం ఈ ప్రాంతం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. జిల్లాలో రవాణా సౌకర్యం లేని ఏకైక ప్రాంతం నాగాయలంక మండలంలోని ఎదురుమొండి దీవులు. మూడు పంచాయతీలున్న ఈ దీవులకు వెళ్లాలంటే ఫంటు, పడవ ప్రయాణమే దిక్కు. గతంలో ఎదురుమొండి, గొల్లమంద వద్ద జరిగిన పడవ ప్రమాదాల్లో 50 మంది మరణించినా పాలకుల్లో చలనం లేదు. గత ఏడాది నవంబర్‌లో దివిసీమ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటిమొగ –ఎదురుమొండి వారధి నిర్మాణానికి రూ.77 కోట్ల నిధులు ప్రకటించినా అతీగతీ లేదు. గుంటూరు జిల్లా రాజుకాలువ ప్రజల దయాదాక్షిణ్యాలే ఈ దీవుల సాగు, తాగునీరుకి ఆధారం. దీవుల్లో బంగారు పంటలు పండే రెండు వేల ఎకరాలు ఆయకట్టు ఉండగా, సాగునీరందక ఐదేళ్లలో రెండు సార్లు పంట విరామం ప్రకటించారు. ఎదురుమొండి – నాచుగుంట మధ్య నిర్మించాల్సిన రహదారి, అటవీ భూముల ఆంక్షల పేరుతో మూడు కిలోమీటర్ల మేర ఆగిపోయింది. గతంలో 50 మంది మృత్యువాత ఎదురుమొండి దీవుల్లో కృష్ణా నదిలో జరిగిన రెండు పడవ ప్రమాదాల్లో 50 మంది మృత్యువాతపడ్డారు. 1990లో ఎదురుమొండి వద్ద జరిగిన పడవ ప్రమాదంలో 20 మంది మరణించగా, 2004లో గొల్లమందలో జరిగిన పడవ ప్రమాదంలో 30 మంది చనిపోయారు. వీరంతా కూలి పనులకు, మండల కేంద్రాలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదాలు జరిగాయి. అప్పటి నుంచి ఎదురుమొండి దీవులకు వారధి నిర్మించాలని డిమాండ్ ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఎదురుమొండి దీవులను పట్టించుకోలేదని ప్రజలు చెబుతున్న మాట. వారధి నిర్మాణం కోసం రూ.74 కోట్లు ప్రకటించినా.. 2004, 2009, 2014 ఎన్నికల్లో ఏటిమొగ – ఎదురుమొండి వారధి నిర్మాణం అంశం ప్రధాన అస్త్రంగా సాగింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏటిమొగ – ఎదురుమొండి వారధి నిర్మాణం కోసం రూ.45 కోట్లు ప్రపంచ బ్యాంకు నిధుల కోసం ప్రతిపాదనలు పంపగా, అనంతరం మహానేత మరణంతో దీని గురించి పట్టించుకున్నవారే లేరు. గత ఏడాది నవంబర్ 21న ఉల్లిపాలెం, చల్లపల్లిలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటిమొగ – ఎదురుమొండి వారధి నిర్మాణం కోసం రూ.74 కోట్లు నిధులు మంజూరు చేసినట్టు ప్రకటించినా అతీగతీ లేదు. రెండుసార్లు సాగుకు విరామం ఎదురుమొండి దీవుల్లో 2 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇది కాకుండా మాజీ సైనికులు, ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మరో మూడు వేల ఎకరాల అటవీభూమి ఉంది. గుంటూరు జిల్లాలోని రాజుకాలువ వద్ద ఉన్న పంపింగ్ స్కీం నుంచి ఎదురుమొండిలోని చెరువులకు నింపి అక్కడ నుంచి పంట పొలాల సాగుకు రైతులు నీటిని వాడుకుంటుంటారు. 2014 – 15లో రెండేళ్లు సాగునీరందక దీవుల్లో రైతులు సాగుకు విరామం ప్రకటించారు. 2016 – 17లో అరకొరగా అందిన సాగునీటితో పంటలు సాగుచేసుకున్నారు. గత ఏడాది రాజుకాలువ రైతులు పంపింగ్ పథకాన్ని అడ్డుకోవడం, కృష్ణానది పాయలో వేసిన పైపులైన్ దెబ్బతినడంతో రెండు వేల ఆయకట్టుకుగాను 450 ఎకరాల్లో మాత్రమే సాగుచేయగలిగారు. ఎదురుమొండి రక్షిత మంచినీటి పథకం చెరువు నీరు పసర్లు కమ్ముకోవడంతో దిక్కులేని స్థితిలో ఈ నీటినే వాడుకుంటున్నారు. సాగునీరందక ఎండిపోయిన పంటను చూసి దిగాలుగా ఉన్న రైతులు ఆగని వలసలు ఎదురుమొండి దీవుల్లో సక్రమంగా సాగునీరు అందకపోవడం, ఇతర పనులు లేకపోవడం వల్ల ఈ దీవులకు చెందిన ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారు. ఏడాదిలో ఎనిమిది నెలలు విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు పనుల కోసం ఈ ప్రాంత ప్రజలు వలస వెళ్తుంటారు. గొల్లమంద, జింకపాలెం, ఎదురుమొండి నుంచి ఎక్కువగా వలసలు ఉంటున్నాయి. ఎదురుమొండి దీవుల్లోని ప్రజల సమగ్ర అభివృద్ధి పథకం కోసం 25 ఏళ్ల క్రితం ఎదురుమొండిలో వేసిన శిలాఫలకం ముళ్లకంప పెరిగి వెక్కిరిస్తోంది. మూడు పంచాయతీల్లో 8,785 మంది జనాభా.. ఎదురుమొండి దీవుల్లో ఎదురుమొండి, నాచుగుంట, ఈలచెట్ల దిబ్బ పంచాయతీలు ఉన్నాయి. ఎదురుమొండి పంచాయతీలో గొల్లమంద, జింకపాలెం, ఏసుపురం, కృష్ణాపురం, బ్రహ్మయ్యగారిమూల, బొడ్డువారిమూల, ఎదురుమొండి గ్రామాలు ఉన్నాయి. దీవుల్లోని ఈ మూడు పంచాయతీల్లో 8,785 మంది జనాభా ఉండగా, 3,513 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 95 శాతం మంది మత్స్యకారులే. ఓట్లు వేయలేదనే అక్కసుతో.. ఎదురుమొండి దీవుల ప్రజలు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు ఓట్లు వేయలేదనే అక్కసుతో ఈ దీవుల అభివృద్ధిని పట్టించుకోవడం లేదనే విమర్శలున్నారు. ఈ విషయాన్ని దివంగత శాసనసభ్యుడు అంబటి బ్రాహ్మణయ్య పలుసార్లు బాహాటంగానే చెప్పారు. 2009 ఎన్నికల్లో అప్పటి వరకూ మెజార్టీతో వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్, చివరిరౌండైన ఎదురుమొండి దీవుల్లో టీడీపీ అభ్యర్థి అంబటి బ్రాహ్మణయ్యకు 1504 అధిక్యంతో బ్రహ్మరథం పట్టారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బుద్ధప్రసాద్‌కు వైఎస్సార్సీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్‌బాబు కంటే కేవలం 365 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. రెండుసార్లు రెండు వేర్వేరు పార్టీలు మారినా దీవుల ప్రజలు తనను ఆదరించలేదనే కోపంతో ఎదురుమొండి దీవుల గురించి బుద్ధప్రసాద్ పట్టించుకోలేదని కొంతమంది దీవుల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఓట్లు వేయలేదని కక్ష గత రెండు ఎన్నికల్లో ఎదురుమొండి దీవుల్లో ప్రజలు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌కు ఓట్లు వేయలేదని మా దీవులపై కక్ష పెంచుకున్నారు. అందుకే దీవుల గురించి ఆయన పట్టించుకోవడం లేదు. రూ.74 కోట్లుతో ఎదురుమొండి వారధి నిర్మిస్తామని సీఎం ప్రకటించినా పనులు ప్రారంభించలేదు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తేనే మా దీవులకు మంచి రోజులు వస్తాయి. –నాయుడు అంకరాజు,ఎదురుమొండి, నాగాయలంక మండలం మా తాత కాలం నుంచి రోడ్డు ఉంది ఊరి పుట్టిన దగ్గర నుంచి నాచుగుంట – ఎదురుమొండి రోడ్డు ఉంది. గతంలో రెండు సార్లు వేశారు. ఇప్పుడు అటవీశాఖ అభ్యంతరాలు పెడితే ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. చినుకు పడితే ఈ రోడ్డుపై వెళ్లలేము. నదిలో నావపై నాగాయంక వెళ్లాలంటే 3 గంటల ప్రయాణం. ఎవరన్నా గర్భిణులు ఉన్నా, రోగస్తులున్నా నావపై తీసుకెళ్లాల్సిందే. – సైకం బస్వారావు, నాచుగుంట -
నాగాయలంకలో జెల్లీఫిష్‌లు
నాగాయలంక (అవనిగడ్డ): కృష్ణా జిల్లా నాగాయలంక రేవులో జెల్లీఫిష్‌లు కనువిందు చేస్తున్నాయి. నాగాయలంక ఎగువ వరకూ సముద్రపు జలాలే (బ్యాక్ వాటర్) కావడంతో జెల్లీఫిష్‌లు, ఇతర సముద్ర చేపలు అధిక సంఖ్యలో చేరుతున్నాయి. ఆవలి తీరంలో వీటి సంచారం ఎక్కువగా ఉండటంతో సందర్శకులు బోtట్లో వెళ్లి చూస్తున్నారు. ఆటవిడుపుగా జెల్లీఫిష్‌లను పట్టుకుని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
సండే స్పెషల్ శనివారమైంది!
ఆశీల వసూలు దారుల ఇష్టారాజ్యం మారిన తరతరాల ఆదివారపు సంత మంగళవారం సెలవు ఆదివారానికి మారుతోంది? నాగాయలంక: దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు ఆదివారం సెలవు. కానీ నాగాయలంకలో మంగళవారం సెలవు దినం. అందుకు ఓ ప్రత్యేక ఉంది. ఆదివారం నాగాయలంక ఉప్పు చేపల సంత జరుగుతుంది. పంచాయతీ అనుమతి లేకుండానే ఆశీలు వసూలుదారులు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని మార్చేశారు. శనివారం రోజు చేపల సంత నిర్వహిస్తున్నారు. నాగాయలంకలో ప్రతి ఆదివారం ఎండుచేపలసంత నిర్వహిస్తారు. ఉప్పు చేపలు, ఎండు రొయ్యలు, రొయ్యపప్పు, మెత్తళ్లు లాంటి అనేక రకాల డ్రైఫిష్ క్రయవిక్రయాలు భారీగా సాగుతుంటాయి. సంత గత వైభవం కోల్పోయినప్పటికీ వారం వారం లక్షల్లో అమ్మకాలు, కొనుగోళ్లు సాగుతున్నాయి. ఇక్కడకు నాగాయలంక మండలంలోని పరిసర 20 గ్రామాల ప్రజలతోపాటు చెన్నై, హైదరాబాద్, వరంగల్ తదితర పట్టణాల నుంచి వ్యాపారులు వచ్చి సరుకు కొనుగోలు చేస్తుంటారు. ఈ మేరకు గతం నుంచీ ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి చేపల హోల్‌సేల్ క్రయవిక్రయాలు ప్రారంభమయ్యేవి. సాయంత్రం 6గంటల వరకు జరిగేవి. ప్రస్తుతం శనివారం మధ్యాహ్నం 12గంటల నుంచి ప్రారంభమై రాత్రికే ముగిసిపోతుంది. గతంలో అందరికీ అందుబాటులో ఉండే ధరలు చుక్కలు చూపిస్తున్నయని కొనుగోలుదారులు వాపోతున్నారు. ఇతర ప్రాంతాల హోల్‌సేల్ వ్యాపారులు ఎగబడటంతో ఏ తీరప్రాంతంలో లేని ధరలు ఇక్కడ రాజ్యమేలుతున్నాయని వినియోగదారులు అంటున్నారు. మరో పక్క ధరలు గిట్టుబాటే కావడంలేదని మత్స్యకారులు చెపుతున్నారు. -
పుణ్యం కోసం.. ఒంటికాలితో...
నాగాయలంక: నాగాయలంక శ్రీరామపాదక్షేత్రం పుష్కరఘాట్‌లో ఉవరి సహాయం లేకుండానే ఒంటికాలితో వికలాంగుడు కృష్ణానదిలో మంగళవారం పుణ్యస్నానం చేసి వెళ్లడం ఇలా కనిపించింది, సమీపంలోని మర్రిపాలెం గ్రామానికి చెందిన తాపీమేస్త్రి వెంకటేశ్వర్రావు నిత్యం ఇలాగే స్నానమాచరించి కృష్ణవేణీమాతను ప్రసన్నం చేసుకుంటున్నట్లు చుప్పాడు. -
లంకలో కృష్ణమ్మ విగ్రహం
నాగాయలంక: పుష్కరాల నేపథ్యంలో నాగాయలంక పుష్కర ఘాట్ వద్ద నది బ్యాక్‌డ్రాప్ అనుసంధానంగా కృష్ణవేణి విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ వెల్లడించారు. కృష్ణానది లాంచీలరేవు వద్ద ఘాట్ తుదిదశ నిర్మాణ పనులను కృష్ణాడెల్టా చీఫ్ ఇంజినీర్ వైఎస్ సుధాకర్, ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్.సుగుణాకరరావుతో కలిసి శనివారం ఆయన పర్యవేక్షించారు. ఘాట్ నిర్మాణం, శ్రీరామపాదక్షేత్రం ఆలయాల పునర్నిర్మాణ పనులను పరిశీలించి సూచనలు చేశారు. ఏఎంసీ చైర్మన్ మండవ బాలవర్ధిరావు, సర్పంచ్ శీలి రాము, తహశీల్దార్ ఎస్.నరసింహారావు, ఎంపీటీసీ తలశిల స్వర్ణలత, డీఈ ఎం.మారుతీప్రసాద్ పాల్గొన్నారు. వైభవంగా దివ్యహారతి సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల భక్తులు స్థానిక ప్రధాన పుష్కరఘాట్‌లో శనివారం రాత్రి 7.30 గంటలకు కృష్ణమ్మకు దివ్యహారతి ఇచ్చారు. శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, మంత్రి దేవినేని ఉమా పాల్గొన్నారు. తొలుత కృష్ణానదికి దీవి మురళీ ఆచార్యులు, ప్రభాకరశర్మ, తుర్లపాటి రామ్మోహనరావు ప్రత్యేక పూజలు చేశారు. చీర, పసుపు కుంకుమతో సారె సమర్పించారు. మహిళలు, భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. బందరు ఆర్డీవో పి.సాయిబాబు, తహశీల్దార్ ఎస్.నరసింహారావు, ఎంపీడీవో వి.ఆనందరావు, ఏఎంసీ చైర్మన్ మండవ బాలవర్ధిరావు, ఎంపీపీలు సజ్జా గోపాలకృష్ణ, బండే కనకదుర్గ, ఎంపీటీసీ తలశిల స్వర్ణలత, అవనిగడ్డ డీఎస్పీ ఖాదర్‌బాషా, సీఐ ఎస్ఎస్వీ మూర్తి పాల్గొన్నారు. అంతకు ముందు స్థానిక నాగసాధువు బాలాజీ ఆధ్వర్యంలో కృష్ణానదికి పూజలు చేసి హారతులిచ్చారు. -
‘లంక’లో ఎస్పీ పుష్కర సమీక్ష
నాగాయలంక : రానున్న పుష్కరాలను పురస్కరించుకుని మండలంలోని పుష్కరఘాట్ల పనులు, సిబ్బంది వసతి ఏర్పాట్లును కృష్ణాజిల్లా ఎస్.పీ జీ.విజయకుమార్ మంగళవారం దివి పోలీసు అధికారులు, మండల రెవెన్యూ అధికారులతో సమీక్ష జరిపారు. మండల కేంద్రంలోని నాగాయలంక పుష్కరఘాట్‌ను ఆయన పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏవిధంగా బందోబస్తు నిర్వహించాలి, ఇక్కడికి భక్తులు ఏస్థాయిలో వస్తారు? తదితర అంశాలపై తహసీల్దార్‡ ఎస్. నరసింహారావు , అవనిగడ్డ డీఎస్పీ ఖాదర్ బాషా , ఆలయకమిటీ వర్గాలతో సమీక్షించారు. గోదావరి పుష్కరాలలో విశిష్టసేవలు అందించిన నాగాయలంక స్టేషన్‌లోని సీనియర్ హెడ్‌కానిస్టేబుల్ వీరాంజనేయులును ఈ సందర్భంగా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఆయన సేవలను సక్రమంగా వినియోగించాలని సూచించారు. అనంతరం సంతబజారులో పోలీసులు, ఇతర సిబ్బందికి ఏర్పాటు చేయనున్న వసతి ఏర్పాట్లు పరిశీలించారు. అవనిగడ్డ సీ.ఐ సీఎస్‌ఎస్‌వీ మూర్తి, స్థానిక ఎస్.ఐ జీ.అనిల్, ప్రొబెషనరీ ఎస్.ఐ, వీఆర్వో తలశిల చిదంబరరావు(పసి) తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులు.. ప్రమాదాలు నివారించండి కొత్తపేట(అవనిగడ్డ): పుష్కరాలు జరిగే 12 రోజుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ విజయకుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని కొత్తపేట పుష్కరఘాట్‌ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిండప్రదాన కార్యక్రమం ఒక ప్రక్కగా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాటు చేయాలన్నారు. మహిళలకు బాత్రూంల ఏర్పాటు గురించి వీఆర్ఏ శేషుబాబుని అడిగితెలుసుకున్నారు. బాత్రూంలు వద్ద తీసుకోవాల్సిన జాగ్రతలను ఆయన పేపర్‌పై వేసి చూపించారు. వైద్యశిబిరం, రెవెన్యూ, పోలీసులు, సమచార కేంద్రాలను ఎదురుగా కాకుండా ఒక పక్కగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రమాదాల నివారణకు పటిష్టచర్యలు తీసుకోవాలని ఒక్క ప్రమాదం జరగకుండా చూడాలని ఆదేశించారు. మట్టిదిబ్బలను సరిచేయించి భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రతలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఖాదర్‌బాషా, సీఐ కెవీవీఎస్ మూర్తి, ఎస్ఐ మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. కష్ణానది ఒడ్డునే మోనిటరింగ్ పెదకళ్లేపల్లి(మోపిదేవి): దక్షిణకాశీ పెదకళ్లేపల్లిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రశాంత వాతావరణలో స్నానాలు ఆచరించేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ తెలిపారు. కృష్ణానది వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాట్ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పుష్కరఘాట్స్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మోనిటరింగ్ కూడా ఇక్కడనుంచే చేయడం వల్ల ఉన్నతాధికారులు ఎప్పటికప్పడు ఘాట్లు పరిశీలిస్తూ అవసరమైన సహాయ సహకారాలు, సూచనలు అందిస్తారని చెప్పారు. స్థానిక దుర్గానాగేశ్వరస్వామివారి దేవస్థానంకు విచ్చేసే భక్తులకు ఆలయప్రవేశానికి రాక, పోకలకు విడివిడిగా గేట్లు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. అధికారులు సూచించిన ప్రదేశంలోనే భక్తులు స్నానాలు చేయాలని, అన్నివిధాలుగా అధికారులకు సహకరించాలని కోరారు. అవనిగడ్డ డీఎస్పీ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహిస్తామని వివరించారు. ఆయనవెంట అవనిగడ్డ డీఎస్పీ ఖాదర్‌బాషా, చల్లపల్లిసీఐ రమణ, ఎస్ఐ చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ అరజా వెంకట సుబ్బారావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
ఇంటినీ ఎత్తేస్తారు!
నాగాయలంక : భూమి మెతక వల్ల కుంగిపోయిన, కొత్తగా వేసిన రోడ్డుకన్నా పల్లంగా ఉన్నా, ఇతర వాస్తు దోషాలు ఉన్న భవనాలను కూల్చివేసి మళ్లీ నిర్మించడం ఇప్పటివరకూ చూస్తున్నాం. భవనం ఎంత గట్టిదైనా, నిర్మించి ఎన్నో ఏళ్లు గడవకున్నా కూల్చి తిరిగి నిర్మించడమే ఇప్పటివరకూ ఉన్న పద్ధతి. కొత్తగా అందుబాటులో ఉన్న పద్ధతులతో ఈ విధానానికి ఇక స్వస్తి పలకవచ్చు. హౌస్ లిఫ్టింగ్, షిఫ్టింగ్ పద్ధతి కొత్తగా అందుబాటులోకి వచ్చింది. ఈ విధానం పల్లెలకు కూడా పాకింది. కృష్ణా జిల్లా నాగాయలంకలో ఓ భవనాన్ని జాకీల మీద లేపి ఎత్తుపెంచడం స్థానికంగా ఆసక్తి కలిగిస్తోంది. మండల పరిషత్ అధ్యక్షుడు సజ్జా గోపాలకృష్ణ ఇంటిని హరియాణాకు చెందిన టీడీబీడీ ఇంజనీరింగ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ (హౌస్ లిప్టింగ్ సర్వీస్ ఇన్ ఇండియా) ఈ పనులు చేపట్టింది. ఈ భవనం పశ్చిమవైపు అడుగు మేర కుంగి, తూర్పున ఎత్తు పెరగడాన్ని వాస్తు దోషంగా భావించి ఇలా ఎత్తు పెంచుతున్నారు. ఈ భవనం ఎత్తు పెంచేందుకు రూ. 5 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. -
బారీ తిమింగలం అస్థిపంజరం లభ్యం
-
బారీ తిమింగలం అస్థిపంజరం లభ్యం
సొర్లగొంది సముద్ర తీరంలో 3నెలలు క్రితం వెలుగుచూసిన వైనం నాగాయలంక నదిఒడ్డుకు చేర్చి భద్రపర్చిన కేజ్ కల్చరిస్ట్ రఘుశేఖర్ బృందం నాగాయలంక : మండలంలోని సొర్లగొంది సముద్రతీర ప్రాంతంలో మూడునెలల క్రితం లభ్యమైన యాభై అడుగులకుపైగా (15మీటర్లు) ఉన్న భారీ తిమింగలానికి(వేల్) సంబంధించిన అస్థిపంజరం నాగాయలంకలో శనివారం వెలుగు చూసింది. పీతలవేట సాగించే యానాదుల నుంచి సమాచారం తీసుకున్న కేజ్‌కల్చరిస్ట్, ఔత్సాహిక యువ ఆక్వా శాస్త్రవేత్త తలశిల రఘుశేఖర్, గాలి బసవదేవుడు తదితర తన బృంద సభ్యులతో వీటిని సేకరించారు. తిమింగలం సైజ్ భారీగా ఉండడంతో అస్థిపంజరం శకలాలను పడవద్వారా నాగాయలంక కృష్ణానది ఒడ్డున ఉన్న తమ కేజ్‌కల్చర్ ప్రాంతానికి చేర్చారు. ఈప్రాంతం వన్యప్రాణి అభయారణ్యం కావడంతో ఈ విషయం స్థానికంగా వెల్లడి చేస్తే చిక్కులు వస్తాయనే అభిప్రాయంతో వైల్డ్‌లైప్ ఉన్నతాధికారులకు తెలిపి శకలాలను దాచారు. రాజమండ్రి వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో రాక రాజమహేంద్రవరం వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో వి.ప్రభాకరరావు, స్వామినాథన్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆర్.రామసుబ్రహ్మణ్యం శనివారం ఇక్కడికి రావడంతో అస్థిపంజరం వెలుగు చూసింది. దీని శకలాలను డీఎఫ్‌వో పరిశీలించారు. తిమింగలం డెత్బాడీ పొడవు 15 మీటర్లకు, వెడల్పు రెండు మీటర్లకు పైబడి ఉండటంతో వాస్తవ తిమింగలం సైజ్ మరింత పెచ్చు ఉండే అవకాశం ఉందని ఆయన విలేకరులకు చెప్పారు. ఇది మరణించి అయిదారు నెలల సమయం కావచ్చున్నారు. అస్థిపంజరం భావితరాల అధ్యయనానికి వినియోగపడేరీతిలో మ్యూజియం లేదా మెరైన్ పార్క్‌కు తరలించేందుకు చర్యలు తీసుంటామని డీఎఫ్‌వో చెప్పారు. నాగాయలంక సముద్రతీరంలో లభ్యమైనందున తిమింగలం అస్థిపంజరాన్ని దివిసీమలోనే ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఈప్రాంతవాసులు కోరడంతో పరిశీలిస్తామన్నారు. అరుదైన అంశం నాగాయలంక సముద్ర తీరంలో తిమింగలానికి చెందిన భారీ అస్థిపంజరం లభ్యం కావడం అరుదైన అంశం. భద్రతకారణాల దృష్ట్యానే ఇప్పటి వరకు బయట పెట్టలేదు. సంబంధిత అభ్యాసకులు, భవితరాలకు ఇది అధ్యయనంగా ఉపయోగపడుతుంది. కేంద్రప్రభుత్వం అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. - వి.ప్రభాకరరావు, వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో, రాజమహేంద్రవరం దివిసీమలో ఏర్పాటు చేయాలి సముద్రతీరప్రాంతంలో అరుదైన వాటిని సేకరించాలనే అభిలాష ఎంతోకాలంగా ఉంది. తిమింగలపు అస్థిపంజరం సమాచారం దొరకడం అదృష్టం. వ్యయప్రయాసలతో సహచర బృందం సహకారంతో నాగాయలంక చేర్చగలిగాను. దివిసీమలోనే ఏర్పాటుచేస్తే బాగుంటుంది. - తలశిల రఘుశేఖర్, ఔత్సాహిక కేజ్‌కల్చరిస్ట్,ఆక్వా శాస్త్రవేత్త,నాగాయలంక -
అస్థిపంజరం.. 15 మీటర్లు!
కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలోని సొర్లగొంది సముద్రతీర ప్రాంతంలో 15 మీటర్ల పొడవైన భారీ తిమింగలం అస్థిపంజరం వెలుగు చూసింది. ఇటీవల ఇది లభ్యమైంది. సముద్రతీరంలో పీతలవేట సాగించే యానాదుల నుంచి సమాచారం తీసుకున్న స్థానిక కేజ్ కల్చరిస్ట్, ఔత్సాహిక యువ ఆక్వాశాస్త్రవేత్త తలశిల రఘుశేఖర్ తన బృందం సభ్యులతో అస్థిపంజరంలోని ఎముకలను సేకరించి పడవల ద్వారా నాగాయలంక కృష్ణానది ఒడ్డుకు చేర్చారు. వాటిని కర్రల సాయంతో తిమింగలం ఆకారంలో పేర్చారు. రాజమహేంద్రవరం వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో ప్రభాకరరావు, స్వామినాథన్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ కోర్డినేటర్ రామసుబ్రహ్మణ్యం శనివారం అస్థిపంజరాన్ని పరిశీలించారు. దీని పొడవే 15 మీటర్లు ఉన్నందున బతికి ఉన్నప్పుడు మరింత ఉండొచ్చని డీఎఫ్‌వో తెలిపారు. దీనిని మ్యూజియం లేదా మెరైన్ పార్క్‌కు తరలిస్తామని చెప్పారు. -నాగాయలంక -
నాగాయలంక తీరంలో శ్రీలంక బోటు!
మచిలీపట్నం: కృష్ణాజిల్లా నాగాయలంక సముద్ర తీరానికి శుక్రవారం తెల్లవారుజామున విదేశీ బోటు కొట్టుకు వచ్చింది. దీంతో మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సముద్ర తీరానికి చేరుకుని... బోటును పరిశీలించారు. సదరు బోటు శ్రీలంకకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. గతంలో ఈ బోటు సముద్రంలో మునిగిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తుపాన్ కారణంగా బోటు తీరానికి కొట్టుకొచ్చి ఉంటుందని పోలీసులు అంటున్నారు. దీనిపై పోలీసులు మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. -
ఆలయాలను వదలట్లేదు..
నాగాయలంక : దోపిడి దొంగలు ఇళ్లు, షాపులే కాదు...చివరకు ఆలయాలను వదలట్లేదు. తాజాగా కృష్ణా జిల్లా నాగాయలంకలో రెండు ఆలయాల్లో జరిగిన దొంగతనాలతో స్థానికంగా కలకలం రేపింది. కృష్ణా నదీ తీరంలో ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలోకి దొంగలు చోరబడి అమ్మవారి మంగళసూత్రం, స్వామివారి నామాలు ఎత్తుకుపోయారు. అలాగే, తూర్పుబజార్‌లోని కోదండరామాలయంలోనూ వారు చోరీకి పాల్పడ్డారు. ఆదివారం ఉదయం దేవాలయంలో చోరీ జరిగినట్టు గుర్తించిన ఆలయ కమిటీ సభ్యులు స్థానిక పోలీసుస్టేషన్లోఫిర్యాదు చేశారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసులు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. -
చైన్ స్నాచర్‌ను పట్టుకున్న గ్రామస్తులు
-
చైన్ స్నాచర్‌ను పట్టుకున్న గ్రామస్తులు
నాగాయలంక (కృష్ణా జిల్లా) : కృష్ణా జిల్లా నాగాయలంకలో ఆదివారం ఒక మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లిన దొంగను స్థానికులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఉదయం 7 గంటలకు నాగాయలంకలో ఉప్పల ప్రమీలారాణి ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా కోడూరు మండలం మర్రిపాలెంకు చెందిన రంగప్రసాద్ ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కొని పరుగుతీశాడు. ఆమె కేకలు వేయడంతో గ్రామస్తులు వెంబడించి అతణ్ణి పట్టుకుని కరెంట్ స్తంభానికి కట్టేశారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించారు. -
సినీఫక్కీలో హత్య.. ఆపై 'మిస్సింగ్' డ్రామా!
విజయవాడ: కృష్ణాజిల్లా నాగాయలంకలో సినిమా తరహాలో దారుణం చోటుచేసుకుంది. వివాహితను భర్త, అత్తమామలే హతమార్చి.. ఆపై కనిపించడంలేదని డ్రామాకు తెరతీశారు. స్వయంగా తామే పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. నాగాయలంకలోని బర్రంకులలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కెమెరామ్యాన్ అయిన వంశీ భార్య వరలక్ష్మి మూడు నెలలుగా కనిపించడం లేదు. ఆమె ఎవరితోనో లేచిపోయిందంటూ అత్తామామలు పోలీసులకు ఫిర్యాదుచేశారు. తమ బిడ్డ కనిపించకపోవడంతో అనుమానించిన వరలక్ష్మి తల్లిదండ్రులు మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో అసలు డొంకంతా కదిలింది. భర్త, అత్తామామలే కలిసి వరలక్ష్మిని హతమార్చి, ఓ కాల్వ వద్ద పాతిపెట్టారని, పోలీసులకు అనుమానం వస్తుందేమోనన్న భయంతో ఆ శవాన్ని తర్వాత మరోచోటకు తరలించారని దర్యాప్తులో వెలుగుచూసింది. ప్రస్తుతం మృతదేహాన్ని దాచిపెట్టారని భావిస్తున్న ప్రదేశంలో పోలీసులు తవ్వకాలు జరుపుతున్నారు. -
నాగాయలంకలో చమురు బావుల గుర్తింపు
రాజమండ్రి(తూ.గో.జిల్లా): కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్ పరిధిలో కృష్ణా జిల్లా నాగాయలంకలో చమురు బావులను ఓఎన్జీసీ తాజాగా గుర్తించింది. దీనికి సంబంధించిన వివరాలను ఆ సంస్థ రాజమండ్రి అసెట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ దేబశీష్ సన్యాల్ మంగళవారం వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి రెండు హై జనరేషన్ బావుల్లో తొలి దశ డ్రిల్లింగ్ ఆరంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ బావుల ద్వారా రోజుకు 10 వేల బేరళ్ల చమురు, ఐదు లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ వెలికితీయవచ్చని అంచనా వేశామన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఫీల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎఫ్డీపీ) పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించామన్నారు. అక్కడ నుంచి అనుమతి రాగానే తొలి దశలో రెండు, రెండో దశలో 18 బావులను ప్రారంభిస్తామన్నారు. తొలి దశ బావులను ఎన్జెడ్-1ఎస్టీ, ఎస్ఈ-1 బావులుగా నామకరణం చేశామని సన్యాల్ వివరించారు. తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట, మల్లేశ్వరం బావులను విస్తరించనున్నామని వివరించారు. గత ఏడాది జరిగిన నగరం గ్యాస్ పైపులైను పేలుడువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఓఎన్జీసీ చర్యలు తీసుకుంటుందన్నారు. గ్యాస్‌తోపాటు నీరు, ఇతర పదార్థాలు వెళ్లడంవల్ల పైప్లైన్లు దెబ్బతింటున్నాయని గుర్తించిన తమ సంస్థ, దీని నివారణకు ఐదు ప్రాంతాల్లో గ్యాస్ డీహైడ్రేజేషన్ యూనిట్లు ఏర్పాటు చేయనుందన్నారు. దీనివల్ల ప్యూరిఫైడ్ గ్యాస్ రవాణా జరుగుతుందని, పైపులైన్లు త్వరగా దెబ్బతినవని సన్యాల్ తెలిపారు. ఇందుకు రూ.320 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. పైపులైన్ల నిర్మాణ పనులను ఓఎన్జీసీ, గెయిల్ సంయుక్తంగా చేపట్టాయని, థర్డ్ పార్టీగా ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ఉందని చెప్పారు. కేజీ బేసిన్ పరిధిలో 800 కిలోమీటర్ల మేర గ్యాస్ పైప్లైన్లు విస్తరించి ఉన్నాయన్నారు. వీటిలో 4, 6 అంగుళాల పైపులైన్లు మారుస్తున్నామన్నారు. ఇప్పటికే 25 శాతం మార్పులు చేశామని చెప్పారు. ప్రపంచంలో చమురు, గ్యాస్ ఉత్పత్తుల వెలికితీతలో ఓఎన్జీసీ మూడో స్థానంలో నిలిచిందని వివరించారు. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ (సీఆర్ఎఫ్) కోసం టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ అండ్ సైన్స్ ఆయా గ్రామాల్లో సర్వే చేపట్టిందని, ఓఎన్జీసీ సీఎండీ, రాష్ట్ర ముఖ్యమంత్రికి నివేదిక అందజేసిందని, దీని ప్రకారం సీఆర్ఎఫ్ నిధులు ఖర్చు చేస్తామని సన్యాల్ తెలిపారు. విలేకర్ల సమావేశంలో జనరల్ మేనేజర్ శర్మ కూడా పాల్గొన్నారు. -
మహా ‘మాగ’.. ధర బాగా!
నాగాయలంక: సాధారణంగా కేజీ నుంచి ఐదు కేజీల బరువుండే ‘మాగ’ చేప ఏకంగా 30 కిలోలు తూగింది. ఇండియన్ సాల్మోన్ శాస్త్రీయ నామం కలిగిన ఈ చేపను తీరప్రాంతంలో ‘మాగ’గా పిలుస్తారు. కృష్ణాజిల్లా నాగాయలంకలో కృష్ణానది ఒడ్డున ఉన్న ఓ చేపల కొనుగోలు కంపెనీలో శుక్రవారం ఈ చేప కనిపించింది. సముద్రపు చేపలవేటలో ఈలచెట్లదిబ్బ మత్స్యకారులకు దొరికింది. ఈ చేప ఖరీదు కేజీ రూ.1300 పలికింది. అంటే రూ. 39 వేలు అన్నమాట. -
‘సంకరజాతి’ ఎవరో?
ఆయన మాటలు మృధువుగా ఉంటారుు. చేతలు మాత్రం మెత్తని కత్తులను తలపిస్తాయి. శాంతికాముకుడిలా కన్పిస్తారు. నిశితంగా గమనిస్తే స్వపక్షంలోనూ, విపక్షంలోనూ ఎవరిని ఎదగనీయని సంకుచితత్వం ఆయనది. తనకు పేరు రాకుంటే అభివృద్ధి పనులను సైతం అడ్డుకుంటారు. అందరూ ఒకటేనంటారు. ఓటేయనివారిని మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తారు. ఇదీ అధికార భాషా సంఘం మాజీ చైర్మన్, అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ నైజం. పైకి త్యాగధనుడిగా కన్పించే ఆయన పదవుల కోసం పాకులాడుతారనడానికి సుదీర్ఘకాలం ఉన్న కాంగ్రెస్‌ను వీడి ఎమ్మెల్యే టికెట్ కోసం టీడీపీలో చేరి... కాంగ్రెస్‌కు ఓటేసినవారంతా ‘సంకరజాతి’ వారేనని వ్యాఖ్యానించడమే నిదర్శనం. అవకాశవాదిగా మారిన బుద్ధప్రసాద్‌ను ఓడిస్తామంటూ కాంగ్రెస్‌వాదులు పడికిలి బిగించి మరీ శపథం చేస్తున్నారు. సాక్షి, మచిలీపట్నం: రాజకీయ అవసరార్ధం ఇటీవల టీడీపీలో చేరిన బుద్ధప్రసాద్‌కు పార్టీ కేడర్ సహాయ నిరాకరణతో ఎదురీత తప్పడంలేదు. తన తండ్రి మండలి వెంకటకృష్ణారావుకు రాజకీయ వారసుడిగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన బుద్ధప్రసాద్ రాష్ట్రంలో సౌమ్యుడిగా పేరు పొందినా సొంత నియోజకవర్గంలో మాత్రం అనేక విమర్శలను మూటగట్టుకున్నారు. పేరు కోసం పాకులాట... అవనిగడ్డ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని చెప్పుకుంటున్న బుద్ధప్రసాద్ పేరు కోసమే పాకులాడతారని, తనకు ఓటేయ్యని వారు ఉండే ప్రాంతాల్లో అభివృద్ధి పనులను సైతం అడ్డుకుంటారన్న విమర్శలున్నాయి. నాగాయలంక మండలంలోని ఏటిమొగ-ఎదురుమొండి వారధి, ఉల్లిపాలెం-భవానీపురం వారధి బుద్ధప్రసాద్ తీరు వల్లే ఆగిపోయాయని ఇప్పటికీ ఆ ప్రాంత వాసులు మండిపడుతుంటారు. * కృష్ణానదిపై ఏటిమొగ-ఎదురుమొండి వద్ద రూ.45కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో వారధిని నిర్మించేందుకు 2008లో ప్రతిపాదించారు. 2009 ఎన్నికల్లో బుద్ధప్రసాద్ ఓడిపోవడానికి ఎదురుమొండి దీవుల ప్రజలే ప్రధాన కారణంగా భావించిన ఆయన ఇక్కడ వారధి నిర్మాణాన్ని అడ్డుకున్నట్టు ఆరోపణలొచ్చాయి. దివంగత ఎమ్మెల్యే అంబటి బ్రాహ్యణయ్య ఈ విషయాన్ని తన మిత్రుల వద్ద పలుమార్లు ప్రస్తావించి ఆవేదన చెందినట్టు తెలిసింది. * ఉల్లిపాలెం-భవానీపురం వారధి విషయంలోనూ బుద్ధప్రసాద్ ఇలాంటి విమర్శలనే ఎదుర్కొంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఇక్కడ వారధిని నిర్మించేందుకు 2009లో రూ.25కోట్లు డెల్టా ఆధునీకరణ నిధులు కేటాయించారు. 2009 ఫిబ్రవరిలో వంతెన నిర్మాణం కోసం శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించేందుకు బుద్ధప్రసాద్ ప్రయత్నించారు. ఈ లోగానే ఎన్నికల కోడ్ రావడంతో ఆ కార్యక్రమాన్ని విరమించుకున్నారు. ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ ఏ రోజూ బుద్ధప్రసాద్ ఈ వారధి నిర్మాణానికి చర్యలు తీసుకోలేదు. ఆ తరువాత ఆయన రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా పనిచేసినప్పటికీ ఈ వారధిని పట్టించుకున్న పాపాన పోలేదు. తాను ఎమ్మెల్యేగా లేని సమయంలో ఆ వారధుల నిర్మాణం చేపడితే స్థానిక ఎమ్మెల్యే బ్రాహ్మణయ్యకే పేరొస్తుందని భావించిన బుద్ధప్రసాద్ దాని నిర్మాణాన్ని అడ్డుకున్నారన్న విమర్శలూ లేకపోలేదు. వాడుకుని వదిలేయడం ఆయన నైజం.. దివంగత మంత్రి మండలి వెంకట కృష్ణారావు దగ్గర నుంచి ఆయన తనయుడు బుద్ధప్రసాద్ వరకు వారి రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ దోహదపడిందన్నది తెల్సిందే. కాంగ్రెస్ అభ్యర్థులుగా గెలిచిన ఆ తండ్రీ, కొడుకులు మంత్రులుగానూ పనిచేశారు. అయినా బుద్ధప్రసాద్ ప్రస్తుతం పదవి కోసం కాంగ్రెస్‌కు చేయిచ్చి సైకిలెక్కేయడంతో తీవ్ర విమర్శలు వె ల్లువెతున్నాయి. నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులను, ఆదుకున్న పార్టీని నట్టేట ముంచి బుద్ధప్రసాద్ సైకిలెక్కడంతో ఛీత్కరించుకుంటున్న అనునయులు ఆయన్ను అనుసరించడంలేదు. తాను ఉండగా పార్టీలో ఇతర నాయకులెవ్వరినీ ఎదగనీయని బుద్ధప్రసాద్ ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నారు. టీడీపీలోనూ ఆయన ఇదే నైజంతో వ్యవహరిస్తారని గతంలో ఆయనతో సన్నిహితంగా మెలిగిన నాయకులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. సంకరజాతి వ్యాఖ్యలపై విమర్శలు.. మూడురోజుల క్రితం బుద్ధప్రసాద్ కోడూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ‘కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే సంకర జాతికి పుట్టినట్టే’ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆయనకు వేసిన ఓటర్లంతా సంకరజాతికి పుట్టిన వారేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ సారి టీడీపీలోకి వెళ్లాడు, వచ్చేసారి ఏ పార్టీ మారతాడో తెలియదు. ఆయనకు ఓట్లు వేయడం ఎందుకు.తిట్లు తినడం ఎందుకు అని కొంతమంది బాహాటంగానే అంటున్నారు. బుద్ధప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఓటర్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో తెలుగు తమ్ముళ్లు సైతం కలవరపడుతున్నారు. బుద్ధప్రసాద్‌పై ఎమ్మెల్యే వర్గీయుల ఆగ్రహం.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు ఏ ఒక్క నాయకుడినీ ఎదగనీయని బుద్ధప్రసాద్ టీడీపీలోనూ నాయకులను అణగ దొక్కే పనిలో పడినట్టు కొంతమంది టీడీపీ నాయకులే విమర్శిస్తున్నారు. రెండు రోజుల క్రితం నాగాయలంకలో జరిగిన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కార్యాలయంలో దివంగత ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య ఫొటో లేకపోవడం, తాజా మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్ బ్యానర్ లేకపోవడం పట్ల అంబటి వ ర్గీయులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అప్పటికప్పుడు బ్రాహ్మణయ్య ఫొటోను ఏర్పాటు చేశారు. టీడీపీ కోసం శ్రమించిన బ్రాహ్యణయ్యకే ప్రాధాన్యం లేకపోతే సామాన్య కార్యకర్తలను బుద్ధప్రసాద్ ఇంకేం పట్టించుకుంటారంటూ విమర్శలు రేగుతున్నాయి. ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నామని తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు. -
నాగాయలంకలో దోపిడి దొంగల బీభత్సం
కృష్ణా జిల్లా నాగాయలంకలో గురువారం అర్థరాత్రి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. నాగాయలంక ప్రధాన కూడలిలోని 11 షాపుల తాళాలు పగులకొట్టారు. ఆ షాపుల్లోని నగదు, వస్తువులను దొచుకెళ్లారు. ఆ విషయాన్ని షాపు యజమానులు శుక్రవారం ఉదయం గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని యాదవ్ నగర్లో దోపిడి దొంగలు వరుసగా మూడిళ్లలో చోరీకి పాల్పడ్డారు. అయా ఇళ్లలోని కుటుంబసభ్యులను కట్టేసి 19 తులాల బంగారం, 4 తులాల వెండి, రూ. 32 వేలు అపహరించుకుపోయారు. శుక్రవారం ఉదయం బాధితులు ఎల్బీ నగర్ పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న జాలర్లు
నాగాయలంక : కృష్ణా జిల్లా నాగాయలంక వద్ద సముద్రంలో మత్స్యకారులు చిక్కుబడిపోయారు. స్వర్లగొంది సమీపంలోని వేటకోసం సముద్రానికి వెళ్లిన 25 మంది మత్యకారులు చిక్కుకున్నారు. డీజిల్ అయిపోవడంతో సముద్రంలోనే బోట్లు నిలిచిపోయాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన సమయంలో మత్స్యకారులు సముద్రంలో చిక్కుకోవడంతో మత్స్యకార కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం నేడు తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు చెన్నై-ఒంగోలు మధ్య తీరందాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలకు వర్ష సూచనతో పాటు గంటకు 45-55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. దాంతో అన్ని పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి.