వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న జాలర్లు
నాగాయలంక : కృష్ణా జిల్లా నాగాయలంక వద్ద సముద్రంలో మత్స్యకారులు చిక్కుబడిపోయారు. స్వర్లగొంది సమీపంలోని వేటకోసం సముద్రానికి వెళ్లిన 25 మంది మత్యకారులు చిక్కుకున్నారు. డీజిల్ అయిపోవడంతో సముద్రంలోనే బోట్లు నిలిచిపోయాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన సమయంలో మత్స్యకారులు సముద్రంలో చిక్కుకోవడంతో మత్స్యకార కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం నేడు తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు చెన్నై-ఒంగోలు మధ్య తీరందాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలకు వర్ష సూచనతో పాటు గంటకు 45-55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. దాంతో అన్ని పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి.