తొలి దశలో 4 జిల్లాల్లో 22 చోట్ల 210 రీఫ్ యూనిట్స్ ఏర్పాటు
తీరంలోనే మత్స్యసంపద వృద్ధి..జీవవైవిధ్యం పెంపుదలకు దోహదం
2022–23లోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన వైఎస్ జగన్ ప్రభుత్వం
పీఎంఎంఎస్‌వై కింద కేంద్రం అనుమతులు
సాక్షి, అమరావతి: మత్స్య సంపద వృద్ధి, జీవవైవిధ్యం పెంపు లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి కృత్రిమ దిబ్బలు (ఆర్టిఫిషియల్ రీఫ్స్) ఏర్పాటు చేయబోతున్నారు. సముద్రపు లోతుల్లో సంచరించే చేపలను ఆకర్షించి, తీరం సమీపానికి రప్పించేలా త్రిభుజాకారం, పూల ఆకారం, భారీ పైపుల ఆకృతుల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఇవి మత్స్య సంపదను ఆకర్షిస్తాయి.
తద్వారా మత్స్యకారులకు తీరానికి సమీపంలోనే భారీగా మత్స్య సంపద లభిస్తుంది. ఒకప్పుడు సముద్రంలో తీరానికి అతి సమీపంలోనే లభించే మత్స్యసంపద పర్యావరణ కాలుష్యం, తీరంలో పెరుగుతున్న చమురు కార్యకలాపాలతో దూరమైపోయింది. కనుచూపు మేరలో మత్స్యసంపద దొరకని పరిస్థితి ఏర్పడింది.
జీవవైవిధ్యం కూడా దెబ్బతింటోంది. ఈ సమస్యకు కృత్రిమ దిబ్బల ఏర్పాటు చక్కటి పరిష్కారమని కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన సంస్థ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) గుర్తించింది. ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేసి, సత్ఫలితాలను సాధించింది. ఇప్పుడు సువిశాల ఏపీ తీరంలో వీటిని ఏర్పాటు చేస్తోంది.
184 ప్రాంతాల్లో 500 యూనిట్లు
ఏపీ తీరంలో 533 మత్స్యకార గ్రామాలున్నాయి. చేపల వేటపై ఆధారపడి 8 లక్షల మందికి పైగా జీవిస్తున్నారు. తీరానికి సమీపంలో ఆశించిన స్థాయిలో మత్స్య సంపద లేకపోవడంతో రాష్ట్ర మత్స్యకారులు గుజరాత్, అండమాన్ నికోబార్ దీవుల వైపు వెళ్తున్నారు. వీరి జీవనోపాధిని మెరుగుపరచడంతోపాటు జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి కృత్రిమ దిబ్బలు ఏర్పాటు చేయాలని సీఎంఎఫ్‌ఆర్‌ఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
2022–23లోనే రీఫ్‌లకు అనువైన ప్రాంతాలను గుర్తించింది. 300 మత్స్యకార గ్రామాల పరిధిలో 184 ప్రాంతాల్లో 500 రీఫ్ యూనిట్ల ఏర్పాటుకు వైఎస్ జగన్ ప్రభుత్వం 2023 జూలైలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) కింద వీటికి అనుమతి ఇచ్చిoది. తొలుత 210 యూనిట్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో యూనిట్‌లో 500 దిబ్బలు ఉంటాయి.
ఒక్కో యూనిట్ రూ.35 లక్షల అంచనాతో తొలి దశలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో 22 చోట్ల ఏర్పాటు చేస్తారు. దశల వారీగా మిగిలిన జిల్లాల్లోనూ ఏర్పాటు చేయనున్నారు. వీటి ఏర్పాటుకు కేరళలో ్చఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసిన కేఎస్‌సీఏడీసీ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం చేసుకోనుంది.
కృత్రిమ దిబ్బలతో ప్రయోజనాలుఎన్నో..
సాధారణంగా సముద్రంలో మునిగిపోయిన బోట్లు, వస్తువులు చేపలను ఆకర్షిస్తాయి. పూర్వం చేపలను ఆకర్షించడానికి భారీ కలప దుంగలు వాడేవారు. ప్రస్తుతం రంధ్రాలు, పగుళ్లతో రూపొందించిన కాంక్రీట్ నిర్మాణాలను ఉపయోగిస్తున్నారు.
ఏళ్ల తరబడి చెక్కు చెదరకుండా ఉంటూ లార్వా, పాచి, ఇతర జీవులు, చేపలను ఆకర్షించడంతో పాటు వాటి సంతానోత్పత్తికి ఇవి దోహదపడతాయి. వీటి ద్వారా లోతు జలాల్లో లభించే కింగ్ ఫిష్, ట్యూనా, రెడ్‌స్నాపర్స్, పీతలు, రొయ్యలు, స్క్వడ్స్, కొన్ని సార్లు ఆక్టోపస్ వంటివి కూడా 2.5 కిలోమీటర్ల దూరంలోనే వలకు చిక్కుతాయి. ఖర్చు కూడా 70 నుంచి 80 శాతం తగ్గుతుంది.
2023లోనే ప్రతిపాదించాం
మత్స్య సంపద సుస్థిరత, తీర ప్రాంత మత్స్యకారుల జీవనోపాధి పెంపు లక్ష్యంతో 2022–23లోనే కృత్రిమ దిబ్బల ఏర్పాటుకు బ్లూ ప్రింట్ తయారుచేశాం. పీఎంఎంఎస్‌వై ద్వారా ఏపీలో 184 ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు 2023లోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
వీటి ఏర్పాటు కోసం ఇప్పటికే ఆ ప్రాంతాల్లో మత్స్యకారులకు అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే వీటి ఏర్పాటు ప్రారంభిస్తాం. – డాక్టర్ జియో కె.కుజాకుదన్, ప్రిన్సిపల్ సైంటిస్ట్, సీఎంఎఫ్‌ఆర్‌ఐ, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment