ఇంటినీ ఎత్తేస్తారు!
నాగాయలంక : భూమి మెతక వల్ల కుంగిపోయిన, కొత్తగా వేసిన రోడ్డుకన్నా పల్లంగా ఉన్నా, ఇతర వాస్తు దోషాలు ఉన్న భవనాలను కూల్చివేసి మళ్లీ నిర్మించడం ఇప్పటివరకూ చూస్తున్నాం. భవనం ఎంత గట్టిదైనా, నిర్మించి ఎన్నో ఏళ్లు గడవకున్నా కూల్చి తిరిగి నిర్మించడమే ఇప్పటివరకూ ఉన్న పద్ధతి. కొత్తగా అందుబాటులో ఉన్న పద్ధతులతో ఈ విధానానికి ఇక స్వస్తి పలకవచ్చు. హౌస్ లిఫ్టింగ్, షిఫ్టింగ్ పద్ధతి కొత్తగా అందుబాటులోకి వచ్చింది. ఈ విధానం పల్లెలకు కూడా పాకింది.
కృష్ణా జిల్లా నాగాయలంకలో ఓ భవనాన్ని జాకీల మీద లేపి ఎత్తుపెంచడం స్థానికంగా ఆసక్తి కలిగిస్తోంది. మండల పరిషత్ అధ్యక్షుడు సజ్జా గోపాలకృష్ణ ఇంటిని హరియాణాకు చెందిన టీడీబీడీ ఇంజనీరింగ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ (హౌస్ లిప్టింగ్ సర్వీస్ ఇన్ ఇండియా) ఈ పనులు చేపట్టింది. ఈ భవనం పశ్చిమవైపు అడుగు మేర కుంగి, తూర్పున ఎత్తు పెరగడాన్ని వాస్తు దోషంగా భావించి ఇలా ఎత్తు పెంచుతున్నారు. ఈ భవనం ఎత్తు పెంచేందుకు రూ. 5 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా.