‘లంక’లో ఎస్పీ పుష్కర సమీక్ష
నాగాయలంక :
రానున్న పుష్కరాలను పురస్కరించుకుని మండలంలోని పుష్కరఘాట్‌ల పనులు, సిబ్బంది వసతి ఏర్పాట్లును కృష్ణాజిల్లా ఎస్.పీ జీ.విజయకుమార్ మంగళవారం దివి పోలీసు అధికారులు, మండల రెవెన్యూ అధికారులతో సమీక్ష జరిపారు. మండల కేంద్రంలోని నాగాయలంక పుష్కరఘాట్‌ను ఆయన పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏవిధంగా బందోబస్తు నిర్వహించాలి, ఇక్కడికి భక్తులు ఏస్థాయిలో వస్తారు? తదితర అంశాలపై తహసీల్దార్‡ ఎస్. నరసింహారావు , అవనిగడ్డ డీఎస్పీ ఖాదర్ బాషా , ఆలయకమిటీ వర్గాలతో సమీక్షించారు. గోదావరి పుష్కరాలలో విశిష్టసేవలు అందించిన నాగాయలంక స్టేషన్‌లోని సీనియర్ హెడ్‌కానిస్టేబుల్ వీరాంజనేయులును ఈ సందర్భంగా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఆయన సేవలను సక్రమంగా వినియోగించాలని సూచించారు. అనంతరం సంతబజారులో పోలీసులు, ఇతర సిబ్బందికి ఏర్పాటు చేయనున్న వసతి ఏర్పాట్లు పరిశీలించారు. అవనిగడ్డ సీ.ఐ సీఎస్‌ఎస్‌వీ మూర్తి, స్థానిక ఎస్.ఐ జీ.అనిల్, ప్రొబెషనరీ ఎస్.ఐ, వీఆర్వో తలశిల చిదంబరరావు(పసి) తదితరులు పాల్గొన్నారు.
ఇబ్బందులు.. ప్రమాదాలు నివారించండి
కొత్తపేట(అవనిగడ్డ): పుష్కరాలు జరిగే 12 రోజుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ విజయకుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని కొత్తపేట పుష్కరఘాట్‌ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిండప్రదాన కార్యక్రమం ఒక ప్రక్కగా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాటు చేయాలన్నారు. మహిళలకు బాత్‌రూంల ఏర్పాటు గురించి వీఆర్‌ఏ శేషుబాబుని అడిగితెలుసుకున్నారు. బాత్‌రూంలు వద్ద తీసుకోవాల్సిన జాగ్రతలను ఆయన పేపర్‌పై వేసి చూపించారు. వైద్యశిబిరం, రెవెన్యూ, పోలీసులు, సమచార కేంద్రాలను ఎదురుగా కాకుండా ఒక పక్కగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రమాదాల నివారణకు పటిష్టచర్యలు తీసుకోవాలని ఒక్క ప్రమాదం జరగకుండా చూడాలని ఆదేశించారు. మట్టిదిబ్బలను సరిచేయించి భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రతలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఖాదర్‌బాషా, సీఐ కెవీవీఎస్ మూర్తి, ఎస్‌ఐ మణికుమార్ తదితరులు పాల్గొన్నారు.
కష్ణానది ఒడ్డునే మోనిటరింగ్
పెదకళ్లేపల్లి(మోపిదేవి): దక్షిణకాశీ పెదకళ్లేపల్లిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రశాంత వాతావరణలో స్నానాలు ఆచరించేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ తెలిపారు. కృష్ణానది వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాట్ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పుష్కరఘాట్స్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మోనిటరింగ్ కూడా ఇక్కడనుంచే చేయడం వల్ల ఉన్నతాధికారులు ఎప్పటికప్పడు ఘాట్‌లు పరిశీలిస్తూ అవసరమైన సహాయ సహకారాలు, సూచనలు అందిస్తారని చెప్పారు. స్థానిక దుర్గానాగేశ్వరస్వామివారి దేవస్థానంకు విచ్చేసే భక్తులకు ఆలయప్రవేశానికి రాక, పోకలకు విడివిడిగా గేట్‌లు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. అధికారులు సూచించిన ప్రదేశంలోనే భక్తులు స్నానాలు చేయాలని, అన్నివిధాలుగా అధికారులకు సహకరించాలని కోరారు. అవనిగడ్డ డీఎస్పీ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహిస్తామని వివరించారు. ఆయనవెంట అవనిగడ్డ డీఎస్పీ ఖాదర్‌బాషా, చల్లపల్లిసీఐ రమణ, ఎస్‌ఐ చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ అరజా వెంకట సుబ్బారావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.