puskara works
-
పుష్కర పనుల్లో వృథా ఖర్చు
* ప్రణాళిక లేక ఖాళీగా దర్శనమిచ్చిన పుష్కరనగర్లు * కొన్ని చోట్ల ఇప్పటికీ కొనసాగుతున్న రోడ్ల నిర్మాణాలు సాక్షి, అమరావతి బ్యూరో: పుష్కరాల ప్రభుత్వం కోట్ల రూపాలయ సొమ్ము వృథా చేసింది. భక్తులకు ఉపయోగపడతాయా లేదా అని ఆలోచించకుండా జిల్లాలో పుష్కర నగర్లను ఏర్పాటు చేసింది. ఘాట్‌కు పుష్కరనగర్లను దూరంగా ఏర్పాటు చేసి వాటిని అలంకారప్రాయంగా ఉంచారు. వీటి కాంట్రాక్టులన్నీ అధికార పార్టీ నేతలే దక్కించుకున్నారు. జిల్లా తాడేపల్లిలోని మోడల్æడెయిరీ, రిథం, కృష్ణాకెనాల్ రైల్వేస్టేషన్, నులకపేట కల్యాణ మండపం, మంగళగిరిలోని ఎయిమ్స్, ఉద్దండరాయునిపాలెం, పెనుమూడి, అమరరావతిలోని గుంటూరు, విజయవాడ, సత్తెనపల్లె రోడ్డులో మూడు, గుంటూరు సమీపంలో (ట్రాన్సిట్ పాయింట్), పొందుగుల, దైద, విజయపురిసౌత్‌లో 14 చోట్ల ఏర్పాటు చేశారు. పేరుకు మాత్రమే.. గుంటూరుకు సమీపంలో రూ.2 కోట్లతో గోరంట్ల వద్ద (ట్రాన్సిట్) పుష్కర నగర్ ఏర్పాటు చేశారు. దీన్ని భక్తులెవరూ ఉపయోగించుకోలేదు. అక్కడ అధికారులు మాత్రమే కనిపించారు. మరుగుదొడ్లు, స్టాల్స్, క్లాక్ Sరూమ్, భారీ ఎల్ఈడీ స్కీన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, మినరల్ వాటర్ ప్లాంట్ల కోసం దాతల నుంచి కార్పొరేషన్ అధికారులు రూ.20 లక్షలు వసూలు చేశారు. ఇవన్నీ వృథాగా మారాయి. ఈ పనులను అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే ఓ కంపెనీకి కట్టబెట్టారు. వ్యవహారం మొత్తం చినబాబు కనుసన్నల్లో జరిగినట్లు సమాచారం. ఇవి కాకుండా జిల్లాలో 13 చోట్ల రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలు ఖర్చు చేసి పుష్కర నగర్లను ఏర్పాటు చేశారు. పొందుగుల, కృష్ణవేణి, అమరావతిలోని సత్తెనపల్లె, విజయవాడ రోడ్డులో ఏర్పాటు చేసిన, ఎయిమ్స్ మంగళగిరి, పెనుమూడి, ఉద్దండరాయునివాళెం, తాడేపల్లె ఏర్పాటు చేసిన పుష్కర నగర్లు వెలవెలబోయాయి. పుష్కరాలు ముగిసినా కొనసాగుతున్న పనులు తెనాలి రూరల్: ప్రాంతాల ప్రాధాన్యాన్ని బట్టి ఘాట్లను ఏ, బీ, సీ విభాగాలుగా విభజించారు. ఒక్క పెనుమూడిలోనే వీఐపీ ఘాట్ ఏర్పాటు చేశారు. తెనాలి డివిజన్లో ఏ కేటగిరీ ఘాట్లు లేవు. ఈ ఘాట్లలో టైల్స్ వేయడం, అందంగా తీర్చిదిద్దాల్సి ఉంది. బీ, సీ కేటగిరీల్లో ఘాట్లను నిర్మించి, రంగులు వేసి, నదీ జలాలు లేని చోట జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేయాలి. నదిలో కిందికి వదిలే నీళ్లు లేకపోవడంతో జల్లు స్నానాలతో మమ అనిపించారు. కొన్ని ఘాట్లలో ఒక్కరు కూడా పుష్కర స్నానాలు చేయలేదు. పుష్కరాలు ముగిసినా పనులు సా..గుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే పుష్కరాలకు సంబంధించిన పనులు ఇంకా కొనసాగుతుండడం విశేషం. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో కరకట్ట నుంచి నది వరకు అప్రోచ్ రోడ్డు నిర్మించాలి. తెనాలి డివిజన్ కొల్లిపర మండల పరిధిలో అవసరం ఉన్నా, లేకపోయినా 12 ఘాట్లను నిర్మించారు. వీటికి సంబంధించి కరకట్ట నుంచి అప్రోచ్ రోడ్డు వేసేందుకు రూ. 2.65 కోట్ల అంచనాలతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పుష్కరాలకు కేవలం 40 రోజుల ముందే కాంట్రాక్టరుతో ఒప్పందం ఖరారైంది. కొన్ని ఘాట్ల వద్ద అప్రోచ్ రోడ్డుకు మట్టి పని చేయాలి. సుమారు ఐదడుగుల మేర ఎత్తు వరకు మట్టి రోడ్డు వేసి, దానిపై డస్ట్, కంకర పోసి రోలర్లతో తొక్కించి, అనంతరం సిమెంటు రోడ్డు లేదా, బీటీ రోడ్డు వేయాలి. అయితే కొల్లిపరలో ఇప్పటికీ ఒక్క ఘాట్‌కూ అప్రోచ్ రోడ్డు నిర్మాణం జరగలేదు. కేలవం కరకట్ట నుంచి ఘాట్ వరకు డస్ట్, కంకర వేసి రోలర్‌తో తొక్కించకుండా వదిలేశారు. ఒప్పందం ప్రకారం కాంట్రాక్టరుకు 90 నుంచి 180 రోజుల సమయం ఉంది. దీంతో పుష్కరాలు పూర్తయినా, ఇప్పటికీ పనులు చేస్తున్నారు. కొల్లూరు మండలంలో 10 ఘాట్లకుగాను రూ. 2.55 కోట్లు కేటాయించారు. ఈపూరు, చిలుమూరు ఘాట్లకు ప్రస్తుతం అప్రోచ్లను నిర్మిస్తున్నారు. కమిషన్ల కోసమే ఘాట్లు నిర్మించారని ప్రజలు విమర్శిస్తున్నారు. -
ఒక్క వర్షం.. పుష్కరరోడ్డు ధ్వంసం
సంగమం ఘాట్‌కు వెళ్లే రోడ్డు మార్జిన్ ముక్కలు ముందే ట్రాన్స్ఫార్మర్ తొలగించడంతో తప్పిన ముప్పు ఇబ్రహీంపట్నం : పుష్కర పనుల్లోని డొల్లతనం ఒక్క వర్షంతో బైటపడింది. పవిత్ర సంగమం పుష్కర ఘాట్‌కు వెళ్లేందుకు రోడ్లు– భవనాలు (ఆర్అండ్బీ) శాఖ నూతనంగా నిర్మించిన రెండులైన్ల రహదారి మార్జిన్ వర్షంతో నిలువునా జారిపోయింది. రోడ్డు మార్జిన్ కూలి పోవటమే కాక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం ఏర్పాటు చేసిన సిమెంటు దిమ్మెసైతం అయిదడుగుల కిందకు ఒరిగిపోయింది. ఈ ప్రాంతంలోనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుచేసిన విద్యుత్ శాఖ అధికారులు బీటీ రోడ్డు వద్ద మార్జిన్ నెర్రెలిచ్చడం గమనించారు. మార్జిన్ కుంగిపోతుందని ఊహించి ముందుగానే అక్కడున్న ట్రాన్స్ఫార్మర్ను తొలగించారు. వారు ఊహించినట్లుగానే సోమవారం తెల్లవారు జామున వర్షం దెబ్బకు అదే జరిగింది. అక్కడ ట్రాన్స్‌ఫార్మరే ఉండి ఉంటే భారీ ప్రమాదమే జరిగి ఉండేది. రూ.6.50 కోట్ల పనులు డొల్లే ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఐరన్ బారి కేడ్లు సైతం బుడమేరు కాలువలోకి జారిపోయాయి. హడావుడిగా చేసిన పుష్కరాల పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని గతంలోనే సాక్షిలో వరుస కథనాలు వచ్చాయి. అప్పట్లో వర్షంలోనే బీటీ రోడ్డు, మార్జిన్ పనులు చేశారు. పుష్కరాల నేపథ్యంలో సుమారు రూ.6.50 కోట్లతో ఈరోడ్డును ఆర్అండ్బీ శాఖ నిర్మించింది. అధికారుల నిర్లక్ష్యం, అవినీతి కారణంగా విలువైన ప్రజాధనం నీళ్లపాలు అయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కుంగిపోయిన ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. రిటైనింగ్ వాల్ లేనందునే: డీఈ మోహనరావు భారీవర్షాలు పడితే బుడమేరు కాలువ వైపున రోడ్డు అంతా జారిపోయే ప్రమాదం పొంచిఉంది. పేదల నివాసాలు తొలగించిన ప్రాంతంలో రోడ్డును నిర్మిస్తూ అక్కడున్న నల్లమట్టిని పైపైన చదును చేశారనే ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి. ఆర్అండ్బీ డీఈ మోహనరావును సంప్రదించగా.... రోడ్డుకు తూర్పువైపు ఉన్న బుడమేరు కాలువకు రిటైనింగ్ వాల్ లేనందున మార్జిన్ కిందికి జారిందన్నారు. నీటి ప్రవాహం కూడా ఓ కారణం అన్నారు. రోడ్డుభధ్రతను దృష్టిలో ఉంచుకుని కాలువ వైపున రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మార్జిన్ ఏర్పాటుకు పటిష్టమైన చర్యలు చేపడతామని తెలిపారు. -
ఇప్పటికీ పూర్తి కాని పుష్కర పనులు
-
ఇంకా అసంపూర్తిగా!
ప్రధాన ఘాట్లూ పూర్తికాలేదు పుష్కర నగర్‌లదీ అదే స్థితి పెండింగ్‌లోనే విద్యుద్దీకరణ, సుందరీకరణ పనులు సాక్షి, అమరావతి : పుష్కరాల గడువు రోజుల నుంచి గంటలకు వచ్చేస్తోంది. అయినా జిల్లాలో పుష్కర పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నా యి. ప్రధాన ఘాట్ల పనులూ ఇంకా పూర్తికాలేదు. పుష్కర నగర్‌లదీ అదే పరిస్థితి. భక్తులకు సౌకర్యాలు, వసతులు ఇంకా ఏర్పాటు కాలేదు. దీంతో బ్యూటిఫికేషన్, విద్యుదీకరణ పనులూ పెండింగ్‌లోనే ఉన్నాయి. జిల్లాలో ప్రధాన ఘాట్లయిన అమరావతి, సీతానగరం, పెనుమూడి సహా దాదాపు అనేక ఘాట్ల పరిస్థితి ఇలాగే ఉంది. విజయపురి సౌత్ నుంచి అమరావతి వరకు సాక్షి యంత్రాంగం క్షేత్రస్థాయిలో జరిపిన పరిశీలనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుపు ఘాట్ నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ తాత్కాలికంగా వేసిన విద్యుత్తు స్తంభాలు.. నీళ్లు వస్తే ఏక్షణానైనా కూలిపోయే ప్రమాదం ఉంది. పెనుమూడిలో అధికారులు జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఘాట్ వద్దకు నీళ్లు అవకాశం లేకపోవడంతో ఈ చర్యలు తీసుకుంటున్నారు. అమరావతిలో పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఇంకా కొన్ని ఘాట్ల పనులు నిర్వహిస్తున్నారు. కాంక్రీట్, విద్యుద్దీకరణ పనులు కొనసాగుతున్నాయి. సీతానగరంలో టైల్స్ పనులు కొనసాగుతున్నాయి. పుష్కర నగర్లలో పూర్తికాని ఏర్పాట్లు.. అమరావతిలో మూడు పుష్కర నగర్లు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. గుంటూరు గోరంట్లలో 10 వేల మంది భక్తులు ఉండేం దుకు వీలుగా ఏర్పాటు చేస్తున్న పుష్కర నగర్ పనులు ఇంకా పూర్తికాలేదు. సౌకర్యాలకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అమరావతి ఆలయంలో సైతం దేవదాయ శాఖ పనులు సాగుతూనే ఉన్నాయి. ఘాట్లు, పుష్కరనగర్లకు నియమించిన ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు పదో తేదీ నాటికి చేరుకుని విధుల్లో పాలుపంచుకోనున్నారు. పులిచింతల నుంచి నీరు విడుదల చేసిన నేపథ్యంలో ప్రత్యేకాధికారులు విధుల్లో చేరాక ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఘాట్ల పనులు పూర్తి కాకుండానే ట్రయల్‌రన్ నిర్వహించాలంటే అధికారులు ఆందోళన చెందుతున్నారు. -
ఘాట్‌కో గండం
నాసిరకంగా ఘాట్ల ఏర్పాటు కొన్ని చోట్ల జారుడు బండల్లా నిర్మాణం ఆయా ప్రాంతాల్లో ప్రమాద ఘంటికలు పుష్కర పనుల్లో అంతా హడావుడి.. ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఏర్పాట్లన్నీ నత్తనడకన సాగుతున్నాయి.. ముహూర్తం ముంచుకొచ్చేకొద్దీ అధికారులు ఇష్టారాజ్యంగా పనులు ముగిస్తున్నారు..ఈ క్రమంలో భక్తుల భద్రతను మాత్రం గాలికొదిలేస్తున్నారు. లక్షల మంది భక్త జనం వచ్చే ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాల్సిందిపోయి..తూతూమంత్రంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఘాట్లన్నీ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కొల్లిపర: పుష్కరఘాట్ల వద్ద ప్రమాదకర దశ్యాలు కనిపిస్తున్నాయి. పిడపర్రు లాకుల వద్ద పుష్కరఘాట్‌కు వెళ్లే అప్రోచ్‌రోడ్డు అధ్వానంగా ఉంది. ఈ రోడ్డు నిర్మాణంలో మట్టి, ఇసుక వాడారు. అప్రోచ్ రోడ్డు పక్కనే ఉన్న రేపల్లె బ్యాంకు కెనాల్ స్లూయిస్ బాగా పల్లంగా ఉండటంతో ఇది భయపెడుతోంది. అప్రోచ్ రోడ్డు నిర్మాణం వెంట బారికేడ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. మున్నంగి వద్ద అప్రోచ్ రోడ్డు.. మున్నంగి పుష్కర ఘాట్‌కు వెళ్లే అప్రోచ్‌రోడ్డు ప్రమాదకరంగా ఉంది. రోడ్డు నిర్మాణంలో భాగంగా మట్టి తవ్వారు. ఎక్కువ లోతుగా తవ్వకాలు జరపటంతో రోడ్డు వెంట పల్లంగా మారింది. ఒక వేళ పట్టుజారిందా గోతిలో పడాల్సిందే. ఇక్కడ అప్రోచ్‌రోడ్డు వెంట సైడ్ వాల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. వల్లభాపురం ఘాట్‌కు బారికేడ్లు తప్పనిసరి? భక్తులు స్నానాలు చేసే చోట తప్పనిసరిగా బారికేడ్లు ఏర్పాటు చేయాలి. వల్లభాపురం తిరుపతమ్మ గుడి వద్ద భక్తుల స్నానాల కోసం అక్కడ ఉన్న ర్యాంప్ వద్ద రెండు పుష్కర ఘాట్లను నిర్మిస్తున్నారు. ఒక ఘాట్ ర్యాంపునకు ఎదురుగా, మరో ఘాట్ ర్యాంపునకు ఎడమవైపు ఉంది. ఆ రెండింటి మధ్య ఎక్కువ ఖాళీ స్థలం ఉంది. రెండు ఘాట్ల వద్ద రెండున్నర అడుగుల మేర మాత్రమే సైడ్ వాల్స్ నిర్మిస్తున్నారు. ఇక్కడ ఖాళీ స్థలంలో భక్తులు స్నానమాచరిస్తారు. కావున బారికేడ్లు తప్పనిసరి. వల్లభాపురం శ్మశాన వాటిక వద్ద గుండం.. వల్లభాపురం శ్మశాన వాటిక వద్ద ఉన్న ఘాట్‌కు సమీపంలో గుండం ఉంది. అక్కడ అధికారులు నిర్దేశించిన ఘాట్ ప్రాంతంలోనే స్నానం చేయడం మంచిది. గుండం వద్దకు భక్తులు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇక్కడ కచ్చితంగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి. జారుడు బల్లగా పుష్కర ఘాట్.. వల్లభాపురం శ్మశాన వాటిక వద్ద ఉన్న పుష్కరఘాట్ జారుడు బల్లగా కనిపిస్తుంది. పుష్కరాల సమయంలో వర్షం వస్తే భక్తులకు ఇబ్బందే. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే భద్రతా పరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
గోడ ప్రమాద జాడ
సాక్షి, విజయవాడ : పుష్కర పనుల పుణ్యమా అని అధికారులు ఇతర ముఖ్యమైన పనులకు తిలోదకాలు ఇస్తున్నారు. పుష్కరాల్లో ట్రాఫిక్ ఇబ్బందుల కోసం రెవెన్యూ అధికారులు తీసుకున్న ఒక నిర్ణయం జలరవాణా కోసం ఇప్పటికే చేపట్టిన పనులకు ఎసరు పెట్టగా, ఆ పక్కనే నిర్మించిన గోడ ప్రమాదకరంగా మారింది. కృష్ణానదిలో నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువన ఉన్న రైవస్, ఏలూరు, బందరు కాలువలకు నీరు వదిలేందుకు కృష్ణా మెయిన్ కెనాల్ ఉంది. గతంలో కెనాల్ రోడ్డులో ఈ మెయిన్ కాలువ రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఆ తరువాత దానికి మరమ్మతులు చేసి వినియోగిస్తున్నారు. ఈ కాలువనే బ్రిటీష్ కాలంలో జల రవాణా కోసం ఉపయోగించేవారు. దీనికోసం కెనాల్‌రోడ్డు నుంచి ప్రకాశం బ్యారేజీకి వెళ్లే మార్గంలో ఒక వంతెన నిర్మించి దాని కింద రెగ్యులేటర్లను ఏర్పాటు చేశారు. ఈ వంతెన, లాకులు పాడవడంతో ఇరిగేషన్ అధికారులు కాలువలో దిగువకు 110 మీటర్ల తరువాత మరో వంతెనను నిర్మించి రెగ్యులేటర్లు ఏర్పాటుచేశారు. జలరవాణా వాల్ క్లోజ్ ఈ ఏడాది చివరి నాటికి ప్రకాశం బ్యారేజీ నుంచి జల రవాణా చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణా కెనాల్‌లోనూ జలరవాణా మార్గం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి వచ్చే 1000 టన్నుల బోట్లు ఈ కాలువ ద్వారానే ఏలూరు కాలువలోకి వెళ్తాయి. ఈ నేపథ్యంలో కృష్ణా కెనాల్లో ఒక గోడను ఇరిగేషన్ అధికారులు నిర్మించారు. సుమారు 90 మీటర్ల పొడవు, 15 మీటర్ల ఎత్తు, రెండు మీటర్ల వెడల్పులో ఈ గోడ నిర్మించారు. ఒకవైపు కెనాల్ రోడ్డు, మరోవైపు ఈ గోడ ఉండటంతో దీని మధ్యలో జలరవాణాకు కావాల్సిన నీటిని నిల్వ చేయాలని నిర్ణయించారు. కాలువను పూడ్చేస్తున్న రెవెన్యూ కేవలం జలరవాణా కోసం నిర్మించుకున్న గోడను ఇప్పుడు రోడ్డుకు రిటైనింగ్ వాల్‌గా మారుస్తున్నారు. పాత వంతెన, కొత్తవంతెన మధ్య కెనాల్‌రోడ్డు వెడల్పు చాలా తక్కువగా ఉండటం వల్ల పుష్కరాలకు వచ్చే భక్తుల తొక్కిసలాట జరుగుతుందని రెవెన్యూ అధికారులు భావించారు. దీంతో అక్కడ రోడ్డు వెడల్పు చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా జలరవాణా కోసం నిర్మించిన గోడను ఖరారు చేసుకుని రోడ్డును విస్తరిస్తున్నారు. 90 మీటర్ల పొడవు, 15 మీటర్ల ఎత్తులో ఉన్న గోడ నిండే వరకూ మట్టితో ఫిల్లింగ్ చేస్తున్నారు. వారం రోజుల్లో ఫిల్లింగ్ పూర్తిచేసి తారురోడ్డు వేయాలని భావిస్తున్నారు. దీనివల్ల రోడ్డు వెడల్పు అవుతుందని నిర్ణయించారు. మట్టిలోడు గోడ భరిస్తుందా? కేవలం జలరవాణా కోసం నిర్మించుకున్న గోడను రిటైటింగ్ వాల్‌గా వినియోగించడంపై ఇంజినీర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 15 మీటర్ల ఎత్తులో ఉన్న గోడ వద్ద టన్నుల కొద్దీ మట్టిని నింపుతున్నారని, ఇక్కడ భక్తుల రద్దీ పెరిగినపుడు మట్టి ఒత్తిడి పెరిగి గోడ కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే, పుష్కరాలు ముగిశాక తిరిగి ఆ మట్టిని తీసేసి జలరవాణాకు సిద్ధం చేయాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. పుష్కరాల పనులను హడావుడిగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో అధికారులు ఇవేమీ పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడేకంటే ఆ ప్రదేశంలో బందోబస్తు ఏర్పాటు చేసి క్రౌడ్ మేనేజ్మెంట్ చేసుకుంటే సరిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. l -
నాణ్యత డొల్ల..
పుష్కర ఘాట్ల నిర్మాణ పనుల్లో అవినీతి వైఎస్సార్ సీపీ పరిశీలనలో బట్టబయలు రూ.వందల కోట్లు కృష్ణార్పణం నాణ్యతకు తిలోదకాలు కృష్ణాపుష్కర పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడంలేదు.. ఇసుక, మట్టితో ఘాట్లు నిర్మిస్తున్నారు.. నామ మాత్రంగా కాంక్రీటు వేస్తున్నారు.. మొత్తంగా కాంట్రాక్టర్ల రూపంలో టీడీపీ నేతలు రూ.కోట్లు ఆరగిస్తున్నాన్న విషయం వైఎస్సార్ సీపీ నాయకుల పరిశీనలో బట్టబయలైంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు బుధవారం అమరావతి, ధరణికోట, సీతానగరం పుష్కర ఘాట్లను పరిశీలించారు. పనుల్లో డొల్లతనం, నాణ్యతలేమిని గుర్తించారు. సాక్షి, అమరాతి: గడువులోగా ఎలాగోలా పూర్తిచేయాలని.. ఘాట్ పనుల్లో ఇసుక పోసి.. పైన నామమాత్రంగా పూతగా కాంక్రీటు వేసి దోపిడీ చేస్తుండడం చూసి వైఎస్సార్ సీపీ నాయకులు ఆశ్చర్యానికి గురయ్యారు. నిర్మాణ పనుల్లో పాటించాల్సిన క్యూరింగ్ జాడ కనిపించడం లేదు. కన్సాలిడేషన్ చేయటం లేదు. దీంతో టైల్స్ వేసినా పుష్కరాల ప్రారంభం నాటికే పగిలిపోయే పరిస్థితిని గమనించారు. ఘాట్ల వద్ద పనుల నాణ్యతను పట్టించుకోకపోవడం దారుణమని పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వారు అధికారులను ఆరా తీయగా జూలై 30 నాటికి పూర్తి చేయాల్సిందేనని సీఎం హుకుం జారీ చేశారని, దీంతో ఎలాగోలా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు హడావుడి పనులు చేస్తున్నారని చెప్పడం విశేషం. డొల్లతనం బట్టబయలు.. అమరావతి ధ్యాన బుద్ధ సమీపంలోని ధరణికోట ఘాట్ నిర్మాణ పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల్లో డొల్లతనం బట్టబయలైంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పనుల నాణ్యతపై అధికారులను పలు విషయాలపై ప్రశ్నించారు. కాంక్రీట్ ఎంత మందంతో వేస్తున్నారని అడిగారు. 0.4 మీటర్ల మందంతో వేయాల్సి ఉందని అధికారులు చెప్పగా.. కాంక్రీట్ వేస్తున్న ప్రాంతాన్ని చూపి ఇక్కడ 0.4 మీటర్ల మందంతో కాంక్రీట్ వేస్తున్నారా.. అని అధికారులను అడగ్గా వారు నీళ్లు నమిలారు. కనీసం 0.2 మీటర్లు కూడా లేకుంటే ఎలాగని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇసుకను గుట్టలుగా పోస్తున్నారని, కనీసం కన్సాలిడేషన్ కూడా చేయకుంటే ఎలాగని నిలదీశారు. నల్లరేగడి నేల పగిలిపోదా అని పేర్కొన్నారు. రూ.10 కోట్ల విలువైన పనులు చేస్తున్నా ఒక్క వైబ్రేటర్ కూడా వాడలేదంటే పనుల నాణ్యతలో డొల్లతనం తేట తెల్లమవుతోందన్నారు. అక్కడ ఉన్న కంకరును చూసి ఇది 40 ఎంఎం కంకరా.. అని ప్రశ్నించారు. పుష్కర పనుల్లో వాడుతున్న స్టీల్‌కు సంబంధించి టెస్టింగ్ సర్టిఫికెట్లు చూపాలని అధికారులను కోరగా.. సబ్మిట్ చేశామంటూ వారు సమాధానాన్ని దాటవేశారు. 30వ తేదీ నాటికి ఎలా పూర్తిచేస్తారు..? పనులు ఎప్పటి నుంచి ప్రారంభించారని మర్రి రాజశేఖర్ ప్రశ్నించారు. ప్రస్తుతం 40 శాతం పనులు కూడా.. పూర్తి కాలేదు.. మిగతా పనులు ఈ నెల 30వ తేదీలోపు ఎలా పూర్తి చేస్తారని అడిగారు. అక్కడ జరుగుతున్న పనులపై పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, పార్టీ సమన్వయకర్తలు కావటి మనోహర్ నాయుడు, క్రిస్టినా, రావి వెంకటరమణ, అన్నాబత్తుల శివకుమార్, బొల్లా బ్రహ్మనాయుడు, రావి వెంకటరమణలు ప్రశ్నల వర్షం కురిపించారు. అనంతరం అక్కడ నుంచి వెళ్లి అమరావతి ఘాట్‌లో జరుగుతున్న పనులను పరిశీలించి, వైకుంఠపురంలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సీతానగరం ఘాట్‌లో... సీతా నగరంలో జరుగుతున్న ఘాట్ పనులు చూసి, ఇలా పనులు చేస్తే పుష్కరాలు వచ్చే వరకు కూడా ఘాట్లు ఉండవని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పుష్కరాల్లో చేసిన కాంక్రీట్ పనులు చూపి.. వాటికీ ప్రస్తుతం చేస్తున్న పనులకు ఎంత తేడా ఉందో చూడాలని మీడియా సభ్యులను కోరారు. కొద్ది పాటి వర్షానికే కోట్టుకు పోయిన ఇసుకను చూపారు. పుష్కర పనులు జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతి, ధరణికోట, సీతానగరం ఘాట్లు మోడల్ ఘాట్లని.. వీటి పరిస్థితే ఇలా ఉంటే మిగతా ఘాట్ల పనులు ఎలా చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చుని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
దోచుకునేందుకే పుష్కర పనులు
ఎమ్మెల్యే ఆర్కే తాడేపల్లి రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, మంత్రులు, కాంట్రాక్టర్లు దోచుకునేందుకే కృష్ణా పుష్కర పనులు హడావుడిగా చేస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి పట్టణంలోని సీతానగరం ఘాట్‌ను పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పనుల్లో నాణ్యత కొరవడి నాసిరకంగా వున్నాయని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న పుష్కర పనులు చూస్తుంటే గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన దురదృష్ట ఘటన పునరావృతమయ్యే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నామినేషన్లపై కోట్ల రూపాయల పనులు కాంట్రాక్టర్లకు.. తమ్ముళ్లకు అప్పగించిన ప్రభుత్వం వాటిని పర్యేక్షించకపోవడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు నివాసంపై నుంచి చూస్తే సీతానగరం పుష్కరఘాట్ కనిపిస్తుందని, కనీసం ఇంటి ముంగిట జరుగుతున్న పనులను పరిశీలించే తీరిక సీఎం చంద్రబాబుకు లేదని విమర్శించారు. -
‘లంక’లో ఎస్పీ పుష్కర సమీక్ష
నాగాయలంక : రానున్న పుష్కరాలను పురస్కరించుకుని మండలంలోని పుష్కరఘాట్ల పనులు, సిబ్బంది వసతి ఏర్పాట్లును కృష్ణాజిల్లా ఎస్.పీ జీ.విజయకుమార్ మంగళవారం దివి పోలీసు అధికారులు, మండల రెవెన్యూ అధికారులతో సమీక్ష జరిపారు. మండల కేంద్రంలోని నాగాయలంక పుష్కరఘాట్‌ను ఆయన పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏవిధంగా బందోబస్తు నిర్వహించాలి, ఇక్కడికి భక్తులు ఏస్థాయిలో వస్తారు? తదితర అంశాలపై తహసీల్దార్‡ ఎస్. నరసింహారావు , అవనిగడ్డ డీఎస్పీ ఖాదర్ బాషా , ఆలయకమిటీ వర్గాలతో సమీక్షించారు. గోదావరి పుష్కరాలలో విశిష్టసేవలు అందించిన నాగాయలంక స్టేషన్‌లోని సీనియర్ హెడ్‌కానిస్టేబుల్ వీరాంజనేయులును ఈ సందర్భంగా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఆయన సేవలను సక్రమంగా వినియోగించాలని సూచించారు. అనంతరం సంతబజారులో పోలీసులు, ఇతర సిబ్బందికి ఏర్పాటు చేయనున్న వసతి ఏర్పాట్లు పరిశీలించారు. అవనిగడ్డ సీ.ఐ సీఎస్‌ఎస్‌వీ మూర్తి, స్థానిక ఎస్.ఐ జీ.అనిల్, ప్రొబెషనరీ ఎస్.ఐ, వీఆర్వో తలశిల చిదంబరరావు(పసి) తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులు.. ప్రమాదాలు నివారించండి కొత్తపేట(అవనిగడ్డ): పుష్కరాలు జరిగే 12 రోజుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ విజయకుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని కొత్తపేట పుష్కరఘాట్‌ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిండప్రదాన కార్యక్రమం ఒక ప్రక్కగా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాటు చేయాలన్నారు. మహిళలకు బాత్రూంల ఏర్పాటు గురించి వీఆర్ఏ శేషుబాబుని అడిగితెలుసుకున్నారు. బాత్రూంలు వద్ద తీసుకోవాల్సిన జాగ్రతలను ఆయన పేపర్‌పై వేసి చూపించారు. వైద్యశిబిరం, రెవెన్యూ, పోలీసులు, సమచార కేంద్రాలను ఎదురుగా కాకుండా ఒక పక్కగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రమాదాల నివారణకు పటిష్టచర్యలు తీసుకోవాలని ఒక్క ప్రమాదం జరగకుండా చూడాలని ఆదేశించారు. మట్టిదిబ్బలను సరిచేయించి భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రతలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఖాదర్‌బాషా, సీఐ కెవీవీఎస్ మూర్తి, ఎస్ఐ మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. కష్ణానది ఒడ్డునే మోనిటరింగ్ పెదకళ్లేపల్లి(మోపిదేవి): దక్షిణకాశీ పెదకళ్లేపల్లిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రశాంత వాతావరణలో స్నానాలు ఆచరించేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ తెలిపారు. కృష్ణానది వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాట్ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పుష్కరఘాట్స్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మోనిటరింగ్ కూడా ఇక్కడనుంచే చేయడం వల్ల ఉన్నతాధికారులు ఎప్పటికప్పడు ఘాట్లు పరిశీలిస్తూ అవసరమైన సహాయ సహకారాలు, సూచనలు అందిస్తారని చెప్పారు. స్థానిక దుర్గానాగేశ్వరస్వామివారి దేవస్థానంకు విచ్చేసే భక్తులకు ఆలయప్రవేశానికి రాక, పోకలకు విడివిడిగా గేట్లు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. అధికారులు సూచించిన ప్రదేశంలోనే భక్తులు స్నానాలు చేయాలని, అన్నివిధాలుగా అధికారులకు సహకరించాలని కోరారు. అవనిగడ్డ డీఎస్పీ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహిస్తామని వివరించారు. ఆయనవెంట అవనిగడ్డ డీఎస్పీ ఖాదర్‌బాషా, చల్లపల్లిసీఐ రమణ, ఎస్ఐ చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ అరజా వెంకట సుబ్బారావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
నాణ్యతకు పాతర
పుష్కర పనుల్లో నాణ్యత పాటించని కాంట్రాక్టర్లు పట్టించుకోని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న భక్తులు పుష్కర తరుణం ముంచుకొస్తోంది.. భక్తజన కోటి పన్నెండేళ్లకోసారి వచ్చే పండుగను ఒక్కసారైనా తరించాలని ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురు చూస్తోంది. దీనికి తగ్గట్టు ప్రభుత్వం నిధులైతే విడుదల చేసి తన పనైపోయినట్లు తూతూమంత్రంగా పర్యవేక్షిస్తోంది. దీంతో ఎక్కడికక్కడ పనులన్నీ నీరంగా నీరసంతో నీరుగారుతున్నాయి. మరోవైపు ఉన్నతాధికారుల మామూళ్ల మత్తు.. హడావుడితో నాణ్యతకు పాతర పడుతోంది. సీతానగరం (తాడేపల్లి రూరల్): మండలంలోని సీతానగరం కృష్ణానది ఒడ్డున 450 మీటర్ల పొడవునా ఘాట్ల నిర్మాణం చేపట్టారు. రెండు నెలల నుంచి పుష్కర పనులు నత్తనడకన కొనసాగించిన కాంట్రాక్టర్లు సమయం ముంచుకొస్తుండటంతో హడావుడిగా ఘాట్ల నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఘాట్ల నిర్మాణంలో కూలీలు కాకుండా యంత్రాలు పని ఎక్కువగా చేయడంతో నాణ్యత లోపం స్పష్టంగా కనబడుతోంది. అధికారులు కాంక్రీట్‌ను మిక్సింగ్ చేసేందుకు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఇది కంకర, సిమెంట్, ఇసుక, కావలసిన నీటిని ఏర్పరుచుకుంటుంది. ఈ క్రమంలో కాంట్రాక్టర్ లెక్కా పత్రం లేకుండా ఇసుకను వేయడం, పరిమితికి మించి నీటిని వినియోగించటంతో ఘాట్ల నిర్మాణంలో ఆ కాంక్రీట్ నేలపై వేసినప్పుడు నీటితోపాటు సిమెంటు కూడా కొట్టుకుపోయి కంకరు, కొంత మేర ఇసుక మాత్రమే మిగులుతోంది. ఎగుడుదిగుడుగా మెట్ల నిర్మాణం.. ఘాట్లలో ఏర్పాటు చేసే మెట్లు చిన్నది, పెద్దదిగా కట్టి యాత్రికులు దిగేందుకు వీలు లేకుండా చేస్తున్నారు. ఇలా చేస్తున్నారేంటని అధికారులు ప్రశ్నిస్తే ప్లాస్టింగ్ చేసే సమయంలో హెచ్చు తగ్గులు లేకుండా చూస్తామని మాట దాటేస్తునారు. దీంతోపాటు ఘాట్ల నిర్మాణాలు చేసే సమయంలో ప్రతిఒక్క లారీలో వచ్చే సిమెంటుతో కూడిన కాంక్రీట్ మిక్సింగ్ శాంపిల్స్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. కాంక్రాక్టర్లు ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఘాట్ల నిర్మాణాన్ని పరిశీలించాల్సిన అధికారులు కాంట్రాక్టర్ల కాసులకు తలొగ్గి మౌనం వహిస్తున్నారు. కనీసం జిల్లా అధికారులు కూడా రోజుకోసారి పరిశీలన జరుపుతున్నారే తప్ప ఘాట్ల నిర్మాణంలో జరుగుతున్న అవినీతిని మాత్రం ఏ ఒక్కరూ ప్రశ్నించడం లేదు. కాంక్రీట్ నిర్మాణం చేపట్టిన తర్వాత పది రోజులు వాటరింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక దానిపై ఒకటి నిర్మాణం చేపడుతున్నారు. పుష్కరాల అనంతరం నిర్మించిన ఘాట్ల వద్ద పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయే అవకాశం ఉందని ప్రభుత్వ ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. పుష్కర కాలంపాటు కూడా ఈ ఘాట్లు ఉండవని, ఒక్కసారి వరద వస్తే ఆ నీటి తాకిడికి కొట్టుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పుష్కరపనుల్లో కొండంత నిర్లక్ష్యం