పుష్కర పనుల్లో వృథా ఖర్చు
పుష్కర పనుల్లో వృథా ఖర్చు
Published Wed, Aug 31 2016 10:16 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
* ప్రణాళిక లేక ఖాళీగా దర్శనమిచ్చిన పుష్కరనగర్లు
* కొన్ని చోట్ల ఇప్పటికీ కొనసాగుతున్న రోడ్ల నిర్మాణాలు
సాక్షి, అమరావతి బ్యూరో: పుష్కరాల ప్రభుత్వం కోట్ల రూపాలయ సొమ్ము వృథా చేసింది. భక్తులకు ఉపయోగపడతాయా లేదా అని ఆలోచించకుండా జిల్లాలో పుష్కర నగర్లను ఏర్పాటు చేసింది. ఘాట్‌కు పుష్కరనగర్‌లను దూరంగా ఏర్పాటు చేసి వాటిని అలంకారప్రాయంగా ఉంచారు. వీటి కాంట్రాక్టులన్నీ అధికార పార్టీ నేతలే దక్కించుకున్నారు. జిల్లా తాడేపల్లిలోని మోడల్æడెయిరీ, రిథం, కృష్ణాకెనాల్ రైల్వేస్టేషన్, నులకపేట కల్యాణ మండపం, మంగళగిరిలోని ఎయిమ్స్, ఉద్దండరాయునిపాలెం, పెనుమూడి, అమరరావతిలోని గుంటూరు, విజయవాడ, సత్తెనపల్లె రోడ్డులో మూడు, గుంటూరు సమీపంలో (ట్రాన్సిట్ పాయింట్), పొందుగుల, దైద, విజయపురిసౌత్‌లో 14 చోట్ల ఏర్పాటు చేశారు.
పేరుకు మాత్రమే..
గుంటూరుకు సమీపంలో రూ.2 కోట్లతో గోరంట్ల వద్ద (ట్రాన్సిట్) పుష్కర నగర్ ఏర్పాటు చేశారు. దీన్ని భక్తులెవరూ ఉపయోగించుకోలేదు. అక్కడ అధికారులు మాత్రమే కనిపించారు. మరుగుదొడ్లు, స్టాల్స్, క్లాక్ Sరూమ్, భారీ ఎల్‌ఈడీ స్కీన్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు, మినరల్ వాటర్ ప్లాంట్ల కోసం దాతల నుంచి కార్పొరేషన్ అధికారులు రూ.20 లక్షలు వసూలు చేశారు. ఇవన్నీ వృథాగా మారాయి. ఈ పనులను అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే ఓ కంపెనీకి కట్టబెట్టారు. వ్యవహారం మొత్తం చినబాబు కనుసన్నల్లో జరిగినట్లు సమాచారం. ఇవి కాకుండా జిల్లాలో 13 చోట్ల రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలు ఖర్చు చేసి పుష్కర నగర్లను ఏర్పాటు చేశారు. పొందుగుల, కృష్ణవేణి, అమరావతిలోని సత్తెనపల్లె, విజయవాడ రోడ్డులో ఏర్పాటు చేసిన, ఎయిమ్స్ మంగళగిరి, పెనుమూడి, ఉద్దండరాయునివాళెం, తాడేపల్లె ఏర్పాటు చేసిన పుష్కర నగర్‌లు వెలవెలబోయాయి.
పుష్కరాలు ముగిసినా కొనసాగుతున్న పనులు
తెనాలి రూరల్: ప్రాంతాల ప్రాధాన్యాన్ని బట్టి ఘాట్లను ఏ, బీ, సీ విభాగాలుగా విభజించారు. ఒక్క పెనుమూడిలోనే వీఐపీ ఘాట్ ఏర్పాటు చేశారు. తెనాలి డివిజన్‌లో ఏ కేటగిరీ ఘాట్‌లు లేవు. ఈ ఘాట్‌లలో టైల్స్ వేయడం, అందంగా తీర్చిదిద్దాల్సి ఉంది. బీ, సీ కేటగిరీల్లో ఘాట్‌లను నిర్మించి, రంగులు వేసి, నదీ జలాలు లేని చోట జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేయాలి. నదిలో కిందికి వదిలే నీళ్లు లేకపోవడంతో జల్లు స్నానాలతో మమ అనిపించారు. కొన్ని ఘాట్లలో ఒక్కరు కూడా పుష్కర స్నానాలు చేయలేదు.
పుష్కరాలు ముగిసినా పనులు సా..గుతూనే ఉన్నాయి.
ఇవన్నీ ఒకెత్తయితే పుష్కరాలకు సంబంధించిన పనులు ఇంకా కొనసాగుతుండడం విశేషం. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో కరకట్ట నుంచి నది వరకు అప్రోచ్ రోడ్డు నిర్మించాలి. తెనాలి డివిజన్ కొల్లిపర మండల పరిధిలో అవసరం ఉన్నా, లేకపోయినా 12 ఘాట్‌లను నిర్మించారు. వీటికి సంబంధించి కరకట్ట నుంచి అప్రోచ్ రోడ్డు వేసేందుకు రూ. 2.65 కోట్ల అంచనాలతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పుష్కరాలకు కేవలం 40 రోజుల ముందే కాంట్రాక్టరుతో ఒప్పందం ఖరారైంది. కొన్ని ఘాట్ల వద్ద అప్రోచ్ రోడ్డుకు మట్టి పని చేయాలి. సుమారు ఐదడుగుల మేర ఎత్తు వరకు మట్టి రోడ్డు వేసి, దానిపై డస్ట్, కంకర పోసి రోలర్‌లతో తొక్కించి, అనంతరం సిమెంటు రోడ్డు లేదా, బీటీ రోడ్డు వేయాలి. అయితే కొల్లిపరలో ఇప్పటికీ ఒక్క ఘాట్‌కూ అప్రోచ్ రోడ్డు నిర్మాణం జరగలేదు. కేలవం కరకట్ట నుంచి ఘాట్ వరకు డస్ట్, కంకర వేసి రోలర్‌తో తొక్కించకుండా వదిలేశారు. ఒప్పందం ప్రకారం కాంట్రాక్టరుకు 90 నుంచి 180 రోజుల సమయం ఉంది. దీంతో పుష్కరాలు పూర్తయినా, ఇప్పటికీ పనులు చేస్తున్నారు. కొల్లూరు మండలంలో 10 ఘాట్‌లకుగాను రూ. 2.55 కోట్లు కేటాయించారు. ఈపూరు, చిలుమూరు ఘాట్‌లకు ప్రస్తుతం అప్రోచ్‌లను నిర్మిస్తున్నారు. కమిషన్ల కోసమే ఘాట్లు నిర్మించారని ప్రజలు విమర్శిస్తున్నారు.
Advertisement
Advertisement