ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ దేశవ్యాప్తంగా ఆహార వృథాను అరికడుతూ, పేదల ఆకలిని తీర్చేందుకు కొత్తగా ‘స్విగ్గీ సర్వ్స్(Swiggy Serves)’ పేరుతో సేవలు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఆహార వృథాను కట్టడి చేసేందుకు మిగులు ఆహారాన్ని పేదలకు పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం రాబిన్ హుడ్ ఆర్మీ (RHA) అనే స్వచ్ఛంద సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది.
స్విగ్గీ సర్వీసెస్ రెస్టారెంట్లు, డెలివరీ భాగస్వాముల విస్తృత నెట్వర్క్ నుంచి మిగులు ఆహారాన్ని గుర్తించి, దాన్ని సేకరించేందుకు రాబిన్ హుడ్ ఆర్మీ సహకారం తీసుకోనున్నట్లు స్విగ్గీ పేర్కొంది. తినదగిన ఆహారం వృథా కాకుండా ఆకలితో ఉన్న పేదలకు పంపిణీ చేస్తామని చెప్పింది. పైలట్ దశలో స్విగ్గీ సర్వీసెస్ 126కి పైగా రెస్టారెంట్లతో ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. ప్రాథమికంగా 33 నగరాల్లో ఈ సర్వీస్‌ను ప్రారంభించినట్లు కంపెనీ అధికారులు తెలిపారు.
ప్రతిష్టాత్మక లక్ష్యాలు
ఈ కార్యక్రమం ద్వారా తినదగిన ఆహారం వృథా కాకుండా 2030 నాటికి 50 మిలియన్ల మందికి భోజనం అందించాలనే లక్ష్యం ఏర్పాటు చేసుకున్నట్లు స్విగ్గీ(Swiggy), ఆర్‌హెచ్‌ఏ తెలిపాయి. ఇది సామాజిక బాధ్యత పట్ల స్విగ్గీ నిబద్ధతను, స్థిరమైన, సమ్మిళిత పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి చేసే ప్రయత్నాలకు నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు.
టెక్నాలజీ అండ
స్విగ్గీ సర్వీసెస్ విజయానికి సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా మారింది. మిగులు ఆహార సేకరణ, పునఃపంపిణీని సమన్వయం చేయడంలో స్విగ్గీ ప్లాట్‌ఫామ్ కీలక పాత్ర పోషించనుంది. ఆహార మిగులును అంచనా వేయడానికి, ఆహార పునఃపంపిణీ లాజిస్టిక్స్‌ను ఆప్టిమైజ్ చేయడానికి అధునాతన అల్గారిథమ్‌లను అమలు చేయాలని కంపెనీ యోచిస్తోంది. భోజనం అవసరమైన వారికి నాణ్యత ప్రమాణాలతో సమర్థవంతంగా చేరేలా చూస్తుంది.
ఈ సందర్భంగా స్విగ్గీ ఫుడ్ సీఈఓ రోహిత్ కపూర్ మాట్లాడుతూ..‘స్విగ్గీ సర్వ్స్‌తో కొత్త ప్రయత్నం చేస్తున్నాం. ఇందుకు ఆర్‌హెచ్‌ఏ సహకారం కీలకం. ఆహారం వృథాను, ఆకలి సమస్యను ఏకకాలంలో పరిష్కరించడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. మా రెస్టారెంట్ భాగస్వాముల నుంచి అవసరమైన వారికి ఆహారాన్ని పునఃపంపిణీ చేయడానికి ఆర్‌హెచ్‌ఏతో భాగస్వామ్యం ఎంతో దోహదం చేస్తుంది. ప్రస్తుతం 33 నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో మరిన్ని ప్రాంతాలకు ఈ సర్వీసును విస్తరిస్తాం’ అని అన్నారు. రాబిన్ హుడ్ ఆర్మీ సహ వ్యవస్థాపకుడు నీల్ ఘోస్ మాట్లాడుతూ..‘ఆకలిని తగ్గించే ఈ భాగస్వామ్య మిషన్ కోసం రాబిన్ హుడ్ ఆర్మీ స్విగ్గీతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. ఆకలి సమస్యను తీర్చేందుకు ఇతరులను ప్రేరేపించడం మంచి పరిణామం’ అన్నారు.
స్విగ్గీ సర్వ్స్‌లో ఎలా చేరాలంటే..
రెస్టారెంట్ భాగస్వాములు స్విగ్గీ ఓనర్ యాప్‌లోని ఫామ్‌ను పూరించడం ద్వారా ఈ స్విగ్గీ సర్వ్స్‌లో చేరవచ్చని కంపెనీ తెలిపింది. తర్వాతి సమన్వయం కోసం ఆర్‌హెచ్‌ఏ రెస్టారెంట్ భాగస్వాములతో వాట్సప్ సమూహాల ద్వారా కమ్యునికేట్ అవుతుందని తెలిపింది. ఆర్‌హెచ్‌ఏ వాలంటీర్లు ఈ భాగస్వాముల నుంచి మిగులు ఆహారాన్ని సేకరించి, అవసరమైన వారికి పంపిణీ చేసే బాధ్యతను తీసుకుంటారు.
తలసరి 55 కిలోల ఆహారం వృథా
ఐక్యరాజ్యసమితి వివరాల ప్రకారం భారతదేశంలో దాదాపు 195 మిలియన్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రపంచంలోని పోషకాహార లోపం ఉన్న జనాభాలో నాలుగోవంతు మంది మన దేశంలోనే ఉన్నారు. 2024లో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (GHI)లో 127 దేశాల్లో భారత్ 105వ స్థానంలో నిలిచింది. దేశంలో ఏటా తలసరి 55 కిలోల ఆహారాన్ని వృథా చేస్తున్నారు.
ఇదీ చదవండి: రేడియో వ్యాపారం మూసివేత
రాబిన్ హుడ్ ఆర్మీ
రాబిన్ హుడ్ ఆర్మీ (RHA) అనేది వేలకొద్దీ యువకులు, పదవీ విరమణ చేసిన వ్యక్తులు, గృహిణులు, కళాశాల విద్యార్థులు వాలంటీర్లుగా ఉన్న స్వచ్చంద సంస్థ. ఎలాంటి లాభాపేక్ష లేని ఈ సంస్థలో వాలంటీర్లను రాబిన్స్ అని పిలుస్తారు. ఈ వాలంటీర్లు రెస్టారెంట్లు/ పెళ్లిల్లు/ ఇవత కార్యక్రమాల నుంచి మిగులు ఆహారాన్ని సేకరించి ఆకలితో ఉన్నవారికి పంపిణీ చేస్తారు. పదేళ్లలో RHA ప్రపంచవ్యాప్తంగా 406 నగరాల్లో 153 మిలియన్ల మందికి పైగా భోజనాన్ని అందించింది. ప్రస్తుతం 13 దేశాల్లో 2,60,000+ మంది రాబిన్స్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment