Robin Hood
-
రాబిన్ హుడ్‌తో జోడీ?
హీరో నితిన్–హీరోయిన్ రాశీ ఖన్నా మరోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. నితిన్–రాశీ ఖన్నా ‘శ్రీనివాస కళ్యాణం’ (2018) మూవీలో జోడీగా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ ‘రాబిన్ హుడ్’ సినిమాలో నటించనున్నారని టాక్. ‘భీష్మ’ (2020) వంటి హిట్ మూవీ తర్వాత హీరో నితిన్–డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తున్న ద్వితీయ చిత్రం ‘రాబిన్ హుడ్’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది. అయితే ఈ మూవీలో కథానాయిక ఎవరు? అనే విషయంపై స్పష్టత లేదు. తొలుత రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తారనే వార్తలొచ్చాయి. ఆ తర్వాత శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. తాజాగా రాశీ ఖన్నాని తీసుకున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి నితిన్‌కి జోడీగా రాశీ ఖన్నా ఫిక్స్ అయ్యారా? లేకుంటే మరో హీరోయిన్ తెరపైకి వస్తారా? అనే విషయంపై చిత్ర యూనిట్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
పిండిలో నోట్ల కట్టలు: తాను పంచలేదంటున్న హీరో
వారం, పది రోజుల నుంచి బాలీవుడ్లో ఓ వార్త బీభత్సంగా చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం రయ్‌మంటూ వచ్చిన ఓ ట్రక్కు వీధిలోకి వచ్చి ఆగుతుంది. అందులోని కొంతమంది వ్యక్తులు పేదలకు పిండి ప్యాకెట్లు పంచుతారు. పిండి అవసరం లేదనుకునే వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోతారు. నిజమైన పేదవాళ్లు వరుసలో నిలబడి దాన్ని అందుకుంటారు. అయితే ఆ ప్యాకెట్లు అందుకున్న వాళ్లకు అందులో రూ.15 వేలు కనిపిస్తాయి. ఇలా గుట్టుగా సాయం చేసింది అమీర్ ఖానే అని చాలామంది అభిప్రాయపడ్డారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన అమీర్.. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు. (పేదలకు పంచిన పిండిలో రూ.పదిహేను వేలు) "నేను గోధుమ పిండి సంచుల్లో డబ్బు పెట్టలేదు. ఇది అసత్య ప్రచారమై ఉండొచ్చు.. లేదంటే తన పేరు వెల్లడించడానికి ఇష్టపడని రాబిన్ హుడ్(ధనవంతులను దోచి పేదవారికి సహాయం చేసే వీరుడి పాత్ర) పని అయి ఉండాలి" అని ట్వీట్ చేశాడు. తాను చేయని పనికి క్రెడిట్ తీసుకోనందుకు అభిమానులు తమ హీరోను ఆకాశానికెత్తుతున్నారు. స్వచ్ఛమైన మనసంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. మరోవైపు ఆ రాబిన్ హుడ్ మీరే అయి ఉండొచ్చేమో అని ఎటుతిరిగీ మళ్లీ అమీర్ ఖాన్‌కే గురి పెడుతున్నారు. మిగతా నెటిజన్లు మాత్రం ఆ రాబిన్ హుడ్ ఎవరై ఉంటారా? అని ఆలోచనలో పడిపోయారు. కాగా అమీర్, తన భార్య కిరణ్ రావుతో కలిసి ఆదివారం నాడు "ఐ ఫర్ ఇండియా" లైవ్ కన్సర్ట్‌లో పాల్గొన్నాడు. ఇందులో పాటలు పాడి అభిమానులను అలరింపజేసిన అనంతరం కరోనా పోరాటానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాల్సిందిగా అభిమానులను కోరాడు. (నాలుగేళ్లు సినిమాలకు దూరం: ఆమిర్) -
రాబిన్‌హుడ్ టైప్
చేతిలో ఆయుధం ఉంది. గుండెల్లో తెగువ ఉంది. ఒంట్లో సత్తా ఉంది. ఇన్ని ఉంచుకుని కూడా ఒక హీరో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడంటే అందుకో కారణం ఉంటుంది. ఇక్కడ నివీన్ పౌలీకి కూడా ఓ కారణం ఉంది. ఎందుకంటే అతను దొంగ. మాములు దొంగ కాదు. రాబిన్ హుడ్ టైప్. అంటే ధనవంతులను దోచి పేదలకు పంచుతాడన్నమాట. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో నివీన్ పౌలీ హీరోగా మలయాళంలో తెరకెక్కిన సినిమా ‘కాయమ్‌కులమ్ కొచ్చిన్’. గోకులమ్ గోపాలన్ నిర్మించారు. ప్రియా ఆనంద్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో మోహన్‌లాల్ ఓ కీలక పాత్ర చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ ఏడాది ఓనమ్ ఫెస్టివల్‌కు సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అప్పటి ట్రవాంకూర్ ఏరియాలో దారిదోపిడి దొంగగా హడలెత్తించిన కాయమ్‌కులమ్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందిందని మాలీవుడ్ టాక్. ప్రియాంకా త్రిమ్మేష్, సున్నీ వాణ్నే, బాబు ఆంటోనీ తదితరులు నటించిన ఈ సినిమాకు గోపీ సుందర్ స్వరకర్త. -
ఏడు నెలల తర్వాత మేకప్ వేసుకుంటున్నాడు
ఒకప్పుడు ఏడాదికి మూడు సినిమాలు చేసిన మాస్ మహరాజ్ రవితేజ, ఇప్పుడు స్పీడు తగ్గించేశాడు. కుర్ర హీరోల నుంచి భారీ పోటీ ఉండటంతో పాటు, వరుస ఫ్లాప్‌లు ఇబ్బంది పెట్టడంతో ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. గత డిసెంబర్లో బెంగాల్ టైగర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రవితేజ, ఆ తరువాత ఇంత వరకు సినిమా ప్రారంభించలేదు. ఈ మధ్యలో దిల్‌రాజు నిర్మాణంలో ఎవడో ఒకడు సినిమా చేయాల్సి ఉన్నా, అది క్యాన్సిల్ అయ్యింది. దీంతో మరో సినిమా అంగీకరించకుండా తన లుక్ మార్చుకునేందుకు టైమ్ తీసుకున్నాడు. గత సినిమాల్లో బాగా సన్నగా కనిపించటం, ఫేస్‌లో ఏజ్ బాగా తెలుస్తుండటంతో గెటప్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. జిమ్‌లో కసరత్తులు చేసి కాస్త బరువు పెరగటంతో పాటు నిపుణుల సూచనలతో గ్లామర్ కూడా ఇంప్రూవ్ చేసే పనిలో ఉన్నాడు. రాబిన్ హుడ్ అనే టైటిల్‌తో రవితేజ చేయనున్న సినిమా జూన్ రెండో వారంలో పట్టాలెక్కనుంది. చక్రీ అనే కొత్త దర్శకుణ్ని పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా, రవితేజ కెరీర్‌కు మరోసారి బ్రేక్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
రాబింగ్ హుడ్.. రాష్ట్ర ప్రభుత్వం!
పేదలను దోచి పెద్దలకు పంచుతున్నారు సామాన్యులపై వ్యాట్ భారం మోపడం అన్యాయం అసెంబ్లీలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ ఆవేదన హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రాబింగ్ హుడ్లా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖిలప్రియ అసెంబ్లీలో ధ్వజమెత్తారు. ‘రాబిన్ హుడ్.. ధనవంతులను దోచుకుని, ఆ సంపదను పేదలకు పంచితే, ఏపీలో టీడీపీ సర్కారు మాత్రం రాబింగ్ హుడ్లా.. పేదలను దోచి పెద్దలకు పంచిపెడుతోంది’ అని ఆమె విమర్శించారు. వ్యాట్ సవరణ బిల్లు సందర్భంగా గురువారం సభలో ఆమె మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు తగ్గాయని, కానీ రాష్ట్ర ప్రజలకు మాత్రం ఈ తగ్గుదల ఫలితం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాట్ రూపంలో ప్రభుత్వం పన్నులు పెంచడమే ఇందుకు కారణమన్నారు. నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు ఇప్పటికే అడుగంటాయని, దీనికితోడు విద్యుత్ చార్జీల పెంపు, వ్యాట్ భారం ప్రజలపై వేశారని ఆందోళన వ్యక్తం చేశారు.డీజిల్ ఇంజన్లపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతులకు ఈ భారం మోయలేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా ఈ మాదిరిగా పెంచలేదని సభ దృష్టికి తెచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని, ఈ విషయంలో అధికార పక్షంతో తాము కూడా ఢిల్లీకి వస్తామని తెలిపారు. అఖిల ప్రియ ప్రసంగం కొనసాగుతుండగానే సభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు అడ్డుపడ్డారు. వ్యాట్ సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత తిరిగి దీనిపై మాట్లాడడం సరికాదని పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తడంతో స్పీకర్ మైకు నిలిపివేశారు. చర్చ లేకుండానే బిల్లులకు పచ్చజెండా వ్యాట్, కార్మికచట్ట సవరణ బిల్లులపై విపక్షం మాట్లాడేందుకు స్పీకర్ అంగీకరించినా, ప్రభుత్వం అడ్డుచెప్పింది. దీనిపై విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభ్యంతరం తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి సమావేశమైన సభలో పలు సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఒకదాని వెంట ఒకటి మెరుపు వేగంతో అనుమతించారు. ఈ క్రమంలో వ్యాట్, కార్మిక చట్ట సవరణ బిల్లులపై తమ వాదన వినిపించాల్సి ఉందని అనుమతించాలని విపక్ష నేత కోరారు. దీనికి స్పీకర్ అనుమతించారు. కార్మిక సవరణ చట్ట బిల్లుపై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. ఆ తర్వాత వ్యాట్‌పై అఖిలప్రియ మాట్లాడుతున్నప్పుడు యనమల అభ్యంతరం లేవనెత్తారు. స్పీకర్ అనుమతితోనే తమ పార్టీ సభ్యులు మాట్లాడుతున్నారని జగన్ తెలిపారు. అయినప్పటికీ దీన్ని అనుమతించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని యనమల అనడంతో స్పీకర్ ఆ వాదననే సమర్థించారు. దీంతో అఖిలప్రియ ప్రసంగం మధ్యలోనే ఆగిపోయింది. -
కత్తిలాంటి నిజం!
చరిత్ర రాబిన్ హుడ్ నిజంగానే ఉన్నాడా? కల్పిత పాత్ర? అనే చర్చలో రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ‘‘ఇలాంటి మనిషి ఒకడుంటే ఎంత బాగుండేది!’’ అని ఆశించే రచయితల కల్పనలో నుంచి పుట్టిన పాత్ర ‘రాబిన్‌హుడ్’ అని కొందరు అన్నారు. ‘‘అదేమీ కాదు. రాబిన్‌హుడ్ నిజంగానే ఉన్నాడు. రోజర్ గాడ్బెర్డ్ అనే రైతే...రాబిన్ హుడ్!’’ అని బలంగా వాదించిన వారూ ఉన్నారు. ఈ వాదానికి బలం చేకూరుస్తూ డేవిడ్ బాల్డ్విన్ అనే ఆయన ‘రాబిన్ హుడ్: ది ఇంగ్లీష్ ఔట్లా అన్మాస్క్డ్’ పేరుతో పుస్తకం కూడా రాశారు. ఇక వ్యక్తిత్వం విషయానికి వస్తే...‘‘రాబిన్ హుడ్ దారి దొంగ మాత్రమే...అంతకు మించి ప్రాధాన్యత లేదు’’ అని కొందరు నమ్మితే ‘‘దారిదొంగ, గజదొంగ అనే మాటలు నిజమేగానీ, మానవత్వం మూర్తీభవించిన దొంగ. పెద్దలను దోచి పేదలకు పెట్టేవాడు’’ అని కొందరు కీర్తించేవారు. ఇక రాబిన్‌హుడ్ ఏ ప్రాంతానికి చెందిన వాడు? ఏ అడవిలో సంచరించాడు? అతని స్థావరం ఏమిటి? అనేదాని గురించి కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఈ వాదనలలో పుస్తకాలలో సమాచారం తప్ప ‘భౌతిక ఆధారాలు’ పెద్దగా తొంగి చూడలేదు. తాజా విషయం ఏమిటంటే... ‘‘రాబిన్‌హుడ్ యాంక్షైర్(ఇంగ్లాండ్)కు చెందిన వాడే అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి’’ అంటున్నారు డాన్‌కాస్టర్ మ్యూజియం అండ్ ఆర్ట్ గ్యాలరీకి చెందిన ఉద్యోగులు. డాన్‌కాస్టర్ మ్యూజియం క్యూరేటర్ క్లారన్ డాల్టన్ 14వ శతాబ్దానికి చెందిన కత్తిని మీడియా వర్గాలకు చూపుతూ చాలాసేపు మాట్లాడారు. ‘‘రాబిన్‌హుడ్ యాంక్షైర్కు చెందిన వాడు అని చెప్పడానికి ఇదొక ఆధారం మాత్రమే’’ అని చెప్పారు ఆమె. బహుశా...యాంక్షైర్లో రాబిన్‌హుడ్ తిరుగాడిన ప్రాంతంలో ఈ కత్తి దొరికి ఉంటుంది. తమ వాదనకు బలం చేకూర్చే మరిన్ని భౌతిక ఆధారాలు కూడా ఉన్నాయని డాల్టన్ చెబుతున్నారు. ఈ భౌతిక ఆధారాల గొడవ మాట ఎలా ఉన్నా...రాబిన్ గురించి మరోసారి తృప్తిగా మాట్లాడుకునే అవకాశం ఆయన అభిమానులకు కలిగింది.