కత్తిలాంటి నిజం!
చరిత్ర
రాబిన్ హుడ్ నిజంగానే ఉన్నాడా? కల్పిత పాత్ర? అనే చర్చలో రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి.
‘‘ఇలాంటి మనిషి ఒకడుంటే ఎంత బాగుండేది!’’ అని ఆశించే రచయితల కల్పనలో నుంచి పుట్టిన పాత్ర ‘రాబిన్‌హుడ్’ అని కొందరు అన్నారు. ‘‘అదేమీ కాదు. రాబిన్‌హుడ్ నిజంగానే ఉన్నాడు. రోజర్ గాడ్‌బెర్డ్ అనే రైతే...రాబిన్ హుడ్!’’ అని బలంగా వాదించిన వారూ ఉన్నారు. ఈ వాదానికి బలం చేకూరుస్తూ డేవిడ్ బాల్‌డ్విన్ అనే ఆయన ‘రాబిన్ హుడ్: ది ఇంగ్లీష్ ఔట్‌లా అన్‌మాస్క్‌డ్’ పేరుతో పుస్తకం కూడా రాశారు.
ఇక వ్యక్తిత్వం విషయానికి వస్తే...‘‘రాబిన్ హుడ్ దారి దొంగ మాత్రమే...అంతకు మించి ప్రాధాన్యత లేదు’’ అని కొందరు నమ్మితే ‘‘దారిదొంగ, గజదొంగ అనే మాటలు నిజమేగానీ, మానవత్వం మూర్తీభవించిన దొంగ. పెద్దలను దోచి పేదలకు పెట్టేవాడు’’ అని కొందరు కీర్తించేవారు. ఇక రాబిన్‌హుడ్ ఏ ప్రాంతానికి చెందిన వాడు? ఏ అడవిలో సంచరించాడు? అతని స్థావరం ఏమిటి? అనేదాని గురించి కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఈ వాదనలలో పుస్తకాలలో సమాచారం తప్ప ‘భౌతిక ఆధారాలు’ పెద్దగా తొంగి చూడలేదు. తాజా విషయం ఏమిటంటే... ‘‘రాబిన్‌హుడ్ యాంక్‌షైర్(ఇంగ్లాండ్)కు చెందిన వాడే అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి’’ అంటున్నారు డాన్‌కాస్టర్ మ్యూజియం అండ్ ఆర్ట్ గ్యాలరీకి చెందిన ఉద్యోగులు. డాన్‌కాస్టర్ మ్యూజియం క్యూరేటర్ క్లారన్ డాల్టన్ 14వ శతాబ్దానికి చెందిన కత్తిని మీడియా వర్గాలకు చూపుతూ చాలాసేపు మాట్లాడారు. ‘‘రాబిన్‌హుడ్ యాంక్‌షైర్‌కు చెందిన వాడు అని చెప్పడానికి ఇదొక ఆధారం మాత్రమే’’ అని చెప్పారు ఆమె.
బహుశా...యాంక్‌షైర్‌లో రాబిన్‌హుడ్ తిరుగాడిన ప్రాంతంలో ఈ కత్తి దొరికి ఉంటుంది. తమ వాదనకు బలం చేకూర్చే మరిన్ని భౌతిక ఆధారాలు కూడా ఉన్నాయని డాల్టన్ చెబుతున్నారు. ఈ భౌతిక ఆధారాల గొడవ మాట ఎలా ఉన్నా...రాబిన్ గురించి మరోసారి తృప్తిగా మాట్లాడుకునే అవకాశం ఆయన అభిమానులకు కలిగింది.