ఆంధప్రదేశ్‌లోని తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకోవాలనే భక్తుల అపరిమితమైన తపన తీవ్ర విషాదానికి దారితీసింది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. దేశంలో ఇటువంటి ఘటనలు గతంలోనూ చోటుచేసుకుని, తీవ్ర విషాదాన్ని మిగాల్చాయి.
మంధర్‌దేవి ఆలయం
2005, జనవరి 25న మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మంధర్‌దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 350 మందికి పైగా భక్తులు మృతిచెందారు. వందలాది మంది గాయపడ్డారు. కొబ్బరికాయలు పగులగొడుతుండగా, కొంతమంది మెట్లపై నుంచి పడిపోవడంతో తొక్కిసలాట జరిగింది.
కుంభమేళా
2003 ఆగస్టు 27న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జరిగిన కుంభమేళాలో పవిత్ర స్నానాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మృతిచెందారు. 140 మంది గాయపడ్డారు.
చాముండా దేవి ఆలయం
రాజస్థాన్‌లోని చాముండా దేవి ఆలయంలో 2008 సెప్టెంబర్ 30న జరిగిన తొక్కిసలాటలో 250 మంది మృతి చెందారు. బాంబు ఉందంటూ వదంతులు తలెత్తిన నేపధ్యంలో తొక్కిసలాటలో జరిగింది. ఈ ప్రమాదంలో 300 మందికి పైగా జనం గాయపడ్డారు.
నైనా దేవి ఆలయం
హిమాచల్ ప్రదేశ్‌లోని నైనా దేవి ఆలయంలో 2008లో జరిగిన మతపరమైన వేడుకలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో162 మంది ప్రాణాలు కోల్పోయారు.
రతన్‌గఢ్ ఆలయం
2013 అక్టోబర్ 13న మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లాలోని రతన్‌గఢ్ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 115 మంది మరణించారు. 100 మందికి పైగా జనం గాయపడ్డారు. యాత్రికులు దాటుతున్న నది వంతెన కూలిపోబోతున్నదనే వదంతితో తొక్కిసలాట జరిగింది.
ఇండోర్
2023, మార్చి 31 న ఇండోర్‌లోని ఒక ఆలయంలో పూజలు జరుగుతుండగా ఆలయం స్లాబ్ కూలిపోవడంతో 36 మంది మృతిచెందారు.
శబరిమల
2011, జనవరి 14న కేరళలోని శబరిమల పరిధిలోని పుల్లమేడు వద్ద యాత్రికులను జీపు ప్రమాదానికి గురైంది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 104 మంది భక్తులు మరణించారు. 40 మందికి పైగా జనం గాయపడ్డారు.
గాంధీ మైదానం
బీహార్‌లోని పాట్నాలో గల గాంధీ మైదానంలో 2014 అక్టోబర్ 3న దసరా వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో 32 మంది మృతి చెందారు. 26 మంది గాయపడ్డారు.
పట్నా
2012 నవంబర్ 19న పట్నాలోని గంగా నది ఒడ్డున ఉన్న అదాలత్ ఘాట్ వద్ద ఛఠ్ పూజ సందర్భంగా ఒక తాత్కాలిక వంతెన కూలిపోయింది. ఫలితంగా జరిగిన తొక్కిసలాటలో 20 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు.
వైష్ణోదేవి ఆలయం
2022, జనవరి 1న, జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతిచెందారు.
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో 2015, జూలై 14న పుష్కరాల ప్రారంభం రోజున గోదావరి నది ఒడ్డున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 27 మంది మృతిచెందారు. 20 మంది గాయపడ్డారు.
హరిద్వార్
ఉత్తరప్రదేశ్‌లోని హరిద్వార్‌లో 2011 నవంబర్ 8న గంగానది ఒడ్డున జరిగిన తొక్కిసలాటలో 20 మంది మృతిచెందారు.
రామ్ జానకి ఆలయం
2010 మార్చి 4న ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోని రామ్ జానకి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో దాదాపు 63 మంది మృతి చెందారు.
హత్రాస్
2024లో ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాట 121 మంది మృతిచెందారు. 300కుపైగా జనం గాయపడ్డారు. జూలై 2న సూరజ్‌పాల్ అలియాస్ భోలే బాబా అలియాస్ నారాయణ్ సకర్ హరి సత్సంగ్‌లో ఈ తొక్కిసలాట జరిగింది.
రాజ్‌కోట్
2024, మే 23న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్‌లో అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 35 మంది మృతి చెందారు.
గుంపులో చిక్కుకున్నప్పుడు..
ఎప్పుడైనా మనం రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లి, గుంపులో చిక్కుకుపోయినప్పడు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. సురక్షితంగా బయటపడేందుకు ప్రయత్నించాలి. కింద తెలిపిన పది ఉపాయాలు మనం గుంపునుంచి సురక్షితంగా బయటపడేందుకు సాయపడతాయి.
1. మీరు ఎప్పుడైన రద్దీగా ఉండే ప్రదేశానికి వెళితే ప్రవేశం, నిష్క్రమణ మార్గాలను గుర్తుంచుకోవాలి.
2. మీరు వెళ్లిన ప్రదేశం గురించిన పూర్తి సమాచారం మీ వద్ద ఉండాలి. మీరు జనసమూహంలో చిక్కుకుపోయినప్పుడు, ఆ ప్రాంతం మీకు పూర్తిగా తెలిస్తే అప్పడు మీరు సులభంగా బయటపడగలుగుతారు.
3. రద్దీగా ఉండే ప్రదేశానికి వెళ్ళే ముందు, ఏదైనా అవాంఛనీయ సంఘటనను ఎదుర్కోవడానికి మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి. నిష్క్రమణ ద్వారం సమీపంలో ఉండటం ఉత్తమం.
4. మీరు ఎప్పుడైనా జనసమూహంలో చిక్కుకున్నప్పుడు, వ్యతిరేక దిశలో ముందుకు వెళ్లకూడదు. ఇలా చేస్తే ఆపద మరింత పెద్దదవుతుంది.
5. మీరు గుంపులో చిక్కుకుంటే వీలైనంత త్వరగా అక్కడి నుండి బయటపడటానికి ప్రయత్నించాలి. ఆందోళన చెందే బదులు, మనసును ప్రశాంతంగా ఉంచుకుని ముందుకు నడవాలి.
6. జనసమూహంలో చిక్కుకున్నప్పుడు, ఆ జనసమూహం దిశగానే ముందుకు కదలాలి. అప్పుడు ఆపద నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా కొంచెం స్థలం కనిపించినా, దానిని సద్వినియోగం చేసుకోవాలి.
7. జనసమూహంలో చిక్కుకున్నప్పుడు, మీరు మీ చేతులను బాక్సర్ మాదిరిగా మీ ఛాతీ ముందు ఉంచుకోవాలి. తద్వారా మీ ఛాతీ సురక్షితంగా ఉంటుంది.
8. మీరు ఎప్పుడైనా జనసమూహంలో చిక్కుకుని కిందపడిపోతే త్వరగా లేవడానికి ప్రయత్నించండి.
9. మీరు జనసమూహంలో పడిపోయి లేవలేకపోతే, వెంటనే ఒక పక్కకు తిరిగి పడుకోండి. అలాగే మీ రెండు కాళ్ళను మీ ఛాతీకి తగిలించి, మీ చేతులను మీ తలపై ఉంచుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోగలుతారు.
10 మీరు రద్దీగా ఉండే ప్రదేశంలో చిక్కుకుంటే గోడలకు దూరంగా ఉండండి. బారికేడింగ్‌కు కూడా దూరంగా ఉండాలి. వెంటనే బయటకు వెళ్లడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు.
ఇది కూడా చదవండి: ఆరేళ్ల బుడతడు.. వెయ్యి కిలోమీటర్లు పరిగెడుతూ అయోధ్యకు..
Comments
Please login to add a commentAdd a comment