ఏమీ తోచనప్పుడు ఇంట్లోనే కూర్చుని ఆడుకునే ఆటల్లో ముఖ్యమైనది క్యారమ్స్. ఇద్దరు, నలుగురు కలిసి ఆడే ఈ ఆటంటే అందరికీ ఇష్టం. ఎవరికి ఎక్కువ కాయిన్స్ దక్కుతాయో ఎవరు రెడ్ కాయిన్స్‌ని చేజిక్కించుకుంటారో వారే ఈ ఆటలో విజేతలవుతారు. ఈ క్యారమ్స్ కథేమిటో తెలుసా?
క్యారమ్స్ భారతదేశంలోనే పుట్టింది. ఎప్పుడు పుట్టిందనే సరైన లెక్కలు లేకపోయినా వందేళ్ల క్రితమే మన దేశంలోని సంపన్నుల ఇళ్లల్లో కొందరు క్యారమ్స్ ఆడేవారని అంచనా. 1935 నాటికి శ్రీలంక దేశంలో ఈ ఆటకు సంబంధించి పోటీలు ప్రారంభమయ్యాయి. 1958లో శ్రీలంక, భారత్ దేశాలు క్యారమ్స్ ఆటకు అధికారిక ఫెడరేషన్స్, క్లబ్స్ ఏర్పాటు చేశాయి. దీన్నిబట్టి అప్పటికే దేశంలో క్యారమ్స్ పాపులర్ అయ్యిందని అర్థం చేసుకోవచ్చు. 1988లో చెన్నైలో తొలిసారి ‘అంతర్జాతీయ క్యారమ్ సమాఖ్య’ (ఐసీఎఫ్)ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ క్యారమ్స్‌కి సంబంధించి విధివిధానాలు రూపొందించారు. అనంతరం పలు దేశాల్లో ఫెడరేషన్లు ఏర్పాటయ్యాయి. వాటి ఆధ్వర్యంలో జాతీయ ఛాంపియన్ షిప్స్ నిర్వహించడం మొదలు పెట్టారు. (పుట్టింది కెనడాలో... అన్నీ ఎదురుదెబ్బలే.. కట్ చేస్తే!)
క్యారమ్స్ ఆడేందుకు శారీరకంగా ఇబ్బందిపడనక్కర్లేదు. బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. కుటుంబంలోని వారంతా కలిసి ఆడుకోవచ్చు. దీంతో ఈ క్యారమ్స్ చాలా ప్రసిద్ధి చెందింది. 2000వ సంవత్సరం నాటికి అనేకమంది ఇళ్లల్లోకి క్యారమ్ బోర్డులు రావడం ఇందుకు ఉదాహరణ. 73.5 సెం.మీల ఎత్తు, 74 సెం.మీల వైశాల్యం కలిగిన ఈ బోర్డు ఆడేందుకు కాకుండా చూసేందుకూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ పరిమాణాన్ని అంతర్జాతీయ క్యారమ్ సమాఖ్య నిర్దేశించింది. క్యారమ్స్ ఆడేందుకు 19 కాయిన్స్, స్టైకర్ ఉండాలి. ఈ కాయిన్స్ తెలుపు, నలుపు, ఒకే ఒక్కటి మాత్రం ఎరుపురంగులో ఉంటాయి. బోర్డుపై ఆట సౌకర్యవంతంగా ఉండేందుకు బోరిక్ పౌడర్ వాడతారు.
చెన్నైకి చెందిన ‘ఆంథోనీ మరియ ఇరుదయం’ అనే వ్యక్తి మన దేశంలో క్యారమ్స్ ఆటకు ప్రసిద్ధి చెందారు. రెండుసార్లు ప్రపంచ క్యారమ్స్ ఛాంపియన్ షిప్, తొమ్మిదిసార్లు నేషనల్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్నారు. ఆయన కృషికి గుర్తింపుగా 1996లో ఆయనకు ‘అర్జున’ పురస్కారం ఇచ్చారు. క్యారమ్స్ కథ విన్నారుగా! ఖాళీ సమయాల్లో ఎంచక్కా ఆడుకోండి మరి!
Comments
Please login to add a commentAdd a comment