carroms
-
క్యారమ్స్ కథ గురించి తెలుసా? ఎక్కడ? ఎపుడు పుట్టింది?
ఏమీ తోచనప్పుడు ఇంట్లోనే కూర్చుని ఆడుకునే ఆటల్లో ముఖ్యమైనది క్యారమ్స్. ఇద్దరు, నలుగురు కలిసి ఆడే ఈ ఆటంటే అందరికీ ఇష్టం. ఎవరికి ఎక్కువ కాయిన్స్ దక్కుతాయో ఎవరు రెడ్ కాయిన్స్‌ని చేజిక్కించుకుంటారో వారే ఈ ఆటలో విజేతలవుతారు. ఈ క్యారమ్స్ కథేమిటో తెలుసా?క్యారమ్స్ భారతదేశంలోనే పుట్టింది. ఎప్పుడు పుట్టిందనే సరైన లెక్కలు లేకపోయినా వందేళ్ల క్రితమే మన దేశంలోని సంపన్నుల ఇళ్లల్లో కొందరు క్యారమ్స్ ఆడేవారని అంచనా. 1935 నాటికి శ్రీలంక దేశంలో ఈ ఆటకు సంబంధించి పోటీలు ప్రారంభమయ్యాయి. 1958లో శ్రీలంక, భారత్ దేశాలు క్యారమ్స్ ఆటకు అధికారిక ఫెడరేషన్స్, క్లబ్స్ ఏర్పాటు చేశాయి. దీన్నిబట్టి అప్పటికే దేశంలో క్యారమ్స్ పాపులర్ అయ్యిందని అర్థం చేసుకోవచ్చు. 1988లో చెన్నైలో తొలిసారి ‘అంతర్జాతీయ క్యారమ్ సమాఖ్య’ (ఐసీఎఫ్)ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ క్యారమ్స్కి సంబంధించి విధివిధానాలు రూపొందించారు. అనంతరం పలు దేశాల్లో ఫెడరేషన్లు ఏర్పాటయ్యాయి. వాటి ఆధ్వర్యంలో జాతీయ ఛాంపియన్ షిప్స్ నిర్వహించడం మొదలు పెట్టారు. (పుట్టింది కెనడాలో... అన్నీ ఎదురుదెబ్బలే.. కట్ చేస్తే!) క్యారమ్స్ ఆడేందుకు శారీరకంగా ఇబ్బందిపడనక్కర్లేదు. బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. కుటుంబంలోని వారంతా కలిసి ఆడుకోవచ్చు. దీంతో ఈ క్యారమ్స్ చాలా ప్రసిద్ధి చెందింది. 2000వ సంవత్సరం నాటికి అనేకమంది ఇళ్లల్లోకి క్యారమ్ బోర్డులు రావడం ఇందుకు ఉదాహరణ. 73.5 సెం.మీల ఎత్తు, 74 సెం.మీల వైశాల్యం కలిగిన ఈ బోర్డు ఆడేందుకు కాకుండా చూసేందుకూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ పరిమాణాన్ని అంతర్జాతీయ క్యారమ్ సమాఖ్య నిర్దేశించింది. క్యారమ్స్ ఆడేందుకు 19 కాయిన్స్, స్టైకర్ ఉండాలి. ఈ కాయిన్స్ తెలుపు, నలుపు, ఒకే ఒక్కటి మాత్రం ఎరుపురంగులో ఉంటాయి. బోర్డుపై ఆట సౌకర్యవంతంగా ఉండేందుకు బోరిక్ పౌడర్ వాడతారు. చెన్నైకి చెందిన ‘ఆంథోనీ మరియ ఇరుదయం’ అనే వ్యక్తి మన దేశంలో క్యారమ్స్ ఆటకు ప్రసిద్ధి చెందారు. రెండుసార్లు ప్రపంచ క్యారమ్స్ ఛాంపియన్ షిప్, తొమ్మిదిసార్లు నేషనల్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్నారు. ఆయన కృషికి గుర్తింపుగా 1996లో ఆయనకు ‘అర్జున’ పురస్కారం ఇచ్చారు. క్యారమ్స్ కథ విన్నారుగా! ఖాళీ సమయాల్లో ఎంచక్కా ఆడుకోండి మరి! -
శ్రీజ, ఐనీ రెడ్డిలకు పతకాలు
జాతీయ సబ్ జూనియర్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు రెండు పతకాలు లభించాయి. వారణాసిలో జరిగిన ఈ పోటీల్లో అండర్–14 బాలికల సింగిల్స్‌లో వి. ఐనీ రెడ్డి రజత పతకం... అండర్–12 బాలికల సింగిల్స్‌లో టి.శ్రీజ కాంస్య పతకం గెల్చుకున్నారు. పతక విజేతలకు తెలంగాణ క్యారమ్ సంఘం జనరల్ సెక్రటరీ ఎస్.మదన్‌రాజ్ అభినందించారు. -
జాతీయ చాంపియన్ అపూర్వ
సాక్షి, హైదరాబాద్: సీనియర్ నేషనల్స్ క్యారమ్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటారు. ఎల్ఐసీ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్రపంచ చాంపియన్ అపూర్వ మహిళల సింగిల్స్ విభాగంలో తొలిసారి జాతీయ చాంపియన్‌గా అవతరించగా... పురుషుల టీమ్ విభాగంలో ఎస్. ఆదిత్య, మొహమ్మద్ అహ్మద్, యు.నరేశ్, వసీమ్, సందీప్, నందులతో కూడిన తెలంగాణ జట్టు విజేతగా నిలిచి స్వర్ణాన్ని గెలుచుకుంది. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన 35 ఏళ్ల అపూర్వ మహిళల సింగిల్స్ ఫైనల్లో 25–11, 25–11తో రష్మి కుమారి (పీఎస్‌పీబీ)పై గెలుపొందింది. అంతకుముందు సెమీఫైనల్లో 18–8, 23–16తో ఖుష్బూ రాణిపై, క్వార్టర్స్‌లో 25–0, 22–8తో నీలమ్‌పై, ప్రిక్వార్టర్స్‌లో 24–9, 25–0తో శ్రుతి (మహారాష్ట్ర)పై గెలుపొందింది. ఈ సందర్భంగా సోమవారం మలక్‌పేట్‌లోని సిటీ టవర్స్‌లో స్కై స్పోర్ట్స్ సమ్మిట్ యాజమాన్యం జాతీయ చాంపియన్లుగా నిలిచిన అపూర్వ, తెలంగాణ పురుషుల జట్టును ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో స్కై స్పోర్ట్స్ సమ్మిట్ మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ ఖాదర్, తెలంగాణ క్యారమ్ సంఘం అధ్యక్షులు బీకే హరనాథ్, ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. -
బద్రుకా కాలేజి శుభారంభం
సాక్షి, హైదరాబాద్: బద్రుకా కాలేజి ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ నిర్వహిస్తోన్న ఇంటర్ కాలేజి పురుషుల క్యారమ్స్ టోర్నమెంట్లో ఆతిథ్య బద్రుకా కాలేజి జట్టు శుభారంభం చేసింది. బద్రుకా కాలేజిలో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో బద్రుకా కాలేజి 2–0తో సెయింట్ మేరీస్ (యూసుఫ్‌గూడ)పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో ఎంజే ఇంగ్లీష్ కాలేజి 2–0తో ఎస్పీ కాలేజిపై విజయం సాధిం చింది. అంతకుముందు జరిగిన రౌండ్–1 మ్యాచ్‌లో ఎంజే ఇంగ్లిష్ కాలేజి 2–0తో సెయింట్ జోసెఫ్ డీసీపై గెలుపొందింది. టోర్నీ ప్రారంభ కార్యక్రమంలో రిటైర్డ్ ఐపీఎస్ విజయ రామారావు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో బద్రుకా కాలేజి జనరల్ డైరెక్టర్ ప్రొఫెసర్ టీఎల్ఎన్ స్వామి, ప్రిన్సిపాల్ డా.సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రౌండ్–1 ఫలితాలు: మాతృశ్రీ ఇంగ్లీష్ కాలేజి 2–0తో ఇస్లామియా ఇంగ్లీష్ కాలేజిపై విజయం. మెస్కో కాలేజి 2–0తో అవంతి డీసీపై విజయం. ఎస్పీ కాలేజి 2–1తో నిజామ్ డీసీపై విజయం. ఓయూ సైన్స్ కాలేజి 2–0తో వసుంధర డీసీపై విజయం. వెస్లీ కాలేజి 2–0తో హెచ్ఎంవీ డీసీపై విజయం. శివ శివాని డీసీ 2–1తో అన్వర్ ఉల్ ఉలూమ్ డీసీపై విజయం. రౌండ్–2 ఫలితాలు ఐఐఎంసీ కాలేజి 2–0తో రైల్వే డీసీపై విజయం. ఓయూ కామర్స్ కాలేజి 2–1తో ఏవీ కాలేజిపై విజయం. భవన్స్ సైనిక్‌పురి కాలేజి 2–0తో ప్రభుత్వ సిటీ కాలేజిపై విజయం. మాతృశ్రీ ఇంగ్లిష్ కాలేజి 2–1తో మెస్కో కాలేజిపై విజయం. ఓయూ సైన్స్ కాలేజి 2–0తో లయోలా అకాడమీ కాలేజిపై విజయం. -
నేటి నుంచి ఎల్ఐసీ జోనల్∙క్యారమ్స్ అండ్ చెస్ టోర్నీ
ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం): ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ క్యారమ్స్ అండ్ చెస్ టోర్నమెంట్ స్థానిక జేఎన్‌రోడ్‌లోని సూర్యగార్డెన్స్‌లో సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్నారు. రాజమహేంద్రవరం డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ జె.రంగారావు ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ రీజనల్ మేనేజర్ (హెచ్ఆర్డీ) కేవీపీవీ నరసింహారావు ఈ టోర్నమెంటును ప్రారంభిస్తారు. ఈ పోటీల్లో ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలనుంచి సుమారు 70 మంది క్రీడాకారులు పాల్గొంటారని రంగారావు తెలిపారు. రాజమహేంద్రవరం ఎల్ఐసీ మెయిన్ బ్రాంచి కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆటగాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో రాజమహేంద్రవరం ఎల్ఐసీ రాజమహేంద్రవరం డివిజనల్ కార్యాలయ మేనేజర్ (పీఆర్) నాగేంద్రకుమార్, ఎన్బీ మేనేజర్ అహ్మద్ ఆలీషా, చెస్ ఆర్బెటర్ జీవీ కుమార్, క్యారమ్స్ ఆర్బెటర్ అస్మదుల్లా, స్పోర్ట్సు ప్రమోషన్‌బోర్డు సభ్యులు జాన్సన్, మంజునాథ్ నియమనిబంధనలను వివరించారు. -
ముగిసిన క్యారమ్స్ పోటీలు
పురుషుల విభాగంలో తమిళనాడు హవా చిలకలూరిపేట రూరల్ : సీఅర్ క్లబ్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా నాలుగు రోజులపాటు పట్టణంలోని క్లబ్ ఆవరణలో నిర్వహించిన స్టేట్ సెకెండ్ ర్యాంకు, సౌత్ ఇండియా టోర్నమెంట్ క్యారమ్స్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. రెండు విభాగాల్లో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, కేరళ రాష్ట్రాల నుంచి 120 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. పోటీలలో విజేతలు.. సౌత్ ఇండియా టోర్నమెంట్ పురుషుల విభాగంలో తమిళనాడు క్రీడాకారులు వరుసగా నాలుగు స్థానాలు కైవసం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన భారతిదాసన్, బి.రాధాకృష్ణన్ ప్రథమ, ద్వితీయ బహుమతులు కైవసం చేసుకున్నారు. మూడు, నాలుగు స్థానాలను సగమ భారతి, కుబేంద్రబాబు పొందారు. మహిళల విభాగంలో హైదరాబాద్‌కు చెందిన యు సరితాదేవి, విశాఖపట్నంకు చెందిన ఎల్. హరిప్రియ ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందారు. మూడు, నాలుగు స్థానాలను గుంటూరు చెందిన హుస్నాసమీర, విజయవాడ టి. తనూజ కైవసం చేసుకున్నారు. స్టేట్ సెకెండ్ ర్యాంకు పోటీలలో ప్రకాశం జిల్లాకు చెందిన ఎల్. రాఘవేంద్ర ప్రథమ, మహిళ విభాగంలో విశాఖపట్నంకు చెందిన ఎల్. హరిప్రియ ద్వితీయ స్థానంలో నిలిచారు. కార్యక్రమంలో అఖిల భారత క్యారమ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నీరజ్ సంపతి, ప్రధాన కార్యదర్శి ఎ.విజయ్‌కుమార్, టెక్నికల్æడైరెక్టర్ డి.రవీంద్రన్, క్రమశిక్షణా సంఘం చైర్మన్ శంకరరావు, సీఆర్ క్లబ్ కోశాధికారి ఎన్. వెంకట్రామయ్య విజేతలకు బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు.