సాక్షి, హైదరాబాద్: సీనియర్ నేషనల్స్ క్యారమ్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటారు. ఎల్‌ఐసీ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్రపంచ చాంపియన్ అపూర్వ మహిళల సింగిల్స్ విభాగంలో తొలిసారి జాతీయ చాంపియన్‌గా అవతరించగా... పురుషుల టీమ్ విభాగంలో ఎస్. ఆదిత్య, మొహమ్మద్ అహ్మద్, యు.నరేశ్, వసీమ్, సందీప్, నందులతో కూడిన తెలంగాణ జట్టు విజేతగా నిలిచి స్వర్ణాన్ని గెలుచుకుంది. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన 35 ఏళ్ల అపూర్వ మహిళల సింగిల్స్ ఫైనల్లో 25–11, 25–11తో రష్మి కుమారి (పీఎస్‌పీబీ)పై గెలుపొందింది.
అంతకుముందు సెమీఫైనల్లో 18–8, 23–16తో ఖుష్బూ రాణిపై, క్వార్టర్స్‌లో 25–0, 22–8తో నీలమ్‌పై, ప్రిక్వార్టర్స్‌లో 24–9, 25–0తో శ్రుతి (మహారాష్ట్ర)పై గెలుపొందింది. ఈ సందర్భంగా సోమవారం మలక్‌పేట్‌లోని సిటీ టవర్స్‌లో స్కై స్పోర్ట్స్ సమ్మిట్ యాజమాన్యం జాతీయ చాంపియన్‌లుగా నిలిచిన అపూర్వ, తెలంగాణ పురుషుల జట్టును ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో స్కై స్పోర్ట్స్ సమ్మిట్ మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ ఖాదర్, తెలంగాణ క్యారమ్ సంఘం అధ్యక్షులు బీకే హరనాథ్, ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment