ఒక్క వర్షం.. పుష్కరరోడ్డు ధ్వంసం
ఒక్క వర్షం.. పుష్కరరోడ్డు ధ్వంసం
Published Tue, Aug 30 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM
సంగమం ఘాట్‌కు వెళ్లే రోడ్డు మార్జిన్ ముక్కలు
ముందే ట్రాన్స్‌ఫార్మర్ తొలగించడంతో
తప్పిన ముప్పు
ఇబ్రహీంపట్నం :
పుష్కర పనుల్లోని డొల్లతనం ఒక్క వర్షంతో బైటపడింది. పవిత్ర సంగమం పుష్కర ఘాట్‌కు వెళ్లేందుకు రోడ్లు– భవనాలు (ఆర్‌అండ్‌బీ) శాఖ నూతనంగా నిర్మించిన రెండులైన్ల రహదారి మార్జిన్ వర్షంతో నిలువునా జారిపోయింది. రోడ్డు మార్జిన్ కూలి పోవటమే కాక విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కోసం ఏర్పాటు చేసిన సిమెంటు దిమ్మెసైతం అయిదడుగుల కిందకు ఒరిగిపోయింది. ఈ ప్రాంతంలోనే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుచేసిన విద్యుత్ శాఖ అధికారులు బీటీ రోడ్డు వద్ద మార్జిన్ నెర్రెలిచ్చడం గమనించారు. మార్జిన్ కుంగిపోతుందని ఊహించి ముందుగానే అక్కడున్న ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించారు. వారు ఊహించినట్లుగానే సోమవారం తెల్లవారు జామున వర్షం దెబ్బకు అదే జరిగింది. అక్కడ ట్రాన్స్‌ఫార్మరే ఉండి ఉంటే భారీ ప్రమాదమే జరిగి ఉండేది.
రూ.6.50 కోట్ల పనులు డొల్లే
ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఐరన్ బారి కేడ్లు సైతం బుడమేరు కాలువలోకి జారిపోయాయి. హడావుడిగా చేసిన పుష్కరాల పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని గతంలోనే సాక్షిలో వరుస కథనాలు వచ్చాయి. అప్పట్లో వర్షంలోనే బీటీ రోడ్డు, మార్జిన్ పనులు చేశారు. పుష్కరాల నేపథ్యంలో సుమారు రూ.6.50 కోట్లతో ఈరోడ్డును ఆర్‌అండ్‌బీ శాఖ నిర్మించింది.
అధికారుల నిర్లక్ష్యం, అవినీతి కారణంగా విలువైన ప్రజాధనం నీళ్లపాలు అయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కుంగిపోయిన ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
రిటైనింగ్ వాల్ లేనందునే:
డీఈ మోహనరావు
భారీవర్షాలు పడితే బుడమేరు కాలువ వైపున రోడ్డు అంతా జారిపోయే ప్రమాదం పొంచిఉంది. పేదల నివాసాలు తొలగించిన ప్రాంతంలో రోడ్డును నిర్మిస్తూ అక్కడున్న నల్లమట్టిని పైపైన చదును చేశారనే ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి. ఆర్‌అండ్‌బీ డీఈ మోహనరావును సంప్రదించగా.... రోడ్డుకు తూర్పువైపు ఉన్న బుడమేరు కాలువకు రిటైనింగ్ వాల్ లేనందున మార్జిన్ కిందికి జారిందన్నారు. నీటి ప్రవాహం కూడా ఓ కారణం అన్నారు. రోడ్డుభధ్రతను దృష్టిలో ఉంచుకుని కాలువ వైపున రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మార్జిన్ ఏర్పాటుకు పటిష్టమైన చర్యలు చేపడతామని తెలిపారు.
Advertisement
Advertisement