quality less
-
వాచర్.. డేంజర్: సమస్య ఒక్కరిది కాదు.. నగరంలో వేలమందిది
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నాగోల్‌కు చెందిన మహేశ్వర్ వంట గ్యాస్ బుక్ చేయడంతో సిలిండర్ డోర్ డెలివరీ అయింది. కొత్త సిలిండర్ రీఫిల్‌కు రెగ్యులేటర్ అమర్చిన కొన్ని గంటల తర్వాత గ్యాస్ లీకేజీ అవుతున్నట్లు వాసన వచ్చింది. పైప్‌ను పరిశీలిస్తే అంతా సవ్యంగానే కనిపించింది. రెగ్యులేటర్ కింద నుంచి గ్యాస్ లీకవుతున్నట్లు గమనించి తక్షణమే దానిని తొలగించి తిరిగి సీల్ మూత బింగించారు. గ్యాస్ ఏజెన్సీకి ఫోన్‌చేస్తే మరుసటి రోజు సంబంధిత నిపుణుడు వచ్చి తనిఖీ చేసి సిలిండర్ నాజిల్లోని వాచర్ మార్చాడు. రూ.300 చార్జీలు వసూలు చేశాడు. సిలిండర్ నాజిల్లో వాచర్ సమస్య ఎందుకు వస్తుందని అడిగితే వాచర్ నాసిరకంతో పాటు రెగ్యులేటర్తోనూ సమస్యగా పేర్కొన్నాడు. ఇది ఒక మహేశ్వర్‌కు ఎదురైనా సమస్య కాదు.. నగరంలో వేలాది మంది వినియోగదారులు గ్యాస్ లీకేజీ సమస్యను ఎదుర్కొంటున్నావారే. ►కొత్త సిలిండర్ బిగించే సమయంలో రెగ్యులేటర్, సిలిండర్ నాబ్‌ల నుంచి గ్యాస్ లీకవుతో ఉంటుంది. తాజాగా సిలిండర్ నాజిల్లోని వాచర్ నుంచి కూడా లీకేజీలు బయటపడుతున్నాయి. నిపుణులు వచ్చి పరిశీలిస్తే గాని గుర్తించలేని పరిస్థితి. అప్పటి వరకు సిలిండర్ సీల్‌ను మూసి ఉంచాల్సి ఉంటుంది. ఇటీవల ఇలాంటి ఘటనలు సంభవిస్తున్నాయి. నాజిల్లో నాసిరకం వాచర్లు అమర్చడం లీకేజీలకు కారణమవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ►కొన్ని పర్యాయాలు రెగ్యులేటర్ ఒత్తిడితోనూ వాచర్ కదిలి గ్యాస్ లీకేజీ అవుతోందని వారంటున్నారు. సిలిండర్ రీఫిల్ సమయంలోనే ఆయిల్ కంపెనీలు వాటిని పరిశీలిస్తే సమస్య ఉత్పన్నం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆయిల్ కంపెనీలు మాత్రం కేవలం తాత్కాలిక ఉపశనం కలిగించేలా వాచర్లను మార్చుతుందే తప్ప శాశ్వత పరిష్కారం కోసం చొరవ చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: (రోడ్డు ప్రమాదాల నివారణకు వీ2ఎక్స్ టెక్నాలజీ! ఎన్నెన్నో ప్రయోజనాలు) లీకేజీకి కారణాలు.. ►ఎక్కువ శాతం సిలిండర్, స్టౌలను కలుపుతూ రబ్బర్ ట్యూబ్ ద్వారా లీకేజీలు ఉంటాయి. ఇది అటు సిలిండర్‌కు, ఇటు స్టౌకు అతికే ప్రాంతాల్లో ఏదో ఒక చోట నుంచి లీక్ అయ్యే ప్రమాదం ఉంది. సాధారణంగా స్టౌకు అనుసంధానిచే చోటే వేడి వల్ల ఈ ట్యూబ్ సాగే గుణం కోల్పోతుంది. ►ఫలితంగా పెళుసుదనం సంతరించుకుని పగుళ్లు ఏర్పడతాయి. కేవలం గుండుసూది మొన పరిమాణంలో రంధ్రం ఏర్పడి దీనిలోంచి గంటకు ముప్పావు నుంచి కేజీన్నర వరకు గ్యాస్ లీక్ అవుతుంది. మెల్లమెల్లగా ఇల్లంతా వ్యాపిస్తుంది. ►ఎల్పీజీకి వ్యాకోచ శక్తి ఎక్కువ. లీకేజీతో వ్యాపించి ఉన్న గ్యాస్‌కు ప్రేరణ లభించగానే ఒక్కసారిగా మంట అంటుకుటుంది. ఇలా అంటుకున్న సందర్భంలో విస్తరించి ఉన్న గ్యాస్ 12 వేల రెట్లు వ్యాకోచిస్తుంది. అంటే కేజీ గ్యాస్ లీకై ఉంటే... మంట అంటుకున్న వెంటనే అది 12 వేల కేజీల వరకు వ్యాకోచిస్తుంది. ఫలితంగానే గ్యాస్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. -
కూల్ కూల్‌గా మోసం
సాక్షి,వేపగుంట(గోపాలపట్నం (విశాఖపశ్చిమ) : నాణ్యత పాటించని ఫ్రూట్ జ్యూస్ షాపుపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేశారు. వేపగుంట సాయిమాధవనగర్‌లో పిల్లా శ్రీనివాసరావు శీతల పానీయాల తయారీ కేంద్రం కృప ఏజెన్సీస్ పేరిట నిర్వహిస్తున్నాడు. బుధవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ సీఎంనాయుడు ఆ శాఖ ఎస్ఐ రమేష్, ఆహార భద్రతాధికారులు వెంకటరత్నం, శ్రీరాములుతో అక్కడికి వచ్చి తనిఖీలు చేపట్టారు. శీతల పానీయాల తయారీకి శుద్ధి చేసిన నీరు వాడాల్సి ఉండగా, ఇక్కడ మా త్రం బాటిళ్లలో బావిలో నీరుపోసేస్తున్నారు. అందులో మామిడి, ద్రాక్ష రసాలతో పాటు కొద్ది రోజులు నిల్వ ఉండేలా రసాయనాలు కలి పేస్తున్నారు. దీంతో శ్రీనివాసరావును అరె స్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. శాంపిళ్లను హై దరాబాద్ సేఫ్టీ ఫుడ్ ల్యాబ్‌కు పంపుతున్నట్లు చెప్పారు. -
పర్యవేక్షణ కరువు.. భక్షణ షురూ
నాణ్యతకు తూట్లు ఇష్టారాజ్యంగా కాంట్రాక్టర్ పనులు గృహనిర్మాణశాఖ సిమెంట్ వాడకం రూ. 2.20 కోట్లతో రోడ్డు కాలువల నిర్మాణం తుని : దీర్ఘకాలికంగా ఉండే నిర్మాణాల విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే అనతికాలంలోనే శిథిలమవుతాయి. ఇందుకు గతంలో చేసిన పనులే నిదర్శనం. కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల కోసమో, లేక అధికార పార్టీకి చెందిన నాయకుడని భయమో తెలియదు కాని అధికారులు నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి రావడం లేదు. దీంతో కాంట్రాక్టర్ నచ్చిన రీతిలో కాలువ నిర్మిస్తున్నారు. కాంక్రీట్‌లో ఉపయోగించే పాళ్లను చూసి ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తుని పట్టణంలోని ఎస్ఏ రోడ్డును వుడా నిధులు రూ.2.20 కోట్లతో విస్తరిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా కాలువ నిర్మాణంలో నాసిరకం మెటీరియల్ వాడుతున్నారు. నిబంధనలు గాలికి విశాఖ నగరపాలక అభివృద్ధి సంస్థ (వుడా) తుని మున్సిపాలిటీకి రూ. 2.20 కోట్లు మంజూరు చేసింది. ఆంజనేయస్వామి గుడి నుంచి ఎస్.అన్నవరం లక్ష్మీదేవి చెరువు వరకు రోడ్డు విస్తరణ, కాలువల నిర్మాణానికి ఆ¯ŒSలై¯ŒS టెండర్లు పిలిచారు. అధికార పార్టీకి చెందిన నాయకుడి బంధువులకు టెండర్ దక్కింది. ప్రస్తుతం ఉన్న 20 అడుగుల రోడ్డును 40 అడుగులకు విస్తరించి కొత్త రహదారిని నిర్మించాలి. విస్తరణలో పాత కాలువలను తొలగించి, కొత్తవి నిర్మించాలి. సుమారు 800 మీటర్ల మేర రోడ్డు, కాలువలను నిర్మించాల్సి ఉంది. ఇటీవల పనులు ప్రారంభించారు. గృహ నిర్మాణశాఖ సిమెంట్ వాడకం అంచనాలో పేర్కొన్న విధంగా కాకుండా గృహనిర్మాణశాఖకు చెందిన సిమెంట్‌ను పనులకు వినియోగిస్తున్నారు. ఇది జాతీయ ఉపాధి హామీ నిధులతో చేసే పనులకు మాత్రమే ఉద్దేశించినది. కాంట్రాక్టర్ అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ఏ సిమెంట్ వాడినా ప్రశ్నించే అధికారులు కరువయ్యారు. మార్కెట్లో 53 గ్రేడ్ రకం సిమెంట్ బస్తా ధర రూ.360 ఉంది. గృహనిర్మాణశాఖ సిమెంట్ బస్తా ధర రూ.230. అంటే బస్తాకు రూ.130 ఆదా అవుతుంది. రెండు అడుగుల వెడల్పు, రెండు నుంచి మూడు అడుగుల ఎత్తు కొలతలతో నిర్మిస్తున్నారు. రోడ్డుకు రెండు వైపులా 800 మీటర్ల చొప్పున 1,600 మీటర్ల కాలువ నిర్మిస్తారు. మూడు మీటర్ల కాంక్రీట్‌కు 331.20 కిలోలు (7 బస్తాలు) సిమెంట్ పడుతుంది. దీంతో 10 ఎంఎం కంకర, సిమెంట్ మాత్రమే కాంక్రీట్‌కు వాడాలి. కాంక్రీట్ రంగు కోసం క్రషర్ బూడిదను మిక్స్ చేస్తున్నారు. 1,600 మీటర్ల కాలువ నిర్మాణానికి 2,548 బస్తాల సిమెంట్ పడుతుందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. అంచనా ప్రకారం కాలువలకు వాడే సిమెంట్‌కు రూ. 9,17,280 అవుతుంది. గృహనిర్మాణ శాఖ సిమెంట్‌కు రూ.5, 86,040 అంటే కాంట్రాక్టర్‌కు రూ.3,31,240 లబ్ధి చేకూరుతుం ది. ఇది సిమెంట్ మార్జి¯ŒSలో కలిగే ప్రయోజనం. క్రషర్ బూడిదను వినియోగించడం వల్ల ఇసుక పరిమాణం తగ్గుతుంది. ఐదేళ్లలో రూ.35 లక్షలు వృథా ఆంజనేయస్వామి గుడి నుంచి ఎస్.అన్నవరం రోడ్డు, కాలువలకు రూ.35 లక్షలు ఐదేళ్లలో ఖర్చు చేశారు. 2013లో రూ.20 లక్షలతో బీటీ రోడ్డు నిర్మించారు. 2014–15లో రూ.15 లక్షలతో కాలువలు కట్టారు. ఇప్పుడు విస్తరణ పేరుతో మళ్లీ అదే రోడ్డుకు రూ.2.20 కోట్లు మంజూరు చేసి పనులు చేపట్టారు. అధికారులకు ముందుచూపు లేకపోవడం వల్ల ప్రజలు పన్నుల రూపంలో కట్టిన రూ.35 లక్షలు వృథా అయ్యాయి. ఈ సొమ్ముతో మురికివాడల్లో రోడ్లు, కాలువలు నిర్మించి ఉంటే ప్రజలకు మేలు జరిగేదని పలువురు అంటున్నారు. పత్తాలేని అధికారులు రోడ్డు నిర్మాణంపై వివరణ కోసం మున్సిపల్ కమిషనర్ ఎస్.వెంకటరమణను సంప్రదించగా ఆ పనులకు, తమకు సంబంధం లేదని చెప్పారు. వుడాకు చెందిన అధికారులదే పర్యవేక్షణ బాధ్యత అన్నారు. రూ.రెండు లక్షల పనికే వర్క్ ఇ¯ŒSస్పెక్టరు ఉంటేనే పని చేయాలని చెబుతారు. రూ. 2.20 కోట్ల పనికి ఏ అధికారి లేకపోయినా కాంట్రాక్టర్ పని చేస్తున్నారు. పర్యవేక్షణ లేకపోతే నాణ్యత ప్రమాణాలు లోపిస్తాయని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. -
మొలక రాకుంటే బాధ్యత ఎవరిది?
సబ్సిడీ అపరాల విత్తనాలపై సందేహాలు రాయవరం: రబీ అనంతరం అపరాల సాగు చేపట్టేందుకు ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీపై మినుము విత్తనాలు సరఫరా చేసేందుకు సన్నద్ధం చేస్తున్నారని, అయితే అవి మొలక రాక రైతులు నష్టపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి ప్రశ్నించారు. రాయవరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఖరీఫ్ అనంతరం పీయూ 31 మినుము విత్తనాలను వ్యవసాయ శాఖ రైతులకు సబ్సిడీపై సరఫరా చేసిందన్నారు. ఆ విత్తనం వేసిన రైతులు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇప్పుడు అవే విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమవుతోందన్నారు. ప్రభుత్వం 33 శాతం సబ్సిడీపై ఇవ్వనున్నట్టు ప్రకటించిందని, మినుములు మార్కెట్లో క్వింటాల్‌కు రూ. 5,300 నుంచి రూ.5,500 వరకు ధర పలుకుతుండగా, ప్రభుత్వ సబ్సిడీ పోను కిలో రూ.65వరకు విక్రయించడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా యంత్రాలతో వరికోతలు కోస్తున్నారని, అటువంటి పొలాల్లో పీయూ31, ఇతర ఏ విత్తనాలు వేసినా విత్తనాలకు జర్మినేష¯ŒS ఉండదని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ విత్తనాలు మొలకెత్తినా మెడవిరుపు తెగులు అధికంగా సోకుతుందన్నారు. అపరాలు, పచ్చిరొట్ట విత్తనాలను ప్రభుత్వం 75 శాతం సబ్సిడీపై ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఫసల్ బీమా యోజన బూటకం ఫసల్ బీమా యోజన బూటకమని ఆయన విమర్శించారు. బీమా నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వలన రైతులకు ఎటువంటి ప్రయోజనం ఒనగూరడం లేదన్నారు. గత ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు వ్యవసాయ శాఖ జేడీ సిఫార్సు చేసినా కూడా బీమా వర్తింపచేయలేదని, దీనిని బట్టే ఫసల్ బీమా యోజన అమలు తీరు ఎలా ఉందో అర్ధమవుతుందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న రైతు వ్యతిరేక నిర్ణయాలతో రాష్ట్ర వ్యాప్తంగా సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయిందన్నారు. విలేకరుల సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు చిన్నం అపర్ణాపుల్లేష్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్తి వెంకటరెడ్డి, ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ సిరిపురపు శ్రీనివాసరావు, సొసైటీ అధ్యక్షుడు నల్లమిల్లి వెంకటరెడ్డి (చినకాపు), సత్తి వీరవెంకటరెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు. -
నాసిరకం విత్తు.. రైతు చిత్తు
= ముంచిన సబ్సిడీ నాసిరకం విత్తనం = 1,500 ఎకరాల్లో చేతికందని వరి పంట = ఎకరాకు రెండు సంచులే ధాన్యమే దిగుబడి = లబోదిబోమంటున్న రైతులు ఉరవకొండ : నాసిరకం విత్తనాలు రైతన్నలను నట్టేట ముంచాయి. ప్రైవేటు డీలర్ల వద్ద నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దంటూ వ్యవసాయాధికారులు ఊరూవాడా ప్రచారం చేయడంతో రైతులంతా ప్రభుత్వం సరఫరా చేసిన విత్తనం కొని నిండా మునిగిపోయారు. నాలుగునెలలపాటు కుటుంబమంతా పంటను బిడ్డలా కాపాడుకున్నా రెండు మూటలు మించి దిగుబడి రాకపోవడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కనీసం పెట్టుబడి కూడా పెట్టుబడి తిరిగి రాక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఉరవకొండ మండలం ఆమిద్యాల, రాకెట్ల, మోపిడి గ్రామాల్లో బోరు బావులు కలిగిన రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు గత ఏడాది ఆగస్టులో కణేకల్లు ప్రభుత్వ ఫాం ద్వారా నెల్లూరు వెరైటీ వరి వంగడాన్ని సబ్సిడీపై అందించారు. నాణ్యమైన వరి విత్తనం అంటూ అధికారులు ప్రచారం చేయడంతో రైతులు ఒక పాసుపుస్తకంపై ఒక్కో ప్యాకెట్‌ను రూ.650 చెల్లించి కోనుగోలు చేశారు. విత్తనం వేసి నెలలు గడిచినా పంట ఎదుగుదల లేకపోవడంతో రైతులు ఆందోâýæనకు గురయ్యారు. ఇదే విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళితే వారు పట్టించుకోలేదు. 1,500 ఎకరాల్లో దిగుబడి లేదు రైతులు ఎకరాకు రూ.20 వేల వరుకు పెట్టుబడి పెట్టి సబ్సిడీ వరి విత్తనం సాగుచేశారు. ఆరు నెలలు అవుతున్నా పంటలో ఎదుగుదల లేదు. కొన్ని గింజలు మాత్రమే కనిపిస్తుండటంతో తమకు ప్రభుత్వం నాసిరకమైన విత్తనం అంటగట్టిందని గుర్తించారు. సాధారణంగా ఎకరాకు 40 నుంచి 50 బస్తాల వరి దిగుబడి వచ్చేది. ఖర్చులు పోను రూ.30 వేల వరకు ఆదాయం లభించేది. ప్రస్తుతం నాసిరకం విత్తనం కారణంగా ఎకరాకు 3 బస్తాలు కుడా అందని పరిస్థితి. కనీసం పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చేలా కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. నాసిరకం వరి విత్తనం అంటగట్టి మోసగించిన ప్రభుత్వం తమకు పంట నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని రాకెట్ల రైతులు అనిల్, సురేష్, అశ్వర్థరెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి, లాలెప్ప, చిన్ననాగన్న తదితరులు కోరుతున్నారు. -
రహదారి పనుల్లో లోపిస్తున్న నాణ్యత
ప్రత్యేక సబ్ డివిజ¯ŒS ఏర్పాటు క్వాలిటీ కంట్రోల్ ఈఈ బ్రహ్మానందరెడ్డి పెడపర్తి (అనపర్తి): రహదారి నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు లోపిస్తున్నాయని, ఏజెన్సీలో చేపట్టే పనుల్లో నాణ్యత మరింత లోపిస్తున్నదని పంచాయతీ రాజ్ క్వాలిటీ కంట్రోల్ ఈఈ ఎస్.బ్రహ్మానందరెడ్డి తెలిపారు. మండలంలోని అనపర్తి, పెడపర్తి గ్రామాల్లో చేపట్టిన రహదారి నిర్మాణ పనులను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఏజెన్సీలో చేపడుతున్న నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు అధికంగా లోపిస్తున్న విషయాన్ని గుర్తించామన్నారు. అందువల్లే రంపచోడవరంలో ప్రత్యేకించి క్వాలిటీ కంట్రోల్ సబ్ డివిజ¯ŒS ఏర్పాటు చేసి అక్కడ ఒక డీఈఈ నియమించామన్నారు. తుని, కాకినాడ, అమలాపురం తదితర ప్రాంతాల్లో ఇటీవల నిర్వహించిన పనులకు సంబంధించి సుమారు రూ.25లక్షల మేర చెల్లింపులు నిలిపివేసినట్టు ఆయన తెలిపారు. ప్రతి 150 మీటర్లకు రెండు చోట్ల నమూనాలు తీసుకుంటామని, ఏ ఒక్కచోట నాణ్యత ప్రమాణాలు లోపించినా చర్యలు తీసుకుంటామన్నారు. రహదారుల నిర్మాణంలో సాధారణంగా 20 న్యూట¯ŒS ఫర్ ఎం.ఎం స్క్వేర్(ఎం20) నాణ్యత పరిగణలోనికి తీసుకుంటామన్నారు. అయితే ఎం17 ఉన్నప్పటికీ నాణ్యతగానే గుర్తిస్తామన్నారు. ఎం 15 నాణ్యత ఉంటే రికవరీకి ఆదేశిస్తామని, అంతకన్నా తక్కువ ఉంటే ఆ ప్రాంతంలో నిర్మాణానికి ఆదేశిస్తామన్నారు. అనపర్తి, పెడపర్తిలో నిర్మించిన ఆరు రహదారుల్లో నమూనాలను పరీక్షిస్తామన్నారు. ఆయన వెంట విజయవాడ జేఈఈలు శంకరప్రసాద్, సత్యనారాయణ, అనపర్తి డీఈ ఏవీ సూర్యనారాయణ, ఏఈ నాగేంద్రప్రసాద్‌లు ఉన్నారు. -
ఒక్క వర్షం.. పుష్కరరోడ్డు ధ్వంసం
సంగమం ఘాట్‌కు వెళ్లే రోడ్డు మార్జిన్ ముక్కలు ముందే ట్రాన్స్ఫార్మర్ తొలగించడంతో తప్పిన ముప్పు ఇబ్రహీంపట్నం : పుష్కర పనుల్లోని డొల్లతనం ఒక్క వర్షంతో బైటపడింది. పవిత్ర సంగమం పుష్కర ఘాట్‌కు వెళ్లేందుకు రోడ్లు– భవనాలు (ఆర్అండ్బీ) శాఖ నూతనంగా నిర్మించిన రెండులైన్ల రహదారి మార్జిన్ వర్షంతో నిలువునా జారిపోయింది. రోడ్డు మార్జిన్ కూలి పోవటమే కాక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం ఏర్పాటు చేసిన సిమెంటు దిమ్మెసైతం అయిదడుగుల కిందకు ఒరిగిపోయింది. ఈ ప్రాంతంలోనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుచేసిన విద్యుత్ శాఖ అధికారులు బీటీ రోడ్డు వద్ద మార్జిన్ నెర్రెలిచ్చడం గమనించారు. మార్జిన్ కుంగిపోతుందని ఊహించి ముందుగానే అక్కడున్న ట్రాన్స్ఫార్మర్ను తొలగించారు. వారు ఊహించినట్లుగానే సోమవారం తెల్లవారు జామున వర్షం దెబ్బకు అదే జరిగింది. అక్కడ ట్రాన్స్‌ఫార్మరే ఉండి ఉంటే భారీ ప్రమాదమే జరిగి ఉండేది. రూ.6.50 కోట్ల పనులు డొల్లే ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఐరన్ బారి కేడ్లు సైతం బుడమేరు కాలువలోకి జారిపోయాయి. హడావుడిగా చేసిన పుష్కరాల పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని గతంలోనే సాక్షిలో వరుస కథనాలు వచ్చాయి. అప్పట్లో వర్షంలోనే బీటీ రోడ్డు, మార్జిన్ పనులు చేశారు. పుష్కరాల నేపథ్యంలో సుమారు రూ.6.50 కోట్లతో ఈరోడ్డును ఆర్అండ్బీ శాఖ నిర్మించింది. అధికారుల నిర్లక్ష్యం, అవినీతి కారణంగా విలువైన ప్రజాధనం నీళ్లపాలు అయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కుంగిపోయిన ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. రిటైనింగ్ వాల్ లేనందునే: డీఈ మోహనరావు భారీవర్షాలు పడితే బుడమేరు కాలువ వైపున రోడ్డు అంతా జారిపోయే ప్రమాదం పొంచిఉంది. పేదల నివాసాలు తొలగించిన ప్రాంతంలో రోడ్డును నిర్మిస్తూ అక్కడున్న నల్లమట్టిని పైపైన చదును చేశారనే ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి. ఆర్అండ్బీ డీఈ మోహనరావును సంప్రదించగా.... రోడ్డుకు తూర్పువైపు ఉన్న బుడమేరు కాలువకు రిటైనింగ్ వాల్ లేనందున మార్జిన్ కిందికి జారిందన్నారు. నీటి ప్రవాహం కూడా ఓ కారణం అన్నారు. రోడ్డుభధ్రతను దృష్టిలో ఉంచుకుని కాలువ వైపున రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మార్జిన్ ఏర్పాటుకు పటిష్టమైన చర్యలు చేపడతామని తెలిపారు. -
అవినీతి బీటలు
పర్యాటక శాఖ పనుల్లో కానరాని నాణ్యత పగుళ్లు తీస్తున్న వసతిగృహ సముదాయం గోడలు రూ.కోటికి పైగా పక్కదారి పట్టినట్లు ఆరోపణలు పిఠాపురం : పర్యాటక శాఖ పనుల్లో అవినీతి బీటలు బయటపడుతున్నాయి. నిధులు మంజూరు చేసేది పర్యాటక శాఖ. పనులు జరిగేది దేవాదాయ శాఖ పరిధిలో. కానీ ఎవరికి వారే తమది కాదంటే తమది కాదంటూ తప్పించుకోవడం.. క్వాలిటీ కంట్రోల్ అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడంతో.. రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన నిర్మాణాలు నెలలు తిరగకుండానే నాణ్యత లోపాలను బహిర్గతం చేస్తున్నాయి. టెంపుల్ టూరిజంలో భాగంగా పర్యాటక శాఖ పిఠాపురం పాదగయ క్షేత్రంలో భక్తులకు మౌలిక వసతులు మెరుగుపరచే పనులు చేపట్టింది. ఆలయాన్ని ఆనుకుని ఉన్న స్థలంలో రూ.1.77 కోట్లతో రిసెప్షన్, సమాచార కేంద్రం, భక్తులు వేచి ఉండే గదులు, హోటల్ తదితర సౌకర్యాలతో వసతిగృహ సముదాయం నిర్మించింది. ఇందులో 8 గదులు ఒక డార్మిటరీ ఉన్నాయి. 2013లో ప్రారంభించిన ఈ పనులు 2014లో పూర్తి కావాలి. కానీ 2015లో పూర్తి చేశారు. దీని నిర్మాణం జరిగిన స్థలం చెరువు గర్భం కావడంతో ఇక్కడ ఏ నిర్మాణం చేపట్టినా పునాది నుంచీ అత్యంత పటిష్టంగా చర్యలు తీసుకోవాలి. కానీ అలా జరగకపోవడంతో ఏడాది తిరగకుండానే గోడలు బీటలు వారుతున్నాయి. వసతిగృహ సముదాయంలో అన్ని సౌకర్యాలూ కల్పించాల్సి ఉండగా.. కేవలం గదులు మాత్రం నిర్మించి ఆలయ అధికారులకు పర్యాటక శాఖ అప్పగించింది. కరెంటు, మంచాలు, ఏసీలు, మంచినీరు, మోటార్లు తదితర సౌకర్యాలన్నింటినీ ఆలయ సొమ్ముతోనే ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఈ భవన నిర్మాణ వ్యయంలో సుమారు రూ.కోటి వరకూ నిధులు పక్కదారి పట్టాయని, అందువల్లనే నాణ్యత లోపించిందన్న ఆరోపణలు వస్తున్నాయి. నిర్మించి ఏడాది కాకుండానే ఈ వసతిగృహ సముదాయంలో గదుల గోడలు బీటలు వారాయి. ఏ ఒక్క అధికారీ నాణ్యతను పరిశీలించకుండానే బిల్లులు చెల్లించడం పర్యాటక శాఖ పనుల్లో సర్వసాధారణం అయిపోయిందని, అందువల్లే ప్రతి నిర్మాణం ఇలా నాణ్యాతా లోపాలతో కొద్ది రోజుల్లోనే శిథిదిలావస్థకు చేరుకుంటోందని భక్తులు ఆరోపిస్తున్నారు. నాణ్యత లోపంపై చర్యలు తీసుకుంటాం వసతిగృహ సముదాయం పనుల్లో నాణ్యత లోపాలపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపిస్తాం. నాణ్యాత లోపాలుంటే చర్యలు తీసుకుంటాం. గోడలు బీటలు వారుతూంటే ఎటువంటి ప్రమాదాలూ జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం. – జి.శ్రీనివాస్, ఈఈ, పర్యాటక శాఖ -
నాసిరకంగా ఏలేరు ఆధునికీకరణ
పిఠాపురం రూరల్ : ప్రస్తుతం చే స్తున్న ఏలేరు ఆధునికీకరణ పనుల్లో నాణ్యత లోపించిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ పెండెం దొరబాబు విమర్శించారు. పిఠాపురం మండలం విరవాడ, విరవ, ఎల్ఎన్ పురం గ్రామాల్లోని పంట కాలువలను శనివారం ఆయన పరిశీలించారు. ఏలేరు కాలువలపై నిర్మిస్తున్న రెగ్యులేటర్ నిర్మాణాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏలేరు రైతుల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.138 కోట్ల వ్యయంతో చేపట్టే ఆధునికీకరణ పనులకు 2008లో ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. అప్పటి నుంచి పాలకుల నిర్లక్ష్యం కారణంగా పనులు మందకొడిగా జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రస్తుతం చేపట్టిన చిన్నపాటి పనుల్లోనే భారీ అవినీతి కనిపిస్తోందని ఆరోపించారు. ఏలేరు ఆయకట్టు రైతుల దుస్థితిపై ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల్లోని నీటిని తీసుకురావడం చేతకాక ఫైరింజన్లతో పొలాలకు నీరు అందిస్తామంటూ నాటకాలాడుతున్నారని దుయ్యబట్టారు. తక్షణమే ఆధునికీకరణ పనులను పారదర్శకంగా, త్వరితగతిన పూర్తి చేయించాలన్నారు. ఏలేరు శివారు ఆయకట్టు భూములు ఎండిపోకుండా నీటిని నిరంతరాయంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ జిల్లా నేతలు కురుమళ్ల రాంబాబు, గండేపల్లి బాబి, కర్రి ప్రసాద్ తదితరులున్నారు. -
రహదారి నిర్వహణలోనూ నిర్లక్ష్యమే
గోదావరి పుష్కరాల ఆరంభంలో బ్యారేజిపై రోడ్డు నిర్మాణం ఏడాది తిరగకుండానే గోతులు పడిన వైనం గోదారిలో కలిసిన రూ.అరకోటి నిధులు బొబ్బర్లంక (ఆత్రేయపురం) : ధవళేశ్వరం బ్యారేజి నిర్వహణలోనే కాదు.. దీనిపై ఉన్న రోడ్డు నిర్వహణలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, నిడదవోలు, విజ్జేశ్వరం తదితర ప్రాంతాల ప్రజలు రాజమహేంద్రవరం రావాలంటే ఈ రోడ్డునే ఆశ్రయిస్తారు. దెబ్బతిన్నదిలా.. ∙ఉభయ గోదావరి జిల్లాలకు వారధిగా నిలుస్తున్న బ్యారేజిపై దెబ్బ తిన్న రహదారిని గత ఏడాది గోదావరి పుష్కరాల ఆరంభంలో సుమారు రూ.50 లక్షలతో నిర్మించారు. ఆ సమయంలో నాణ్యతా ప్రమాణాలు పటించకపోవడంతో ఏడాది పూర్తి కాకుండానే ఈ రోడ్డు దెబ్బతింది. బ్యారేజి రోడ్డుపై జాయింట్ల వద్ద ఎక్కడికక్కడ గోతులు పడ్డాయి. అక్కడకు చేరేసరికి వాహనాలు ఎగిరి పడుతున్నాయి. వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు కూడా పాడవుతున్నాయి. జాయింట్లవద్ద ఖాళీలు ఏర్పడటంతో పాటు అక్కడక్కడ ఇనుప ఊచలు పైకి లేచిపోయాయి. విద్యుద్దీపాలు వెలగక బ్యారేజిపై రాత్రి వేళల్లో అంధకారం అలముకుంటోంది. ఆ సమయంలో వాహనచోదకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. నాణ్యతతో రోడ్డు నిర్మించాలి బ్యారేజిపై రహదారిని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నాణ్యంగా నిర్మించాలి. జాయింట్లవద్ద ఖాళీలు, గోతులు లేకుండా చర్యలు తీసుకోవాలి. బ్యారేజిని కూడా సుందరంగా తీర్చిదిద్దాలి. – చిలువూరి చిన వెంకట్రాజు, ఆత్రేయపురం నిర్వహణపై శ్రద్ధ చూపాలి బ్యారేజి నిర్వహణపై ఇరిగేషన్ అధికారులు శ్రద్ధ చూపాలి. కనీసం రక్షిత ప్రాంతంలో విద్యుద్దీపాలు ఏర్పాటు చేసి ప్రజలు సేద తీరేవిధంగా పార్కులు నిర్మించాలి. బ్యారేజీపై రాత్రి ప్రయాణాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి. – కప్పల శ్రీధర్, ర్యాలి -
ఆ భోజనం వద్దు బాబోయ్!
ఇస్కాన్ భోజనాన్ని చెత్తబుట్ట పాలుచేస్తున్న విద్యార్థులు ముద్దగా మారుతున్న అన్నం పలచటి సాంబారు, మజ్జిగ ఇళ్ల నుంచి క్యారేజీలు తెస్తున్న తల్లిదండ్రులు అన్నం పరబ్రహ్మ స్వరూపం.. ఇస్కాన్ నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తరచూ దీనిని పఠిస్తుంటారు. అలాంటి ఇస్కాన్ సంస్థ అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో వండి, వడ్డిస్తున్న భోజనాన్ని ఆరగించలేక స్కూలు పిల్లలు ఆ ‘మధ్యాహ్న భోజనాన్ని’ నేలపాలు చేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందనే విషయమై ఆ సంస్థ ఇంతవరకూ కనీస దృష్టి సారించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – కంబాలచెరువు (రాజమహేంద్రవరం) మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలకు భోజనాన్ని సరఫరా చేస్తున్నారు. గతంలో ఇస్కాన్ మందిరం నుంచి వచ్చే భోజనం చాలా రుచి, శుచిగా ఉందన్న విద్యార్థులే.. నేడు ఆ భోజనాన్ని చెత్తబుట్టలో వేస్తున్నారు. రాజమహేంద్రవరంతో పాటు రాజమహేంద్రవరం రూరల్, కోరుకొండ, సీతానగరం, రాజానగరం, కడియం ప్రాంతాల్లోని మొత్తం 43 ప్రభుత్వ స్కూళ్లకు ఇస్కాన్ ఈ భోజనాన్ని సరఫరా చేస్తోంది. వీరు సరఫరా చేసే భోజనాన్ని విద్యార్థులు పూర్తి స్థాయిలో భుజించడం లేదు. ఈ నేపథ్యంలో దీనిపై దృష్టి సారించిన ‘సాక్షి’.. పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి, మధ్యాహ్న భోజనం పరిస్థితులను పరిశీలించింది. విద్యార్థులంతా తమ కంచాల్లో భోజనం వేయించుకుని, రెండు ముద్దలు తిని పక్కనున్న చెత్తబుట్టలో భోజనాన్ని పడవేయడం కనిపించింది. దీనిపై ఆ విద్యార్థులను అడగగా, అన్నం బాగాలేదని, సాంబారు బాగోలేదని సమాధానమిచ్చారు. స్కూలు వద్దకు ఇస్కాన్ వ్యాన్ తీసుకొచ్చిన భోజనాన్ని పరిశీలించగా, నీళ్ల సాంబారు, పలచటి మజ్జిగ, ముద్దలా మారిన అన్నం కనిపించాయి. ‘మధ్యాహ్న భోజనం’లో ప్లాస్టిక్ పా్లస్టిక్ వాడకాన్ని అరికడతామని ప్రచారం చేస్తున్న విద్యాసంస్థల్లోనే మజ్జిగను ప్లాస్టిక్ కవర్లో ఉంచి ఇస్కాన్ పంపించింది. నిత్యం సాంబారు అన్నం తినలేక, రుచిగా లేకపోవడంతో కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు ఇళ్ల నుంచే తమ పిల్లలకు భోజనం తెచ్చిపెడుతున్నారు. ఇస్కాన్ భోజనం ఉండగా, ఇంటి నుంచి ఎందుకు తెస్తున్నారని వారిని ప్రశ్నించగా, స్కూలులో పెట్టే భోజనం అసలు తమ పిల్లలు తినలేకపోతున్నారని, ఒక్కోసారి కడుపునొప్పి వస్తోందని బాధపడుతున్నారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఇస్కాన్ భోజనం బాగాలేదని, మధ్యాహ్న భోజన పథకం నుంచి ఆ సంస్థను తొలగించాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు అనేకమంది ఫిర్యాదు చేశారు. ఇటీవల రాజమహేంద్రవరం వచ్చిన టీడీపీ నాయకుడు ముద్దుకృష్ణమనాయుడికి కూడా దీనిపై ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే ఇస్కాన్ భోజనంపై విచారణ చేసి, చర్యలు చేపట్టాలని డీఈఓకు సూచించారు. దీనిపై ఆయా స్కూళ్ల హెచ్ఎంల నుంచి లిఖితపూర్వక ఫిర్యాదులను విద్యా శాఖాధికారులు తీసుకుంటున్నారు. హెచ్ఎంల ప్రశంసల వెనుక రహస్యం ఏమిటో? భోజనాన్ని విద్యార్థులు తినలేకపోతున్నా, వారంలో ఒకరోజే కూర, మిగతా రోజులన్నీ సాంబారు అన్నం పెడుతున్నా ఇస్కాన్ భోజనంపై ఆయా స్కూళ్ల హెచ్ఎంలు ప్రశంసల జల్లు కురిపిస్తూ లిఖితపూర్వకంగా విద్యాశాఖాధికారులకు లేఖలు రాస్తున్నారు. దీనిపై విద్యాశాఖాధికారులు సైతం విస్తుపోతున్నారు. దీనివెనుక అసలు కథ వేరని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిత్యం స్కూళ్లలో భోజనం చేసే విద్యార్థుల సంఖ్యను ముందుగా ఇస్కాన్‌కు అందించాలి. ఆ ప్రకారం వారు భోజనాలను తీసుకురావాలి. అసలు బాగోతమంతా ఇక్కడే ఉంది. ఇస్కాన్‌కు భోజనాలు చేసే విద్యార్థుల సంఖ్య ఒకరోజు ముందుగా పంపాల్సి ఉంటుంది. ఆ సమయంలో స్కూలులో భోజనం చేసేది 500 మంది విద్యార్థులైతే, రెట్టింపు సంఖ్యలో లిస్టు పంపిస్తున్నారు. ఆ మేరకు భోజనాల బిల్లు నిర్వాహకులు, హెచ్ఎంల చేతికి చేరుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇస్కాన్ ఇవ్వాల్సిన భోజనం మెనూ సోమవారం రైస్, సాంబారు, మజ్జిగ మంగళవారం : రైస్, కాయగూరల కూర, మజ్జిగ బుధవారం : రైస్, బిర్యానీ, పుదీనా రైస్, టమోటా రైస్ (ఏదో ఒకటి), మసాల రైతా, మజ్జిగ గురువారం : రైస్, పప్పు ఆకుకూరతో, మజ్జిగ శుక్రవారం : రైస్, సాంబారు, మజ్జిగ శనివారం : లెమన్ రైస్, పుదినా రైస్, టమోటా రైస్ (ఏదో ఒకటి), స్వీటు, మజ్జిగ మంచి భోజనం పెడుతున్నాం పిల్లలకు భోజనం బాగానే పెడుతున్నాం. ప్రభుత్వ మెనూ ప్రకారమే అందిస్తున్నాం. మేము సేవ చేస్తున్నాం. ఇస్కాన్ భోజనం బాగోలేదు అని వస్తున్న ఆరోపణలు నిజం కాదు. – శ్యామాంగ శ్రీనివాస్‌దాస్, నిర్వాహకుడు, ఇస్కాన్ భోజన పథకం చర్యలు తీసుకుంటున్నాం ఇస్కాన్ భోజనం బాగాలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు సైతం సీరియస్‌గా ఉన్నారు. త్వరలోనే చర్యలు తీసుకుంటాం. భోజనం బాగా లేకపోతే ఇస్కాన్‌ను మధ్యాహ్న భోజనం పథకం నుంచి తప్పిస్తాం. హెచ్ఎంలు ఇస్కాన్ భోజనం బాగుందని ఇస్తున్నారనే దానిని పరిశీలించి, ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే వారిపైనా చర్యలు చేపడతాం. – ఎస్.అబ్రహాం, ఉప విద్యాశాఖాధికారి -
నాణ్యతకు పాతర
పుష్కర పనుల్లో నాణ్యత పాటించని కాంట్రాక్టర్లు పట్టించుకోని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న భక్తులు పుష్కర తరుణం ముంచుకొస్తోంది.. భక్తజన కోటి పన్నెండేళ్లకోసారి వచ్చే పండుగను ఒక్కసారైనా తరించాలని ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురు చూస్తోంది. దీనికి తగ్గట్టు ప్రభుత్వం నిధులైతే విడుదల చేసి తన పనైపోయినట్లు తూతూమంత్రంగా పర్యవేక్షిస్తోంది. దీంతో ఎక్కడికక్కడ పనులన్నీ నీరంగా నీరసంతో నీరుగారుతున్నాయి. మరోవైపు ఉన్నతాధికారుల మామూళ్ల మత్తు.. హడావుడితో నాణ్యతకు పాతర పడుతోంది. సీతానగరం (తాడేపల్లి రూరల్): మండలంలోని సీతానగరం కృష్ణానది ఒడ్డున 450 మీటర్ల పొడవునా ఘాట్ల నిర్మాణం చేపట్టారు. రెండు నెలల నుంచి పుష్కర పనులు నత్తనడకన కొనసాగించిన కాంట్రాక్టర్లు సమయం ముంచుకొస్తుండటంతో హడావుడిగా ఘాట్ల నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఘాట్ల నిర్మాణంలో కూలీలు కాకుండా యంత్రాలు పని ఎక్కువగా చేయడంతో నాణ్యత లోపం స్పష్టంగా కనబడుతోంది. అధికారులు కాంక్రీట్‌ను మిక్సింగ్ చేసేందుకు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఇది కంకర, సిమెంట్, ఇసుక, కావలసిన నీటిని ఏర్పరుచుకుంటుంది. ఈ క్రమంలో కాంట్రాక్టర్ లెక్కా పత్రం లేకుండా ఇసుకను వేయడం, పరిమితికి మించి నీటిని వినియోగించటంతో ఘాట్ల నిర్మాణంలో ఆ కాంక్రీట్ నేలపై వేసినప్పుడు నీటితోపాటు సిమెంటు కూడా కొట్టుకుపోయి కంకరు, కొంత మేర ఇసుక మాత్రమే మిగులుతోంది. ఎగుడుదిగుడుగా మెట్ల నిర్మాణం.. ఘాట్లలో ఏర్పాటు చేసే మెట్లు చిన్నది, పెద్దదిగా కట్టి యాత్రికులు దిగేందుకు వీలు లేకుండా చేస్తున్నారు. ఇలా చేస్తున్నారేంటని అధికారులు ప్రశ్నిస్తే ప్లాస్టింగ్ చేసే సమయంలో హెచ్చు తగ్గులు లేకుండా చూస్తామని మాట దాటేస్తునారు. దీంతోపాటు ఘాట్ల నిర్మాణాలు చేసే సమయంలో ప్రతిఒక్క లారీలో వచ్చే సిమెంటుతో కూడిన కాంక్రీట్ మిక్సింగ్ శాంపిల్స్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. కాంక్రాక్టర్లు ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఘాట్ల నిర్మాణాన్ని పరిశీలించాల్సిన అధికారులు కాంట్రాక్టర్ల కాసులకు తలొగ్గి మౌనం వహిస్తున్నారు. కనీసం జిల్లా అధికారులు కూడా రోజుకోసారి పరిశీలన జరుపుతున్నారే తప్ప ఘాట్ల నిర్మాణంలో జరుగుతున్న అవినీతిని మాత్రం ఏ ఒక్కరూ ప్రశ్నించడం లేదు. కాంక్రీట్ నిర్మాణం చేపట్టిన తర్వాత పది రోజులు వాటరింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక దానిపై ఒకటి నిర్మాణం చేపడుతున్నారు. పుష్కరాల అనంతరం నిర్మించిన ఘాట్ల వద్ద పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయే అవకాశం ఉందని ప్రభుత్వ ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. పుష్కర కాలంపాటు కూడా ఈ ఘాట్లు ఉండవని, ఒక్కసారి వరద వస్తే ఆ నీటి తాకిడికి కొట్టుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.