నాసిరకం విత్తు.. రైతు చిత్తు
నాసిరకం విత్తు.. రైతు చిత్తు
Published Tue, Feb 28 2017 1:00 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
= ముంచిన సబ్సిడీ నాసిరకం విత్తనం
= 1,500 ఎకరాల్లో చేతికందని వరి పంట
= ఎకరాకు రెండు సంచులే ధాన్యమే దిగుబడి
= లబోదిబోమంటున్న రైతులు
ఉరవకొండ : నాసిరకం విత్తనాలు రైతన్నలను నట్టేట ముంచాయి. ప్రైవేటు డీలర్ల వద్ద నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దంటూ వ్యవసాయాధికారులు ఊరూవాడా ప్రచారం చేయడంతో రైతులంతా ప్రభుత్వం సరఫరా చేసిన విత్తనం కొని నిండా మునిగిపోయారు. నాలుగునెలలపాటు కుటుంబమంతా పంటను బిడ్డలా కాపాడుకున్నా రెండు మూటలు మించి దిగుబడి రాకపోవడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కనీసం పెట్టుబడి కూడా పెట్టుబడి తిరిగి రాక పోవడంతో ఆందోళన చెందుతున్నారు.
ఉరవకొండ మండలం ఆమిద్యాల, రాకెట్ల, మోపిడి గ్రామాల్లో బోరు బావులు కలిగిన రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు గత ఏడాది ఆగస్టులో కణేకల్లు ప్రభుత్వ ఫాం ద్వారా నెల్లూరు వెరైటీ వరి వంగడాన్ని సబ్సిడీపై అందించారు. నాణ్యమైన వరి విత్తనం అంటూ అధికారులు ప్రచారం చేయడంతో రైతులు ఒక పాసుపుస్తకంపై ఒక్కో ప్యాకెట్‌ను రూ.650 చెల్లించి కోనుగోలు చేశారు. విత్తనం వేసి నెలలు గడిచినా పంట ఎదుగుదల లేకపోవడంతో రైతులు ఆందోâýæనకు గురయ్యారు. ఇదే విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళితే వారు పట్టించుకోలేదు.
1,500 ఎకరాల్లో దిగుబడి లేదు
రైతులు ఎకరాకు రూ.20 వేల వరుకు పెట్టుబడి పెట్టి సబ్సిడీ వరి విత్తనం సాగుచేశారు. ఆరు నెలలు అవుతున్నా పంటలో ఎదుగుదల లేదు. కొన్ని గింజలు మాత్రమే కనిపిస్తుండటంతో తమకు ప్రభుత్వం నాసిరకమైన విత్తనం అంటగట్టిందని గుర్తించారు. సాధారణంగా ఎకరాకు 40 నుంచి 50 బస్తాల వరి దిగుబడి వచ్చేది. ఖర్చులు పోను రూ.30 వేల వరకు ఆదాయం లభించేది. ప్రస్తుతం నాసిరకం విత్తనం కారణంగా ఎకరాకు 3 బస్తాలు కుడా అందని పరిస్థితి. కనీసం పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చేలా కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. నాసిరకం వరి విత్తనం అంటగట్టి మోసగించిన ప్రభుత్వం తమకు పంట నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని రాకెట్ల రైతులు అనిల్, సురేష్, అశ్వర్థరెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి, లాలెప్ప, చిన్ననాగన్న తదితరులు కోరుతున్నారు.
Advertisement