తాలు వచ్చిన వరికంకిని చూయిస్తోన్న రైతు
మల్దకల్ (గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ మండలానికి ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి చెరువులు, కుంటలకు నీరు సరఫరా అవుతోంది. దీంతో తాటికుంట, నాగర్‌దొడ్డి రిజర్వాయర్లతోపాటు గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలు, వ్యవసాయ బోరు బావుల వద్ద రైతులు రబీలోనూ వరి పంటలు వేల ఎకరాల్లో సాగు చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటకు కాపు వచ్చినా గింజ పట్టక తాలు రావడంతో పంటలు సాగు చేసిన రైతులు నట్టేట మునిగిపోయామంటూ లబోదిబోమంటున్నారు.
మండలంలోని ఉలిగేపల్లికి చెందిన రైతులు దాదాపు వెయ్యి ఎకరాల్లో తులసి, ధనలక్ష్మి, వినాయక, ఓంకార్, టాటా, ధర్మరాజ్ పల్లి కంపెనీకి చెందిన ఆర్‌ఎన్‌ఆర్ 15048 రకం వరి విత్తనాలతో నాటు వేశారు. 25 కిలోల వరి విత్తనాల ప్యాకెట్ రూ.850 నుంచి రూ.900 వరకు వెచ్చించి గద్వాల, రాయచూరు పట్టణ ప్రాంతాల్లోని డీలర్ల వద్ద కొనుగోలు చేశారు. పంట సాగు కోసం ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టినా ఆశించిన మేరకు వరి పంట రాకపోవడంతోపాటు, వరి గింజలు పట్టక తాలుపోయింది. దీంతో వరి పంటలు సాగు చేసిన రైతులు చిన్న సవారన్న, తిమ్మారెడ్డి, తిమ్మప్ప, జైపాల్, లక్ష్మన్న, రాములతోపాటు మరో 80 మందికి పైగా రైతులు కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయాన్ని బాధిత రైతులు మండల వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మండల వ్యవసాయాధికారిణి శ్రీలత బుధవారం గ్రామానికి వెళ్లి వరి పంటలను పరిశీలించారు. పంటకాలం పూర్తికావస్తున్నా గింజలు పట్టకుండా తాలుపోవడంతో తమ పరిస్థితి ఏమిటని రై తులు ప్రశ్నించారు. వరి నాటు పెట్టి ఐదు నెలలు కావొస్తుందని, గింజలు పట్టక మొత్తం తాలు గింజలు పట్టినట్లు రైతులకు ఆవేదన వ్యక్తం చేశారు. నిరక్షరాస్యులైన తమకు కంపెనీలు నకిలీ వరి విత్తనాలను అంటగట్టారని, వరి పంటలకు కంపెనీలే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఉన్నతాధికారులకు వివరిస్తాం..
ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ గ్రామంలో రైతులు సాగుచేసిన వరి పంటలను పరిశీలించామని, వరికి ఇంత వరకు గింజ పట్టక తాలుపోయిందన్నారు. ఈ విషయమై శాస్త్రవేత్తలకు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. ఇదిలా ఉండగా గతంలో కూడా మల్దకల్ మండలంలోని బిజ్వారం, కుర్తిరావుల్‌చెర్వు గ్రామాల రైతులకు నకిలీ మిరప విత్తనాలు అంటగట్టడంతో రైతులు తీవ్రం గా నష్టపోయారు. దీనిపై అప్పట్లో రైతులు కలెక్టర్ రజత్‌కుమార్‌సైనికి ఫిర్యాదు చేయగా, కంపెనీ అధికారులు పంట పొలాలను పరిశీలించినా ఫలితం లేకపోవడంతో నకిలీ మిరప పంటలను రైతులు స్వచ్ఛందంగా తొలగించారు. ప్రస్తుతం నష్టపోయిన రైతులకైనా నష్టపరిహారం కంపెనీ నిర్వాహకులు చెల్లిస్తుందో.. లేదో వేచి చూడాల్సిందే.
పంటలను పరిశీలిస్తాం : డీఏఓ
ఈ విషయమై జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌నాయక్ స్పందిస్తూ ఉలిగేపల్లి రైతులతోపాటు కేటీదొడ్డి, గట్టు మండలాలకు చెందిన రైతులు కూడా ఫిర్యాదు చేశారన్నారు. వారి ఫిర్యాదు మేరకు బుధవారం శాస్త్రవేత్తలతో మాట్లాడి వారికి లేఖ రాశామన్నారు. వారు పంటలను పరిశీలించిన అనం తరం ఏ విషయమనేది తెలుస్తుందని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment