DAO
-
టీఎస్పీఎస్సీ డీఏవో పరీక్ష పేపర్ కోసం.. ‘ఆడి’ కారు అమ్మి.. అడ్వాన్సు ఇచ్చి
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పరీక్ష పేపర్ ఖరీదు చేసిన కేసులో అరెస్టయిన ఖమ్మం జంట సాయి లౌకిక్, సాయి సుస్మిత విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. వీరిద్దరినీ సిట్ అధికారులు న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని మూడు రోజులపాటు విచారించారు. ఆదివారం ఆ గడువు ముగియడంతో సోమవారం వైద్యపరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నారు. సాయి సుస్మిత గ్రూప్–1 పరీక్ష రాసిన తర్వాత ఓఎంఆర్ షీట్లో జరిగిన పొరపాట్లు సరి చేసుకోవడానికి కమిషన్‌కు వచ్చిన సందర్భంలో ప్రవీణ్‌కుమార్‌తో పరిచయమైంది. డీఏఓ మాస్టర్ క్వశ్చన్ పేపర్ తన వద్ద ఉందని ఫిబ్రవరి మూడో వారంలో ఈమెతో చెప్పిన ప్రవీణ్ రూ.10 లక్షలకు విక్రయిస్తానన్నాడు. ఈ విషయాన్ని సుస్మిత తన భర్త లౌకిక్‌కు చెప్పింది. అప్పటికప్పుడు అంత డబ్బు లేకపోవడంతో తమ వద్ద ఉన్న రెండు కార్లలో ‘ఆడి’ కారును తన స్నేహితుడికి విక్రయించిన లౌకిక్ అతడి నుంచి అడ్వాన్స్‌గా రూ.6 లక్షలు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని ప్రవీణ్‌కు ట్రాన్స్ఫర్ చేసి మిగిలిన మొత్తం చెల్లింపునకు గడువు కోరాడు. దీంతో భార్యాభర్తల్ని ఎల్బీనగర్ వద్దకు రమ్మని ప్రవీణ్ చెప్పాడు. ‘ఆ పేపర్ మేం ఎవ్వరికీ ఇవ్వలేదు’ ఫిబ్రవరి 23 రాత్రి ఖమ్మం నుంచి నగరానికి వచ్చిన దంపతులు ఎల్బీనగర్లోని డీ మార్ట్ వద్ద ఉండి ప్రవీణ్‌కు సమాచారం ఇచ్చారు. బడంగ్‌పేట్‌లోని మల్లికార్జున కాలనీలో తన ఇంటి నుంచి అక్కడకు వచ్చిన ప్రవీణ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చి వెళ్లాడు. ఆ రాత్రి అల్కాపురిలోని లాడ్జిలో బస చేసిన ఈ దంపతులు మరుసటి రోజు ఖమ్మంలోని సమీప బంధువు ఇంటికి వెళ్లారు. అక్కడే రెండు రోజుల ఉండి పరీక్షకు సిద్ధమైన సుస్మిత ఫిబ్రవరి 26న పరీక్ష రాసింది. సిట్ అధికారులు వీరిద్దరినీ తీసుకుని శనివారం ఖమ్మం రాపర్తినగర్‌లోని వారి ఇంట్లో సోదాలు చేశారు. మాస్టర్ ప్రశ్నపత్రంతో పాటు హాల్‌టికెట్ స్వాదీనం చేసుకున్నారు. తాము ఆ ప్రశ్నపత్రాలు మరెవరికీ ఇవ్వలేదని ఇరువురూ సిట్ అధికారులకు తెలిపారు. నేను కష్టపడి చదివా.. మీరు అపోహపడుతున్నారు న్యూజిలాండ్ నుంచి సిట్‌కు ఈ– మెయిల్ చేసిన నిందితుడు ప్రశాంత్ గ్రూప్–1 ప్రశ్నా పత్రాన్ని ప్రధాన నిందితులలో ఒకడైన రాజశేఖర్‌రెడ్డి, న్యూజిలాండ్‌లో ఉన్న తన బావ ప్రశాంత్‌రెడ్డికి పంపించాడు. న్యూజిలాండ్‌లో పరీక్షకు సిద్ధమై, హైదరాబాద్‌కు వచ్చి ప్రశాంత్ గ్రూప్–1 పరీక్ష రాసి వెళ్లాడు. పేపర్ లీకేజీ ఘటన వెలుగులోకి రావడంతో వందకుపైగా మార్కులు వచ్చిన వారిని ఆరా తీస్తున్న క్రమంలో ప్రశాంత్‌రెడ్డికి వందకుపైగా మార్కులు వచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో తన బావకు ప్రశ్న పత్రాన్ని పంపించానని రాజశేఖర్ అంగీకరించాడు. ఈ మేరకు న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌కు వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా సిట్ నోటీసులు పంపించింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌రెడ్డి సిట్‌కు ఈ మెయిల్ పంపించాడు. ‘నేను కష్టపడి చదివానని, నేను ఎవరి వద్ద నుంచి ప్రశ్నా పత్రం తీసుకోలేదు, నాకు మార్కులు ఎక్కువగా రావడంతో మీరు అపోహపడుతున్నారు’ అని ఈ మెయిల్లో పేర్కొన్నాడు. కాగా ప్రశ్నా పత్రాన్ని న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌కు రిమోట్‌యాప్ అయిన ఎనీడెస్క్ ద్వారా రాజశేఖర్‌రెడ్డి పంపించిన విషయం విచారణలో వెల్లడైన విషయంతెలిసిందే. -
డీఏఓ పేపరూ అమ్మేశాడు!
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజ్ కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) క్వశ్చన్ పేపర్లతో పాటు డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) ప్రశ్న పత్రాలనూ సూత్రధారి పి.ప్రవీణ్ కుమార్ విక్రయించినట్లు తాజాగా బయటపడింది. ఈ విషయం గుర్తించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శుక్రవారం ఖమ్మం ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు సాయి సుస్మిత, సాయి లౌకిక్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కమిషన్ నిర్వహించిన, నిర్వహించాల్సిన ఆరు పరీక్షలకు సంబంధించి 15 ప్రశ్న పత్రాలు లీకైనట్లు ఇప్పటికే సిట్ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. వీటిలో గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షలకు పంచుకున్నారని, ఏఈ పరీక్షలవి విక్రయించారని, మిగిలినవి ఏ అభ్యర్థుల వద్దకూ వెళ్లలేదని భావించారు. అయితే కమిషన్ కార్యదర్శి అనిత రామ్‌చంద్రన్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన ప్రవీణ్ కుమార్ బ్యాంకు ఖాతాను విశ్లేషించిన అధికారులు డీఏఓ పరీక్ష పత్రాన్ని కూడా ఇతడు విక్రయించాడని గుర్తించారు. సాయి లౌకిక్ ఖమ్మంలో కార్ల వ్యాపారం చేస్తుండగా, ఈయన భార్య సుస్మిత గతంలో హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేశారు. టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్–1, డీఏఓ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న సుస్మిత ఉద్యోగం మాని వీటికోసం సిద్ధమయ్యారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన గ్రూప్–1 ప్రిలిమ్స్ రాసిన ఈమె ఓఎంఆర్ షీట్‌ను రాంగ్ బబ్లింగ్ చేశారు. అంటే నిబంధనలకు విరుద్ధంగా రెండు చోట్ల పెన్నుతో మార్కింగ్ చేశారు. దీంతో ఈమె జవాబు పత్రాన్ని కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదు. ఈ అంశంలో తనకు న్యాయం చేయాలని కోరడానికి సుస్మిత పలుమార్లు టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చి, పలువురు అధికారులను కలిశారు. ఇలా కమిషన్ కార్యదర్శి వద్దకు వచ్చిన సందర్భంలోనే ఈమెకు ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడింది. మాటల సందర్భంలో తాను డీఏఓ పరీక్షకు సిద్ధమవుతున్నట్లు చెప్పింది. జవాబులతో కూడిన మాస్టర్ పేపర్‌నే ఇస్తా.. ఫిబ్రవరి మూడో వారంలో డీఏఓ పేపర్ చేజిక్కించుకున్న ప్రవీణ్ ఆమెను సంప్రదించారు. తన వద్ద డీఏఓ పరీక్ష పత్రం ఉందని, రూ.10 లక్షలకు విక్రయిస్తానని చెప్పాడు. దీంతో ఆమె విషయాన్ని తన భర్త లౌకిక్‌కు చెప్పింది. ఇద్దరూ కలిసి ప్రవీణ్‌ను కలిసి బేరసారాలు చేశారు. తాను ఇచ్చేది జవాబులతో కూడిన మాస్టర్ పేపర్ అని చెప్పిన అతగాడు రేటు తగ్గించడానికి ససేమిరా అన్నాడు. దీంతో అడ్వాన్స్‌గా రూ.6 లక్షలు ప్రవీణ్ ఖాతాకు బదిలీ చేసిన లౌకిక్ డీఏఓ ప్రశ్నపత్రం ప్రింటెడ్ కాపీ తీసుకున్నాడు. మిగిలిన రూ.4 లక్షలు ఫలితాలు వెలువడిన తర్వాత ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. ఈ ప్రశ్న పత్రం ఆధారంగానే తర్ఫీదు పొందిన సుస్మిత ఫిబ్రవరి 26న డీఏఓ పరీక్ష రాసింది. నాటకీయ పరిణామాల మధ్య గత నెలలో ఈ పేపర్ల లీకేజ్ వ్యవహారం వెలుగులోకి రావడం, ప్రవీణ్ సహా మొత్తం 15 మంది అరెస్టు కావడం జరిగిపోయాయి. ప్రవీణ్‌ను సిట్ పోలీసులు రెండుసార్లు కస్టడీలోకి తీసుకుని విచారించినా సుస్మిత వ్యవహారం చెప్పలేదు. కేవలం ఏఈ పేపర్లు మాత్రమే విక్రయించానని పదేపదే చెప్తూ సిట్ అధికారులను నమ్మించే ప్రయత్నం చేశాడు. రూ. 6 లక్షలపై తీగ లాగితే... అతడి బ్యాంకు ఖాతాలోకి నగదు లావాదేవీలు పరిశీలించిన అధికారులు రూ.6 లక్షలు ఫిబ్రవరి మూడో వారంలో డిపాజిట్ అయినట్లు గుర్తించారు. ఆ నగదు లావాదేవీల వివరాలు చెప్పాలంటూ విచారణ సందర్భంలో ప్రవీణ్‌ను తమదైన శైలిలో అడిగారు. తన కారు ఖమ్మంలోని కార్ల వ్యాపారి లౌకిక్‌కు విక్రయించానని, దానికి సంబంధించిన మొత్తమే అది అంటూ తొలుత నమ్మించే ప్రయత్నం చేశాడు. దీనిపై సందేహాలు వ్యక్తం చేసిన సిట్ లౌకిక్‌కు సంబం«దీకులు ఎవరైనా టీఎస్పీఎస్సీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారా? అనే అంశంపై దృష్టి పెట్టారు. కమిషన్ నుంచి తీసుకున్న ఆయా పరీక్షల అభ్యర్థుల జాబితాలోని వివరాలను సరి చూశారు. దీంతో లౌకిక్ భార్య సుస్మిత గ్రూప్–1తో పాటు డీఏఓ పరీక్ష రాసినట్లు వెల్లడైంది. దీంతో భార్యాభర్తలను సిట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. శుక్రవారం ఇరువురినీ అరెస్టు చేసిన సిట్ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. వీరి నుంచి ఈ పేపర్ ఇంకా ఎవరికైనా చేరిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ దంపతుల్ని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సిట్ నిర్ణయించింది. -
రైతుల్ని ముంచిన నకిలీ విత్తనాలు
మల్దకల్ (గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ మండలానికి ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి చెరువులు, కుంటలకు నీరు సరఫరా అవుతోంది. దీంతో తాటికుంట, నాగర్‌దొడ్డి రిజర్వాయర్లతోపాటు గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలు, వ్యవసాయ బోరు బావుల వద్ద రైతులు రబీలోనూ వరి పంటలు వేల ఎకరాల్లో సాగు చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటకు కాపు వచ్చినా గింజ పట్టక తాలు రావడంతో పంటలు సాగు చేసిన రైతులు నట్టేట మునిగిపోయామంటూ లబోదిబోమంటున్నారు. మండలంలోని ఉలిగేపల్లికి చెందిన రైతులు దాదాపు వెయ్యి ఎకరాల్లో తులసి, ధనలక్ష్మి, వినాయక, ఓంకార్, టాటా, ధర్మరాజ్ పల్లి కంపెనీకి చెందిన ఆర్ఎన్ఆర్ 15048 రకం వరి విత్తనాలతో నాటు వేశారు. 25 కిలోల వరి విత్తనాల ప్యాకెట్ రూ.850 నుంచి రూ.900 వరకు వెచ్చించి గద్వాల, రాయచూరు పట్టణ ప్రాంతాల్లోని డీలర్ల వద్ద కొనుగోలు చేశారు. పంట సాగు కోసం ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టినా ఆశించిన మేరకు వరి పంట రాకపోవడంతోపాటు, వరి గింజలు పట్టక తాలుపోయింది. దీంతో వరి పంటలు సాగు చేసిన రైతులు చిన్న సవారన్న, తిమ్మారెడ్డి, తిమ్మప్ప, జైపాల్, లక్ష్మన్న, రాములతోపాటు మరో 80 మందికి పైగా రైతులు కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని బాధిత రైతులు మండల వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మండల వ్యవసాయాధికారిణి శ్రీలత బుధవారం గ్రామానికి వెళ్లి వరి పంటలను పరిశీలించారు. పంటకాలం పూర్తికావస్తున్నా గింజలు పట్టకుండా తాలుపోవడంతో తమ పరిస్థితి ఏమిటని రై తులు ప్రశ్నించారు. వరి నాటు పెట్టి ఐదు నెలలు కావొస్తుందని, గింజలు పట్టక మొత్తం తాలు గింజలు పట్టినట్లు రైతులకు ఆవేదన వ్యక్తం చేశారు. నిరక్షరాస్యులైన తమకు కంపెనీలు నకిలీ వరి విత్తనాలను అంటగట్టారని, వరి పంటలకు కంపెనీలే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులకు వివరిస్తాం.. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ గ్రామంలో రైతులు సాగుచేసిన వరి పంటలను పరిశీలించామని, వరికి ఇంత వరకు గింజ పట్టక తాలుపోయిందన్నారు. ఈ విషయమై శాస్త్రవేత్తలకు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. ఇదిలా ఉండగా గతంలో కూడా మల్దకల్ మండలంలోని బిజ్వారం, కుర్తిరావుల్‌చెర్వు గ్రామాల రైతులకు నకిలీ మిరప విత్తనాలు అంటగట్టడంతో రైతులు తీవ్రం గా నష్టపోయారు. దీనిపై అప్పట్లో రైతులు కలెక్టర్ రజత్‌కుమార్‌సైనికి ఫిర్యాదు చేయగా, కంపెనీ అధికారులు పంట పొలాలను పరిశీలించినా ఫలితం లేకపోవడంతో నకిలీ మిరప పంటలను రైతులు స్వచ్ఛందంగా తొలగించారు. ప్రస్తుతం నష్టపోయిన రైతులకైనా నష్టపరిహారం కంపెనీ నిర్వాహకులు చెల్లిస్తుందో.. లేదో వేచి చూడాల్సిందే. పంటలను పరిశీలిస్తాం : డీఏఓ ఈ విషయమై జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌నాయక్ స్పందిస్తూ ఉలిగేపల్లి రైతులతోపాటు కేటీదొడ్డి, గట్టు మండలాలకు చెందిన రైతులు కూడా ఫిర్యాదు చేశారన్నారు. వారి ఫిర్యాదు మేరకు బుధవారం శాస్త్రవేత్తలతో మాట్లాడి వారికి లేఖ రాశామన్నారు. వారు పంటలను పరిశీలించిన అనం తరం ఏ విషయమనేది తెలుస్తుందని ఆయన చెప్పారు. -
బాధ్యతలు స్వీకరించిన డీఏవోలు
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్, వరంగల్ అర్బన్ జిల్లాలను మినహాయించి మిగిలిన కొత్త జిల్లాల్లో జిల్లా వ్యవసాయాధికారుల (డీఏవో)ను వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి నియమించారు. వారంతా మంగళవారం బాధ్యతలు స్వీకరించారని ఆ శాఖ వర్గా లు తెలిపాయి. పాత కొత్త జిల్లాల డీఏవోలుగా సీహెచ్ తేజోవతి (కరీంనగర్), జె.భాగ్యలక్ష్మి (జగిత్యాల), ఆర్.తిరుమల ప్రసాద్ (పెద్దపల్లి), జయదేవి (సిరిసిల్ల), కె.ఎన్.జగదీష్ (రంగారెడ్డి), గోపాల్ (వికారాబాద్), విజయ్‌కుమార్ (కామారెడ్డి), విజయగౌరి (నిజామాబాద్), సుచరిత (మహబూబ్‌నగర్), బి.సింగారెడ్డి (నాగర్‌కర్నూల్), జె.సి.నాగేంద్రయ్య (వనపర్తి), కె.గోవింద్ నాయక్ (గద్వాల), ఝాన్సీలక్ష్మీకుమారి (ఖమ్మం), పి.ప్రతాప్ (కొత్తగూడెం), బి.నర్సింహారావు (నల్లగొండ), యు.జ్యోతిర్మయి (సూర్యాపేట), పి.హరి నాథ్‌బాబు (యాదాద్రి), ఆశాకుమారి (ఆదిలాబాద్), జె.దాదారావు (మంచిర్యాల), కె.గంగారాం (నిర్మల్), అలీముద్దీన్ (ఆసిఫాబాద్), జి.రాములు (మెదక్), ఏఎం.శ్రీలత (సంగారెడ్డి), ఎం.గోవిందు (సిద్దిపేట), డి.ఉషా (వరంగల్ రూరల్), కె.అనురాధ (జయశంకర్), ఎన్.వీరునాయక్ (జనగాం), బి.చత్రు (మహబూబాబాద్)లను నియమించారు. మేడ్చల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో వ్యవసాయ కార్యక్రమాలు ఉన్నందున ఆ జిల్లాలకు ఏడీఏ స్థాయి అధికారిని నియమిస్తారు. ఇదిలావుండగా ఉద్యాన, పశు సంవర్థకశాఖ జిల్లా అధికారులు కూడా జిల్లాల్లో బాధ్యతలు స్వీకరించారు.