టీఎస్‌పీఎస్సీ డీఏవో పరీక్ష పేపర్‌ కోసం.. ‘ఆడి’ కారు అమ్మి.. అడ్వాన్సు ఇచ్చి | TSPSC Divisional Accounts Officer Exam Paper Costing Case | Sakshi
Sakshi News home page

టీఎస్‌పీఎస్సీ డీఏవో పరీక్ష పేపర్‌ కోసం.. ‘ఆడి’ కారు అమ్మి.. అడ్వాన్సు ఇచ్చి

Published Mon, Apr 17 2023 2:35 AM | Last Updated on Mon, Apr 17 2023 11:38 AM

TSPSC Divisional Accounts Officer Exam Paper Costing Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏఓ) పరీక్ష పేపర్‌ ఖరీదు చేసిన కేసులో అరెస్టయిన ఖమ్మం జంట సాయి లౌకిక్, సాయి సుస్మిత విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. వీరిద్దరినీ సిట్‌ అధికారులు న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసు­కుని మూడు రోజులపాటు విచారించారు. ఆది­వారం ఆ గడువు ముగియడంతో సోమవారం వైద్యపరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నారు.

సాయి సుస్మిత గ్రూప్‌–1 పరీక్ష రాసిన తర్వాత ఓఎంఆర్‌ షీట్‌లో జరిగిన పొరపాట్లు సరి చేసుకోవడానికి కమిషన్‌కు వచ్చిన సందర్భంలో ప్రవీణ్‌కుమార్‌తో పరిచయమైంది. డీఏఓ మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్‌ తన వద్ద ఉందని ఫిబ్రవరి మూడో వారంలో ఈమెతో చెప్పిన ప్రవీణ్‌ రూ.10 లక్షలకు విక్రయిస్తానన్నాడు.

ఈ విషయాన్ని సుస్మిత తన భర్త లౌకిక్‌కు చెప్పింది. అప్పటికప్పుడు అంత డబ్బు లేకపోవడంతో తమ వద్ద ఉన్న రెండు కార్లలో ‘ఆడి’ కారును తన స్నేహితుడికి విక్రయించిన లౌకిక్‌ అతడి నుంచి అడ్వాన్స్‌గా రూ.6 లక్షలు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని ప్రవీణ్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసి మిగిలిన మొత్తం చెల్లింపునకు గడువు కోరాడు. దీంతో భార్యాభర్తల్ని ఎల్బీనగర్‌ వద్దకు రమ్మని ప్రవీణ్‌ చెప్పాడు. 

‘ఆ పేపర్‌ మేం ఎవ్వరికీ ఇవ్వలేదు’ 
ఫిబ్రవరి 23 రాత్రి ఖమ్మం నుంచి నగరానికి వచ్చిన దంపతులు ఎల్బీనగర్‌లోని డీ మార్ట్‌ వద్ద ఉండి ప్రవీణ్‌కు సమాచారం ఇచ్చారు. బడంగ్‌పేట్‌లోని మల్లికార్జున కాలనీలో తన ఇంటి నుంచి అక్కడకు వచ్చిన ప్రవీణ్‌  మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్‌ ఇచ్చి వెళ్లాడు.

ఆ రాత్రి అల్కాపురిలోని లాడ్జిలో బస చేసిన ఈ దంపతులు మరుసటి రోజు ఖమ్మంలోని సమీప బంధువు ఇంటికి వెళ్లారు. అక్కడే రెండు రోజుల ఉండి పరీక్షకు సిద్ధమైన సుస్మిత ఫిబ్రవరి 26న పరీక్ష రాసింది. సిట్‌ అధికారులు వీరిద్దరినీ తీసుకుని శనివారం ఖమ్మం రాపర్తినగర్‌లోని వారి ఇంట్లో సోదాలు చేశారు. మాస్టర్‌ ప్రశ్నపత్రంతో పాటు హాల్‌టికెట్‌ స్వాదీనం చేసుకున్నారు. తాము ఆ ప్రశ్నపత్రాలు మరెవరికీ ఇవ్వలేదని ఇరువురూ సిట్‌ అధికారులకు తెలిపారు.  

నేను కష్టపడి చదివా.. మీరు అపోహపడుతున్నారు 
న్యూజిలాండ్‌ నుంచి సిట్‌కు ఈ– మెయిల్‌ చేసిన నిందితుడు ప్రశాంత్‌  
గ్రూప్‌–1 ప్రశ్నా పత్రాన్ని ప్రధాన నిందితులలో ఒకడైన రాజశేఖర్‌రెడ్డి, న్యూజిలాండ్‌లో ఉన్న తన బావ ప్రశాంత్‌రెడ్డికి పంపించాడు. న్యూజిలాండ్‌లో పరీక్షకు సిద్ధమై, హైదరాబాద్‌కు వచ్చి  ప్రశాంత్‌ గ్రూప్‌–1 పరీక్ష రాసి వెళ్లాడు. పేపర్‌ లీకేజీ ఘటన వెలుగులోకి రావడంతో వందకుపైగా మార్కులు వచ్చిన వారిని ఆరా తీస్తున్న క్రమంలో ప్రశాంత్‌రెడ్డికి వందకుపైగా మార్కులు వచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది.  

విచారణలో తన బావకు ప్రశ్న ప­త్రాన్ని పంపించానని రాజశేఖర్‌ అంగీకరించాడు. ఈ మేరకు న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌కు వా­ట్సాప్, ఈ మెయిల్‌ ద్వారా సిట్‌ నోటీసులు పంపించింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌రెడ్డి సిట్‌కు ఈ మె­యిల్‌ పంపించాడు. ‘నేను కష్టపడి చదివానని, నేను ఎవరి వద్ద నుంచి ప్రశ్నా పత్రం తీసుకోలేదు, నాకు మార్కులు ఎక్కువగా రావడంతో మీరు అపోహపడుతున్నారు’ అని ఈ మెయిల్‌లో పేర్కొన్నా­డు. కాగా ప్రశ్నా పత్రాన్ని న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌కు రిమోట్‌యాప్‌ అయిన ఎనీడెస్క్‌ ద్వా­రా రాజశేఖర్‌రెడ్డి పంపించిన విషయం విచారణలో వెల్లడైన విషయంతెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement