డీఏఓ పేపరూ అమ్మేశాడు!  | New matter has come out in the case of leakage of TSPSC exam papers | Sakshi
Sakshi News home page

డీఏఓ పేపరూ అమ్మేశాడు! 

Published Sat, Apr 8 2023 4:40 AM | Last Updated on Sat, Apr 8 2023 10:24 AM

New matter has come out in the case of leakage of TSPSC exam papers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజ్‌ కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ) క్వశ్చన్‌ పేపర్లతో పాటు డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏఓ) ప్రశ్న పత్రాలనూ సూత్రధారి పి.ప్రవీణ్‌ కుమార్‌ విక్రయించినట్లు తాజాగా బయటపడింది. ఈ విషయం గుర్తించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) శుక్రవారం ఖమ్మం ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు సాయి సుస్మిత, సాయి లౌకిక్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

కమిషన్‌ నిర్వహించిన, నిర్వహించాల్సిన ఆరు పరీక్షలకు సంబంధించి 15 ప్రశ్న పత్రాలు లీకైనట్లు ఇప్పటికే సిట్‌ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. వీటిలో గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్షలకు పంచుకున్నారని, ఏఈ పరీక్షలవి విక్రయించారని, మిగిలినవి ఏ అభ్యర్థుల వద్దకూ వెళ్లలేదని భావించారు. అయితే కమిషన్‌ కార్యదర్శి అనిత రామ్‌చంద్రన్‌ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన ప్రవీణ్‌ కుమార్‌ బ్యాంకు ఖాతాను విశ్లేషించిన అధికారులు డీఏఓ పరీక్ష పత్రాన్ని కూడా ఇతడు విక్రయించాడని గుర్తించారు.

సాయి లౌకిక్‌ ఖమ్మంలో కార్ల వ్యాపారం చేస్తుండగా, ఈయన భార్య సుస్మిత గతంలో హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేశారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్‌–1, డీఏఓ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న సుస్మిత ఉద్యోగం మాని వీటికోసం సిద్ధమయ్యారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ రాసిన ఈమె ఓఎంఆర్‌ షీట్‌ను రాంగ్‌ బబ్లింగ్‌ చేశారు. అంటే నిబంధనలకు విరుద్ధంగా రెండు చోట్ల పెన్నుతో మార్కింగ్‌ చేశారు. దీంతో ఈమె జవాబు పత్రాన్ని కమిషన్‌ పరిగణనలోకి తీసుకోలేదు.

ఈ అంశంలో తనకు న్యాయం చేయాలని కోరడానికి సుస్మిత పలుమార్లు టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వచ్చి, పలువురు అధికారులను కలిశారు. ఇలా కమిషన్‌ కార్యదర్శి వద్దకు వచ్చిన సందర్భంలోనే ఈమెకు ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడింది. మాటల సందర్భంలో తాను డీఏఓ పరీక్షకు సిద్ధమవుతున్నట్లు చెప్పింది. 

జవాబులతో కూడిన మాస్టర్‌ పేపర్‌నే ఇస్తా.. 
ఫిబ్రవరి మూడో వారంలో డీఏఓ పేపర్‌ చేజిక్కించుకున్న ప్రవీణ్‌ ఆమెను సంప్రదించారు. తన వద్ద డీఏఓ పరీక్ష పత్రం ఉందని, రూ.10 లక్షలకు విక్రయిస్తానని చెప్పాడు. దీంతో ఆమె విషయాన్ని తన భర్త లౌకిక్‌కు చెప్పింది. ఇద్దరూ కలిసి ప్రవీణ్‌ను కలిసి బేరసారాలు చేశారు. తాను ఇచ్చేది జవాబులతో కూడిన మాస్టర్‌ పేపర్‌ అని చెప్పిన అతగాడు రేటు తగ్గించడానికి ససేమిరా అన్నాడు. దీంతో అడ్వాన్స్‌గా రూ.6 లక్షలు ప్రవీణ్‌ ఖాతాకు బదిలీ చేసిన లౌకిక్‌ డీఏఓ ప్రశ్నపత్రం ప్రింటెడ్‌ కాపీ తీసుకున్నాడు. మిగిలిన రూ.4 లక్షలు ఫలితాలు వెలువడిన తర్వాత ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు.

ఈ ప్రశ్న పత్రం ఆధారంగానే తర్ఫీదు పొందిన సుస్మిత ఫిబ్రవరి 26న డీఏఓ పరీక్ష రాసింది. నాటకీయ పరిణామాల మధ్య గత నెలలో ఈ పేపర్ల లీకేజ్‌ వ్యవహారం వెలుగులోకి రావడం, ప్రవీణ్‌ సహా మొత్తం 15 మంది అరెస్టు కావడం జరిగిపోయాయి. ప్రవీణ్‌ను సిట్‌ పోలీసులు రెండుసార్లు కస్టడీలోకి తీసుకుని విచారించినా సుస్మిత వ్యవహారం చెప్పలేదు. కేవలం ఏఈ పేపర్లు మాత్రమే విక్రయించానని పదేపదే చెప్తూ సిట్‌ అధికారులను నమ్మించే ప్రయత్నం చేశాడు. 

రూ. 6 లక్షలపై తీగ లాగితే...
అతడి బ్యాంకు ఖాతాలోకి నగదు లావాదేవీలు పరిశీలించిన అధికారులు రూ.6 లక్షలు ఫిబ్రవరి మూడో వారంలో డిపాజిట్‌ అయినట్లు గుర్తించారు. ఆ నగదు లావాదేవీల వివరాలు చెప్పాలంటూ విచారణ సందర్భంలో ప్రవీణ్‌ను తమదైన శైలిలో అడిగారు.  తన కారు ఖమ్మంలోని కార్ల వ్యాపారి లౌకిక్‌కు విక్రయించానని, దానికి సంబంధించిన మొత్తమే అది అంటూ తొలుత నమ్మించే ప్రయత్నం చేశాడు. దీనిపై సందేహాలు వ్యక్తం చేసిన సిట్‌ లౌకిక్‌కు సంబం«దీకులు ఎవరైనా టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారా? అనే అంశంపై దృష్టి పెట్టారు.

కమిషన్‌ నుంచి తీసుకున్న ఆయా పరీక్షల అభ్యర్థుల జాబితాలోని వివరాలను సరి చూశారు. దీంతో లౌకిక్‌ భార్య సుస్మిత గ్రూప్‌–1తో పాటు డీఏఓ పరీక్ష రాసినట్లు వెల్లడైంది. దీంతో భార్యాభర్తలను సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. శుక్రవారం ఇరువురినీ అరెస్టు చేసిన సిట్‌ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించింది. వీరి నుంచి ఈ పేపర్‌ ఇంకా ఎవరికైనా చేరిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ దంపతుల్ని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని సిట్‌ నిర్ణయించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement