ప్రత్తిపాటికి మంత్రిగా సాగే అర్హత లేదు..
ప్రత్తిపాటికి మంత్రిగా సాగే అర్హత లేదు..
Published Mon, Oct 24 2016 11:33 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్
గుంటూరు (పట్నంబజారు): ‘రైతుల కష్టాలు పట్టని నువ్వు వ్యవసాయ శాఖ మంత్రివా...? నకిలీ విత్తనాల చట్టాల్లో లోపాలు ఉన్నాయని చెబుతున్న నీకు మంత్రిగా ఉండే అర్హత ఉందా...అసలు నీ ప్రమేయంతోనే నకిలీ విత్తనాల అమ్మకాలు జరుగుతున్నాయని పత్రికలు ఘోషిస్తున్నాయి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై నిప్పులు చెరిగారు. విత్తనాల కంపెనీలకు కాంగ్రెస్ హయాంలో లైసెన్సులు ఇచ్చారని...వాటిలో లోపాలు ఉన్నాయని ప్రకటనలు చేస్తున్న మంత్రి ప్రత్తిపాటి లోపాలు సరిచేయకుండా ఏంచేస్తున్నారని విమర్శించారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం మర్రి రాజశేఖర్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ చట్టాల్లో లోపాలు ఉన్నాయని చెప్పే ప్రత్తిపాటికి మంత్రిగా సాగే అర్హత ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. రెండున్నర సంవత్సరాల పాలన తరువాత తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై నెపాలను నెడుతున్నారని ఆరోపించారు. రైతులు దివాళా తీసే పరిస్థితుల్లో ఉంటే ఆదుకోవాల్సిన మంత్రి చట్టాల్లో లోపాలు అని చెప్పటం సిగ్గుచేటన్నారు. హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులు, యువకులు, రాజకీయపార్టీలపై పీడీ యాక్టులు పెడుతున్న ప్రభుత్వం నకిలీ విత్తనాల కంపెనీలపై ఎందుకు పెట్టదని సూటిగా ప్రశ్నించారు. మంత్రి ప్రమేయం లేకుండానే లక్ష రూపాయలకు విత్తనాలు అమ్మే పరిస్థితులు వచ్చాయా అని ప్రశ్నించారు. కంపెనీలపై కేసు పెడతామని, రైతులకు రూ. 10 వేల నుంచి 30 వేల వరకు నష్ట పరిహారం ఇస్తామని చెప్పారని, ఇప్పటి వరకు అతీగతీ లేదని మండిపడ్డారు. పత్తి కోనుగోళ్ళు సమయంలోనూ తన వద్ద పనిచేసే ఉద్యోగులనే రైతులుగా చూపించి మంత్రి అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. రైతుల పక్షాన ఎంతటి పోరాటానికైనాS వెనుకాడమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు శిఖా బెనర్జీ, కొత్తా చిన్నపరెడ్డి, మొగిలి మధు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement