మొన్న 'జీవా'.. నిన్న 'బ్రహ్మపుత్ర'
Published Thu, Oct 6 2016 4:47 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
* మంత్రి ఇలాఖా.. నకిలీల ఖిల్లా
* నకిలీ విత్తనాలతో మిర్చి రైతులు కుదేలు
* జిల్లాలో రోజుకోచోట బయటపడుతున్న వైనం
* 4 వేల ఎకరాలకుపైగా నష్టం
* హైబ్రీడ్ లక్షణాలు లేవని తేల్చిన శాస్త్రవేత్తలు
* కమిటీ పేరుతో మీన మేషాలు
సాక్షి, అమరావతి బ్యూరో/ గుంటూరు వెస్ట్: వ్యవసాయశాఖ మంత్రి సొంత జిల్లాలో నకిలీ మిర్చి విత్తనాలు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రోజుకో కంపెనీ పేరుతో పుట్టగొడుగుల్లా నకిలీ మిరప విత్తనాలు బయట పడుతుండటంతో రైతులు కుదేలవుతున్నారు. నకిలీ విత్తనాల నియంత్రణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయల పెట్టుబడులు మట్టిపాలు అవుతున్నాయి. జీవా, అగ్రిటెక్ పేరుతో జిల్లాలో దాదాపు 242 కేజీల విత్తనాలను రైతులకు పంపిణీ చేసినట్లు సమాచారం. అయితే ఈ విత్తనాల్లో హైబ్రీడ్ లక్షణాలు లేవని, హ్టార్టీకల్చర్ శాస్త్రవేత్తలు తేల్చినట్లు తెలిసింది. ఈ విత్తనాలు వాడి మేడికొండూరు, పెదకూరపాడు, అమరావతి మండలాల్లో పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు. వేసిన పంటను సైతం పీకివేశారు. ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నష్టపోయిన రైతులకు వేరే పంటలు వేసుకునేందుకు వీలుగా వెంటనే పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. కమిటీ పేరుతో కాలయాపన చేస్తోంది. రైతులకు ఏ మేరకు పరిహారం ఇవ్వాలనేది జేడీ నాయకత్వంలోని కమిటీæ తేల్చి ప్రభుత్వానికి పంపాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి పుణ్యకాలం గడిచిపోతుందని, సమస్య కోల్డ్‌స్టోరేజీలోకి చేరుతుందని పలువురు పేర్కొంటున్నారు.
పూత, పిందె రాని బ్రహ్మపుత్ర..
బ్రహ్మపుత్ర 555 రకానికి సంబంధించిన మొక్కల్లో పెరుగుదల లేదని, పూత, పిందె రావడం లేదని తాడికొండ, రెంటచింతల మండలాల్లోని రైతులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హార్టీకల్చర్ శాస్త్రవేత్త శారదా పంటను పరిశీలించారు. దాదాపు కిలో విత్తనాలను రైతులకు రూ.50వేల నుంచి రూ.లక్ష రేటుతో కట్టబెట్టినట్లు సమాచారం. అయితే ఈ విత్తనాలకు హైబ్రీడ్ లక్షణాలు లేకపోవడం గమనార్హం. మామూలు విత్తనాలనే హైబ్రీడ్ విత్తనాలుగా చూపి రైతులను నట్టేటముంచినట్లు తెలిసింది. వ్యవసాయ శాఖ మంత్రి సొంత ఇలాకాలో నకిలీలు స్వైర విహారం చేస్తున్నా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. విత్తన పంపిణీ సమయంలో ఓ మంత్రి సమీప బంధువు ఆధ్వర్యంలోనే ఈ దందా జరగడంతో వ్యవసాయశాఖ అధికారులు సైతం చర్యలు తీసుకోలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుల కార్యాలయం కేంద్రంగానే ఈ నకిలీ దందా సాగిందని, ఇందులో ఓ వ్యవవసాయాశాఖ అధికారి కీలకంగా వ్యవహారించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో 1.75 లక్షల ఎకరాల్లో మిరప పంటను సాగుచేశారు. రోజుకో కంపెనీకి చెందిన విత్తనాలు నకిలీవని తేలుతుండటంతో పంట సాగు చేసిన రైతులు, కౌలు రైతులు హడలిపోతున్నారు. దాదాపు ఎకరాకు సరాసరిన 40 వేలు పెట్టుబడి అంటే మొత్తం రూ.160కోట్ల పెట్టుబడి, ఎకరాకు దిగుబడి సరాసరిన రూ1.5లక్షలు అంటే 4000 ఎకరాలకు రూ.600కోట్లు అన్నదాతలు నష్టపోయారు.
మంత్రిని నిలదీసేందుకు సన్నద్ధం..
నేడు జిల్లా పరిషత్ సమావేశంలో నకిలీ విత్తనాలపై ప్రధానంగా చర్చ జరుగనుంది. జెడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు నకిలీలపై మంత్రిని, వ్యవసాయశాఖ అధికారులను నిలదీసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై చర్చ వాడి, వేడిగా సాగే అవకాశం ఉంది.
Advertisement
Advertisement