విత్తును వీడని నకిలీ మకిలి | Farmers are getting fake seeds itself | Sakshi
Sakshi News home page

విత్తును వీడని నకిలీ మకిలి

Published Sun, Jun 17 2018 2:55 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Farmers are getting fake seeds itself - Sakshi

ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు ఆంగోతు రాములు. ఈయనది నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం రంగుండ్ల తండా. గతేడాది గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని ఓ వ్యాపారి వద్ద ఒక ప్రముఖ కంపెనీకి చెందిన పత్తి విత్తనాలను తెచ్చి తనకున్న ఎనిమిది ఎకరాల భూమిలో విత్తాడు. కనీసం మొలకలు కూడా రాలేదు. దీంతో వ్యాపారి వద్దకు వెళ్లి నిలదీశాడు. తనకేం తెలియదని, మంచి విత్తనాలనే ఇచ్చామని దబాయించడంతో చేసేది లేక వెనుదిరిగాడు. కంపెనీ యజమాని, వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని కలెక్టరేట్‌ ఎదుట పలుమార్లు రైతు సంఘం నాయకులతో కలిసి ధర్నా చేశాడు. అయినా ఫలితం లేకుండాపోయింది. రాములు సుమారు రూ.2 లక్షలు నష్టపోయాడు. 

సాక్షి, నెట్‌వర్క్‌: నకిలీ విత్తనాల కారణంగా రైతులు ఏటా నష్టపోతూనే ఉన్నారు. పత్తి, మిర్చి, వరి విత్తనాల్లో ఈ నకిలీ ఎక్కువగా ఉంటోంది. రైతులు ఇరుగుపొరుగు వారిని అడిగి మార్కెట్‌లో లభ్యమవుతున్న వివిధ కంపెనీల విత్తనాలను తెచ్చి సాగు చేస్తున్నారు. అందులో కొన్ని నకిలీ విత్తనాలు ఉండటంతో మొక్క ఎదిగినా పూత, కాత ఉండడం లేదు. దీంతో అప్పటివరకు పెట్టిన పెట్టుబడులన్నీ రైతులు నష్టపోతున్నారు. చాలా జిల్లాల్లో ఇలా నష్టపోయిన రైతులు వ్యవసాయాధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ న్యాయం జరగలేదు. కొన్ని కంపెనీల విత్తనాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినా నివేదికలను తెప్పించడంలో వ్యవసాయ శాఖ విఫలమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల తాము సరఫరా చేసిన విత్తనాలు నాణ్యమైనవేనంటూ విత్తన కంపెనీలు కోర్టును ఆశ్రయించడంతో పరిహారం అంశం తేలడం లేదు. ఇంకొన్ని చోట్ల తక్కువ ధరకు విత్తనాలు లభిస్తున్నాయనే కారణంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. గ్రామాల్లో కొందరు చోటా నాయకులు విత్తన వ్యాపారుల అవతారం ఎత్తి రైతులకు పత్తి విత్తనాలు అంటగడుతున్నారు. ఏటా ఖరీఫ్‌ ఆరంభానికి ముందు రైతు చైతన్య యాత్రల పేరిట గ్రామాలకు వెళ్లే వ్యవసాయ అధికారులు.. ఈ ఏడాది రైతుబంధు చెక్కుల పంపిణీతో తీరిక లేకుండా గడిపారు. ప్రస్తుతం బదిలీల హడావుడి కొనసాగుతుండడంతో రైతులకు విత్తనాలపై మార్గనిర్దేశనం కొరవడింది. 

ఖమ్మం జిల్లాలో ఎక్కువ 
దాదాపు అన్ని జిల్లాల్లో నకిలీ విత్తనాల వ్యాపారం జరుగుతుండగా.. ఖమ్మం జిల్లాలో మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. నకిలీ విత్తనాలకు ఈ జిల్లా పెట్టింది పేరు. మిర్చి నకిలీ విత్తన వ్యవహారం 2016లో ఇక్కడే బయటపడింది. ఇందులో వివిధ కంపెనీలకు చెందిన బాధ్యులు, జిల్లాలోని పలు కంపెనీల డిస్ట్రిబ్యూటర్లు, వ్యాపారులపై అధికారులు కేసులు నమోదు చేసి జైళ్లకు పంపారు. ఆయా దుకాణాల లైసెన్సులు కూడా రద్దు చేశారు. గతేడాది కూడా పత్తి, మిర్చి రకాల్లో నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి వచ్చాయి. పత్తి ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా 5 నుంచి 6 క్వింటాళ్లకు మించలేదు. మిర్చి పరిస్థితీ అంతే. ఇక రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ విక్రయించిన వరి విత్తనాల్లో సరైన మొలక శాతం లేకపోవడంతో రైతులు లబోదిబోమన్నారు. పరిహారంపై కొందరు రైతులు కోర్టును కూడా ఆశ్రయించారు.  

ఈ ఏడాది విత్తనాలు అరకొరేనా? 
ఈ ఖరీఫ్‌లో విత్తనాల కొరత లేకుండా చూస్తామని వ్యవసాయాధికారులు చెబుతున్నా మండల పాయింట్లలోకి ఇండెంట్‌లో సగమే వచ్చాయి. కొన్నిచోట్ల ఇంకా వస్తున్నాయి. వర్షాలు ఇప్పుడిప్పుడే కురుస్తున్నాయని, సాగు పనులు ముమ్మరం అయ్యేసరికి విత్తనాలు సరఫరా అవుతాయని స్థానిక వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పత్తి, మిర్చి, మొక్కజొన్న విత్తనాలను ప్రైవేటు కంపెనీలు విక్రయిస్తున్నాయి. రైతులు ఎక్కువగా ప్రైవేటు కంపెనీలు విక్రయించే విత్తనాలు కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. 

గింజలు గట్టి పడలేదు.. 
ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు మహదేవ్‌. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రానికి చెందిన ఈయన గతేడాది రబీలో బోరు నీటి ఆధారంగా ఎకరన్నర విస్తీర్ణంలో వరి సాగు చేశాడు. రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. నాలుగు నెలలు గడచినా వరి గింజలు గట్టి పడలేదు. ఉత్తి తాలుగా మారాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా నష్టపరిహారం అందలేదు. శాస్త్రవేత్తలు పరిశీలించినా ఏం లాభం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.




ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు రాథోడ్‌ దేవీదాస్‌. కుమురంభీం జిల్లా రెబ్బెన మండలం గోలేటి గ్రామం. గతేడాది 20 ఎకరాలు కౌలుకు తీసుకుని తొమ్మిదెకరాల్లో బీటీ–3 విత్తనాలతో పత్తి సాగు చేశాడు. మిగతా 11 ఎకరాల్లో బీటీ–2 విత్తనాలు వేశాడు. బీటీ–2 పంట ఆశాజనకంగానే వచ్చింది. కానీ బీటీ–3 దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. బీటీ–3 సాగు కోసం సుమారు రూ.1.8 లక్షల వరకు ఖర్చుచేయగా.. 40 క్వింటాళ్ల దిగుబడే వచ్చింది. ఈ సీజన్‌లో ఏ వ్యవసాయాధికారి కూడా తమకు ఏ విత్తనాలు వాడాలో చెప్పలేదని.. దాంతో తెలిసినవాళ్ల సలహాతో పత్తి విత్తన ప్యాకెట్లను కొనుగోలు చేశానని చెప్పాడు.

అధికారులు సూచనలు ఇవ్వడం లేదు 
గత ఏడాది ఖరీఫ్‌లో పత్తి సాగు చేసి తీవ్రంగా నష్టపోయిన. ప్రభుత్వపరంగా, విత్తన కంపెనీ పరంగా, ఇప్పటి వరకు ఎలాంటి పరిహారం అందలేదు. సీజన్‌ ప్రారంభమైనా ఇప్పటి వరకు విత్తన ఎంపికకు సంబంధించి అధికారులు సలహాలు, సూచనలు ఇవ్వడం లేదు. 
– ఎల్లారం నవాజులు, బాబిల్‌గాం, సదాశివపేట మండలం, సంగారెడ్డి జిల్లా 

కాపు రాని మిర్చి
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన వేమిరెడ్డి వెంకట్రామిరెడ్డి నాలుగెకరాల్లో సాగు చేసేందుకు మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ బంగ్లా, ఖమ్మం జిల్లా వైరాలోని విత్తన దుకాణాల నుంచి మిర్చి విత్తనాలు తెచ్చాడు. ఒక్కో ప్యాకెట్‌కు రూ.350 చొప్పున ఎకరానికి 20 ప్యాకెట్ల చొప్పున రూ.28 వేలు వెచ్చించాడు. కాపు రాలేదు. కొద్ది రోజులు చూసి తోటను తొలగించాడు. రూ.2 లక్షలు నష్టపోయాడు.   
 – వేమిరెడ్డి వెంకట్రామిరెడ్డి, నారాయణపురం, తల్లాడ మండలం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement