నకిలీ పురుగుకు మందేదీ..? | The thosands of farmers are losed with the fake seeds | Sakshi
Sakshi News home page

నకిలీ పురుగుకు మందేదీ..?

Published Sun, Oct 2 2016 5:48 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

నకిలీ పురుగుకు మందేదీ..? - Sakshi

నకిలీ పురుగుకు మందేదీ..?

నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన వేలాది మంది రైతన్నలు

- ఎకరాకు రూ.3 లక్షల చొప్పున.. రూ.500 కోట్ల వరకు నష్టం
- నకిలీ విత్తన విక్రయాలపై నియంత్రణ శూన్యం
- విత్తన ధ్రువీకరణ సంస్థ ఉన్నా ‘అమ్యామ్యా’లకే ప్రాధాన్యం
- బలిపశువులు అవుతున్న రైతన్నలు.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు
 
 ఒకప్పుడు అనావృష్టి, అతివృష్టి కారణంగానో, పండిన పంటకు మద్దతు ధరలు లేకనో రైతులు నష్టపోయే పరిస్థితి. కానీ ఇప్పుడు.. కనీసం పంటను కళ్లజూడలేని దుస్థితి. కారణం నకిలీ.. మట్టిని నమ్ముకుని వేలులక్షల రూపాయలు ధారపోసే రైతన్నలను ఇప్పుడు ఈ నకిలీ పురుగు పట్టి పీడిస్తోంది. వేల ఖర్చుతో మిర్చి విత్తనాలు నారు పోసి.. నాటితే.. మొక్కలు ఏపుగా పెరిగి.. పూత.. కాత లేకపోతే.. దాన్ని చూసి రైతన్న కన్నీరుమున్నీరవుతున్నాడు. ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం.. వెరసి నకిలీ విత్తన కంపెనీలు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది. ఎప్పటిలానే రైతన్న బలిపశువు అవుతున్నాడు. ప్రభుత్వ ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో నకిలీ మిర్చి విత్తనాల వల్ల నష్టపోయిన రైతన్నల పరిస్థితిపై ఈ వారం ఫోకస్..
  - సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, ఖమ్మం/శాంతినగర్/నర్సంపేట
 
 రాష్ట్రంలో నకిలీ విత్తనాల దందా జోరుగా జరుగుతోంది. నకిలీ విత్తనాలను రైతులకు అంటగ ట్టి కంపెనీలు, వ్యాపారులు, డీలర్లు రూ.వందల కోట్లు ఆర్జిస్తున్నారు. కానీ అప్పులు చేసి ఆ విత్తనాలతో సాగు చేసిన రైతు మాత్రం ఇప్పుడు వీధిన పడాల్సి వచ్చింది. ముఖ్యంగా మిరప విత్తనాలను వేసి సాగు చేసిన ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లా రైతులు ఇప్పుడు నిండా మునిగిపోయారు. రూ.కోట్లల్లో నష్టపోయారు. తమకు పరిహారం దక్కకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ కన్నీరుమున్నీరు అవుతున్నారు. నకిలీ విత్తనాలను ముందస్తుగా కట్టడి చేయడంలో వ్యవసాయ శాఖ విఫలం కాగా.. ఇప్పుడు విచారణల పేరుతో కాలయాపన చేస్తోంది. పైగా ఇది తమ తప్పు కాదంటూ చేతులెత్తేస్తోంది. లెసైన్సులు రద్దు చేస్తామని, క్రిమినల్ కేసులు పెడతామని చెప్పిన మాటలే చెబుతోంది. కంటితుడుపు చర్యగా అక్కడక్కడ కొందరు డీలర్లను, వ్యాపారులను అరెస్టు చేస్తోంది. నకిలీలు మార్కెట్లోకి రాకుండా చర్యలు తీసుకోవడంలో వ్యవసాయ యంత్రాంగం మొదటి నుంచీ విఫలమవుతూనే ఉంది.
 
 1.43 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు
 కాయకష్టం చేసి పంట సాగు చేసిన రైతుల శ్రమ వృథా అయింది. విత్తనాలు, పంట సాగు కోసం రూ.కోట్లు ఖర్చు చేశారు. మొక్కలు ఏపుగా పెరిగి రెండు నెలలైనా పూతలేదు.. కాత లేదు. దీంతో తాము నకిలీ విత్తనాలు, నారు సాగుతో నష్టపోయామని గ్రహించిన రైతులు ఆందోళన బాటపట్టారు. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో వేలాది మంది రైతులు మిర్చి పంట సాగుచేసి రూ.500 కోట్ల వరకు నష్టపోయార ని అంచనా. పూత, కాత లేని మిర్చి పంటను పీకేసి పరిహారం కోసం రోడ్డెక్కారు. రాష్ట్రంలో ఈ ఏడాది 1.43 లక్షల ఎకరాల్లో (97%) మిర్చి పంట సాగయింది. గతేడాది క్వింటాలు మిర్చి రూ.13 వేల వరకు ధర పలకడంతో ఈసారి రైతులు పెద్ద ఎత్తున ఆ పంటపై దృష్టి సారించారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 72 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. నకిలీ విత్తనాల కారణంగా ఖమ్మం జిల్లాలో 8 వేల ఎకరాలు, వరంగల్ జిల్లాలో 5 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా. ఈ రెం డు జిల్లాల్లోని మండలాల్లో పూత, కాత లేదని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తూ వ్యవసాయ కార్యాలయాలు, డీలర్ల దుకాణాలు, రో డ్లపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నకిలీ విత్తనాల వల్ల పంట పండే పరిస్థితి లేక ఈ మూడు జిల్లాల్లో రైతులకు రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లి ఉంటుందని చెబుతున్నారు.
 
 20 వేల టన్నుల నాసిరకం విత్తనాలు
 ఈ ఖరీఫ్ సీజన్‌లో 20 వేల టన్నుల మేర మిరప విత్తనాలను రైతులకు కంపెనీలు, వ్యాపారులు, డీలర్లు అంటగట్టారు. ఇలా ఒక్కో వ్యాపారి కోట్లు కూడబెట్టుకున్నాడు. కూసుమంచి మండల కేంద్రంలో ఒక విత్తన, ఎరువుల దు కాణదారుడు కేవలం మిరప విత్తనాలను విక్రయించడం ద్వారా ఏకంగా రూ.60 లక్షలు లాభం పొందాడంటే రైతులను ఏ స్థాయిలో ముంచారో అర్థమవుతుంది. జపాన్‌కు చెందిన సకాట అనే పేరుతో విత్తనాలను పెద్ద ఎత్తున విక్రయించారు. వీటిని అమ్మడానికి ముందు విత్తనాలు రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు అనువైనవా కాదా అనే విషయాన్ని అధికారులు గు ర్తించలేదు. ఇందుకు క్షేత్రస్థాయి పరీక్షలు ఎక్కడైనా జరిగాయా కూడా తెలియదు. ఖమ్మం జిల్లా వైరా కేంద్రంగా ‘గ్రీ న్ వీర 333’ అనే కంపెనీ రైతులకు రూ.10 కోట్ల విలువ చేసే విత్తనాలను అమ్మినట్లు సమాచారం. లెసైన్సు కలిగిన గ్రీ న్ వీర, జీవీ అనే కంపెనీలతోపాటు లెసైన్సు లేని మరో 14 కంపెనీలు మిరప విత్తనాలను విక్రయించి నట్లు తెలిసింది. గ్రీన్ వీర అనే కంపెనీ హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ దగ్గర కొంపల్లి గ్రామం అడ్రస్‌తో పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ కంపెనీకి ఏ ప్రయోగశాలలు లేవని తెలిసింది.
 
 విత్తన ధ్రువీకరణ సంస్థ ఏం చేస్తోంది..?
 రాష్ట్రంలో విత్తనాలను ధ్రువీకరించేందుకు తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ ఉంది. ఇక్కడ నాణ్యమైనవి అని ధ్రువీకరించిన తర్వాతే మార్కెట్లో విక్రయించాలి. కానీ ధ్రువీకరణ చేయించుకోని కంపెనీలు కూడా మార్కెట్లో తమ విత్తనాలను విచ్చలవిడిగా విక్రయించుకుంటున్నాయి. మరోవైపు విత్తనాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసినా.. ఇవేవీ పత్తి, మిరప వంటి విత్తనాల నాణ్యతను పట్టించుకోవడం లేదు. మొత్తం ప్రైవేటు కంపెనీల ఇష్టారాజ్యానికే వదిలేస్తున్నాయి. ఇంకో విచిత్రమేంటంటే రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయిలో అనేకమంది వ్యవసాయాధికారులు కేవలం కమీషన్ల కక్కుర్తిలోనే ఉంటున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇక రాష్ట్రస్థాయిలో లెసైన్సులు కూడా డబ్బులిస్తే ఇచ్చే పరిస్థితి నెలకొందన్న ఆరోపణలున్నాయి. వ్యవసాయ శాఖకు డీఎన్‌ఏ లేబొరేటరీ సౌకర్యం ఉన్నా విత్తన నమూనాలను తీసి పరీక్షించే దిక్కు లేకుండా పోయింది. విత్తనాలపై నియంత్రణకు 2013లో విత్తన బిల్లును రూపొందించినా ఇప్పటికీ దాన్ని చట్టంగా తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైంది.
 
 పూత నిలబడక.. పిందె రాక..
 మహబూబ్‌నగర్ జిల్లా వడ్డేపల్లి మండలం రాజోలి గ్రామానికి చెందిన రైతులు చిలకనాటు కంపెనీకి చెందిన 10668 లాట్ నంబర్ గల 10 గ్రాముల విత్తనాలను రూ.360 నుంచి రూ.420 చొప్పున కొనుగోలు చేశారు. ఎకరానికి 15 నుంచి 20 ప్యాకెట్ల చొప్పున కేవలం విత్తనాలకే ఎకరానికి రూ.8,400 వరకు వెచ్చించారు. కౌలుకు పొలాలు తీసుకుని సాగు చేసిన వారి పెట్టుబడి మరింత పెరిగింది. ఎకరానికి కౌలు రూ.25 వేలతోపాటు పెట్టుబడి రూ.60 వేల వరకు పెట్టినట్లు రైతులు పేర్కొంటున్నారు. నెల రోజులపాటు నారుమళ్లను కంటికి రెప్పలా కాపాడుకున్న రైతులు రెండు నెలల కిందట నాటు పెట్టారు. ఏపుగా పెరుగుతున్న మిరప పంటను చూసి అప్పులు చేసి మరీ లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. తీరా కాపుకు వచ్చే దశలో పూతలు నిలబడక పిందెలు రాకుండా పోయాయి. దీంతో బాధిత రైతులు డీలర్లను సంప్రదించారు. చిలకనాటు కంపెనీ వారిని పిలిచి పరిశీలించగా క్రాసింగ్ సరిగా లేనందున కాయలు నిలబడవని, విత్తనాల ధర కంటే అధికంగా ఇస్తామని చెప్పివెళ్లిపోయారు. వెళ్లిన వారు మళ్లీ తిరిగి రాలేదు. రైతన్నలు చేసేది లేక పంటను తొలగించారు.
 
 జిల్లాలకు శాస్త్రవేత్తలు
 నకిలీ మిర్చి విత్తనాల విషయంపై క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటు చేశాం. వారు ఇప్పటికే ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పర్యటించారు. నల్లగొండ జిల్లాలోనూ పరిశీలిస్తారు. నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టిన విషయాన్ని గుర్తించి సంబంధిత కంపెనీలపై ఆకస్మిక దాడులు నిర్వహించాం. వాటికి లెసైన్సు ఉన్నట్లు తేలింది. వాటిని సీజ్ చేస్తాం.
 - పార్థసారథి, వ్యవసాయ శాఖ కార్యదర్శి
 

 మొలకలు కొని నాటిన..
 నకిలీ విత్తనాల వల్ల మా ఊళ్లో మిరప విత్తనాలు మొలకెత్తలేదు. విధి లేని పరిస్థితిలో డోర్నకల్ మండలం ములకలపల్లిలోని గణేశ్ నర్సరీ నుంచి రూ.1కి మొక్క చొప్పున 50 వేల మొలకలు తెచ్చిన. కొన్ని మొలకలు ఎండిపోతే నర్సరీ వారిని సంప్రదిస్తే 2,700 మొక్కలు ఉచితంగా ఇచ్చారు. మొక్కలు ఎండిపోవడం రోజురోజుకు పెరిగిపోయింది. మళ్లీ 15 వేల మొక్కలు కొనుగోలు చేసి నాటినా పరిస్థితిలో మార్పులేదు.
 - మోర్తాల రాజేందర్, నర్సంపేట
 
 మొక్కలకు డీఎన్‌ఏ టెస్ట్
 - డాక్టర్ సైదయ్య, హార్టికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్త
 నర్సంపేట రూరల్: నకిలీ విత్తనాలతో నష్టపోరుున రైతుల పొలాల్లో మిర్చి మొక్కలకు డీఎన్ ఏ టెస్టు నిర్వహించి, రిపోర్టును ప్రభుత్వానికి అందజేస్తామని, దాని ఆధారంగా సీడ్‌‌స యజమానులపై చర్యలు ఉంటాయని హైదరాబాద్ హార్టికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ సైదయ్య తెలిపారు. శనివారం వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లి గ్రామశివారు ఆకులతండాలో మిర్చి తోటను పరిశీలించారు. కొన్ని మిర్చి షాంపిల్స్ సేకరించారు. జీవా కంపెనీకి చెందిన సీఎస్ 333 గ్రీన్ రా, బేలా కంపెనీకి చెందిన 2205, పెన్నార్ క్యామ్‌సమ్ సీడ్, లక్కీ కంపెనీకి చెందిన అంజనీ సీడ్‌‌స వాడిన రైతులు ఎక్కువ నష్టపోయారని చెప్పారు.
 
 మూడుసార్లు వేసినా అంతే..
 వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలం నందిగామకు చెందిన 32 ఏళ్ల జంగలి రాంబాబు తనకున్న 8 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నాడు. గతేడాది మూడెకరాల్లో మిర్చి వేయగా ఎకరాకు రూ.1.50 లక్షల విలువైన పంట దిగుబడి వచ్చింది. దీంతో అప్పు రూ.4 లక్షలు తీర్చేశాడు. ఆదాయం బాగానే వస్తుందనే ఉద్దేశంతో ఇద్దరు కుమారులను ప్రైవేటు చదువులు చదివిస్తున్నాడు. అయితే కల్తీ విత్తనాలు అతడి ఆశలపై నీళ్లు చల్లారుు. విత్తనాలు వేస్తే మొలకెత్తలేదు. రెండోసారీ అదే పరిస్థితి. మూడోసారి వేయగా.. మొక్కలు బాగానే ఎదిగినప్పటికీ ఇటీవలి భారీ వర్షాలతో పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోరుుంది.దీంతో పిల్లల ఫీజులు చెల్లించలేక, రెండు కిడ్నీలు చెడిపోరుున చెల్లెలికి వైద్యం చేరుుంచలేక సాయం కోసం ఎదురుచూస్తున్నాడు.
 
 మొలకలు కూడా రాలేదు..
 రెండు ఎకరాల్లో మిరప సాగు చేసేందుకు వరంగల్ ఉమామహేశ్వర సీడ్‌‌స షాపులో నాలుగు మైకో, 10 పెన్నార్ విత్తన ప్యాకెట్లను రూ.4,600 కు కొనుగోలు చేసిన. అధిక దిగుబడి వస్తుందనుకున్న పెన్నార్ ఎఫ్1 రకం విత్తనాలు నారు మొలవనేలేదు. కంపెనీ ప్రతినిధులను అడిగితే పరిహారం ఇవ్వలేమంటూ ఆగ్రోస్ కంపెనీ బేలా 2205 రకం 4, నోబల్ 222 రకం 4, పెన్నార్ రకం 4 విత్తన ప్యాకెట్లు ఉచితంగా ఇచ్చారు. కానీ నోబెల్ మినహా మిగిలినవి మొలవలేదు. వ్యాపారులను అడిగితే దిగుబడి రాకుంటే కంపెనీ వారు పరిహారం ఇస్తారని చెపుతున్నారు. అసలు నారే మొలవకపోతే దిగుబడి గురించి మాట్లాడటమేంటో అర్థం కావడం లేదు.
 - మోరె సతీశ్, నందిగామ
 
 ఎకరాకు రూ.3 లక్షల నష్టం
 వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎకరాకు రూ.3 లక్షలకుపైగా నష్టం వాటిల్లింది. ఇక్కడ మొత్తం 13 వేల ఎకరాల్లో నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోయారు. ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తుందా లేదా.. ఇస్తే ఎంత ఇస్తుంది.. ఇచ్చింది సాగు ఖర్చుకైనా సరిపోతుందా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మిర్చి పంట నష్టపోతే ఇన్ పుట్ సబ్సిడీ కింద రూ.12 వేల వరకు చెల్లించారు. అదే  సబ్సిడీ ఇప్పుడు ఇస్తే కూలి ఖర్చులకు కూడా సరిపోవని రైతులు పేర్కొంటున్నారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మిర్చి, పత్తిని వాతావరణ ఆధారిత బీమా కింద తీసుకున్నారు. అయితే వర్షపాతం ఎక్కువగా ఉండి, పూర్తిగా తగ్గిన పరిస్థితుల్లో మిర్చి పంటకు నష్టం వాటిల్లితేనే ఈ బీమా వర్తిస్తుంది. ఎకరాకు రైతులు రూ.4,250 ప్రీమియం చెల్లిస్తే.. బీమా కింద రూ.85 వేలను అందజేస్తారు. ప్రస్తుతం నష్టపోరుున మిర్చి వాతావరణ బీమా పరిధిలోకి రాదు. నకిలీ విత్తనాలతో నష్టపోవడంతో ఇన్ పుట్ సబ్సిడీగా ప్రభుత్వం లేదా పరిహారంగా కంపెనీ.. రైతులకు చెల్లించాల్సిందే తప్ప వేరే దారిలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement