ఎన్నాళ్లీ నిరీక్షణ
⇒ పరిహారం చెల్లింపులో జాప్యం..రైతులకు శాపం
⇒ 200.29 ఎకరాలు సెజ్‌కు కేటాయింపు
ప్రభుత్వం సెజ్‌కు తీసుకున్న భూముల పరిహారం కోసం రైతులు ఐదేళ్లుగా నిరీక్షిస్తున్నారు. సెజ్‌కు కేటాయించిన భూములను సాగు చేసుకోలేక, వ్యవసాయ భూములపై బ్యాంకుల్లో రుణాలు పొందలేక ఇక్కడి రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారు.
పెళ్లకూరు(సూళ్లూరుపేట): మండలంలోని శిరసనంబేడు గ్రామంలో సర్వే నంబరు 278 నుంచి 280లలో 200.29 ఎకరాలను ప్రభుత్వం 2012లో సెజ్‌ల కింద సేకరించగా ఆ భూములకు సంబంధించి రైతులకు పరిహారం నేటికీ అందలేదు. సేకరించిన భూములపై పరిహారం చెల్లించడం కోసం అప్పట్లో పలుమార్లు జిల్లా అధికారులు ఇక్కడి రైతులతో సమావేశం నిర్వహించారు. రైతులు ఎకరానికి రూ.7 లక్షలు పరిహారం కోరారు. పలుమార్లు రైతులతో చర్చించిన అధికారులు చివరకు ఒక ఎకరానికి రూ.5 లక్షలు పరిహారం చెల్లించే విధంగా నిర్ణయించారు. ఈ భూములకు సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలు, వన్‌బీ, అడంగల్‌తోపాటు రైతుల ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డులు తదితర ధృవపత్రాలను అధికారులు తీసుకున్నారు. ఐదేళ్లు కావస్తున్నా అధికారుల నుంచి ఎలాంటి చలనం లేదు. ఆనాటి నుంచి పొలాలు సాగు చేయకపోవడంతో బీడుగా మారాయి.
పెత్తందారుల వల్లే జాప్యం
శిరసనంబేడు గ్రామంలో పెత్తందారుల ఆధిపత్యం వల్లే రైతులకు పరిహారం చెల్లించడంలో జాప్యం జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సర్వే నంబరు 278, 279, 280, 287లలో మొత్తం 200.29 ఎకరాలు మాత్రమే ఉన్నాయి. అయితే కొందరు అధికారులకు ముడుపులు చెల్లించి గ్రామంలో భూములు లేకపోయినా సుమారు 50 ఎకరాలకు పైగా అధికారపార్టీకి చెందిన స్థానికేతరులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయడం గమనార్హం. ఈక్రమంలో తమకు కూడా సెజ్ పరిహారం చెల్లించాలని అధికారపార్టీ నాయకుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. సెజ్‌కు కేటాయించిన భూములను సర్వే చేసిన జిల్లా యంత్రాంగం భూములు లేని పట్టాదారు పాసుపుస్తకాలను పరిహారం చెల్లింపుల్లో చేర్చలేదు.
అలాగే పెత్తందారులు కొందరు పట్టాదారు పాసుపుస్తకాలను స్వాధీనం చేసుకొని చిన్నపాటి మొత్తాలను అప్పుగా చెల్లించి వాటికి అధిక వడ్డీలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈక్రమంలోనే సెజ్ భూములపై చెల్లించే పరిహారంలో భారీ నగదు చెల్లించాలంటూ ఓ మాజీ ఎమ్మెల్యే నుంచి రైతులపై ఒత్తిడి తీసుకొచ్చారు. అధికార పార్టీ నేతలకు తలొగ్గని రైతులు తమ దారికి వచ్చేంత వరకు సెజ్ భూములకు పరిహారం చెల్లించకుండా అధికారులను పెత్తందారులు అడ్డుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందువల్ల అర్హులైన రైతులకు పరిహారం చెల్లించడంలో అధికారులు విఫలమవుతున్నారు.
పనులు లేక అల్లాడుతున్నాం
ప్రభుత్వం సెజ్‌లకు తమ భూములను తీసుకుంది. ఐదేళ్లుగా పరిహారం చెల్లించకుండా పట్టించుకోలేదు. పనులు లేక అల్లాడుతున్నాం.
– మల్లి రాజయ్య, రైతు
పరిహారం త్వరగా చెల్లించాలి
వేరుశనగ, మినుము పంటలు పండించుకుంటూ కుటుంబాలను పోషించుకొనేవాళ్లం. ప్రభుత్వం భూములు తీసుకొని ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి పరిహారం త్వరగా చెల్లించేలా చర్యలు చేపట్టాలి.
– బండి ప్రభాకరయ్య, రైతు
జిల్లా అధికారులు పరిశీలిస్తున్నారు
రైతుల నుంచి సెజ్‌కు తీసుకున్న భూములకు పరిహారం చెల్లించే విషయమై జిల్లా అధికారులు పరిశీలిస్తున్నారు. త్వరలో చర్యలు చేపడతారు.
– శీనానాయక్,ఆర్డీవో, నాయుడుపేట