వ్యవసాయ యంత్రాల సబ్సిడీకీ కోత!
- బీసీ, ఓసీ రైతులకిచ్చే సబ్సిడీ
- 50 నుంచి 20 శాతానికి తగ్గిస్తూ ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: రైతులకు సూక్ష్మసేద్యం పరికరాలపై సబ్సిడీని తగ్గించాలని నిర్ణరుుంచిన వ్యవసాయశాఖ.. తాజాగా వ్యవసాయ యంత్రాలపైనా వివిధ వర్గాలకు ఇస్తున్న సబ్సిడీని తగ్గించేందుకు సిద్ధమైంది. వ్యవసాయ యంత్రాలపై బీసీలు, ఓసీలు, ఇతర వర్గాలకు ప్రస్తుతం ఇస్తున్న 50 శాతం సబ్సిడీని 20 శాతానికి తగ్గించాలని ప్రతిపాదనలు తయారుచేసింది. ఇటీవల వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో.. ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేసినట్లు తెలిసింది. ఇక ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న 95 శాతం సబ్సిడీని కూడా ఎంత మేరకు తగ్గించాలన్న అంశంపైనా తర్జనభర్జన పడినట్లు తెలిసింది. వ్యవసాయశాఖ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం లభించగానే సబ్సిడీ కోతలు అమల్లోకి రానున్నారుు.
నిధుల కొరత వల్లే..!
తక్కువ సబ్సిడీ ఇచ్చి ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాలన్నది తమ ఉద్దేశమని ప్రభుత్వం చెబుతున్నా... వాస్తవంగా నిధుల కొరత వల్లే సబ్సిడీకి కోత పెడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది వ్యవసాయ యాంత్రీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కలిపి రూ.423 కోట్లు కేటారుుంచారని వ్యవసాయ అధికారి ఒకరు తెలిపారు. అరుుతే అందులో ఇప్పటివరకు రూ.86 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని, మొత్తం 50 వేల మంది రైతులకు అందజేశారని వెల్లడించారు. మిగతా సొమ్మును కూడా పూర్తిస్థారుులో విడుదల చేసే పరిస్థితి లేదని సమాచారం. అందువల్ల సబ్సిడీలో కోత విధించాలని వ్యవసాయశాఖ ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు సమాచారం.
నష్టపోనున్న రైతులు
ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తుండడంతో రైతులు మెల్లమెల్లగా యాంత్రీకరణ వైపు మళ్లుతున్నారు. సబ్సిడీ తగ్గిస్తే అది ఎస్సీ, ఎస్టీలు, ఇతర పేద రైతులకే నష్టంగా పరిణమించనుంది. ఉదాహరణకు స్ప్రేయర్ల ధర మార్కెట్లో రూ.16 వేలకు అటూఇటూగా ఉండగా.. ఇప్పటివరకు 50 శాతం సబ్సిడీతో రూ.8 వేలకు పొందే అవకాశం రైతులకు ఉంది. కానీ సబ్సిడీని 20 శాతానికే పరిమితం చేస్తే రూ.12,800కు కొనుగోలు చేయాలి. ఇది సన్న, చిన్నకారు రైతులకు భారంగా మారుతుంది. ఇక పవర్ టిల్లర్ సుమారు రూ.1.30 లక్షలుండగా.. 50శాతం సబ్సిడీతో రూ.65 వేలకు ఇస్తున్నారు. సబ్సిడీని 20 శాతానికే పరి మితం చేస్తే రైతులు రూ.1.04లక్షలు కట్టాల్సి వస్తుంది. ఇలా అనేక పరికరాలపై ఉన్న సబ్సిడీకి కోత వేయనున్నారు. చెరుకు నరికే యం త్రం ధర రూ.కోటిన్నర వరకు ఉంది. దీనిపై ఇచ్చే సబ్సిడీనీ 20 శాతానికి తగ్గిస్తున్నారు. పైగా వీటిని జిల్లాకు ఒకటి మాత్రమే ఇవ్వాలని తాజాగా నిర్ణరుుంచారు.