సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిషేధిత బీజీ–3 పత్తి విత్తన దందా జోరుగా సాగుతోంది. సీజన్ మొదలు కావడంతో పలు విత్తన కంపెనీలు బీజీ–3 విత్తనాలను అన్నదాతలకు అంటగట్టే పనిలో నిమగ్నమయ్యాయి. ఎరువులు, విత్తన దుకాణాల్లో నేరుగా అమ్మడం సాధ్యం కాకుంటే ఇతరత్రా పద్ధతులను అనుసరిస్తున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా అనేకచోట్ల కిరాణా దుకాణాల్లో బీజీ–3 విత్తనాలను విక్రయిస్తున్నట్లు వ్యవసాయ శాఖకు ఫిర్యాదులందాయి. కొన్నిచోట్ల బడ్డీ కొట్లూ బీజీ–3కి అడ్డాలుగా మారాయి. ఇటీవల జరిగిన దాడుల్లో కిరాణా షాపుల్లో విత్తనాలను సీజ్ చేసినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. బీజీ–3 విత్తనాలను ప్యాకెట్లలో కాకుండా లూజ్‌గా గ్రాముల వారీగా అమ్ముతున్నారు. 450 గ్రాముల విత్తనాల ధర రూ.800 వరకు రైతులకు అంటగడుతున్నారు. బీజీ–3, బీజీ–2 విత్తనాలను పక్కన పెట్టి చూస్తే రెండింటి మధ్యì తేడాను గుర్తించలేం. దీంతో ఏది నిషేధిత విత్తనమో అర్థంగాక రైతులు అయోమయంలో పడిపోతున్నారు. గత్యంతరం లేక వ్యాపారులు ఇచ్చిందే కొనుగోలు చేసి విత్తుకుంటున్నారు.
గతేడాదీ ఇంతే
గతేడాది నకిలీ, అనుమతి లేని అన్ని రకాల విత్తనాలు వెల్లువెత్తాయి. గత ఖరీఫ్‌లో రైతులు 47 లక్షల ఎకరాలకుపైగా పత్తి సాగు చేశారు. దేశవ్యాప్తంగా బీటీ–2 పత్తి విత్తనాలకు మాత్రమే అనుమతి ఉంది. వాటి లోనూ నకిలీ విత్తనాలు వెలుగుచూశాయి. వ్యవసాయ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2.37 లక్షల నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లను సీజ్ చేశారు. వాటి విలువ రూ.15.19 కోట్లు. అయితే ఇంతస్థాయిలో నకిలీ విత్త నాలు మార్కెట్లోకి వచ్చి చేరుతుంటే, ఎందుకు ముందస్తుగా గుర్తించలేదన్న అనుమానాలు తలెత్తుతున్నా యి. అనుమతిలేని బీటీ–3 పత్తి విత్తనాలను కంపెనీ లు అక్రమంగా సరఫరా చేశాయి. దాదాపు 10 లక్షల ఎకరాల్లో బీటీ–3 విత్తనాలు వేసినట్లు అంచనా. గత ఖరీఫ్‌లో విత్తనాలు విక్రయించే వరకు చోద్యం చూసిన వ్యవసాయ శాఖ తనిఖీలు చేసి పట్టుకోవడం వరకే పరిమితమైంది. తనిఖీల్లో అనేకచోట్ల కంపెనీలు కొందరు వ్యవసాయాధికారులకు ముడుపులు చెల్లించి తమ దందా కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
20 లక్షల ప్యాకెట్లు: గతేడాది 79.15 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు రైతులకు విక్రయించగా, 2018–19 ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నందున 1.05 కోట్ల విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ పేర్కొంది. మొత్తం 43 కంపెనీలకు పత్తి విత్తనాలను సరఫరా చేసే బాధ్యతను సర్కారు అప్పగించింది. అందులో అత్యధికంగా రాశి విత్తన కంపెనీ 17.23 లక్షల ప్యాకెట్లు, ఆ తర్వాత కావేరీ విత్తన కంపెనీ 16.25 లక్షల ప్యాకెట్లు, నూజివీడు విత్తన కంపెనీ 13.17 లక్షల ప్యాకెట్లు సరఫరా చేస్తాయి. అయితే బీజీ–2తోపాటు అనేక కంపెనీలు దాదాపు 20 లక్షల ప్యాకెట్ల వరకు బీజీ–3 పత్తి విత్తనాలను ఇప్పటికే రంగంలోకి దింపాయన్న చర్చ జరుగుతోంది. కంపెనీలు ఆ మేరకు రైతులకు అంటగడుతున్నాయి.
గ్లైఫోసేట్‌ను నిషేధించని సర్కారు
రాష్ట్రంలో రెండేళ్లుగా రైతులు పండిస్తున్న పత్తి చేలల్లో బీజీ–3 ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. ఈ విషయాన్ని కేంద్ర శాస్త్రవేత్తల బృందం కూడా ధ్రువీకరించింది. ఇక ‘గ్లైఫోసేట్’అనే కలుపు మందును కేవలం తేయాకు తోటల్లో వేయడానికే దేశంలో అనుమతి ఉంది. ఇతర పంటలకు ఏమాత్రం వాడకూడదని కేంద్రం తేల్చి చెప్పింది. అయితే బీజీ–3 పత్తి పంటలో కలుపు నివారణకు ఈ మందునే వాడాల్సి ఉంది. అనుమతి లేకుండా బీజీ–3 వేయడమే పెద్ద తప్పు. అదీగాక బీజీ–3 వేసిన రైతులు తప్పనిసరిగా గ్లైఫోసేట్‌ను కొనుగోలు చేస్తారు. ‘గ్లైఫోసేట్’ను బీజీ–3 పత్తికి వేస్తే, ఇతర పంటలపై ప్రభావం చూపుతుంది. అవి విషపూరితమవుతాయి. అవి తిన్న ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. ఆ పురుగు మందుతో జీవవైవిధ్యానికి తీవ్ర ముప్పు కలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణం కలుషితమవుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘గ్లైఫోసేట్’ కలుపు మందును నిషేధించాల్సి ఉండగా, ఇప్పటికీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలేదు. గ్లైఫోసేట్‌ను మార్కెట్లో అనుమతిస్తున్నారంటే బీజీ–3కి రాష్ట్ర వ్యవసాయ శాఖ పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లేనంటూ చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment