ఎరువు.. బరువు
ఒంగోలు టూటౌన్ : సాగుకు ఏటేటా కష్టాలు, నష్టాలే ఎదురవుతున్నాయి. నకిలీ విత్తనాలు, రోజురోజుకూ పెరుగుతున్న ఎరువుల ధరలు, గిట్టుబాటు ధరల లేమితో రైతులు సతమతమవుతున్నారు. గత నాలుగేళ్లలో డీఏపీ మూడొంతులు పెరిగింది. ఈ ఏడు మార్చి నెలలో కేంద్రం యూరియా ధరను అమాంతం పెంచింది. పెరిగిన ధరలకు తోడు వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. జిల్లాకు ఏటేటా కోటా మేర ఎరువులు కేటాయించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోంది. నామమాత్రపు కేటాయింపులతో సరిపెడుతుండటంతో వ్యవసాయం భారమవుతోంది. పెరిగిన ఎరువుల ధరలతో జిల్లా రైతులపై ఏడాదికి రూ.50 కోట్ల వరకు అదనపు భారం పడింది.
పురుగు మందులదీ అదే పరిస్థితి...
మరోపక్క పురుగు మందుల ధరలు ఏ ఏటికాయేడు పెరిగిపోతున్నాయి. మోనోక్రొటోపాస్ లీటరుకు రూ.50 పెరిగింది. కలుపు మందుల ధరలూ ఇదే రీతిన పెరిగాయి. ఫలితంగా రైతులపై 20 నుంచి 30 శాతం వరకు అదనపు భారం పడింది.
లక్ష్యానికి దూరంగా ఖరీఫ్ సాగు
వర్షాలు సకాలంలో కురవకపోవడంతో ఖరీఫ్ పరిస్థితి తారుమారైంది. ఒక పక్క నైరుతీ రుతుపవనాల జాడలేక.. మరో పక్క ఎల్‌నినో ప్రభావంతో మండుతున్న ఎండలు రైతులను అయోమయంలో పడేశాయి. ఖరీఫ్ లక్ష్యం 2.30 లక్షల హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 19,854 హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలు సాగయ్యాయి. వరి 20 హెక్టార్లలో, జొన్న నామమాత్రంగా సాగైంది. పచ్చపెసర 494 హెక్టార్లు, మినుములు 449 హెక్టార్లు, వేసవి పత్తి 14,216 హెక్టార్లలో సాగు చేశారు. అదే విధంగా వేరుశనగ 616 హెక్టార్లు, కూరగాయలు 1,820 హెక్టార్లలో సాగైంది. మొత్తం మీద 19,854 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. అసలే గిట్టుబాటు ధరలు రాక అల్లాడుతున్న రైతులకు మూలిగే నక్కపై తాటికాయపడిన చందంగా ఎరువులు, పురుగు మందుల ధరలు పెరిగి నడ్డి విరిచాయి.