the cost price
-
బియ్యం ‘ధర’వు.. బతుకు బరువు
పెరుగుతున్న బియ్యం ధరలతో బెంబేలెత్తుతున్న వినియోగదారులు జంగారెడ్డిగూడెం : నెలనెలా పెరుగుతున్న బియ్యం ధరలతో పేదలు విలవిల్లాడుతున్నారు. వచ్చే ఆదాయంలో మూడోవంతు బియ్యం కొనుగోలుకే పోతోందని, దీనికి దీటుగా పచారీ సరుకుల ధరలు కూడా పెరగడంతో బతుకు బండి నడవడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులమ్మే ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంలో చేతులెత్తేసిన సర్కారు.. బియ్యం ధరలను నియంత్రించడంలో కూడా తన చేతకానితనాన్ని చాటుకుంటోంది. దీంతో మింటికెగసిన ధరలతో తమ ఇంటి బడ్జెట్ తల్లకిందులవుతోందని సామాన్యులు వాపోతున్నారు. బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మిల్లర్లు, వ్యాపారుల మధ్య సమన్వయం కుదర్చడంలో ప్రభుత్వం విఫలం కావడంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాంబ మసూరి, పీఎల్, 1001, స్వర్ణ రకాలను వినియోగదారులు వారి స్థాయిలను బట్టి కొనుగోలు చేస్తుంటారు. రేట్లు భారీగా ఉండటంతో మధ్యతరగతి ప్రజలు బియ్యం కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. పీఎల్ 1వ రకం కేజీ రూ. 30, 25 కేజీల బస్తా రూ. 750, దీనినే కేజీ రూ. 31కి కూడా అమ్ముతున్నారు. పీఎల్ 2వ రకం 25 కేజీల బస్తా రూ.650, 1001 రకం కేజీ రూ. 22, 25 కేజీల బస్తా రూ.550, సాంబ కేజీ రూ. 47, 25 కేజీల బస్తా రూ. 1,150 నుంచి రూ. 1200 వరకు వ్యాపారులు అమ్ముతున్నారు. భారీగా పెరిగిన బియ్యం ధరలతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడితే వచ్చే కూలి సొమ్ములో బియ్యం కొనుగోలుకే చాలావరకు పోతోందని, నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు సొమ్ములు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటిన తరుణంలో బియ్యం రేట్లు కూడా పైకే చూడటంతో ఒకపూట కూడా కడుపు నిండా అన్నం తినే పరిస్థితి ఉండటం లేదని పేదవర్గాల వారు వాపోతున్నారు. అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులు ధాన్యాన్ని అమ్మితే గిట్టుబాటు ధర రావడం లేదు. రైతులు పంటలు వేసి అప్పులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు. వరి పండించిన రైతులు సైతం షాపులకెళ్లి బియ్యం బస్తా కొనాలంటే కళ్లంటా నీళ్లు వస్తున్నాయని పేర్కొంటున్నారు. తాము పండించిన పంట అమ్మకానికి వచ్చినప్పుడు ధర ఉండటం లేదని, తీరా తాము బియ్యం కొనుక్కోవాల్సి సమయంలో ధరలు అందుబాటులో లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రోజురోజుకు పెరుగుతున్న బియ్యం ధరలను అదుపు చేసి సామాన్యుడు అన్నం తినే విధంగా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. -
ఎరువు.. బరువు
ఒంగోలు టూటౌన్ : సాగుకు ఏటేటా కష్టాలు, నష్టాలే ఎదురవుతున్నాయి. నకిలీ విత్తనాలు, రోజురోజుకూ పెరుగుతున్న ఎరువుల ధరలు, గిట్టుబాటు ధరల లేమితో రైతులు సతమతమవుతున్నారు. గత నాలుగేళ్లలో డీఏపీ మూడొంతులు పెరిగింది. ఈ ఏడు మార్చి నెలలో కేంద్రం యూరియా ధరను అమాంతం పెంచింది. పెరిగిన ధరలకు తోడు వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. జిల్లాకు ఏటేటా కోటా మేర ఎరువులు కేటాయించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోంది. నామమాత్రపు కేటాయింపులతో సరిపెడుతుండటంతో వ్యవసాయం భారమవుతోంది. పెరిగిన ఎరువుల ధరలతో జిల్లా రైతులపై ఏడాదికి రూ.50 కోట్ల వరకు అదనపు భారం పడింది. పురుగు మందులదీ అదే పరిస్థితి... మరోపక్క పురుగు మందుల ధరలు ఏ ఏటికాయేడు పెరిగిపోతున్నాయి. మోనోక్రొటోపాస్ లీటరుకు రూ.50 పెరిగింది. కలుపు మందుల ధరలూ ఇదే రీతిన పెరిగాయి. ఫలితంగా రైతులపై 20 నుంచి 30 శాతం వరకు అదనపు భారం పడింది. లక్ష్యానికి దూరంగా ఖరీఫ్ సాగు వర్షాలు సకాలంలో కురవకపోవడంతో ఖరీఫ్ పరిస్థితి తారుమారైంది. ఒక పక్క నైరుతీ రుతుపవనాల జాడలేక.. మరో పక్క ఎల్‌నినో ప్రభావంతో మండుతున్న ఎండలు రైతులను అయోమయంలో పడేశాయి. ఖరీఫ్ లక్ష్యం 2.30 లక్షల హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 19,854 హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలు సాగయ్యాయి. వరి 20 హెక్టార్లలో, జొన్న నామమాత్రంగా సాగైంది. పచ్చపెసర 494 హెక్టార్లు, మినుములు 449 హెక్టార్లు, వేసవి పత్తి 14,216 హెక్టార్లలో సాగు చేశారు. అదే విధంగా వేరుశనగ 616 హెక్టార్లు, కూరగాయలు 1,820 హెక్టార్లలో సాగైంది. మొత్తం మీద 19,854 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. అసలే గిట్టుబాటు ధరలు రాక అల్లాడుతున్న రైతులకు మూలిగే నక్కపై తాటికాయపడిన చందంగా ఎరువులు, పురుగు మందుల ధరలు పెరిగి నడ్డి విరిచాయి. -
రైతు బంద్
జిల్లాలో పడకేసిన రైతు బంధు పథకం పౌరసరఫరాల శాఖ సేవలో తరిస్తున్న మార్కెటింగ్ శాఖ జిల్లాలో 21 ప్రభుత్వ గోదాములు ఖాళీ నష్టపోతున్న అన్నదాతలు సాక్షి, విశాఖపట్నం: పండించిన పంటకు గిట్టుబాటు ధర పలికే వరకు వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసి ఆ తర్వాత విక్రయిస్తేనే అన్నదాతల కు కాస్తోకూస్తో లాభం మిగిలేది. ఇదే ఉద్దేశంతో పుట్టిన రైతుబంధు పథకం ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం కారణంగా పడకేసింది. మార్కెట్లో రేటు పెరిగినప్పుడు దాచిన ఉత్పత్తులను విక్రయించుకునేలా ప్రభుత్వం రైతులను చైతన్యం చేయకపోవడంతో ఏటా గిట్టుబాటు లేకున్నా తక్కువధరకే పంటలు విక్రయిస్తూ వారు నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మొద్దునిద్ర వీడకుండా రైతుల వ్యవసాయ ఉత్పత్తులను దాచి ఉంచాల్సిన 21 గోదాములను పౌరసరఫరాలశాఖకు అప్పగించి కళ్లుమూసుకున్నారు. అన్నదాతలంటే అలుసే... జిల్లాలో వరి, మొక్కజొన్న, పసుపు,మిరియాలు, జొన్న తదితర పంటలు పుష్కలంగా 98 పండుతాయి. ఈ ఆహార,వాణిజ్య,ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు బహిరంగ మార్కెట్లో మంచి ధర పలకనప్పుడు వాటిని కొంతకాలం నిల్వ ఉంచి తిరిగి మార్కెట్ ఆశాజనకంగా ఉన్నప్పుడు విక్రయిస్తే వారికి కాసిన్ని కాసులు మిగులుతాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఉద్దేశం ఇదే. ఇందుకుగాను రైతులు తమ ఉత్పత్తులను నిల్వ ఉంచుకునేందుకు మార్కెటింగ్‌శాఖ ఆయా ప్రాంతాల్లో గోదాములు ఇస్తుంది. ఇందులో రైతులు తమ ఉత్పత్తులను మూడు నెలల వరకు ఉచితంగా నిల్వ ఉంచుకోవచ్చు. పైగా ఈసమయంలో నిల్వ ఉంచిన పంట విలువ ఆధారంగా ప్రభుత్వం రుణం కూడా ఇస్తుంది. ఇన్ని సౌకర్యాలున్నా పథకం మాత్రం జిల్లాలో అన్నదాతలకు ఏమాత్రం అక్కరకు రావడంలేదు. పథకం పాతదే అయినా అధికారులు ఎప్పటికప్పుడు రైతుల్లో అవగాహన కల్పించే ప్రయత్నా లు చేయడం లేదు. దీంతో అంగట్లో గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉన్నా అది తెలియక అన్నదాతలు పథకం ప్రయోజనాలకు దూరమై పోతున్నారు. ప్రసుత్తం జిల్లాలో 21 భారీ గోదాములున్నాయి. కాని వీటిలో అన్నదాతల ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నవి లేవనే చెప్పాలి.రైతులు ఎలాగూ వీటిని వాడుకోవడం లేదనే సాకుతో మార్కెటింగ్ శాఖ అధికారులు వీటిని వేరే శాఖ అవసరాలకు అప్పగించేస్తున్నారు. రికార్డుల్లో మాత్రం వ్యవసాయ ఉత్పత్తులతో గోదాములు ఖాళీగా లేవని చూపిస్తున్నారు. ఫలితంగా రైతుల వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ ఉంచాల్సిన గోదాముల్లో ఇప్పుడు బియ్యం,పప్పులు,నూనెలు దాస్తున్నారు. వీటిలో ఉత్పత్తులను దాచుకోవడానికి ముందుకు వచ్చే రైతులకు ఇచ్చే రుణసదుపాయాన్ని గతేడాది రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు పెంచారు. అయినా అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు ఇవన్నీ వివరించకపోవడంతో ఈ పథకం నిరుపయోగమవుతోంది. అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, పాయకరావుపేట తదితర ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న, ఇతర కూరగాయలు పండించే రైతుల పరిస్థితి దారుణంగా మారింది.