రైతు బంద్
- జిల్లాలో పడకేసిన రైతు బంధు పథకం
- పౌరసరఫరాల శాఖ సేవలో తరిస్తున్న మార్కెటింగ్ శాఖ
- జిల్లాలో 21 ప్రభుత్వ గోదాములు ఖాళీ
- నష్టపోతున్న అన్నదాతలు
సాక్షి, విశాఖపట్నం: పండించిన పంటకు గిట్టుబాటు ధర పలికే వరకు వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసి ఆ తర్వాత విక్రయిస్తేనే అన్నదాతల కు కాస్తోకూస్తో లాభం మిగిలేది. ఇదే ఉద్దేశంతో పుట్టిన రైతుబంధు పథకం ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం కారణంగా పడకేసింది. మార్కెట్లో రేటు పెరిగినప్పుడు దాచిన ఉత్పత్తులను విక్రయించుకునేలా ప్రభుత్వం రైతులను చైతన్యం చేయకపోవడంతో ఏటా గిట్టుబాటు లేకున్నా తక్కువధరకే పంటలు విక్రయిస్తూ వారు నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మొద్దునిద్ర వీడకుండా రైతుల వ్యవసాయ ఉత్పత్తులను దాచి ఉంచాల్సిన 21 గోదాములను పౌరసరఫరాలశాఖకు అప్పగించి కళ్లుమూసుకున్నారు.
అన్నదాతలంటే అలుసే...
జిల్లాలో వరి, మొక్కజొన్న, పసుపు,మిరియాలు, జొన్న తదితర పంటలు పుష్కలంగా 98 పండుతాయి. ఈ ఆహార,వాణిజ్య,ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు బహిరంగ మార్కెట్లో మంచి ధర పలకనప్పుడు వాటిని కొంతకాలం నిల్వ ఉంచి తిరిగి మార్కెట్ ఆశాజనకంగా ఉన్నప్పుడు విక్రయిస్తే వారికి కాసిన్ని కాసులు మిగులుతాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఉద్దేశం ఇదే. ఇందుకుగాను రైతులు తమ ఉత్పత్తులను నిల్వ ఉంచుకునేందుకు మార్కెటింగ్‌శాఖ ఆయా ప్రాంతాల్లో గోదాములు ఇస్తుంది.
ఇందులో రైతులు తమ ఉత్పత్తులను మూడు నెలల వరకు ఉచితంగా నిల్వ ఉంచుకోవచ్చు. పైగా ఈసమయంలో నిల్వ ఉంచిన పంట విలువ ఆధారంగా ప్రభుత్వం రుణం కూడా ఇస్తుంది. ఇన్ని సౌకర్యాలున్నా పథకం మాత్రం జిల్లాలో అన్నదాతలకు ఏమాత్రం అక్కరకు రావడంలేదు. పథకం పాతదే అయినా అధికారులు ఎప్పటికప్పుడు రైతుల్లో అవగాహన కల్పించే ప్రయత్నా లు చేయడం లేదు. దీంతో అంగట్లో గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉన్నా అది తెలియక అన్నదాతలు పథకం ప్రయోజనాలకు దూరమై పోతున్నారు.
ప్రసుత్తం జిల్లాలో 21 భారీ గోదాములున్నాయి. కాని వీటిలో అన్నదాతల ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నవి లేవనే చెప్పాలి.రైతులు ఎలాగూ వీటిని వాడుకోవడం లేదనే సాకుతో మార్కెటింగ్ శాఖ అధికారులు వీటిని వేరే శాఖ అవసరాలకు అప్పగించేస్తున్నారు. రికార్డుల్లో మాత్రం వ్యవసాయ ఉత్పత్తులతో గోదాములు ఖాళీగా లేవని చూపిస్తున్నారు. ఫలితంగా రైతుల వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ ఉంచాల్సిన గోదాముల్లో ఇప్పుడు బియ్యం,పప్పులు,నూనెలు దాస్తున్నారు.
వీటిలో ఉత్పత్తులను దాచుకోవడానికి ముందుకు వచ్చే రైతులకు ఇచ్చే రుణసదుపాయాన్ని గతేడాది రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు పెంచారు. అయినా అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు ఇవన్నీ వివరించకపోవడంతో ఈ పథకం నిరుపయోగమవుతోంది. అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, పాయకరావుపేట తదితర ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న, ఇతర కూరగాయలు పండించే రైతుల పరిస్థితి దారుణంగా మారింది.