పెరుగుతున్న బియ్యం ధరలతో బెంబేలెత్తుతున్న వినియోగదారులు
జంగారెడ్డిగూడెం : నెలనెలా పెరుగుతున్న బియ్యం ధరలతో పేదలు విలవిల్లాడుతున్నారు. వచ్చే ఆదాయంలో మూడోవంతు బియ్యం కొనుగోలుకే పోతోందని, దీనికి దీటుగా పచారీ సరుకుల ధరలు కూడా పెరగడంతో బతుకు బండి నడవడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులమ్మే ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంలో చేతులెత్తేసిన సర్కారు.. బియ్యం ధరలను నియంత్రించడంలో కూడా తన చేతకానితనాన్ని చాటుకుంటోంది. దీంతో మింటికెగసిన ధరలతో తమ ఇంటి బడ్జెట్ తల్లకిందులవుతోందని సామాన్యులు వాపోతున్నారు.
బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మిల్లర్లు, వ్యాపారుల మధ్య సమన్వయం కుదర్చడంలో ప్రభుత్వం విఫలం కావడంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాంబ మసూరి, పీఎల్, 1001, స్వర్ణ రకాలను వినియోగదారులు వారి స్థాయిలను బట్టి కొనుగోలు చేస్తుంటారు. రేట్లు భారీగా ఉండటంతో మధ్యతరగతి ప్రజలు బియ్యం కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. పీఎల్ 1వ రకం కేజీ రూ. 30, 25 కేజీల బస్తా రూ. 750, దీనినే కేజీ రూ. 31కి కూడా అమ్ముతున్నారు.
పీఎల్ 2వ రకం 25 కేజీల బస్తా రూ.650, 1001 రకం కేజీ రూ. 22, 25 కేజీల బస్తా రూ.550, సాంబ కేజీ రూ. 47, 25 కేజీల బస్తా రూ. 1,150 నుంచి రూ. 1200 వరకు వ్యాపారులు అమ్ముతున్నారు. భారీగా పెరిగిన బియ్యం ధరలతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు.
రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడితే వచ్చే కూలి సొమ్ములో బియ్యం కొనుగోలుకే చాలావరకు పోతోందని, నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు సొమ్ములు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటిన తరుణంలో బియ్యం రేట్లు కూడా పైకే చూడటంతో ఒకపూట కూడా కడుపు నిండా అన్నం తినే పరిస్థితి ఉండటం లేదని పేదవర్గాల వారు వాపోతున్నారు.
అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి
ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులు ధాన్యాన్ని అమ్మితే గిట్టుబాటు ధర రావడం లేదు. రైతులు పంటలు వేసి అప్పులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు. వరి పండించిన రైతులు సైతం షాపులకెళ్లి బియ్యం బస్తా కొనాలంటే కళ్లంటా నీళ్లు వస్తున్నాయని పేర్కొంటున్నారు.
తాము పండించిన పంట అమ్మకానికి వచ్చినప్పుడు ధర ఉండటం లేదని, తీరా తాము బియ్యం కొనుక్కోవాల్సి సమయంలో ధరలు అందుబాటులో లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రోజురోజుకు పెరుగుతున్న బియ్యం ధరలను అదుపు చేసి సామాన్యుడు అన్నం తినే విధంగా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.