సాక్షి, హైదరాబాద్: సన్న బియ్యం సామాన్యులు కొనలేని పరిస్థితి దాపురించింది. దిగుబడి తగ్గడం ఒక కారణమైతే... మిల్లర్లే ఎక్కువగా కొనుగోలు చేయడం మరో కారణం. రిటైల్ మార్కెట్‌లో నాణ్యతను బట్టి పాత సన్న బియ్యం ధర క్వింటాల్‌కు రూ.6 వేల నుంచి 8వేల వరకు ఉండడం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా వచ్చిన వానాకాలం బియ్యాన్ని కూడా రూ.6వేలకు క్వింటాల్ చొప్పున విక్రయిస్తున్నారు. హైపర్ మార్కెట్లు, సూపర్ బజార్లలో సైతం బియ్యం ధరలు సామాన్య, మధ్య తరగతి వర్గాలను బెంబేలెత్తిస్తున్నాయి.
జై శ్రీరామ్ క్వింటాల్‌కు రూ.7,800 వరకు
సన్నబియ్యంలో అగ్రగామిగా చెప్పుకునే జైశ్రీరాం రకం పాత బియ్యం ధర నాలుగు రోజుల క్రితం క్వింటాల్‌కు రూ. 7,800 వరకు రిటైల్ మార్కెట్‌లో పలికింది. తర్వాత రూ. 200 వరకు తగ్గినా, మళ్లీ ధర పెరిగింది. మంగళవారం రూ. 7,500 నుంచి రూ. 7,800 వరకు రిటైల్ మార్కెట్‌లో అమ్మినట్టు సమాచారం. హెచ్‌ఎంటీ రకం బియ్యం(పాతవి) రూ.7,200 వరకు, కొత్తవి రూ.6,500 నుంచి 7,000 వరకు రిటైల్ మార్కెట్‌లో అమ్ముతున్నారు. బీపీటీ, ఆర్‌ఎన్‌ఆర్, తెలంగాణ సోనాలను రూ. 5,500 నుంచి 6,500 వరకు అమ్ముతున్నారు.
దొడ్డు బియ్యం అంతంతే
దొడ్డు బియ్యం ధర క్వింటాల్ రూ.4,500 నుంచి ఉన్నా, వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఇదే పరిస్థితి నెలకొంది.
రాష్ట్రంలో పెరగని సన్నాల దిగుబడి
రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో 80 శాతానికి పైగా దొడ్డు రకాలైన 1010, 1001, 1061, ఐఆర్ 64, తెల్లహంస వంటి వరి రకాలనే ఎక్కువగా పండిస్తారు. ఉత్తర తెలంగాణలో యాసంగిలో సన్న రకాలు పండే పరిస్థితి ఏమాత్రం లేదు. దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్, ఖమ్మంలలో అదే పరిస్థితి. మిర్యాలగూడ, సూర్యాపేట వంటి ప్రాంతాల్లో కొన్నిచోట్ల సన్నాలు పండించినా, సొంత అవసరాలకే వినియోగిస్తారు. ఇక వానాకాలం సీజన్‌లో నిజామాబాద్ మినహా ఉత్తర తెలంగాణలో రైతులు తమ పొలాల్లో సంవత్సరకాలం తిండి అవసరాలు, స్థానిక అవసరాలకు మాత్రమే సన్న రకాలను పండించి, దొడ్డు వరి వైపే మొగ్గు చూపుతారు.
నిజామాబాద్, నల్లగొండ ఉమ్మడి జిల్లాలతో పాటు మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మాత్రమే ఖరీఫ్ సీజన్‌లో సన్నాలు ఎక్కువగా పండిస్తారు. సన్నాలను బియ్యంగా మార్చి విక్రయించే రైతులు కొందరైతే , సన్న ధాన్యాన్ని మిల్లర్లకు విక్రయించే వారు ఎక్కువ మంది. అయితే ఈసారి వానాకాలం సీజన్‌లో నాగార్జునసాగర్ కింద పంట తక్కువగా రావడంతో సన్నాలకు డిమాండ్ పెరిగింది. దీనికి తోడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద కూడా వాతావరణ ప్రతికూల పరిస్థితులతో సన్న ధాన్యాన్ని తెగులు సోకినట్టు రైతులు చెబుతున్నారు. దీంతో ఇక్కడ కూడా కొంత పంట దెబ్బతింది. కేవలం బోర్లు, కరెంటు మోటార్ల కింద పండిన పంట మాత్రమే ఎక్కువ దిగుబడి వచ్చింది.
మార్కెట్‌కు వచ్చిన ధాన్యం 43 ఎల్‌ఎంటీ మాత్రమే
రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్‌లో 99 మెట్రక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసినా, ఇప్పటివరకు వచ్చిన ధాన్యం 43 ఎల్‌ఎంటీ మాత్రమే మరో 2 ఎల్‌ఎంటీ ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాలకు వచ్చే పరిస్థితి లేదు. గత యాసంగిలో 67 ఎల్‌ఎంటీ మేర దొడ్డు ధాన్యం వచ్చినా, అదంతా మిల్లుల్లోనే నిల్వ ఉంది.
సన్నాలు పైపైకి
Published Wed, Jan 3 2024 4:49 AM | Last Updated on Wed, Jan 3 2024 4:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment