Department of Civil Supplies
-
50 లక్షల టన్నుల సన్నాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల కోసం పౌర సరఫరాల సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. దసరా పండుగ తర్వాత వరి కోతలు మొదల య్యే అవకాశమున్న నేపథ్యంలో.. జిల్లాల్లోని పౌర సరఫరాల శాఖ, కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అదనపు కలెక్టర్ల నేతృత్వంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ డిసెంబర్ నెలాఖరు వరకు సాగనుంది. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో (హైదరాబాద్ మినహా) 7,185 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ శాఖ వివరాల ఆధారంగా.. రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్‌లో 60.8 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. మొత్తంగా 146.70 లక్షల మెట్రిక్ టన్నులు (ఎంఎల్టీ) దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో 91 లక్షల టన్నుల మేర కొనుగోలు కేంద్రాలకు వస్తుందని.. అందులో 50 లక్షల టన్నుల మేర సన్న ధాన్యం వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ నుంచి ఆయా వివరాలు తీసుకొని జిల్లాల వారీగా సన్నాల కోసం ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. మొత్తంగా 7,185 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా.. ఇందులో సగానికిపైగా సన్న ధాన్యం సేకరణ మాత్రమే చేస్తాయని ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు.వ్యవసాయ శాఖ లెక్కల ఆధారంగా జిల్లా కలెక్టర్లే సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారని వివరించారు. ఐకేపీ, పీఏసీఎస్‌తోపాటు ఇతర సహకార సంఘాల నేతృత్వంలో కొనుగోలు కేంద్రాలు ఉంటాయన్నారు. ఎంపిక చేసిన రకాలు, కొలతలతో.. ‘బోనస్’ రాష్ట్రంలో పండించే ధాన్యానికి కనీస మద్ధతు ధర గ్రేడ్–ఏ రకాలకు రూ.2,320 సాధారణ రకాలకు రూ.2,300గా నిర్ణయించారు. సన్నరకాలకు రూ. 500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. ఆయా రకాల ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 2,800 చొప్పున చెల్లించనున్నారు. వ్యవసాయ శాఖ ఇప్పటికే 33 రకాలను సన్నాలుగా గుర్తించింది. బీపీటీ–5204, ఆర్ఎన్ఆర్– 15048, హెచ్ఎంటీ, సో నా, జైశ్రీరాం తదితర రకాలను ప్రామాణికంగా తీసుకుంటారు. ఇవేకాకుండా.. బియ్యం గింజ పొడ వు 6 మిల్లీమీటర్లు, వెడల్పు 2 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉన్న ఇతర రకాలను కూడా సన్నాలుగా గుర్తిస్తారు. బియ్యం గింజ పరిమాణాన్ని గుర్తించడానికి ‘గ్రెయిన్ కాలిపర్’యంత్రాలను వినియోగిస్తా రు. ఈ మేరకు కొనుగోలు కేంద్రాల కోసం అవసరమైన గ్రెయిన్ కాలిపర్లను కొనుగోలు చేసినట్లు ప్రొ క్యూర్‌మెంట్ విభాగం అధికారి ఒకరు తెలిపారు. పెరిగిన సన్నాల సాగు..సన్న ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. చాలా జిల్లాల్లో సన్నాల సాగు పెరిగింది. వ్యవసాయ శాఖ నిర్దేశించిన 33 రకాల్లో మేలిమి రకమైన హెచ్ఎంటీ, జైశ్రీరాం వంటివాటితోపాటు ఎక్కువ దిగుబడి ఇచ్చే బీపీటీ లోని పలు వెరైటీలను రైతులు భారీ ఎత్తున సాగు చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో వరి వేసిన 45 వేల ఎకరాల్లో పూర్తిస్థాయిలో సన్నాల సాగే జరగగా.. పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నల్లగొండ, సూర్యాపేట, మహబూ బాబాద్, మంచిర్యాల జిల్లాల్లోనూ సన్నాల సాగు ఎక్కువగా జరిగింది. జనవరి నుంచే రేషన్ దుకాణాలకు ఇవ్వాలని భావిస్తున్న సన్న బియ్యానికి అవసరమైన ధాన్యం సమకూరుతుందని పౌరసరఫరాల శాఖ భావిస్తోంది. -
ఆల్ ఇన్ వన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రతి పథకానికి ఇకపై ఒకే కార్డు ఆధారం కానుంది. అదే డిజిటల్ కార్డు. ప్రతి కుటుంబానికీ ఇచ్చే ఈ డిజిటల్ కార్డులో కుటుంబసభ్యుల వివరాలన్నీ నమోదై ఉంటాయి. ఆరోగ్య, సంక్షేమ పథకాలతో పాటు రేషన్ సరుకులకు సైతం ఉపయోగపడేలా ఈ కార్డును రూపొందించనున్నారు. కుటుంబానికి చెందిన ఆధార్ కార్డు లేదా సెల్ నంబర్‌ను ఈ డిజిటల్ కార్డుతో అనుసంధానిస్తారు. ప్రస్తుతం కర్ణాటక, రాజస్తాన్, మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల్లో కుటుంబ ఆర్యోగానికి సంబంధించిన సమాచారాన్ని డిజిటల్ కార్డులో పొందుపరిచి ఉపయోగిస్తున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి అన్ని ప్రభుత్వ పథకాలకు చిప్ అమర్చిన ఒకే డిజిటల్ కార్డు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. ఇందులో ఒక్కో పథకానికి ఒక్కో నంబర్‌ను కేటాయిస్తారు. తొలిదశలో ప్రయోగాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో ఒక పట్టణం, ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని ఈ విధానాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకురావడానికి ముందే ఆయా రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాన్ని అధ్యయనం చేయాలని, అక్కడ ఎదురవుతున్న సమస్యలు ఇక్కడ తలెత్తకుండా పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అధికారుల బృందాన్ని అక్కడకు పంపించాలని నిర్ణయించారు. అన్ని రికార్డులు ఒకే దగ్గర..: కేవలం ఆరోగ్యానికి సంబంధించిన అంశాలే కాకుండా.. ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు, ఆ కుటుంబ సభ్యులకు అందుతున్న పథకాల వివరాలను కూడా ఈ డిజిటల్ కార్డులో పొందుపర్చనున్నారు. ఒక కుటుంబంలో నలుగురు సభ్యులుంటే..ఆ కుటుంబానికి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూఐఎన్)ను కేటాయించి, కుటుంబసభ్యుల సంఖ్య ఆధారంగా ఆ యూఐఎన్కు బై నంబర్ కేటాయిస్తారు. ఆ బై నంబర్ ఎదురుగా ఆ కుటుంబ సభ్యుని పేరు, ఆ సభ్యుడి సమస్త సమాచారం ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ డిజిటల్ కార్డు పూర్తిగా సురక్షితమైనదని, అన్నిరకాల రికార్డులు ఒకే దగ్గర అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. కాగా కుటుంబంలోని ప్రతి ఇంటి సభ్యుని హెల్త్ ప్రొఫైల్ అందులో ఉండాలని, తద్వారా దీర్ఘకాలంలో వైద్య సేవలకు ఇది ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య సమాచారంతో పాటు, సంక్షేమ పథకాలు కూడా ఒకేచోట ఒకే క్లిక్‌తో లభ్యమవుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎక్కడైనా సేవలు, రేషన్ పొందేలా.. రాజస్థాన్, హరియాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కార్డులపై అధ్యయనం చేయాలని, వాటితో కలుగుతున్న ప్రయోజనాలు, ఇబ్బందులపై అధ్యయనం చేసి త్వరగా ఒక సమగ్ర నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఉండాలని సూచించారు. లబ్ధిదారులు ఎక్కడైనా రేషన్, ఆరోగ్య సేవలు పొందేలా ఈ కార్డులు ఉండాలని అన్నారు. కుటుంబసభ్యులను జత చేయడం, తొలగింపునకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేలా ఉండాలని కూడా సీఎం సూచించారు. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పర్యవేక్షణకు జిల్లాల వారీగా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, కార్యదర్శులు చంద్రశేఖర్‌రెడ్డి, సంగీత సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. ఆలస్యం లేకుండా వైద్యండిజిటల్ కార్డులపై సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఆయన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, సీఎస్ శాంతికుమారి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ డిజిటల్ కార్డులో ఆ కుటుంబంలోని సభ్యుల పూర్తి ఆరోగ్య సమాచారం, వారు అంతకుముందు చేయించుకున్న వైద్య పరీక్షల నివేదికలు ఉండేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ప్రభుత్వంలో ఎంప్యానల్ అయిన అసుపత్రులన్నింటిలోనూ ఈ కార్డులను ఉపయోగించి ఎలాంటి ఆలస్యం లేకుండా వైద్యం చేయించుకోవడానికి వీలవుతుందని భావిస్తోంది. -
సన్నాలు పైపైకి
సాక్షి, హైదరాబాద్: సన్న బియ్యం సామాన్యులు కొనలేని పరిస్థితి దాపురించింది. దిగుబడి తగ్గడం ఒక కారణమైతే... మిల్లర్లే ఎక్కువగా కొనుగోలు చేయడం మరో కారణం. రిటైల్ మార్కెట్లో నాణ్యతను బట్టి పాత సన్న బియ్యం ధర క్వింటాల్‌కు రూ.6 వేల నుంచి 8వేల వరకు ఉండడం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా వచ్చిన వానాకాలం బియ్యాన్ని కూడా రూ.6వేలకు క్వింటాల్ చొప్పున విక్రయిస్తున్నారు. హైపర్ మార్కెట్లు, సూపర్ బజార్లలో సైతం బియ్యం ధరలు సామాన్య, మధ్య తరగతి వర్గాలను బెంబేలెత్తిస్తున్నాయి. జై శ్రీరామ్ క్వింటాల్‌కు రూ.7,800 వరకు సన్నబియ్యంలో అగ్రగామిగా చెప్పుకునే జైశ్రీరాం రకం పాత బియ్యం ధర నాలుగు రోజుల క్రితం క్వింటాల్‌కు రూ. 7,800 వరకు రిటైల్ మార్కెట్లో పలికింది. తర్వాత రూ. 200 వరకు తగ్గినా, మళ్లీ ధర పెరిగింది. మంగళవారం రూ. 7,500 నుంచి రూ. 7,800 వరకు రిటైల్ మార్కెట్లో అమ్మినట్టు సమాచారం. హెచ్ఎంటీ రకం బియ్యం(పాతవి) రూ.7,200 వరకు, కొత్తవి రూ.6,500 నుంచి 7,000 వరకు రిటైల్ మార్కెట్లో అమ్ముతున్నారు. బీపీటీ, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనాలను రూ. 5,500 నుంచి 6,500 వరకు అమ్ముతున్నారు. దొడ్డు బియ్యం అంతంతే దొడ్డు బియ్యం ధర క్వింటాల్ రూ.4,500 నుంచి ఉన్నా, వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో పెరగని సన్నాల దిగుబడి రాష్ట్రంలో యాసంగి సీజన్లో 80 శాతానికి పైగా దొడ్డు రకాలైన 1010, 1001, 1061, ఐఆర్ 64, తెల్లహంస వంటి వరి రకాలనే ఎక్కువగా పండిస్తారు. ఉత్తర తెలంగాణలో యాసంగిలో సన్న రకాలు పండే పరిస్థితి ఏమాత్రం లేదు. దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్, ఖమ్మంలలో అదే పరిస్థితి. మిర్యాలగూడ, సూర్యాపేట వంటి ప్రాంతాల్లో కొన్నిచోట్ల సన్నాలు పండించినా, సొంత అవసరాలకే వినియోగిస్తారు. ఇక వానాకాలం సీజన్లో నిజామాబాద్ మినహా ఉత్తర తెలంగాణలో రైతులు తమ పొలాల్లో సంవత్సరకాలం తిండి అవసరాలు, స్థానిక అవసరాలకు మాత్రమే సన్న రకాలను పండించి, దొడ్డు వరి వైపే మొగ్గు చూపుతారు. నిజామాబాద్, నల్లగొండ ఉమ్మడి జిల్లాలతో పాటు మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మాత్రమే ఖరీఫ్ సీజన్లో సన్నాలు ఎక్కువగా పండిస్తారు. సన్నాలను బియ్యంగా మార్చి విక్రయించే రైతులు కొందరైతే , సన్న ధాన్యాన్ని మిల్లర్లకు విక్రయించే వారు ఎక్కువ మంది. అయితే ఈసారి వానాకాలం సీజన్లో నాగార్జునసాగర్ కింద పంట తక్కువగా రావడంతో సన్నాలకు డిమాండ్ పెరిగింది. దీనికి తోడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద కూడా వాతావరణ ప్రతికూల పరిస్థితులతో సన్న ధాన్యాన్ని తెగులు సోకినట్టు రైతులు చెబుతున్నారు. దీంతో ఇక్కడ కూడా కొంత పంట దెబ్బతింది. కేవలం బోర్లు, కరెంటు మోటార్ల కింద పండిన పంట మాత్రమే ఎక్కువ దిగుబడి వచ్చింది. మార్కెట్‌కు వచ్చిన ధాన్యం 43 ఎల్ఎంటీ మాత్రమే రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో 99 మెట్రక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసినా, ఇప్పటివరకు వచ్చిన ధాన్యం 43 ఎల్ఎంటీ మాత్రమే మరో 2 ఎల్ఎంటీ ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాలకు వచ్చే పరిస్థితి లేదు. గత యాసంగిలో 67 ఎల్ఎంటీ మేర దొడ్డు ధాన్యం వచ్చినా, అదంతా మిల్లుల్లోనే నిల్వ ఉంది. -
కొత్త రేషన్ కార్డులు ఇప్పట్లో లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులను ఇప్పట్లో జారీ చేసే అవకాశం కనిపించడం లేదు. త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జూన్ నుంచి కొత్త రేషన్ కార్డుల జారీని ప్రారంభించనున్నట్టు సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. దీంతో కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది దీనిపై ఆరా తీయడం మొదలుపెట్టారు. కానీ ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో ఎలాంటి ప్రతిపాదన లేదని.. ప్రభుత్వం నుంచి ఆ దిశగా ఆలోచనేదీ లేదని పౌర సరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే కుటుంబాలను మించి కార్డులు రాష్ట్రంలో జనాభా లెక్కల ప్రకారం చూస్తే.. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాల కన్నా అత్యధిక సంఖ్యలో ఆహార భద్రత కార్డులు ఉన్నాయని పలు సర్వేలు తేల్చాయి. అనర్హులకు ఇచ్చిన కార్డులను ఏరివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒకటి రెండు సార్లు ఆలోచించినా.. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో మిన్నకుండి పోయింది. 2018 ఎన్నికలకు ముందు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. సుమారు 9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులను పరిశీలించిన సర్కారు.. 2021 వరకు పలు దఫాల్లో 3.11 లక్షల కార్డులను జారీ చేసింది. ఆ తర్వాత కొత్త కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే కుటుంబంలో ఎవరైనా మరణిస్తే.. రేషన్ కార్డు నుంచి సదరు వ్యక్తి పేరును తొలగిస్తున్న అధికారులు, కొత్తగా జన్మించిన వారి పేర్లను చేర్చడం లేదు. ఈ మార్పులు చేర్పుల కోసం ఎఫ్ఎస్సీఆర్ఎం వెబ్సైట్లో చేసుకుంటున్న దరఖాస్తుకే ఇప్పటివరకు మోక్షం కలగలేదు. 90.14 లక్షల ఆహార భద్రత కార్డులు ప్రస్తుతం రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో 90,14,263 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల్లో ఉన్న యూనిట్ల (కుటుంబ సభ్యుల) సంఖ్య 2.83 కోట్లు. అంటే రాష్ట్ర జనాభాలో మూడింట రెండొంతుల మేర ప్రజలు వీటి పరిధిలో ఉన్నారు. ఇక రేషన్ కార్డుల్లో జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద 48.86 లక్షల కార్డులు, అంత్యోదయ అన్నయోజన పథకం (ఏఏవై) కింద 5.62 లక్షల కార్డులు ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి సబ్సిడీ భరిస్తూ ఇచ్చిన ఆహార భద్రత కార్డులు (ఎఫ్ఎస్సీ) 35.66 లక్షల మేర ఉన్నాయి. ఇందులో 5,211 కార్డులు అన్నపూర్ణ పథకం కింద వినియోగంలో ఉన్నాయి. అన్నపూర్ణ పథకం కింద కార్డుకు 10 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేస్తారు. ఏఏవై, అన్నపూర్ణ మినహా మిగతా రేషన్ కార్డులపై ప్రతినెలా కుటుంబంలోని ఒక్కొక్కరికి రూపాయికి కిలో చొప్పున 6 కిలోల బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తుంది. కరోనా ప్రబలిన నేపథ్యంలో 2021 నుంచి ఉచితంగానే బియ్యం పంపిణీ చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో నెలకు 1.80 లక్షల టన్నుల బియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తున్నారు. ఆ ప్రచారంలో నిజం లేదు గత ఎన్నికల ముందు ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించినట్లుగానే.. ఈసారి కూడా అవకాశం ఇచ్చిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. జూన్ నుంచే కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్టు ప్రభుత్వం నిర్ణయించిందన్న ప్రచారమూ జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని పౌర సరఫరాల శాఖ తోసిపుచ్చింది. కొత్త రేషన్‌కార్డుల కోసం ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ‘సాక్షి’కి స్పష్టం చేసింది. (చదవండి: అర్ధరాత్రి నుంచి ఉరుములు, పిడుగులతో వాన) -
నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: గత సీజన్లో రైస్‌మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద పౌరసరఫరాల శాఖకు అప్పగించని మిల్లర్లకు యాసంగి ధాన్యం కేటాయించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎంఆర్ కోసం 18 నెలల పాటు గడువు ఇచ్చినా, ధాన్యాన్ని మర పట్టించి ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న రైస్ మిల్లులను ఇక బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం మంగళవారం నుంచి రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తోంది. ఈ మేరకు మంత్రులు టి.హరీశ్‌రావు, గంగుల కమలాకర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్ సింగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతస్థాయి అధికారులు సోమవారం బీఆర్కే భవన్లో జిల్లాల అదనపు కలెక్లర్లు, డీఎంలు, డీఎస్ఓలు, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యాసంగి ధాన్యం సేకరణ, సీఎంఆర్ కేటాయింపు, రైతులకు ఉపయోగకర అంశాలు వంటి వాటిపై చర్చించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకొని కొనుగోళ్ళకు సిద్దం కావాలని, రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని మంత్రులు ఆదేశించారు. ఇందు కోసం యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా 7,100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆయా జిల్లాల్లో మొదలైన కోతలు, ధాన్యం దిగుబడికి అనుగుణంగా కేంద్రాలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే వారంలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ముగ్గురు మంత్రులు అధికారులకు దిశా నిర్శేశం చేశారు. ధాన్యం కొనుగోళ్ళకు కావాల్సిన ఏర్పాట్లను కలెక్టర్లు సిద్ధం చేసుకోవాలని, వచ్చే వారంలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. యాసంగికి సీజన్ సీఎంఆర్ అప్పగింతకు ఆఖరు తేదీగా ఈ నెల 30వ తేదిని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ఈలోగా మిల్లర్లు నుంచి సీఎంఆర్‌ను పూర్తి స్థాయిలో సేకరించాలని ఆదేశించారు. ఇక నుంచి సీఎంఆర్ అప్పగించే విషయంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న సీఎంఆర్‌ని అప్పగించిన తరువాతే ఈ సీజన్ కు సంబంధించి ధాన్యాన్ని తీసుకోవాలని రైస్ మిల్లర్లుకు సూచించారు. ఇప్పటి వరకు సీఎంఆర్‌లో పాల్గొనని మిల్లర్లను కూడా ఈ యాసంగి సీజన్ నుంచి భాగాస్వామ్యం చేస్తున్నట్లు మంత్రులు ప్రకటించారు. రెండు సీజన్లలో పూర్తి ధాన్యాన్ని సేకరిస్తున్న రాష్ట్రం తెలంగాణనే... దేశ వ్యాప్తంగా రెండు సీజన్లలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఒక్క తెలంగాణా మాత్రమేనని మంత్రులు హరీష్‌రావు, గంగుల, సింగిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నుంచి అదనపు కలెక్టర్లు ఆయా జిల్లా స్థాయిలలో కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసుకొని ధాన్యం కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ధాన్యం నిల్వలకు ఇంటర్మీడియట్ గోడౌన్లను గుర్తించి తగు ప్రతిపాధనలను ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. అలాగే ఆరబెట్టిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకోచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో భారీగా ధాన్యం దిగుబడి రాష్ట్రంలో రోజురోజుకూ ధాన్యం దిగుబడి, కొనుగోలు గణనీయంగా పెరుగుతున్నాయని మంత్రులు వెల్లడించారు. 2014–15 లో రూ.3392 కోట్లతో ధాన్యం సేకరిస్తే 2020–21 నాటికి రూ.26 వేల 600 కోట్లతో ధాన్యం సేకరించగలిగామని చెప్పారు. 9 సంవత్సరాలలో ఆరు రెట్ల ధాన్యం కొనుగోలు పెరగగా , ఈ రబీ(యాసంగి)లో దేశంలో సగం పంట తెలంగాణలో మాత్రమే ఉండడం మనకు గర్వకారణమన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న చెక్ పోస్టులను బలోపేతం చేయాలని మంత్రులు ఆదేశించారు. రైతులకు చెల్లింపులు ఆలస్యం జరగకుండా ధాన్యం కొనుగోలు వివరాలను కేంద్రాల నిర్వాహకులు ఎప్పటికప్పడు ఆన్ లైన్ లో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకష్ణ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌర సరఫరాల కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. -
ముగిసిన వానాకాలం ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం ధాన్యం సేకరణ పూర్తయిందని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రైతులకు ఇబ్బందుల్లేకుండా, రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే ధాన్యాన్ని సేకరించి రైస్‌మిల్లులకు తరలించిందన్నారు. ఆలస్యంగా వరి నాట్లేయడం వల్ల ఎక్కడైనా రైతుల వద్ద ధాన్యం మిగిలి ఉంటే ఈ నెల 24 వరకూ సేకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. శనివారం ఇక్కడ మంత్రి గంగుల ఆ శాఖ అధికారులతో వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వ్యవసాయ అనుకూల విధానాలతో ధాన్యం దిగుబడి ఏయేటికాయేడు పెరుగుతోందన్నారు. ఈసారి రికార్డుస్థాయిలో 64.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు చెప్పారు. అక్టోబర్ 21 నుంచి మొదలైన వానాకాలం పంట సేకరణ మూడునెలలకు పైగా నిరంతరాయంగా సాగిందని తెలిపారు. మారుమూల ప్రాంతాల రైతులకు అందుబాటులోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో 7,024 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రూ.13,570 కోట్ల విలువైన 64.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 9.76 లక్షలమంది రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యం విక్రయించిన రైతుల్లో ఓపీఎంఎస్లో నమోదైన రైతులకు రూ.12,700 కోట్లు చెల్లించామని చెప్పారు. పంజాబ్ తరువాత తెలంగాణనే.. దేశంలో పంజాబ్ తరువాత తెలంగాణ నుంచే అత్యధిక ధాన్యం సేకరణ జరుగుతోందని మంత్రి గంగుల తెలిపారు. రాష్ట్రంలో 2014–15లో 11.04 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న వానాకాలం ధాన్యం సేకరణ గతేడాది 70.44 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుందన్నారు. ఈ ఏడు బహిరంగ మార్కెట్లలో అత్యధిక ధర లభించడంతో రైతులు లాభసాటిగా ప్రైవేటుగా ధాన్యం విక్రయించుకోవడం సంతోషకర పరిణామమని అన్నారు. ఈ సీజన్లో అత్యధికంగా నిజామాబాద్‌లో 5.86 లక్షల మెట్రిక్ టన్నులు, కామారెడ్డిలో 4.75, నల్లగొండలో 4.13, మెదక్‌లో 3.95, జగిత్యాలలో 3.79 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించగా, అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 2,264 మెట్రిక్ టన్నులు సేకరించినట్లు వివరించారు. కాగా, ఈ సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి సీఎంఆర్ ప్రక్రియను సైతం వేగంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, జాయింట్ కమిషనర్ ఉషారాణి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జీఎం రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వినియోగదారులకు అండగా కాల్‌సెంటర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వినియోగదారుల సాధికారతే ధ్యేయంగా.. వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు 1967 టోల్‌ఫ్రీ నంబర్‌తో ఇంటిగ్రేటెడ్ కాల్‌సెంటర్ ఏర్పాటు చేసినట్టు పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ పంపిణీలో జాప్యం, నాణ్యత లోపాలు, బరువులో వ్యత్యాసం, ఎండీయూల నిర్లక్ష్యం, డీలర్లపై ఫిర్యాదులు, కొత్త బియ్యం కార్డుల మంజూరు, సభ్యుల విభజన, చేర్పులు, మార్పులు, కొత్తకార్డు అప్లికేషన్ స్థితి, ఒకే దేశం – ఒకే రేషన్, గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేయకపోవడం, అదనపు రుసుము వసూలు, రశీదులు లేని వ్యవహారాలు, వస్తువులు ఎమ్మార్పీ కంటే ఎక్కువకు విక్రయించడం, పెట్రోల్, డీజిల్ నాణ్యత, పెట్రోబంకుల్లో కనీస సౌకర్యాల కొరత, ధాన్యం సేకరణలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరిగే ప్రతి వ్యవహారంపైనా ఈ కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. ఆ ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి సత్వరమే పరిష్కరిస్తామని తెలిపారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండే ఈ కాల్‌సెంటర్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ను బియ్యం పంపిణీచేసే ఎండీయూ వాహనాలపైన కూడా ముద్రించినట్లు తెలిపారు. ప్రతి మండలంలో మండల వినియోగదారుల సేవాకేంద్రాలను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కేంద్రాలకు డిప్యూటీ తహసీల్దార్లు ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తూ వినియోగదారులకు హక్కుల రక్షణ, సమస్యల పరిష్కారాలపై సూచనలు చేస్తారని తెలిపారు. -
సివిల్ సప్లైస్ గోదాములపై సోలార్ పలకలు
సాక్షి, హైదరాబాద్: నెలవారీ విద్యుత్ బిల్లుల భారం నుంచి బయటపడటం, అదే సమయంలో ఆదాయాన్ని కూడా పొందడం కోసం పౌర సరఫరాల శాఖ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పౌర సరఫరాల శాఖ గోదా ములపై సోలార్ పలకలను అమర్చి.. విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని, ఇదే సమయంలో పలుచోట్ల ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పునరుద్ధర ణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో)తో కలసి సివిల్ సప్లైస్ పరిధిలోని గోదాములతోపాటు పెట్రోల్, ఎల్పీజీ ఔట్‌లెట్లలోనూ ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. శుక్రవారం పౌర సరఫరాల భవనంలో రెడ్కో మేనేజింగ్ డైరెక్టర్ జానయ్య, తెలంగాణ సోలార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ గౌడ్, ఇతర అధికారులతో రవీందర్‌సింగ్ సమావేశమై చర్చించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడంతోపాటు పౌర సరఫరాల సంస్థకు సంబంధించిన కరెంటు చార్జీలను తగ్గించుకు నేందుకు గోదాముల్లో సోలార్ వ్యవ స్థలను ఏర్పాటు చేయాలని నిర్ణ యించినట్టు రవీందర్‌సింగ్ వెల్లడించారు. తొలిదశలో సంస్థకు చెందిన 19 గోదాములు, రెండు పెట్రోల్ బంకులు, ఐదు ఎల్పీజీ గోదాములు కలిపి మొత్తం 26 చోట్ల ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే ప్రతిపా దనలపై చర్చించామన్నారు. అందులో 24 చోట్ల అనుకూలంగా ఉన్న ట్టుగా అధికారులు ధ్రువీకరించారని తెలిపారు. ఇక తమ పరిధిలోని రైస్‌మిల్లుల్లోనూ సౌర విద్యుత్‌ను వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వివరించారు. సమావేశం అనంతరం రవీందర్‌సింగ్ సికింద్రాబాద్‌లోని జిల్లా పౌర సరఫరాల కార్యాలయాన్ని పరిశీలించారు. అక్కడ సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల సంస్థ గోదాముల్లో సోలార్ వ్యవస్థల ఏర్పాటు నిర్ణయంపై సోలార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్‌గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. -
గిరిజన ప్రాంతాల్లో బైక్‌ల ద్వారా రేషన్ సరఫరా
సాక్షి, అమరావతి: గిరిజన ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థలో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ చెప్పారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సరుకు రవాణాకు ఇబ్బందిగా ఉన్న ప్రాంతాల్లో కొత్త ఎంఎల్ఎస్ పాయింట్లు, బఫర్ గోడౌన్ల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మారుమూల, కొండ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఎండీయూ ఆపరేటర్లకు అదనపు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, ఎండీయూ వాహనం వెళ్లలేని గిరిజన గ్రామాలకు బైక్‌ల ద్వారా ఇంటింటికీ రేషన్ సరఫరా చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జనవరి నుంచి కందిపప్పు, పంచదార పంపిణీతో పాటు అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల వద్దకే నిత్యావసరాలు డెలివరీ చేసేలా చూడాలన్నారు. ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో అవసరాన్ని బట్టి కలెక్టర్ కొత్త రేషన్ షాపులు మంజూరు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో దాదాపు 45 శాతానికి పైగా ధాన్యం కొనుగోళ్లు పూర్తయినట్టు కమిషనర్ తెలిపారు. జనవరి చివరి నాటికి ఖరీఫ్ సేకరణ పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నామని, ధాన్యం కొనుగోళ్ల సొమ్ముతో పాటు మిల్లర్ల బకాయిలనూ వేగంగా చెల్లిస్తున్నట్టు చెప్పారు. 16 రోజులు దాటిన ఎఫ్‌టీవోలకు చెల్లింపులు పూర్తి చేసినట్టు తెలిపారు. మిల్లర్లు ప్రభుత్వం చెల్లించే బకాయిల్లో కొంత మొత్తం వెచ్చించి ఆరబోత యంత్రాలు (డ్రయర్లు) ఏర్పాటు చేయాలని, లేకుంటే.. 2023 ఖరీఫ్ సీజన్ నుంచి ఆయా మిల్లులకు సీఎంఆర్ నిలిపివేస్తామని కమిషనర్ అరుణ్‌కుమార్ హెచ్చరించారు. -
ధాన్యం కొనుగోలుతో రైతులకు భరోసా
సాక్షి, అమరావతి: ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రంలోని రైతులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తాము ఇంతే కొంటామంటూ ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని స్పష్టం చేశారు. మిల్లర్ల ప్రమేయం లేకుండా రైతులు పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంటే.. ధాన్యం కొనుగోలులో ఆంక్షలు అంటూ ‘ఈనాడు’ తప్పుడు ఆరోపణలు చేయడం దారుణం అని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడు పంటలు పండే పచ్చని పంట పొలాలను రాజధాని పేరిట సేకరించినప్పుడు రామోజీ ఎందుకు బాధ పడలేదని ఆయన ప్రశ్నించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం మూడున్నరేళ్లుగా రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవడం దేశమంతా గుర్తిస్తుండటం కనిపించడం లేదా అని నిలదీశారు. రైతులకు మద్దతు ధర దక్కుతోందనే అక్కసుతో బురద చల్లుతున్నారని ధ్వజమెత్తారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. రామోజీ.. ఆరోజు ఎందుకు నోరు విప్పలేదు? ► టీడీపీ ఐదేళ్ల పాలనలో రూ.40 వేల కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, ఈ మూడున్నరేళ్లలో మా ప్రభుత్వం రూ.50,699 కోట్ల విలువైన 2.71 కోట్ల టన్నుల ధాన్యం సేకరించింది. టీడీపీ ఐదేళ్లలో రూ.3 వేల కోట్ల విలువైన ఉత్పత్తులు కొనుగోలు చేస్తే, ఈ మూడున్నరేళ్లలో ఈ ప్రభుత్వం రూ.7,500 కోట్ల విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేసింది. ఇవి రామోజీకి కన్పించక పోవటం దురదృష్టకరం. ► వ్యవసాయం దండగ అని చంద్రబాబు విమర్శించినప్పుడు రామోజీ ఎందుకు నోరు విప్పలేదు? ఈరోజు రాష్ట్రం పాడి పంటలతో కళకళలాడుతోంది. సాగునీరు పుష్కలంగా అందుతోంది. దిగుబడులు బాగా పెరిగాయి. రైతులు సంతోషంగా ఉన్నారు. కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధరకే రైతులు పంట విక్రయించుకుంటున్నారు. ► రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్ల మీద.. టీడీపీ, దాని కుల మీడియా రాసిన కథనాలు వారి పెత్తందారీ పోకడలను, అహంకారాన్ని మరోసారి బయట పెట్టాయి. ఈ కార్పొరేషన్ల ద్వారా వేలాది మంది బీసీలకు రాజకీయంగా గుర్తింపు రావడం నిజం కాదా? ఊరికొకరికి మాత్రమే మేలు చేసే గత ప్రభుత్వ దుర్మార్గం బట్టబయలు కాలేదా? -
వేగంగా వానాకాలం ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా సాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం ఆయన జిల్లాల వారీగా కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్, డిప్యూటీ కమిషనర్ రుక్మిణిలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం గంగుల మాట్లాడుతూ.. రాష్ట్రంలో శుక్రవారం నాటికి 6.42 లక్షల మంది రైతుల నుంచి 38.06 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ)ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటివరకు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా సేకరించామన్నారు. గత సీజన్లో నవంబర్ ఆఖరు నాటికి 25.84 ఎల్ఎంటీ ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వ్యవసాయ అనుకూల విధానాలు, అన్ని ప్రాంతాలకు అందుతున్న పుష్కలమైన నీటితో ఈసారి ధాన్యం నాణ్యత మరింత పెరిగిందని చెప్పారు. దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా మారిందన్నారు. బహిరంగ మార్కెట్లో సైతం కనీస మద్దతు ధర కన్నా అధిక ధరతో రైతులు ధాన్యాన్ని విక్రయిస్తుండటం శుభపరిణామమన్నారు. కోతలకు అనుగుణంగా ధాన్యం సేకరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. 729 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి రాష్ట్రంలో 6,734 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన 38.06 ఎల్ఎంటీ ధాన్యంలో 36.87 ఎల్‌ఎంటీని మిల్లులకు తరలించినట్లు గంగుల తెలిపారు. దీని విలువ రూ.7,837 కోట్లు కాగా, రైతుల ఖాతాల్లోకి ఇప్పటివరకు 4,780 కోట్లు జమచేసినట్లు చెప్పారు. ధాన్యం సేకరణకు 9.52 లక్షల గన్నీ బ్యాగులను వినియోగించగా, ఇంకా 9.16 లక్షల బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. కొనుగోళ్లు పూర్తయిన 729 కేంద్రాలను మూసివేసినట్లు తెలిపారు. నిజామాబాద్ టాప్ వానాకాలానికి సంబంధించిన ధాన్యం సేకరణలో రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా ఇప్పటివరకు ముందంజలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 38,06,469 మె ట్రిక్ టన్నుల సేకరణ పూర్తికాగా నిజామా బాద్ జిల్లాలో 5,38,354 మెట్రిక్ టన్నుల సేకరణ అయింది. తరువాత కామారెడ్డి జిల్లాలో 3,98,818 మెట్రిక్ టన్నులు, నల్లగొండ జిల్లాలో 3,22,634 మెట్రిక్ టన్నులు, మెదక్ జిల్లాలో 3,22,047 మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తయింది. సన్నాలకు డిమాండ్‌తో... జై శ్రీరాం, బీపీటీ, హెచ్ఎంటీ లాంటి సన్న రకం వడ్లకు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఉండటంతో మిల్లర్లు, వ్యాపారులు సన్నధాన్యాన్ని వివిధ జిల్లాలతోపాటు నిజామాబాద్ జిల్లాలో భారీగా సేకరించారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల వ్యాపారులు నిజామాబాద్ జిల్లాలో సన్న రకం ధాన్యాన్ని పెద్దఎత్తున సేకరించారు. రైతులకు క్వింటాకు రూ.100 ఎక్కువగా చెల్లించి మరీ సేకరించి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశారు. దీంతో దొడ్డు రకం ధాన్యమే కొనుగోలు కేంద్రాలకు ఎక్కువగా వస్తోంది. -
పేదల బియ్యంతో కోట్లకు పడగ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్ బియ్యం దందా ఓ మాఫియాగా తయారైంది. గ్రామాలు, పట్టణాల్లోని బస్తీల నుంచి సేకరించే బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించాలన్నా, రైస్ మిల్లులకు చేరవేయాలన్నా.. జిల్లాల స్థాయిలో కొందరు వ్యక్తులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. రెండు దశాబ్దాల క్రితం పట్టణ స్థాయిలో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, కమీషన్ మీద అమ్ముకునే చిరుదందా సాగించిన ఓ వ్యక్తి ఇప్పుడు ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలను శాసించే బియ్యం లీడర్‌గా మారితే, రైస్ మిల్లులో పార్టనర్‌గా చేరి, ఆ రైస్ మిల్లుతో పాటు పలు ఇతర మిల్లులకు రేషన్ బియ్యం రీసైక్లింగ్ కోసం తరలించే లీడర్‌గా మరో వ్యక్తి మారి దందా సాగిస్తున్నారు. హైదరాబాద్ పక్కనున్న ఓ పారిశ్రామిక జిల్లాలో రేషన్ డీలర్ స్థాయి నుంచి డీలర్ల సంఘానికే నాయకుడిగా ఎదిగిన మరో వ్యక్తి.. రేషన్ బియ్యాన్ని యథేచ్ఛగా కర్ణాటకకు తరలిస్తున్నాడు. ఇలా ప్రతి ఉమ్మడి జిల్లాలో కనీసం ఇద్దరు చొప్పున రేషన్ బియ్యం దందా సాగించే ‘లీడర్లు’రాష్ట్ర పౌరసరఫరాల శాఖ పంపిణీ చేస్తున్న పేదల బియ్యానికి సవాల్ విసురుతున్నారు. ప్రతి నెలా రూ. వందల కోట్ల విలువైన పీడీఎస్ బియ్యాన్ని నల్లబజారుకు తరలిస్తూ ఈ దళారులు కోట్లు కొల్లగొడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి సహా పాత 10 జిల్లాల్లో కనీసంగా 20 మంది వ్యక్తులు ఈ బియ్యం దందాతో రూ. కోట్లు కూడబెట్టారని తెలుస్తోంది. లక్షల్లో మామూళ్లు .. రేషన్ బియ్యం పక్కదారి పట్టడంలో అన్ని ప్రధాన ప్రభుత్వ శాఖల అధికారుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా చూడాల్సిన పౌరసరఫరాల శాఖలోని జిల్లా స్థాయి అధికారుల నుంచి ఎన్ఫోర్స్మెంట్ విభాగంలోని వివిధ హోదాల్లో ఉన్న వారి వరకు బియ్యం దందా సాగించే వారికి సహకారం అందిస్తున్నట్లు భావిస్తున్నారు. కాగా, మామూళ్లు ఇవ్వలేని గ్రామ, మండల స్థాయిలోని ఆటో ట్రాలీలను అప్పుడప్పుడు సీజ్ చేసి అధికారులు కంటితుడుపు చర్యలు తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. రెవెన్యూ అధికారులతోపాటు బియ్యం వాహనాలు రాష్ట్ర సరిహద్దులు దాటే మార్గంలో ఉన్న అన్ని పోలీస్స్టేషన్లను ఈ వ్యాపారులు మేనేజ్ చేస్తున్నట్లు సమాచారం. కాగా, బియ్యం వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసే మరికొందరికి కూడా ఏనెలకు ఆనెల ఠంచన్‌గా మామూళ్లు ముడతాయని తెలుస్తోంది. మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి మొదలైన జిల్లాల నుంచి సిరోంచకు బియ్యం రవాణా చేసే ఓ ‘వీరుడు’మామూళ్ల కిందనే నెలకు రూ.10 లక్షలకు పైగా ముట్ట చెపుతాడంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇతనిపై 12 కేసుల వరకు ఉన్నాయి. ఈ వ్యక్తి కాళేశ్వరం, కరీంనగర్, హైదరాబాద్‌లలో ఆస్తులు సంపాదించే స్థాయిలో బియ్యం దందా సాగిస్తున్నాడు. ఆసిఫాబాద్ రెబ్బెనకు చెందిన మరో ‘కిరణం’మీద 22 కేసులు ఉన్నప్పటికీ, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ చుట్టుపక్కల మండలాల నుంచి బియ్యం సేకరించి బల్లార్షా ప్రాంతంలోని వీరూర్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌కు చెందిన ఓ రైస్ మిల్లు భాగస్వాములు పీడీఎస్ బియ్యం దందాలో రాష్ట్రంలోనే కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సంగారెడ్డి జిల్లా నుంచి కర్ణాటకకు.. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రేషన్ దుకాణం యజమాని సంఘం నాయకుడిగా చలామణి అవుతూ పెద్ద ఎత్తున దందా సాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇతను హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన దందా సాగిస్తూ ‘రాజు’గా వెలిగిపోతున్నాడు. ఈ నాయకుడు తను దందా చేయడమే గాక, బియ్యం దందా సాగించే కొందరు రేషన్ డీలర్లకు అండగా ఉంటున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ జిల్లాల నుంచి సేకరించిన బియ్యాన్ని కర్ణాటక సరిహద్దులు దాటిస్తూ కోట్లకు పడగలెత్తినట్లు ఆరోపణలున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రేషన్ బియ్యం దందాకు మిల్లర్లతో పాటు అధికార పార్టీ నాయకుల అండ ఉన్నట్లు చెపుతున్నారు. మహబూబ్‌నగర్, గద్వాల ప్రాంతంలోని నలుగురు ముఖ్యమైన వ్యక్తులు మక్తల్, నారాయణపేట మీదుగా కర్ణాటకకు బియ్యాన్ని తరలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో రీసైక్లింగ్‌కే ఎక్కువ నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా రేషన్ బియ్యం దందా సాగించడంలో రైస్‌మిల్లర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. గ్రామాల్లో రేషన్ డీలర్లతోపాటు కొంతమంది ఏజెంట్లు పేదల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి మహారాష్ట్రకు కొంత మేర తరలిస్తుండగా భారీ ఎత్తున రైస్‌మిల్లులకు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఓ ఎమ్మెల్యేతోపాటు కీలకమైన ఓ రైస్‌మిల్లర్ హస్తముందనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో పండిస్తున్న సన్నరకాలను రైస్‌మిల్లర్లు ఏ గ్రేడ్ రకం కింద సేకరిస్తూ, బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. వాటి స్థానంలో ఏజెంట్లు, రేషన్‌డీలర్ల ద్వారా సేకరించిన ప్రజా పంపిణీ బియ్యాన్ని లెవీ కింద తిరిగి ఎఫ్‌సీఐకి అప్పగిస్తున్నారని తెలుస్తోంది. రైస్‌మిల్లుల ద్వారా ఎఫ్‌సీఐకి, అక్కడి నుంచి రేషన్‌షాపులకు, లబ్ధిదారులకు చేరుతుండగా, తిరిగి వారి నుంచి ఏజెంట్ల ద్వారా మళ్లీ రైస్‌మిల్లులకే చేరుతుండడం గమనార్హం. మహబూబాబాద్‌లో ప్రజా ప్రతినిధి అండతో.. మహబూబాబాద్ పట్టణంలోని ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద ఉన్న మిల్లు, మరిపెడ మండలంలోని మరో రైస్ మిల్‌తో పాటు తొర్రూరు, కొత్తగూడ, కేసముద్రం కేంద్రాలుగా రేషన్ బియ్యం దందా సాగుతోందన్న ఆరోపణలున్నాయి. సివిల్ సప్లై శాఖలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఓ అధికారి ఈ వ్యవహారాన్ని చక్కబెడుతూ వాటాలు నిర్ణయించి.. దందా సాఫీగా సాగేలా చూస్తున్నాడని తెలుస్తోంది. పీడీఎస్ డీలర్ల ద్వారా పేదల నుంచి కిలో ఐదు రూపాయల నుంచి పది రూపాయల వరకు కొనుగోలు చేసి మామిడి తోటలు, రైస్ మిల్లులు, గోదాముల్లో దాచిపెడుతూ ఆ బియ్యాన్ని సీఎంఆర్ రూపంలో ఎఫ్‌సీఐకి అప్పగిస్తున్నారని ఆరోపణలున్నాయి. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి హస్తం ఈ దందాలో ఉన్నట్లు ఆరోపణలున్నాయి. -
గత వానాకాలం సీఎంఆర్ గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: గత సంవత్సరం వానాకాలం (2021–22) సీజన్‌కు సంబంధించి ఎఫ్‌సీఐకి అప్పగించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) గడువును కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు పెంచింది. సెప్టెంబర్ నెలాఖరుతో ముగిసిన ఈ గడువును పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు పలుమార్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖను అభ్యర్థించినా స్పందించలేదు. దీంతో అక్టోబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోని మిల్లులనుంచి వానాకాలం సీజన్‌కు సంబంధించి సీఎంఆర్ తీసుకోవడం లేదు. గత వానాకాలం సీజన్లో 70.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా, సీఎంఆర్ కింద 47.04 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సెంట్రల్ పూల్ ద్వారా ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది. కానీ సెప్టెంబర్ నెలాఖరు నాటికి 30 ఎల్ఎంటీ బియ్యం మాత్రమే ఎఫ్‌సీఐకి ఇచ్చారు. మరో 17 ఎల్ఎంటీ అప్పగించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ, ఎఫ్‌సీఐ అధికారులతో మాట్లాడిన ఆయన, నవంబర్ వరకు గడువు ఇస్తే పూర్తిస్థాయిలో సీఎంఆర్ అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అశోక్‌కుమార్ వర్మ నవంబర్ ఆఖరు వరకు గడువు పెంచుతూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. యాసంగి ఫోర్టిఫైడ్ రైస్.. మరో 4 ఎల్ఎంటీకి కేంద్రం అనుమతి గత యాసంగిలో ఉత్పత్తి అయిన ధాన్యం నుంచి సీఎంఆర్ కింద అదనంగా 4 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ పారాబాయిల్డ్ రైస్‌ను సెంట్రల్‌పూల్‌కు తీసుకునేందుకు కూడా కేంద్రం ఒప్పుకున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గత జూలై నుంచి కురిసిన వర్షాలకు మిల్లుల్లోని ధాన్యం తడిసిపోగా, ముడి బియ్యంగా సీఎంఆర్ చేయడానికి పనికిరాని పరిస్థితి నెలకొందని తెలిపారు. అలాగే సాధారణ యాసంగి ధాన్యం సైతం ముడిబియ్యంగా మిల్లింగ్ చేస్తే నూకలు ఎక్కువ వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల 8 లక్షల మెట్రిక్ టన్నుల యాసంగి ధాన్యాన్ని ఫోర్టిఫైడ్ పారాబాయిల్డ్ బియ్యంగా తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలిపారు. తాజా అనుమతితో కలిపి మొత్తం 12 ఎల్ఎంటీ పారాబాయిల్డ్ ఫోర్టిఫైడ్ రైస్‌ను సెంట్రల్‌పూల్‌కు ఇస్తామని చెప్పారు. దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.180 కోట్లు ఆదా అవుతాయని మంత్రి గంగుల కమలాకర్ హర్షం వ్యక్తం చేశారు. -
AP: ఒంటరిగా ఉంటున్నారా?.. ఈ ఆప్షన్ మీ కోసమే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అనర్హత (ఇన్ ఎలిజిబుల్) కారణంగా రైస్ కార్డు కోల్పోయిన వారు దరఖాస్తు చేసుకుంటే ఆరు దశల ధ్రువీకరణ (సిక్స్ స్టెప్ వెరిఫికేషన్) అనంతరం కొత్తకార్డు మంజూరుకు పౌరసరఫరాల శాఖ అవకాశం ఇచ్చింది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో స్ప్లిట్ ఆప్షన్ తీసుకొచ్చింది. చదవండి: రేషన్ కార్డుదారులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ వీరితోపాటు విడాకులు తీసుకుని సంతానం లేని ఒంటరి వ్యక్తులు సైతం తగిన ధ్రువపత్రాలు సమర్పిస్తే రైస్ కార్డు ఇవ్వనుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖతో సమన్వయం చేసుకుంటూ రైస్ కార్డుల దరఖాస్తులను స్వీకరించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖకు సూచించింది. -
బియ్యంపై కయ్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైస్‌మిల్లులు మూతపడి మూడు వారాలు దాటింది. పేదలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు ఇచ్చిన బియ్యాన్ని లబ్ధిదారులకు ఇవ్వలేదనే సాకును చూపుతూ రాష్ట్రం నుంచి బియ్యాన్నే సేకరించకూడదనే తీవ్రమైన నిర్ణయం కేంద్రం తీసుకుంది. ఈనెల 7వ తేదీ నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) తీసుకోవడాన్ని నిలిపివేసింది. దీంతో రాష్ట్రంలోని సుమారు 3,250 రైస్ మిల్లులు మూతపడ్డాయి. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని వేచి చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కనుచూపు మేరలో స్పష్టత కనిపించడం లేదు. సీఎంఆర్ లేకపోవడంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన సొమ్ము ఆగిపోయింది. మరోవైపు మిల్లుల్లో నిండిపోయిన ధాన్యం నిల్వలు మిల్లింగ్ లేక ముక్కిపోతున్నాయి. మిల్లుల ఆవరణల్లో నిల్వ ఉంచిన సుమారు 20 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యంపైన టార్పాలిన్లు కప్పినా, వర్షం, తేమకు మొలకలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ధాన్యాన్ని ఏం చేయాలనే విషయంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. పౌరసరఫరాల శాఖ అధికారులు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖకు రాస్తున్న లేఖలకు ఎలాంటి స్పందన లభించడం లేదు. ఈ పరిస్థితుల్లో కస్టమ్ మిల్లింగ్ అవుతున్న గత వానాకాలం వడ్లు 40 ఎల్ఎంటీలకు తోడు యాసంగిలో సేకరించిన 50 ఎల్ఎంటీల ధాన్యం మిల్లులు, వాటి ఆవరణల్లో పేరుకుపోయాయి. దాదాపు 90 ఎల్ఎంటీల ధాన్యం, కస్టమ్ మిల్లింగ్ అయిన మరో 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లుల్లోనే ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. తప్పు దిద్దుకున్నా స్పందించని ఢిల్లీ.... కరోనా ప్రబలిన తరువాత 2021 మార్చి నుంచి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత కార్డు (ఎన్ఎఫ్ఎస్సీ)లు కలిగిన వారికి ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 53.68 లక్షల ఎన్ఎఫ్ఎస్ కార్డులకు గాను 1.92 కోట్ల మందికి ఉచిత బియ్యం పంపిణీ జరుగుతోంది. ఈ క్రమంలోనే గత ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన కోటా 1.90 ఎల్ఎంటీల బియ్యాన్ని పంపిణీ కోసం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ సేకరించింది. కానీ ఈ బియ్యాన్ని వివిధ కారణాల వల్ల పంపిణీ చేయలేదు. దీనిపై ఈనెల 7న రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్‌సీఐ లేఖ రాసింది. బియ్యం పంపిణీ చేయనందున సీఎంఆర్ బియ్యాన్ని తీసుకోబోమని హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సాంకేతిక కారణాలతో ఉచిత బియ్యం పంపిణీ చేయలేదని, ఆ కోటాను ఈనెల 18 నుంచి ఆరునెలల పాటు ప్రతినెలా ఇస్తామని లేఖ రాసింది. ఈ మేరకు 18 నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేస్తూ ఆ విషయాన్ని కూడా తెలియజేసింది. రాష్ట్రం నుంచి సీఎంఆర్ తీసుకునే విషయంలో విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఢిల్లీకి వెళ్లి మరీ అధికారులను కోరారు. అయినా ఇప్పటివరకు కేంద్రం స్పందించలేదు. రూ.1,700కు కొనేందుకు మిల్లర్లు సిద్ధం రాష్ట్రం నుంచి సీఎంఆర్ తీసుకోకుండా ఎఫ్‌సీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. ధాన్యాన్ని వేలం పద్ధతిలో మిల్లర్లకే అప్పగిస్తే ఎలా ఉంటుందనే ఆప్షన్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయమై మిల్లర్లు ఇటీవల సమావేశమై ప్రభుత్వం ధాన్యాన్ని తమకు విక్రయిస్తే కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. క్వింటాలు ధాన్యాన్ని రూ.1700 లెక్కన కొనుగోలు చేసి, బాయిల్డ్ రైస్‌గా విక్రయించుకుంటామని కూడా వారు చెప్పినట్లు తెలిసింది. దీనిపై మిల్లర్లతో ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజలపై కక్ష సాధించడమే.. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల నుంచి వడ్డీకి అప్పులు తెచ్చి, రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి, బియ్యంగా మార్చి కేంద్రానికి ఇస్తుంది. కేంద్రం తనకు తోచినప్పుడు ఇచ్చే డబ్బులను బ్యాంకులకు చెల్లిస్తూ, భారమైన వడ్డీని ప్రభుత్వమే భరిస్తూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో బియ్యం తీసుకోకుండా కేంద్రం మొండి వైఖరితో వ్యవహరించడం రాష్ట్ర ప్రజలపై కక్ష సాధించడమే. రాష్ట్ర రైతాంగానికి అన్యాయం చేసే విధానాన్ని తీవ్రంగా ఎండగడతాం. – గంగుల కమలాకర్, మంత్రి, పౌరసరఫరాల శాఖ -
రైతులకు రూ.700 కోట్లు జమ
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 5,000కు పైగా ఆర్బీకేల ద్వారా రబీ ధాన్యం కొనుగోళ్లు చేపట్టినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ గురువారం తెలిపారు. ఈ సీజన్లో 37 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా ఇప్పటివరకు 1,35,640 మంది రైతుల నుంచి 17.20 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం విక్రయించి 21 రోజులు దాటిన రైతులందరికీ కలిపి మొత్తంగా రూ.700 కోట్లు జమ చేసినట్లు వివరించారు. -
రూ.67కే కందిపప్పు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా చౌక దుకాణాల ద్వారా సబ్సిడీపై కందిపప్పును పంపిణీ చేస్తూ ప్రభుత్వం పేదలకు ఊరటనిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు ధర కిలో రూ.110కి పైగా ఉండటంతో సామాన్యులపై భారాన్ని తగ్గించేలా ఒక్కో కార్డుదారుడికి కిలో రూ.67కే ప్రభుత్వం అందిస్తోంది. అవసరమైన నిల్వలను కొత్త జిల్లాల వారీగా పౌరసరఫరాల శాఖ సిద్ధం చేసింది. వినియోగదారులకు ఇబ్బంది లేకుండా నాణ్యమైన కందిపప్పును కిలో ప్యాకెట్ల రూపంలో పారదర్శకంగా సరఫరా చేస్తోంది. నెలకు 6,500 టన్నుల వినియోగం రాష్ట్రంలో 1.45 కోట్ల రేషన్ కార్డుదారులకు కిలో చొప్పున పంపిణీ చేసేందుకు నెలకు 14,542 టన్నుల కందిపప్పు అవసరం అవుతుంది. ఐసీడీఎస్ పథకానికి మరో 1,097 టన్నులను వినియోగిస్తున్నారు. సగటున నెలకు రేషన్ దుకాణాల ద్వారా కేవలం 6,000 నుంచి 6,500 టన్నులు మాత్రమే విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని మండల నిల్వ కేంద్రాల్లో (ఎంఎల్ఎస్ పాయింట్లు) 1,771 టన్నుల సరుకు అందుబాటులో ఉంది. దీనికితోడు మరో 25 వేల టన్నుల సేకరణకు పౌరసరఫరాల శాఖ టెండర్లు ఖరారు చేసి సరఫరాకు అనుమతులు ఇచ్చింది. దీంతో మొత్తం 26,770 టన్నులు కందిపప్పు నిల్వలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఈ లెక్కన మూడు నెలల పాటు ఎటువంటి అవరోధం లేకుండా సబ్సిడీపై కందిపప్పు అందించనున్నారు. పంచదార కిలో రూ.34 రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అర కిలో ప్యాకెట్ల రూపంలో పంచదారను సబ్సిడీపై అందిస్తోంది. ఒక్కో కార్డుకు గరిష్టంగా కిలో వరకు రూ.34కు ఇస్తుండగా మరో మూడు నెలల వరకు సరఫరాకు అంతరాయం లేకుండా నిల్వలను సమకూర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంఎల్ఎస్ పాయింట్లలో 4,442 టన్నుల పంచదార నిల్వలు అందుబాటులో ఉండగా.. మరో 15,335 టన్నుల సేకరణకు టెండర్లను ఖరారు చేశారు. ప్రతి నెలా 5,500–6000 టన్నుల వరకు వినియోగం ఉంటోంది. 3 నెలల వరకు ఢోకా లేదు రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు మూడు నెలల పాటు సబ్సిడీపై కందిపప్పు, పంచదార అందించేందుకు అవసరమైన నిల్వలను సమకూర్చాం. ఇప్పటికే టెండర్లు పూర్తవగా.. వేగంగా సరుకును సరఫరా అయ్యేలా పర్యవేక్షిస్తున్నాం. జిల్లాల్లో ఎక్కడైనా అత్యవసరంగా స్టాక్ అవసరమైతే పక్క జిల్లాల నుంచి సర్దుబాటు చేసేలా అధికారులను ఆదేశించాం. దాదాపు అన్ని మండల స్థాయి నిల్వ కేంద్రాలకు సరుకును అందుబాటులో ఉంచాం. వినియోగదారులకు రేషన్ పంపిణీలో జాప్యం జరగనివ్వం. – వీరపాండియన్, ఎండీ, పౌర సరఫరాల శాఖ -
బలవర్థక ఆహారమే లక్ష్యం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కేంద్ర, రాష్ట్ర పభుత్వాల మధ్య బాయిల్డ్ రైస్‌పై వివాదం ఒకవైపు కొనసాగుతుండగానే ఇప్పుడు ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధకమైన బియ్యం) అంశం తెరపైకి వచ్చింది. గతేడాది రబీకి సంబంధించి సీఎంఆర్ బియ్యం ఇవ్వాల్సిన రైస్ మిల్లర్లు ఇకపై బలవర్థకమైన బియ్యాన్ని కలిపి ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ రైస్ మిల్లులకు ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్‌సీఐ (భారత ఆహార సంస్థ) నిర్ణయం మేరకే ఆదేశాలిచ్చినట్లు పౌరసరఫరాల సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.89లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్‌తో కూడిన బియ్యాన్ని సేకరించాలని నిర్ణయించారు. క్వింటాల్‌కు ఒక కిలో.. గత రబీ సీజన్(2020–21)లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మర ఆడించేందుకు రైస్ మిల్లులకు ఇచ్చిన విషయం విధితమే. ఈ బియ్యంలో బలవర్థకమైన బియ్యాన్ని మిలితం చేసి ఇవ్వాలని ఎఫ్‌సీఐ ఆదేశించింది. ఒక్కో క్వింటాల్ బియ్యంలో కిలో బలవర్థక బియ్యాన్ని కలపాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసిన బలవర్ధక బియ్యాన్ని సీఎంఆర్ బియ్యంలో మిళితం చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం వెంటనే మిల్లులు ఈ మిక్చర్ ప్లాంట్లను అమర్చుకోవాలని ఆదేశించింది. బలవర్థక బియ్యంలో వివిధ రకాల విటమిన్లు ఉంటాయి. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి ఈ ఫోర్టిఫైడ్‌రైస్‌ను సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
కేంద్రం నిర్దేశించిన లక్ష్యం కన్నా అధికంగా ధాన్యం సేకరణ
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిర్దేశించిన లక్ష్యం కన్నా అధికంగా రాష్ట్రంలో ధాన్యం సేకరణ జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దేశ వ్యాప్తంగా 593 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే, 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణతో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. వానాకాలం సీజన్లో రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజ కొనాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గత సంవత్సరం కన్నా దాదాపు 44 శాతం అధికంగా సేకరించినట్లు తెలిపారు. -
ధాన్యం కొనుగోళ్లు 69.5 లక్షల మెట్రిక్ టన్నులు
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్లో ధాన్యం సేకరణ దాదాపుగా పూర్తి కావచ్చిం దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటివరకు 69.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, మరో 2 లక్షల టన్నుల వరకు సేకరించే అవకాశం ఉందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోళ్లలో పెట్టిన పేచీలను అధిగమించి విజయవంతంగా ధాన్యం సేకరణ జరిపినట్లు తెలిపారు. రాష్ట్రంలో వానాకాలం సీజన్లో ఇంత పెద్ద మొత్తంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం ఇదే తొలిసారని వివరించారు. 12.72 లక్షల మంది నుంచి కొనుగోలు ‘గత సంవత్సరం వానాకాలంలో 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా.. ఈసారి అదనంగా మరో 22 ఎల్ఎంటీ ధాన్యాన్ని రైతుల నుంచి తీసుకోవడం జరిగింది. ఈ సీజన్లో 6,878 కొనుగోలు కేంద్రాలను తెరవగా, దాదాపు 20 జిల్లాల్లో ధాన్యం సేకరణ పూర్తిస్థాయిలో జరిగింది. వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో కొన్నిచోట్ల ఆలస్యంగా సాగు చేసిన కారణంగా కొనుగోళ్లలో జాప్యం జరిగింది. 12.72 లక్షల మంది రైతుల నుంచి రూ.13,601 కోట్ల విలువైన ధాన్యాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేశాం. ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టం (ఓపీఎంఎస్)లో నమోదైన 8.68 లక్షల మంది రైతులకు రూ.11 వేల కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. మరో రూ. 2,500 కోట్లు ఓపీఎంఎస్‌లోకి వివరాలు ఎక్కగానే రైతుల ఖాతాల్లోకి చేరతాయి. రైతులకు ధాన్యం సొమ్మును ఒక్కరోజు కూడా ఆపకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వచ్చే యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండబోవని ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో రైతులు అందుకు అనుగుణంగానే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించడం హర్షణీయం..’ అని మంత్రి గంగుల పేర్కొన్నారు. -
ఆ బియ్యం.. ఆరోగ్యానికి అభయం
సాక్షి, అమరావతి: చిన్నారులు, మహిళల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విశాఖ, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించింది. రెండేళ్ల క్రితం విజయనగరం జిల్లాలో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు సత్ఫలితాలనిస్తోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదో నివేదిక ప్రకారం రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య విజయనగరం జిల్లాలో తాజాగా 78.7 నుంచి 66.7 శాతానికి తగ్గింది, మహిళల్లో రక్తహీనత 75.7 నుంచి 64.6 శాతానికి తగ్గడం గమనార్హం. సరైన పోషకాలు అందక సాధారణం కంటే తక్కువ బరువు ఉన్న మహిళల శాతం 25.8 నుంచి 16.9 శాతానికి తగ్గింది. ఆర్థిక భారం పడినా.. ఆరోగ్యకర సమాజాన్ని కాంక్షిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫోర్టిఫికేషన్ బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత కార్డులకు(ఎన్ఎఫ్ఎస్ఏ) మాత్రమే ఈ రకమైన బియ్యాన్ని సరఫరా చేస్తుండగా మిగిలిన కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతో అందచేస్తోంది. ఎన్ఎఫ్ఎన్ఏలో కూడా కేంద్రం 75 శాతం కార్డులకు మాత్రమే అందిస్తోంది. మూడు జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేసేందుకు రాష్ట్రంపై నెలకు సుమారు రూ.1.70 కోట్లకుపైగా అదనపు భారం పడనుండగా ఏడాదికి రూ. 20.40 కోట్లు అదనంగా ఖర్చు కానుంది. విశాఖపట్నం, కడప జిల్లాల్లో రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య అధికంగా ఉన్నందున మొదటి దశలో అక్కడ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేయనున్నారు. ఈ సీజన్లో 27 లక్షల టన్నుల లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా గతేడాది జూన్ నుంచి మధ్యాహ్నం భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు విటమిన్లతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తున్నారు. ఫలితంగా చాలా వరకు రక్తహీనత సమస్యలు తగ్గాయి. గత సీజన్లో (ఖరీఫ్, రబీ) 2.4 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సేకరించారు. ప్రస్తుత సీజన్లో 27 లక్షల టన్నుల సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు. విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని మిల్లుల్లో ఫోర్టిఫైడ్ రైస్‌ను తయారు చేస్తున్నారు. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ అంటే? బియ్యపు నూకలను పిండిగా చేసి ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్–బి 12 లాంటి కీలక సూక్ష్మ పోషకాలను జోడించి నీళ్లు పోసి ముద్దగా చేస్తారు. ఈ ముద్దను యంత్రంలో వేసి ఎక్స్ట్రాషన్ పద్ధతి ద్వారా బియ్యపు గింజలను తయారు చేస్తారు. ఈ కృత్రిమ బియ్యాన్ని ఆరబెట్టి ప్యాకింగ్ చేస్తారు. వీటినే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ అంటారు. ఇవి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. కిలో ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ సేకరణకు ప్రభుత్వం రూ.75 చొప్పున ఖర్చు చేస్తోంది. వంద కిలోల సాధారణ బియ్యంలో ఒక కేజీ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్‌ను కలిపి పంపిణీ చేస్తారు. ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటే చిన్నారుల్లో మెదడు, వెన్నెముక పెరుగుదలతో పాటు మహిళలకు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం మెరుగుపడుతుంది. నాడీ వ్యవస్థ పనితీరు బాగుంటుంది. రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ సంస్థ టెండర్లు నిర్వహించి ఇతర రాష్ట్రాల నుంచి ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్‌ను కొనుగోలు చేస్తోంది. దశలవారీగా అన్ని జిల్లాల్లో.. రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు, మహిళలకు ఫోర్టిఫైడ్ బియ్యం మంచి పోషకాలను అందిస్తుంది. ఇందులో విటమిన్ బి –12, ఐరన్, ఫోలిక్ యాసిడ్ లాంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయి. విజయనగరంలో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు మంచి ఫలితాలను ఇచ్చింది. దశలవారీగా అన్ని జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని రేషన్ డిపోల ద్వారా ప్రజలకు అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. – గిరిజా శంకర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ పోషకాలతో కూడిన ఆహారం పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. కడప, విశాఖపట్నం జిల్లాల్లో వీటిని పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. చౌక బియ్యం ద్వారా సమకూరే పోషకాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో త్వరలో విజయనగరం జిల్లాలో సర్వే నిర్వహిస్తాం. – వీరపాండియన్, పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీ -
రైస్ ఏజ్ టెస్టు.. రేషన్ బియ్యాన్ని పట్టిస్తుంది.. ఎలా పరీక్ష చేస్తారో తెలుసా?
సాక్షి, అమరావతి: రేషన్ బియ్యం రీసైక్లింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు దేశంలో తొలిసారిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా వినియోగిస్తోంది. బియ్యం కాల నిర్ధారణ పరీక్ష (రైస్ ఏజ్ టెస్టు) ద్వారా పౌరసరఫరాల శాఖ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. గతేడాది రెండు సీజన్లలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. తాజాగా కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల శాఖ దేశమంతా ఈ విధానం అనుసరించేందుకు ఆమోదం తెలిపింది. అన్ని రాష్ట్రాలు మిల్లర్లు ఇచ్చే బియ్యానికి తప్పనిసరిగా రైస్ ఏజ్ టెస్టు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దోపిడీకి అడ్డుకట్ట.. సబ్సిడీ రేషన్ బియ్యాన్ని కొన్నిచోట్ల దళారులు బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు రైస్ మిల్లర్లు సబ్సిడీ బియ్యాన్ని కొనుగోలు చేసి పాలిష్ పట్టి సివిల్ సప్లయిస్, ఎఫ్‌సీఐ గోడౌన్లకు రీసైకిల్ చేస్తున్నారు. ఎక్కువ కాలం నిల్వ ఉండటం, మిల్లింగ్ బియ్యం పాతవి కావడంతో గోడౌన్లలో స్టాక్ పురుగులు పట్టి ముక్కిపోతోంది. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రైస్ ఏజ్ టెస్టు విధానాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా తాజా మిల్లింగ్ బియ్యాన్ని కచ్చితంగా గుర్తిస్తుండటంతో రీసైకిల్ దందాకు తెరపడింది. మిల్లర్ల సమక్షంలో శాంపిళ్ల పరీక్ష రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లర్ల వద్దకు తరలించి కస్టమ్ మిల్లింగ్ చేయిస్తారు. అనంతరం బియ్యాన్ని గోడౌన్లలో భద్రపరుస్తారు. అయితే అంతకు ముందే అధికారులు బియ్యం నాణ్యత పరీక్షలను గోడౌన్ ప్లాట్‌ఫామ్‌ల వద్దే చేస్తున్నారు. 580 బస్తాలను (29 టన్నులు) ఒక లాటుగా పరిగణించి మిల్లర్ల సమక్షంలో శాంపిళ్లను పరీక్షిస్తున్నారు. ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ రంగు వస్తే తాజా మిల్లింగ్ బియ్యంగా పరిగణిస్తారు. లేదంటే లోడును మిల్లర్లకు తిప్పి పంపుతున్నారు. ఎలా చేస్తారు? మిథైల్ రెడ్, బ్రోయోథైమోల్ బ్లూ, ఇథైల్ ఆల్కహాల్, శుద్ధమైన నీటిని కలిపి ప్రత్యేక ద్రావణాన్ని తయారు చేస్తారు. టెస్ట్‌ట్యూబ్‌లో 10 ఎంఎల్ మిశ్రమాన్ని తీసుకుని ఐదు గ్రాముల నమూనా బియ్యాన్ని కలపాలి. నిముషం తర్వాత బియ్యం రంగు మారుతుంది. ఆకుపచ్చగా మారితే తాజా మిల్లింగ్ బియ్యం (నెలలోపు మిల్లింగ్ చేసినవి) అని పరిగణిస్తారు. లేత ఆకుపచ్చ రంగులో మారితే ఒకటి నుంచి రెండు నెలలు, పసుపు రంగులో మారితే మూడు నెలలు, నారింజ రంగులోకి మారితే నాలుగు నుంచి ఐదు నెలల క్రితం మిల్లింగ్ చేసినవిగా నిర్ధారిస్తారు. పాత ధాన్యాన్ని మర పట్టిస్తే ఇబ్బంది ఉండదు. పాత బియ్యాన్ని కొత్తగా మిల్లింగ్ చేస్తే మాత్రం తెలిసిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో.. మిల్లింగ్ అనంతరం బియ్యంలో నూకలు, రంగు, తేమ శాతాన్ని గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఈ యంత్రం విలువ సుమారు రూ.13 లక్షలు ఉంటుంది. సివిల్ సప్లయిస్ ప్రధాన కార్యాలయంతో పాటు విజయవాడ, ఏలూరు, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లా కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. దేశంలో తొలిసారిగా.. రేషన్ బియ్యం దోపిడీని అరికట్టేందుకు ‘రైస్ ఏజ్ టెస్టింగ్’ విధానాన్ని దేశంలో మొదటి సారిగా రాష్ట్రంలో ప్రవేశపెట్టాం. ప్రయోగాత్మక ఫలితాల అనంతరం దేశమంతా దీన్ని పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇది రాష్ట్రానికి గర్వకారణం. బియ్యం కచ్చితంగా నిర్ధారణ అవుతుండటంతో బియ్యం రీసైక్లింగ్ దందాకు అడ్డుకట్ట పడుతుంది. చౌక బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా అడ్డుకోవచ్చు. – వీరపాండియన్, రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీ -
రైతులకు రూ.1,153 కోట్లు చెల్లించాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోందని పౌర సరఫరాల శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. ఇప్పటివరకు 17లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు ఆయన చెప్పారు. సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు 76,158 మంది రైతులకు రూ.1,153 కోట్ల చెల్లింపులు చేశామన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోనే నగదు జమ చేస్తున్నామన్నారు. ఇ–కేవైసీ, బ్యాంకు ఖాతాలో సమస్యలు ఉంటే కొంత జాప్యం జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వం రైతులకు మద్దతుగా నిలుస్తుంటే కొన్ని పత్రికలు ధాన్యం విక్రయించిన రైతులకు నగదు రావట్లేదంటూ అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయన్నారు. వారిపై ప్రభుత్వం న్యాయపరంగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ఖరీఫ్‌లో 50 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా.. ప్రస్తుతం 4,837 ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని, ఏప్రిల్ నాటికి లక్ష్యాన్ని పూర్తిచేస్తామని కమిషనర్ చెప్పారు. ఫోర్టిఫైడ్ బియ్యం మరో రెండు జిల్లాల్లో.. ఐరన్, ఫోలిక్ యాసిడ్, బి–12 విటమిన్ వంటి సూక్ష్మపోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీని దేశంలోనే తొలిసారిగా గతేడాది విజయనగరంలో ప్రారంభించినట్లు గిరిజాశంకర్ తెలిపారు. కొత్తగా విశాఖపట్నం, వైఎస్సార్ కడపలో కూడా ఈ బియ్యాన్ని అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. జనవరి 18 నుంచి రెండు నెలల (డిసెంబర్, జనవరి) ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తామన్నారు. 1902, 155215 నంబర్లతో కమాండ్ కంట్రోల్ రూమ్ ధాన్యం కొనుగోలులో సమస్యల పరిష్కారానికి రాష్ట్రస్థాయిలో 1902, 155215 నంబర్లతో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేసినట్లు పౌర సరఫరాల శాఖ ఎండీ వీరపాండియన్ తెలిపారు. పొలం వద్దే ధాన్యం కొనుగోలు చేసేలా మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టినట్లు ఆయన వివరించారు. ఆర్బీకేల్లో చేసే ఐదు రకాల టెస్టులను ఐఓటీ ఆధారంగా రియల్ టైమ్‌లో చేసేందుకు ఒక స్టార్టప్ కంపెనీ సహకారంతో కృష్ణాజిల్లాలో పైలట్ ప్రాజక్టుగా చేపట్టామన్నారు. త్వరలోనే దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తామన్నారు. ప్రభుత్వ గోదాముల్లోకి రీసైకిల్డ్ బియ్యం రాకుండా గుర్తించేందుకు వీలుగా ఏజ్ టెస్టింగ్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు వీరపాండియన్ తెలిపారు. -
రికార్డు స్థాయిలో కొనుగోళ్లు : మంత్రి గంగుల
సాక్షి, హైదరాబాద్: వానాకాలం ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయి కొనుగోళ్లు నమోదు చేసిందని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేంద్రం సహకరించకున్నా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర రైతుల పక్షాన నిలిచి ధాన్యం సేకరించినట్లు చెప్పారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో ధాన్యం కొనుగోళ్లు, కస్టమ్ మిల్లింగ్ రైస్‌పై సమీక్షను మంగళవారం నిర్వహించారు. ధాన్యం సేకరణ లక్ష్యం దాదాపు పూర్తికావచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 46 ఎల్ఎంటీ బియ్యానికి సమానమైన 68.65 ఎల్ఎంటీ ధాన్యం సేకరణలో 3వ తేదీ నాటికే 65.20 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించినట్లు తెలిపారు. కేంద్రం విధించిన నిబంధనలతో సంబంధం లేకుండా ఎంత ధాన్యం వచ్చినా సేకరిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 4,808 కొనుగోలు కేంద్రాల్లో సేకరణ పూర్తయిందని, వాటిని మూసివేసివేశామని తెలిపారు. ఎఫ్‌సీఐకి సీఎంఆర్ అందజేసే ప్రక్రియ కూడా కొనసాగుతుందని, ఈ వానకాలానికి సంబంధించి దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లింగ్ చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ డిప్యూటీ కమిషనర్లు శ్రీకాంత్ రెడ్డి, రుక్మిణి, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కాశీ విశ్వనాథ్, వాణీభవాని, నసీరుద్దీన్, పౌరసరపరాల సంస్థ జనరల్ మేనేజర్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Telangana: జనవరి 5 నుంచి రేషన్ పంపిణీ
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక సమస్యల కారణంగా జనవరి నెల రేషన్‌ను ఈనెల 4న కాకుండా 5వ తేదీన పంపిణీ చేస్తామని తెలంగాణ పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. రేషన్ లబ్ధిదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, పెద్ద మనసుతో అర్థం చేసుకుని రేషన్ కార్డుదారులు ప్రభుత్వానికి సహకరించాలని ఆ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.