సాక్షి, అమరావతి: రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 2,252 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. అవసరాన్ని బట్టి మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు పౌర సరఫరాల సంస్థ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఖరీఫ్‌లో 45 లక్షల మెట్రిక్ టన్నుల పైబడి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు బాసటగా నిలవాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది.
కేంద్ర ప్రభుత్వం ఏ–గ్రేడ్ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.1,815, సాధారణ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.1,765 మద్దతు ధర ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ధరను కేంద్రం మరికొంత పెంచొచ్చని ఓ అధికారి తెలిపారు. కనీస మద్దతు ధర కంటే మార్కెట్‌లో ఎక్కువ ధర ఉంటే రైతులు బయట కూడా ధాన్యాన్ని విక్రయించుకోవచ్చు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యానికి తేమ శాతం కొలిచే మీటర్లు, బరువు తూచే యంత్రాలు, టార్పాలిన్లు, తూర్పారపట్టే యంత్రాలు, తదితర వాటిని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం మార్కెటింగ్ శాఖకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చేందుకు వీలుగా రాష్ట్రంలో ఇప్పటివరకు 9.63 లక్షల మంది రైతులు పేర్లను నమోదు చేసుకున్నారు.
ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు
–కోన శశిధర్, ఎక్స్‌అఫీషియో కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ
రైతులు దళారుల బారిన పడి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలి. దీనివల్ల రైతులకు మద్దతు ధర కూడా లభిస్తుంది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 2,252 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. అవసరమైతే కేంద్రాలను పెంచుతాం. ఎక్కువ ధర ఇస్తామని చెప్పి కొందరు దళారులు తూకాల్లో మోసం చేసే ప్రమాదం ఉంది. మోసం చేస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే స్థానిక అధికారులకు తెలపాలి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తాం.
2,252 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
Published Wed, Oct 23 2019 4:13 AM | Last Updated on Wed, Oct 23 2019 4:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment