grain purchase centers
-
ఆ నిర్ణయాన్ని కేసీఆర్ వెనక్కి తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్ : కొనుగోలు కేంద్రాల ఎత్తివేతని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉపసంహరించుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. 2005లో తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మార్క్ ఫెడ్ చైర్మన్‌గా ఉన్న సమయంలో మొక్కజొన్న, వరి ధాన్యాల కొనుగోలు కేంద్రాలు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మండల వారీగా, మేజర్ గ్రామ పంచాయతీల వారీగా ఏర్పాటు చేశామని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి.. పంట వేసినప్పటి నుండి కొనుగోలు చేసే వరకు నా బాధ్యత అన్న ముఖ్యమంత్రి.. రాష్ట్రంలోని మొత్తం కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తామనే మాట వెనక్కి తీసుకోవాలి. ఎన్నికల హామీ లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదు. సన్న వడ్లు వేసుకోమని చెప్పి మద్దతు ధరలు కల్పించలేదు. ( తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు డ్రామా ఆడుతూ ఈరోజు కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయడం అనేది రైతులకు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. కాబట్టి మేం చూస్తూ ఊరుకోం. ‘జాగ్రత్త కేసీఆర్’ అని హెచ్చరిస్తున్నాం. పునరాలోచన చేయండి. రైతుల ఆగ్రహానికి గురి కావద్దని కోరుతున్నాను. కొనుగోలు కేంద్రాల ఎత్తివేతను ఉపసంహరించుకోవాలి. లేకపోతే వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము మళ్లీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తా’’మని చెప్పారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
సాక్షి, కరీంనగర్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని పౌరసరఫరాల మంత్ర గంగుల కమాలాకర్ మండిపడ్డారు. కొత్తపల్లిలో మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంత పెద్ద ఎత్తున ఏనాడు పంట రాలేదని, కొనుగోళ్లు కూడా గతంలో ఎప్పుడు జరగలేదన్నారు. కాళేశ్వరం జలాలు, 24 గంటల కరెంట్ వల్లే పంట దిగుబడి పెరిగిందని పేర్కొన్నారు. 21 రోజుల్లో 21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, సగటున రోజుకు లక్ష మెట్రిక్ టన్నులు కోనుగోలు చేస్తున్నామని తెలిపారు. 3.5 లక్షల మంది రైతులు ఇప్పటి వరకు తమ పంటను అమ్ముకున్నారని, రాష్ట్రంలో ఉన్న 6540 కోనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటికే 5789 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ జరుగుతుంటే కాంగ్రెస్, బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని, భారీ ఎత్తున పంట దిగుబడి వచ్చి రైతులు సంతోషంగా ఉండటం ప్రతిపక్ష పార్టీలకు ఇష్టం లేదని ధ్వజమెత్తారు. ఇంత పంట దిగుబడి చూసి ఓర్వలేకే ప్రతి పక్షాలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. (రేషన్ కార్డులేని వారికి పోస్టల్ ద్వారా రూ.1,500) రైతులు సాగునీటి కోసం, కరెంట్ కోసం ఇబ్బందులు పడినప్పుడు విమర్శులు చేస్తున్న నేతలంతా ఎక్కడికెళ్లారని, రైతులు పంటను కాల్చుతుంటే నవ్వుతున్న వాళ్లు ఇంతకాలం రైతుల కోసం ఎందుకు పోరాటం చేయలేదని మండిపడ్డారు. కాళేశ్వరం జలాలకు, 24 గంటల కరెంటుకు అడ్డుపడిన నేతలే ఇప్పుడు మళ్లీ రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారన్నారు. నారు, నీరు పోయని కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలను తెలంగాణ రైతులు నమ్మొద్దని, నారు, నీరు పోసి ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రైతులు నమ్మాలని సూచించారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వం కొనకపోతే రూ. 800లకు క్వింటా వడ్లు అమ్ముకుంటున్నారని, దేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ధాన్యం కొనడం లేద చెప్పారు. ఏనాడు రైతుల గురించి ఆలోచించని నాయకులు కార్లేసుకుని వచ్చి కల్లాల్లో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఇక రైసు మిల్లులకు, రైతులకు సంబంధం లేదని, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మాత్రమే రైతులు రావాలన్నారు. (శభాష్ కమలాకర్ అంటూ అభినందించిన సీఎం) పాడీ క్లీనింగ్ చేసి తీసుకువచ్చిన తర్వాత కూడా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తే మా దృష్టికి తీసుకురావాలని మంత్రి రైతులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారమే తాలు నిబంధనలు అమలు చేస్తుందని, బీజేపీ నేతలకు ఏ మాత్రమైన చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో దీక్ష చేసి తెలంగాణలోని రైతులకు ధాన్యం సేకరణ నిబంధనలు సడలించేలా చూడాలని కోరారు. రాజకీయ పార్టీల ప్రోత్సాహంతోనే కొంతమంది రైతులు తూర్పార బట్టిన తాలును మాత్రమే తగలబెట్టారని పేర్కొన్నారు. దాదాపు 40 లక్షల ఎకరాలకి ఈసారి కోటీ 20 లక్షల ధాన్యం దిగుబడి వచ్చిందని చెప్పారు. ఇదంతా చూసి ప్రతిపక్షాలకు కళ్లు మండుతున్నాయని, మీ కళ్ల మంటలే మాకు దీవెనలు అని హితవు పలికారు. కరోనా ప్రభావం రైతులపై పడకుండా ఉండేందుకు ఊరుకో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నామని వెల్లడించారు. సన్నరకం ధాన్యం పండించాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని, ఈ విషయంలో రైతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. -
సకాలంలో రైతులకు చెల్లింపులు
కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల గురించి ఆ మీడియా కథనాల్లో రాయరు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.8 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తే అందులో రూ.6 వేల కోట్లు చెల్లించింది. ఇక మిగిలింది కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే. కేంద్రం నుంచి దాదాపు రూ.4,500 కోట్ల బకాయిలు రాకున్నా రూ.2 వేల కోట్లు అప్పు చేసి మరీ రైతులకు చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళో, రేపో రైతుల బకాయిలు ఎలాగూ క్లియర్ అవుతాయి కాబట్టి.. దానికి ముందే చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులు పెండింగ్ ఉన్నాయని చెబుతాడు. దానిని ఆయన మీడియా తల కెత్తుకుంటుంది. వాస్తవాలు ఏమిటన్నది మాత్రం ఆయనా చెప్పడు. వాళ్లూ రాయరు. గతంలో చంద్రబాబు పెండింగ్‌లో పెట్టిన రూ.960 కోట్లు కూడా ఈ ప్రభుత్వం వచ్చాకే చెల్లించిందన్న విషయం కూడా ఆ కథనాల్లో రాయరు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు పడకుండా చూడాలని, సకాలంలో చెల్లింపులు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్‌లో రాబోయే సమస్యలను ముందుగానే ఊహించి జాగ్రత్తలు తీసుకోవాలని, రైతుకు ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించడంలో శ్రద్ధాసక్తులు చూపించాలన్నారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన హార్టికల్చర్, సెరికల్చర్, రైతు భరోసా కేంద్రాలపై అధికారులతో సమీక్షించారు. ధాన్యం బకాయిలపై కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని ఈ సందర్భంగా కొందరు అధికారులు ప్రస్తావించారు. ఈ దుష్ప్రచారం కొత్తేమీ కాదని, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన రూ.4,500 కోట్ల గురించి చంద్రబాబు మాట్లాడరని, ఆయన నోటి నుంచి ఈ మాట కూడా రాదని ఎద్దేవా చేశారు. నిజాయితీ, పారదర్శకత, బాధ్యతతో రైతులకు న్యాయం చేసే దిశగా అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే.. రైతులకు మేలు జరిగేలా శాశ్వత పరిష్కారం అరటి, చీని, టమాటా, మామిడి, ఉల్లి, కొబ్బరి మార్కెటింగ్‌కు సంబంధించి ప్రతి ఏడాది ఏదో రూపంలో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ధరలు దక్కక రైతులు రోడ్డెక్కుతున్నారు. ఇలాంటి పంటల విషయంలో రైతులకు మేలు జరిగేలా శాశ్వత పరిష్కారం చూడాలి. ఈ పంటల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. అవి వచ్చేలోగా కోల్డ్ స్టోరేజీ సదుపాయాన్ని పెంచుకునేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి ఏటా ఒక పంటను లక్ష్యంగా చేసుకుని మార్కెటింగ్ ఇబ్బందులు రాకుండా కార్యాచరణను అమలు చేయండి. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, అనుబంధ ఉత్పత్తులపై దృష్టి సారించాలి. ఆహార శుద్ధి పరిశ్రమలు, యూనిట్లు పెట్టి రైతులను ఆదుకోవాలి. అరటి, చీని, టమాటా, కొబ్బరి, ఉల్లి, మామిడి పంటలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కోనసీమ ప్రాంతంలో కొబ్బరి ప్రాసెసింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. వ్యవసాయ ఉత్పత్తుల కోసం శాశ్వత సర్టిఫికేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలి. అరటి అనుబంధ ఉత్పత్తులపై ఐజీ కార్ల్‌లో ఓ సంస్థ ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఫుడ్ పార్క్ ఏర్పాటు దిశగా అడుగు వేయాలి. పులివెందుల ఐజీ కార్ల్‌లో వ్యవసాయం, దాని అనుబంధ సంస్థల్లో అరటి అనుబంధ ఉత్పత్తులపై ఓ సంస్థను ఏర్పాటు చేయాలి. అరటి అనుబంధ ఉత్పత్తులపై పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలి. సోలార్ కోల్డ్ స్టోరేజ్ రూం సహా ఏది చేసినా సంతృప్త స్థాయిలో చేయండి. మండలాన్నో, నియోజకవర్గాన్నో యూనిట్‌గా చేసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేపడితే సత్ఫలితాలు వస్తాయి. కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్ని తెల్లదోమ ఆశించినట్టు తెలుస్తోంది. దీని నివారణకు ఏయే చర్యలు చేపట్టాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి. అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలి. ఈ ఏడాది లక్ష్యంగా నిర్ణయించుకున్న 50 వేల టన్నుల పండ్ల ఉత్పత్తుల ఎగుమతిని పూర్తి చేసేలా అధికారులు కృషి చేయాలి. స్వయం సహాయక సంఘాలతో తేనె ఉత్పత్తులను ప్రోత్సహించి గిరిజనులకు న్యాయం చేయండి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ సమావేశానికి వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబుతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రైతు భరోసా కేంద్రాలు ఆదర్శంగా నిలవాలి రాష్ట్రంలో 3,300 రైతు భరోసా కేంద్రాలు సిద్ధమయ్యాయని చెప్పినప్పుడు సీఎం వైఎస్ జగన్ అధికారుల పని తీరును ప్రశంసిస్తూ ఈ కేంద్రాలు దేశానికే ఆదర్శప్రాయంగా నిలవాలని ఆకాంక్షించారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాక వ్యవసాయం సహా ఉద్యానవన పంటల సాగులో వినూత్న మార్పులు తీసుకురావాలన్నారు. ఏయే వంగడాలు సాగు చేయాలన్న దానిపై రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల్లో అవగాహన కల్పించాలని, వచ్చే ఖరీఫ్ నాటికి అన్ని కేంద్రాలు సిద్ధం కావాలని చెప్పారు. ‘వ్యవసాయ సిబ్బందికి ఇచ్చే ట్యాబ్‌లతో రైతులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేలా చూడాలి. ఇ–క్రాపింగ్‌ను పూర్తి చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. దీనిపై దృష్టి సారించాలి. ప్రతి గ్రామ సచివాలయంలో మద్దతు ధరల పోస్టర్ ఉండాలి. రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించే విత్తనాలు నాణ్యంగా ఉండాలి. ఖరీఫ్‌కు విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉంచాలి. -
కేజీ.. క్యాజీ..!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ధాన్యం రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఆరుగాలం శ్రమించి.. పంట పండించి.. ధాన్యం అమ్మేందుకు కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే.. తూకం సమయంలో బస్తా బరువు కింద తరుగును నిబంధనల ప్రకారం 500 గ్రాములు తీయాల్సి ఉండగా.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బస్తాకు కేజీ తరుగు కింద తీస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఒక్కో బస్తాకు కేజీ చొప్పున తీస్తే పెద్ద మొత్తంలో ధాన్యం అమ్ముకునే రైతులకు భారీ నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు. జిల్లాలో డీఆర్డీఏ ఐకేపీ ఆధ్వర్యంలో 28, ఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 94.. మొత్తం 122 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పటివరకు డీఆర్డీఏ ఐకేపీ ఆధ్వర్యంలో 15, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 80.. మొత్తం 95 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 7 డీఆర్డీఏ ఐకేపీ కేంద్రాల ద్వారా, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 34 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేశారు. మొత్తం 1,005 మంది రైతుల నుంచి గ్రేడ్–‘ఏ’ రకం ధాన్యం 2,323.360 మెట్రిక్ టన్నులు, కామన్ రకం 5,090.640 మెట్రిక్ టన్నులు.. మొత్తం 7,414 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కోతల విధింపుతో.. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్ముకునే రైతులకు కొర్రీలు తప్పడం లేదు. ధాన్యం తూకం వేసే సమయంలో కొనుగోలుదారులు కోతలు విధిస్తుండడంతో రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. పాత బస్తాతో తూకం వేస్తే 500 గ్రాముల ధాన్యం, కొత్త బస్తాతో తూకం వేస్తే 600 గ్రాముల ధాన్యం తీయాల్సి ఉంటుంది. అయితే అలా కాకుండా.. బస్తాకు కేజీ చొప్పున ధాన్యం తరుగు తీస్తుండడంతో రైతులకు నష్టాలను మిగులుస్తున్నాయి. ధాన్యం పండించేందుకు శ్రమించి.. కష్టపడి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన రైతుకు ధాన్యం అమ్మే దగ్గర కన్నీళ్లే మిగులుతున్నాయి. తన కళ్లముందే తరుగు తీస్తుండడంతో చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. నిబంధనలకతీతంగా కొనుగోలు కేంద్రాల్లో కేజీ ధాన్యం తరుగు కింద తీస్తున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. ఇది చిన్న విషయంగానే కనిపిస్తున్నా.. రైతులకు కనిపించని నష్టాన్ని మిగులుస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటే మద్దతు ధరకు అమ్ముకోవచ్చనే ఆశతో ఇక్కడకు వస్తున్న రైతులకు నిబంధనల పేరుతో తీస్తున్న తరుగుతో నష్టం తప్పడం లేదు. ఒక్క తరుగు విషయంలోనే కాకుండా.. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులు అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో లభించే మద్దతు ధర ఏమోగానీ.. ఇలాంటి ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలని రైతులు వాపోతున్నారు. హమాలీ ధరల విషయంలో.. ఇతర విషయాల్లో కూడా రైతులు ఇబ్బందులపాలు కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కిలో తరుగు తీస్తున్నారు.. పాలేరులోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చాను. ఇక్కడ కొనుగోలు కేంద్రంలో బస్తా తరుగుగా కిలో తీస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 600 గ్రాములు తీయాల్సి ఉండగా.. కొనుగోలు కేంద్రాల్లో మాత్రం కిలో తరుగుగా తీస్తున్నారు. దీనివల్ల రైతులు నష్టపోవాల్సి వస్తోంది. – బజ్జూరి నారాయణరెడ్డి, రైతు, పాలేరు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చాం. ధాన్యం బస్తాలో తరుగు విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా జరిగితే ఆయా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – బి.రాజేంద్రప్రసాద్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
కమీషన్ బకాయి రూ.20 కోట్లు
మోర్తాడ్ (బాల్కొండ): వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పౌర సరఫరాల శాఖ ద్వారా కొనుగోలు కేంద్రాలకు రూ.20 కోట్ల కమీషన్ బకాయి అందాల్సి ఉంది. సహకార సంఘాలకు కమీషన్ బకాయి వసూలు కాకపోవడంతో సంఘాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ఖరీఫ్ సీజను వరి ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. అయితే గడచిన ఖరీఫ్, రబీ సీజను నెలల కమీషన్ ఇంతవరకు చెల్లించకపోవడంతో సంఘాలకు బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలోని 87 సహకార సంఘాల ఆధ్వర్యంలో 230 కొనుగోలు కేంద్రాలు కొనసాగాయి. గడచిన ఖరీఫ్, రబీ సీజనులలో భారీ మొత్తంలో వరి ధాన్యం కొనుగోలు చేశారు. ప్రతి క్వింటాలుకు నిర్ణయించిన మేరకు కమీషన్‌ను పౌర సరఫరాల శాఖ కొనుగోలు కేంద్రాలను నిర్వహించిన సహకార సంఘాలకు ఇస్తూ ఉంటుంది. సాధారణంగా ఏ సీజను కమీషన్ ఆ సీజనులోనే చెల్లించాల్సి ఉంది. కాగా ఇప్పటి వరకు ప్రభుత్వం పౌర సరఫరాల శాఖకు నిధులు కేటాయించకపోవడంతో కమీషన్ బకాయిలు పేరుకుపోయాయి. అనేక సహకార సంఘాలు కొనుగోలు కమీషన్‌ను సిబ్బంది జీత భత్యాలకు చెల్లిస్తున్నాయి. ఒక్కో సహకార సంఘంలో సిబ్బందికి నెలకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు వేతనం చెల్లించాల్సి ఉంటుంది. ఎరువుల విక్రయం ద్వారా లభించే లాభాన్ని సహకార సంఘాల నిర్వహణకు వినియోగిస్తుండగా కొనుగోలు కమీషన్ నుంచి సిబ్బందికి జీత భత్యాలను చెల్లిస్తున్నారు. సహకార సంఘాలు ఆర్థికంగా బలంగా ఉన్నా కమీషన్ బకాయి పేరుకుపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఒక్క మోర్తాడ్ సహకార సంఘానికి రూ.30లక్షల కమీషన్ బకాయి అందాల్సి ఉంది. ఇలా జిల్లాలోని ప్రతి సహకార సంఘానికి ఎక్కువ మొత్తంలోనే కమీషన్ రావాల్సి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోలు కమీషన్ సొమ్మును సహకార సంఘాలకు అందించాలని పలువురు కోరుతున్నారు. కమీషన్ సొమ్ము కోసం ప్రతిపాదనలు పంపాం... సహకార సంఘాలకు కమీషన్ సొమ్ము మంజూరు కోసం ప్రతిపాదనలు పంపించాం. ఈ సీజను కొనుగోళ్లు ముగిసిపోయేలోపు కమీషన్ సొమ్ము మంజూరు అయ్యే అవకాశం ఉంది. – అభిషేక్ సింగ్, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ -
2,252 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
సాక్షి, అమరావతి: రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఖరీఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 2,252 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. అవసరాన్ని బట్టి మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు పౌర సరఫరాల సంస్థ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఖరీఫ్‌లో 45 లక్షల మెట్రిక్ టన్నుల పైబడి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు బాసటగా నిలవాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏ–గ్రేడ్ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.1,815, సాధారణ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.1,765 మద్దతు ధర ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ధరను కేంద్రం మరికొంత పెంచొచ్చని ఓ అధికారి తెలిపారు. కనీస మద్దతు ధర కంటే మార్కెట్లో ఎక్కువ ధర ఉంటే రైతులు బయట కూడా ధాన్యాన్ని విక్రయించుకోవచ్చు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యానికి తేమ శాతం కొలిచే మీటర్లు, బరువు తూచే యంత్రాలు, టార్పాలిన్లు, తూర్పారపట్టే యంత్రాలు, తదితర వాటిని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం మార్కెటింగ్ శాఖకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చేందుకు వీలుగా రాష్ట్రంలో ఇప్పటివరకు 9.63 లక్షల మంది రైతులు పేర్లను నమోదు చేసుకున్నారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు –కోన శశిధర్, ఎక్స్అఫీషియో కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ రైతులు దళారుల బారిన పడి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలి. దీనివల్ల రైతులకు మద్దతు ధర కూడా లభిస్తుంది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 2,252 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. అవసరమైతే కేంద్రాలను పెంచుతాం. ఎక్కువ ధర ఇస్తామని చెప్పి కొందరు దళారులు తూకాల్లో మోసం చేసే ప్రమాదం ఉంది. మోసం చేస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే స్థానిక అధికారులకు తెలపాలి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తాం. -
అమ్మేందుకూ అవస్థలే..
ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతన్నను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. రబీ సీజన్లో సాగునీటి కోసం తిప్పలు పడిన రైతు చేతికి అరకొరగా వచ్చిన పంట అమ్ముకుందామన్నా అవస్థలే ఎదురవుతున్నాయి. ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు అమ్మడం శక్తికి మించిన శ్రమగా మారింది. జిల్లాలోని కొన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు సక్రమంగా జరగక.. మరికొన్ని కేంద్రాల్లో నగదు కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఇక వర్షం వస్తే ధాన్యంపై కప్పేందుకు పట్టా కూడా లేని పరిస్థితి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. సాక్షిప్రతినిధి, ఖమ్మం : జిల్లాలో ఈ ఏడాది 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. డీఆర్డీఏ ఐకేపీ గ్రూపుల ఆధ్వర్యంలో 2,728 మంది రైతుల నుంచి గ్రేడ్–‘ఏ’ ధాన్యం 19,143.480 మెట్రిక్ టన్నులు, కామన్ రకం ధాన్యం 1,752.200 మెట్రిక్ టన్నులు.. మొత్తం 20,895.680 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాయి. పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 8,760 మంది రైతుల నుంచి గ్రేడ్–‘ఏ’ రకం ధాన్యం 81,082.760 మెట్రిక్ టన్నులు, కామన్ రకం ధాన్యం 3,711.280 మెట్రిక్ టన్నులు.. మొత్తం 84,794.040 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. డీఆర్డీఏ, పీఏసీఎస్‌లు కలిపి 11,488 మంది రైతుల నుంచి గ్రేడ్–‘ఏ’ రకం ధాన్యం 1,00,226.240 మెట్రిక్ టన్నులు, కామన్ రకం 5,463.480 మెట్రిక్ టన్నులు.. అంటే మొత్తం 1,05,689.720 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. సమస్యల కేంద్రాలు.. కొనుగోలు కేంద్రాల్లో అనేక సమస్యలు నెలకొన్నాయి. రైతు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకెళ్తే.. వెంటనే కొనుగోళ్లు చేపట్టడం లేదు. తేమ శాతం ఎక్కువగా ఉండడంతో రైతులు రోజులతరబడి కొనుగోలు కేంద్రాల వద్దే ధాన్యాన్ని ఆరబోసుకుంటున్నారు. దీనికితోడు ఎండలు ఎక్కువగా ఉండడంతో కాంటాలు వేయడం ఆలస్యమవుతోంది. హమాలీల కొరత కూడా అనేక కొనుగోలు కేంద్రాల్లో ఉంది. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఉండేందుకు సౌకర్యాలు లేకపోవడంతో వేసవి కాలంలో విపరీతమైన ఎండతో అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో తాగేందుకు మంచినీరు కూడా దొరకని పరిస్థితి. మధిర కొనుగోలు కేంద్రంలో పందులు సంచరిస్తుండడంతో ధాన్యం ఎక్కడ పాడు చేస్తాయోనని రైతులు కాపలా ఉండాల్సి వస్తోంది. కొణిజర్ల మండలం పెద్దమునగాలలో ఊరి బయట పొలాల్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో ఏ చిన్న గాలిదుమారం వచ్చినా రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా పాట్లు పడాల్సి వస్తోంది. ఇక కొన్ని కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత వెంటాడుతోంది. పురికోసలు కూడా తెచ్చుకోవాలని నిర్వాహకులు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. వేసవి కాలం కావడంతో అకాల వర్షాలు, ఈదురు గాలులు తరచూ వస్తున్నాయి. వర్షం వస్తే ధాన్యాన్ని కాపాడుకునేందుకు పట్టాలు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. సకాలంలో అందని నగదు.. ఎలాగోలా కష్టపడి ధాన్యం అమ్ముకున్నా.. అందుకు సంబంధించిన నగదు మాత్రం సకాలంలో అందడం లేదు. నిబంధనల ప్రకారం ధాన్యం అమ్మిన 48 గంటల్లోగా రైతులకు నగదు చెల్లించాల్సి ఉంటుంది. అయితే జిల్లాలోని అనేక చోట్ల రైతులు ధాన్యం అమ్మి 15 రోజులు గడుస్తున్నా.. ఇంకా నగదు అందజేయలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం 11,488 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయగా.. ఇప్పటివరకు 2,147 మందికి డబ్బులు చెల్లించారు. ఇంకా 9,341 మందికి నగదు చెల్లించాల్సి ఉంది. మూడు రోజుల నుంచి.. నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి మూడు రోజులైంది. నేటి వరకు కూడా నేను తెచ్చిన ధాన్యం కొనలేదు. రోజూ కొనుగోలు చేయాలని కోరుతున్నా.. నా ధాన్యం అలాగే ఉంది. వర్షం వస్తే తడిసిపోతుందని ఆందోళనగా ఉంది. – చెరుకు వెంకటేశ్వర్లు, రైతు, నేలకొండపల్లి వర్షం వస్తే ఇబ్బందే.. ధాన్యం కొనుగోలు కేంద్రం ఊరి చివర రైతుల భూమి లీజుకు తీసుకుని ఏర్పాటు చేశారు. ధాన్యం నిల్వ చేసుకునేందుకు ఏర్పాట్లు లేవు. వర్షం వస్తే ధాన్యం కాపాడుకునేందుకు పట్టాలు అందుబాటులో లేవు. రైతుల పూచీకత్తు మీద ఇస్తామంటున్నారు. వర్షం వస్తే ఆరుకాలం కష్టపడి పండించిన పంట నాశనమే. – వీరబాబు, రైతు, మునగాల, కొణిజర్ల -
కుమ్మక్కు!
మిర్యాలగూడ : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మక్కై దోచుకుంటున్నారు. యాసంగిలో సన్న ధాన్యం నేరుగా మిల్లుల వద్ద విక్రయించుకుంటున్న రైతులు.. 1010 రకం ధాన్యం మాత్రం ఐకేపీ కేంద్రాల్లో అమ్ముకుంటున్నారు. సన్న ధాన్యం విక్రయించుకోవడానికి మిల్లులకు వెళ్లిన వారికి మిల్లర్లు వివిధ కారణాలతో కుచ్చుటోపీ పెడుతుండగా ప్రభుత్వ ఐకేపీ కేంద్రాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. వీరి నిర్వాకం ఇటీవల విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడుల్లో బయటపడింది. ఐకేపీల్లో ఇక్కడ 40 కిలోల బస్తాకు ఒక కిలో అదనంగా తీసుకుంటున్నారు. మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతాల్లో 90 రైస్ మిల్లులు ఉన్నాయి. ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని అధికారులు కేటాయించిన రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు. దీంతో ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు.. ముందస్తుగా మిల్లర్లతో కుమ్మక్కై రైతుల వద్దనుంచి అదనంగా తూకం వేసుకున్న ధాన్యానికి డబ్బులు తీసుకొని పంచుకుంటున్నారు. లారీ ధాన్యానికి నాలుగు క్వింటాళ్ల దోపిడీ ఒక్క లారీ ధాన్యానికి నాలుగు క్వింటాళ్ల ధాన్యం దోపిడీ చేస్తున్నారు. రైతులనుంచి అదనంగా తూకం వేసుకుంటున్న ధాన్యాన్ని మిల్లు వద్దకు చేర్చుతున్న ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు అదనంగా ఉన్న ధాన్యంలో మిల్లర్లతో కలిసి వాటా పంచుకుంటున్నారు. నాలుగు క్వింటాళ్ల ధాన్యంలో ఒక క్వింటా మిల్లర్‌కు, మూడు క్వింటాళ్లు ఐకేపీ కేంద్రం వారు తీసుకుంటున్నా రు. ప్రస్తుతం ఉన్న ధాన్యం ధరల ప్రకారం క్వింటా ధా న్యానికి 1770 రూపాయలు చెల్లిస్తుండగా నాలుగు క్విం టాళ్లకు 7080 రూపాయల మేర దోచుకుంటున్నారు. వే బ్రిడ్జి తూకాల్లో మోసం.. వే బ్రిడ్జిలలో తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఒక్కో రైస్‌మిల్లుకు ప్రత్యేకంగా వే బ్రిడ్జి కాంటా ఉంటుంది. ఆ బ్రిడ్జిలో తూకం వేసిన ధాన్యానికి మరో వేబ్రిడ్జిలో వేసిన తూకానికి తేడా వస్తోంది. రైస్ మిల్లర్ల ఆధీనంలో ఉండే వే బ్రిడ్జిలలో తక్కువ తూకం వేస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఇటీవల తూనికల కొలతల అధికారులు చేపట్టిన తనిఖీలలో వాస్తవాలు వెల్లడయ్యాయి. రైతులు నేరుగా మిల్లుల్లో ధాన్యం విక్రయించుకోవడానికి ట్రాక్టర్లలో ధాన్యం తీసుకవస్తుండగా వేబ్రిడ్జిలోనే తూకం వేయించాల్సి వస్తుంది. తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న మిల్లర్ల వద్ద వేబ్రిడ్జిలో తూకం వేసి ట్రాక్టర్ ధాన్యం విక్రయించుకుంటే సుమారుగా రెండు నుంచి మూడు క్వింటాళ్ల ధాన్యాన్ని రైతులు నష్టపోతున్నారు. అంటే రైతులు 5వేల రూపాయల నుంచి 5500 రూపాయల వరకు నష్టపోతున్నారు. సంఘ బంధాలను మార్చకపోవడం వల్లనే.. ఐకేపీ ధాన్యం కొనుగోలుకు మహిళా సంఘబంధాలను ప్రతి ఏటా మారుస్తూ ఉండాలి. కానీ అధికారులు నిర్లక్ష్యం వహించి ప్రతి ఏటా కొనుగోలు చేసిన సంఘాలకే యధావిధిగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో వారికి, మిల్లర్లకు మధ్య మంచి సంబంధాలు ఏర్పడి రైతులను దగా చేస్తున్నారు. ఇదే విషయం మిర్యాలగూడ మండలంలోని గూడూరులో తూనికల కొలతల అధికారులు ఇటీవల తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. ఐకేపీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన నాటి నుంచి ఆ సంఘానికే కొనుగోలు బాధ్యతలు ఇస్తున్నారు. అలాకాకుండా కేంద్రాల నిర్వహణ గ్రామంలోని అన్ని సంఘాలకు అవకాశం కల్పించే విధంగా మార్పులు చేస్తే ఇలాంటి అక్రమాలకు తావుండే అవకాశాలు లేవన్న వాదన వినిపిస్తోంది. -
మిల్లుల్లోనే లారీలు
ఇందూరు/ఇందల్వాయి: కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం బస్తాలను రైస్ మిల్లులకు తరలించడానికి సరిపడా లారీలున్నప్పటీకీ... మార్కెట్లో ఏర్పడిన హమాలీల కొరత కారణంగా మిల్లర్లు లారీల్లోంచి బస్తాలను దింపుకోవడం లేదు. నాలుగైదు రోజులుగా ఆయా మిల్లుల్లోనే లారీలు ఉండిపోవడంతో తూకం వేసి ఉంచిన ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రాల్లో, రోడ్లపైనే ఉన్నాయి. లారీల సమస్యతో కొన్ని చోట్ల కొనుగోళ్లు కూడా చేపట్టడం లేదు. ఇటు మారుతున్న వాతావరణ పరిస్థితులతో వర్షం పడితే ఏం చేయాలో అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రబీ సీజన్‌కు గాను 3 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని సివిల్ సప్లయి అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 291 కొనుగోలు కేంద్రాల్లో ప్రస్తుతం ధాన్యం సేకరణ సాగుతోంది. ఇప్పటి వరకు 2లక్షల 10వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు. అయితే అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతుల నుంచి సేకరించిన ధాన్యం లారీల్లో తరలించడానికి దాదాపు 450 లారీలు ఏర్పాటు చేశారు. అదనంగా మరికొన్ని లారీలను పక్క జిల్లాల నుంచి తెప్పించారు. జిల్లా వ్యాప్తంగా 64 మిల్లులకు సీఎంఆర్ బాధ్యతలు ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల నుంచి లారీల్లో బస్తాలను నింపుకుని నేరుగా మిల్లులకు పంపిస్తున్నారు. అయితే కొనుగోలు కేంద్రాల్లో ప్రయివేటు కూలీలకు తూకం వేసి లారీల్లో ఎక్కించినందుకు గాను ఒక క్వింటాలుకు రూ.25 వరకు లభిస్తోంది. అదే రైస్ మిల్లుల్లో లారీల్లోంచి బస్తాలను దింపినందుకు గాను కేవలం రూ.6 వరకే మిల్లర్లు ఇస్తున్నారు. దీంతో అధికంగా కూలీ వస్తున్న కొనుగోలు కేంద్రాల వైపే కూలీలు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా మిల్లులకు చేరిన లారీల్లోంచి ధాన్యం దింపేవారు కరువయ్యారు. ఐదారు మంది హమాలీలతోనే రోజుకు రెండు లారీల వరకు దింపుకుంటున్నారు. అన్లోడింగ్ సమస్య ఏర్పడడంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 380 వరకు లారీలు మిల్లుల్లోనే ఉన్నట్లు సమాచారం. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించడానికి లారీల కొరత ఏర్పడుతుందని, వెంట వెంటనే లారీలను అన్లోడ్ చేసి పంపాలని మిల్లర్లకు పదే పదే సూచిస్తున్నా పరిస్థితి అంతే ఉంది. మరోపక్క రైతులేమో లారీల కోసం, కాంటాల ఏర్పాటు కోసం జిల్లాలో ఎక్కడో ఒక చోట రోడ్డెక్కుతూనే ఉన్నారు. డీటీలను రంగంలోకి దింపిన జేసీ సివిల్ సప్లయి అధికారులు మిలర్లకు ఎన్నిసార్లు చెప్పినా అన్లోడ్ చేసి లారీలను పంపకపోవడంతో జేసీ వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే జేసీ ఐదుగురు ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్లను రంగంలోకి దింపారు. ఏయే మిల్లుల్లో అన్లోడింగ్ కావడం లేదో తెలుసుకుని ప్రతి గంటకు సమాచారం అందించడానికి ప్రత్యేకంగా వీరిని నియమించారు. రోజుకు 20 మిల్లులు తిరిగి వచ్చిన లారీలను అన్లోడింగ్ చేయించి కొనుగోలు కేంద్రాలకు పంపించాలని వారికి ఆదేశాలు ఇచ్చారు. అన్లోడింగ్ చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్న మిల్లుల సమాచారం ఇవ్వాలన్నారు. దీంతో రెండు రోజులుగా టీడీలు ప్రధానంగా నగర శివార్లలో ఉన్న మిల్లులను తిరుగుతున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం.. – హరికృష్ణ, డీఎం, సివిల్ సప్లయి కార్పొరేషన్ జిల్లాలో ఉన్న అన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రారంభం కావడంతో ఎక్కువ మొత్తంలో ధాన్యం వస్తోంది. తూకం వేసిన బస్తాలను వెంటనే సంబంధిత మిల్లులకు లారీల ద్వారా పంపుతున్నాం. కానీ మిల్లర్లు బస్తాలను దింపుకోకపోవడంతో లారీల కొరత ఏర్పడుతోంది. వెంటనే అన్లోడ్ చేసి పంపితే లారీలతో ఇబ్బందులు ఉండవు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిస్థితిని చక్కబెడుతున్నాం. ఐదు రోజులవుతున్నా లారీలు రావడం లేదు 300 బస్తాల ధాన్యం అమ్మి ఐదు రోజులవుతున్నా లారీ రావడం లేదు. దీంతో పట్టాల కిరాయి అదనంగా భరించాల్సి వస్తుంది. మొదట్లో గన్నీ బస్తాల కొరత ఉంటే ఇప్పుడు లారీల కొరత అంటున్నారు. వర్ష సూచన ఉన్నందున లారీల కొరత తీర్చి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. –జమీల్ పాషా, రైతు, సిర్నాపల్లి కడ్తాతో పాటు ధర తక్కువ అంటున్నారు నేను నల్లవెల్లి కొనుగోలు కేంద్రంలో 120 బస్తాల ధాన్యాన్ని ఎగబోసి శుధ్ధిచేసి విక్రయించాను. ధాన్యం మిల్లుకు చేరాక ఇప్పుడు తాలు గింజలు ఉన్నాయని 3 కిలోల కడ్తా, సన్నగా ఉందని కామన్ గ్రేడ్ ధర రూ. 1750 ఇస్తామని అంటున్నారు. ఈ లెక్కన మాకు 3 వేల రూపాయల నష్టం వస్తుంది. ఇకనైనా అధికారులు ఇలా జరగకుండా చర్యలు చేపట్టాలి. –గోపాల్ రెడ్డి, నల్లవెల్లి లారీల కొరత గన్నీ బస్తాలు లేక ధాన్యం కుప్పబోసిన వారం రోజులకు కాంట అయ్యాయి. ఇప్పుడు లారీలు లేక మరో వారం రోజులు ఆగాల్సి వచ్చేలా ఉంది. తీరా మిల్లుకు తరలిన ధాన్యంలో మరెన్ని లోపాలు ఎత్తి చూపిస్తారోనన్న భయం ఉంది. ఇవ్వన్ని పూర్తయినా డబ్బుల కోసం కూడా చాలా కాలం వేచి చూడాల్సి వస్తుంది. ఇకనైనా అధికారులు ఈ సమస్యలపై దృష్టి సారించి కొనుగోళ్ల వేగవంతానికి కృషి చేయాలి. –నోముల తిరుపతిరెడ్డి, నల్లవెల్లి -
మర ఆడించాలా.. మానేయాలా?
సాక్షి ప్రతినిధి, వరంగల్: పౌర సరఫరాల శాఖ, రైసుమిలర్ల నడుమ ‘రా’ రైస్ వివాదం తారాస్థాయికి చేరింది. 2018–19 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) వ్యవహారంలో తలెత్తిన వివాదం.. రబీ ధాన్యాన్ని రైసుమిల్లుల్లో దింపుకునేందుకు నిరాకరించే వరకు చేరింది. ఈనెల 3వ తేదీ నుంచి రబీ సీఎంఆర్ ధాన్యం ముట్టబోమంటూ రైసుమిల్లర్ల సంక్షేమ సంఘం బాధ్యులు ఇటీవల ప్రకటించారు. దీంతో పది రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణను ముమ్మరం చేసిన పౌరసరఫరాల శాఖకు.. రైసుమిల్లర్ల నిర్ణయంతో చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు పౌరసరఫరాలశాఖ బియ్యం సేకరణను నిలిపివేయడం, ఓ వైపు రైసుమిల్లుల్లో బియ్యం నిల్వలు నిండిన నేపథ్యంలో రబీ ధాన్యాన్ని ఎలా నిల్వ చేసుకోవాలన్న ఆందోళనను మిల్లర్లు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల పరిశీలన, ఉన్నతాధికారులతో సమీక్షలకు వస్తుండడం గమనార్హం. వివాదం ముదురింది ఇలా... ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం మర ఆడించేందుకు(బియ్యంగా మార్చడం) మిల్లర్లకు సీఎంఆర్ కింద ధాన్యం కేటాయిస్తుంది. ఇదే క్రమంలో 2018–19 ఖరీఫ్ సీజన్లో వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల్లో మొత్తం 115 రా రైసుమిల్లులకు 1,25,499 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించారు. ఈ ధాన్యాన్ని మర ఆడించిన రైసుమిల్లర్లు 84,186 మెట్రిక్ టన్నుల బియ్యంను పౌరసరఫరాలశాఖ ద్వారా ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు రైసుమిల్లర్లు 55,350 మెట్రిటన్నుల బియ్యం సరఫరా చేయగా.. ఇంకా 28,836 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేయాల్సి ఉంది. ఈ మొత్తం బియ్యాన్ని సైతం పంపేందుకు రైసుమిల్లర్లు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ సరఫరా చేసిన గన్నీ బ్యాగులపై స్టెన్సిల్(చాప) కొట్టి, కాంటా పెట్టి సిద్ధం చేసుకున్నారు. ఇంతలోనే ఫిబ్రవరి 14 నుంచి రా రైస్ సేకరణను నిలిపి వేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సుమారు 80 రోజులుగా బియ్యం సేకరణ నిలిచిపోయింది. ఎఫ్‌సీఐకి పంపితే వారు కూడా తీసుకోవడం లేదని, ఫలితంగా బియ్యానికి పురుగులు పడుతున్నాయని రైసుమిలర్ల సంఘం నాయకులు ఇటీవల వెల్లడించారు. ఇకనైనా ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ స్పందించి బియ్యం తీసుకోనట్లయితే శుక్రవారం నుంచి రబీ సీఎంఆర్ ధాన్యాన్ని దిగుమతి చేసుకోకుండా సహాయ నిరాకరణ చేపడుతామని బాయిల్, రా రైస్ మిల్లుల యజమానులు ప్రకటించడంతో సమస్య మరింత జఠిలంగా మారింది. కమిషనర్ పర్యటన ఇలా... పౌరసరఫరాలశాఖ కమిషనర్ డాక్టర్ అకున్ సబర్వాల్ ఉదయం 8.30 గంటలకు వరంగల్ పోలీసు గెస్ట్‌హౌస్‌కు చేరుకుని 10 గంటల వరకు అబ్కారీశాఖ అధికారులతో వివిధ అంశాలపై సమీక్షిస్తారు. ఆ తర్వాత వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారులు, జిల్లా మేనేజర్లతో సమీక్ష జరిపిన మీదట పలు రేషన్ దుకాణాలను పరిశీలిస్తారు. అలాగే, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లను కూడా పర్యవేక్షించనున్నారు. ఆ తర్వాత జనగామ జిల్లాకు చేరుకోనున్న అకున్ సబర్వాల్ అక్కడ కూడా జాయింట్ కలెక్టర్, జిల్లా పౌరసరఫరాల అధికారి, జిల్లా మేనేజర్ ఇతర అధికారులతో సమీక్ష జరిపి హైదరాబాద్ వెళ్తారు. కాగా, రైసుమిల్లర్లు, పౌర సరఫరాల శాఖల మధ్యన రా రైస్ వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆ శాఖ కమిషనర్ పర్యటించనుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రేపటి నుంచి సహాయ నిరాకరణ మర ఆడించిన బియాన్ని తీసుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మిల్లర్లు శుక్రవారం నుంచి సహాయ నిరాకరణకు దిగనున్నారు. ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్ తదితర సంస్థల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా తరలిస్తే ఎట్టి పరిస్థితుల్లో మిల్లుల్లో దించుకోబోమని స్పష్టం చేస్తున్నారు. జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడు తోట సంపత్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ఎర్రబెల్లి వెంకటేశ్వర్రావు, కోశాధికారి దుబ్బ రమేష్ తదితరులు జిల్లా అధికారులకు ఈ విషయమై వినతిపత్రం సమర్పించడంతో పాటు రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ నిర్ణయాన్ని వెల్లడించారు. మిల్లుల్లో ఉన్న బియ్యం నిల్వలు ఖాళీ అయ్యే వరకు ప్రభుత్వానికి సహకరించేది లేదని స్పష్టం చేశారు. ఇదిలా వుండగా ప్రభుత్వ ఎక్స్అఫిషీయో కార్యదర్శి, పౌరసరఫరాలశాఖ కమిషనర్ డాక్టర్ అకున్ సబర్వాల్ గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పర్యటించన్నారు. -
అన్నదాత ... అరిగోస
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఆరుగాలం శ్రమించి, కష్టనష్టాలకు ఓర్చి పండించిన పంటను అమ్ముకుని రోజుల తరబడి డబ్బుల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. కనీస మద్దతు ధర అందించేందుకు, రైతులకు అండగా నిలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరా సంస్థ ద్వారా ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేయించి, కొనుగోలు చేస్తోంది. ఈ సంస్థ, పీఎసీఎస్, ఐకేపీల ద్వారా ధాన్యం కేంద్రాలు నిర్వహిస్తోంది. అంచనాలకు తగ్గట్టు రైతులకు మద్దతు ధర చెల్లిస్తూ ధాన్యం కొనుగోలు చేస్తున్నా.. వాటికి చెల్లింపుల విషయంలో మాత్రం చేతులు ఎత్తేస్తోంది. వివిధ సాంకేతిక కారణాల సాకుతో రోజుల తరబడి రైతులకు చెల్లింపులు జరగడం లేదు. ఆయా కేంద్రాల్లో అసౌకర్యాలను ఎదుర్కొంటూ.. అకాల వర్షాలకు ధాన్యాన్ని కాపాడుకుంటూ.. ఇలా, అన్ని గండాలు దాటుకుని అమ్ముకున్న ధాన్యానికి వెంటనే డబ్బులు అందక అన్నదాత అరిగోస పడుతున్నాడు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 508 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు రూ.769.45కోట్ల విలువైన 4.35లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కాగా, ఈ మొత్తంలో ఇప్పటి వరకు రైతులకు చెల్లించిన సొమ్ము కేవలం రూ.118.88కోట్లు మాత్రమే కావడం గమనార్హం. అంటే ప్రభుత్వం రైతులకు ఇంకా.. రూ.650.57కోట్లు బకాయి పడ్డట్టయ్యింది. కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం వల్ల చెల్లింపులకు ఆలస్యం జరుగుతోందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను బుక్ కీపర్లు ట్యాబ్‌లో అప్లోడ్ చేసిన 48గంటల లోగా రైతు ఖాతాలో నగదు జమ కావాల్సి ఉంటుంది. కానీ, ఇరవై రోజులు గడిచినా డబ్బులు అందని రైతులు వేలాది మంది ఉన్నారు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే ముప్పై ఆరు వేల మంది రైతులు ఇప్పటి దాకా ధాన్యం అమ్ముకుంటే పట్టుమని మూడు వేల మందికి కూడా డబ్బులు అందలేదు. ఆన్లైన్ సమస్యలు అన్నదాతకే కష్టాలు తెచ్చిపెడుతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిన సంబంధిత అధికారులు మాత్రం చేతులు ఎత్తేస్తున్నారు. ఇదీ .... లెక్క సూర్యాపేట : యాసంగిలో సాగు చేసిన వరి ధాన్యం కొనుగోలు కోసం జిల్లా వ్యాప్తంగా 140 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా 136 కేంద్రాలలలో ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది. వీటిలో సహకార సంఘాల ద్వారా 70 కేంద్రాలు, ఐకేపీ ద్వారా 66 కేంద్రాలను ఏర్పా?టు చేశారు.ఈ ఏప్రిల్ మొదటి వారంలో కొనుగోలు ప్రారంభం కాగా, నేటి వరకు ఈ కేంద్రాల ద్వారా 1,29,774.800 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని∙కొనుగోలు చేశారు. ఈ ధాన్యం విలువ రూ. 2,29,68,23,376. మొత్తం17,920 మంది రైతులు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని అమ్ముకోగా .. 3,984 మంది రైతులకు రూ. 48,68,49,156లను ఖాతాలలో జమ చేశారు. యాదాద్రి : యాదాద్రిభువనగిరి జిల్లాలో 143 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఇప్పటి వరకు 9వేల మంది రైతుల నుంచి 65వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈమొత్తం ధాన్యానికి రూ.115కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. రైతులకు సకాలంలో డబ్బులు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు రూ.25కోట్ల మేరకు ట్యాబ్‌లో అప్లోడ్ చేయడం వల్ల రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. -
ఎలా కొనేది ?
మెదక్ జోన్: రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్న కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం కమీషన్ విడుడల చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో కేంద్రాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతోంది. ధాన్యం సేకరణ (కొనుగోలు)కు ఐకేపీ సంఘాలు ససేమీరా అంటున్నాయి. సాధారణంగా ధాన్యం సేకరణ ముగిసి రైతులకు చెల్లింపులు పూర్తి కాగానే కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వం కమీషన్ మంజూరు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే గతేడాది రబీ, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లకు సంబంధించి కమీషన్ విడుదల చేయలేదు. ఇందుకు సంబంధించి కొనుగోలుదారులకు, రైతులకు చెల్లించే హమాలీ రూ.2.5 కోట్లు జిల్లాకు రావాల్సి ఉంది. ప్రస్తుతం మూడో సీజన్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కమీషన్ రానిదే ఊరికే ఎందుకు చేయాలని నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. రెండు సీజన్లుగా అందని కమీషన్... రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి పౌరసరఫరాల సంస్థకు అందించినందుకుగాను పీఏసీఎస్, ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.2.50 చెల్లిస్తుంది. ఈ కమీషన్ నుంచే కేంద్రాలకు సంబంధించిన ధాన్యం సేకరణ ఖర్చులను వెచ్చిస్తారు. మిగిలిన డబ్బులను మహిళా సంఘాల సభ్యులు పంచుకుంటారు. సహకార సంఘాల్లో అయితే సంఘాల నిల్వలకు జమచేసుకుంటారు. గత రెండు సీజన్లకు సంబంధించి ప్రభుత్వం కమీషన్ చెల్లించలేదు. గత ఖరీఫ్‌లో జిల్లాలో పీఏసీఎస్ ద్వారా 130 కేంద్రాలు, ఐకేపీ ద్వారా 40 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 170 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి రైతులకు సుమారు రూ.300 కోట్లకు పైగా చెల్లించారు. ప్రభుత్వం నుంచి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు రెండు సీజన్లకు సంబంధించి కమీషన్ రానందున సంఘాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు రూ.1.50 కోట్లు రావాల్సి ఉండగా, హమాలీ చార్జీ కింద రూ.కోటి రైతులకు రావాల్సి ఉంది. మొత్తంగా రూ.2.50 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అధికారుల చొరవతో.. ఈఏడాది రబీసీజన్‌కు సంబంధించి ఎప్పటిలాగే ఐకేసీ, పీఏసీఎస్ సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా ఐకేసీ సంఘాల సభ్యులు తమకు రావాల్సిన కమీషన్ ఇచ్చేంతవరకు కొనుగోలు చేయలేమని ఖరాకండీగా తేల్చి చెప్పారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో ధాన్యం దిగుబడులు వచ్చాయి. త్వరలో రావాల్సిన కమీషన్ ఇప్పిస్తాని.. కొనుగోలు తప్పకుండా చేయాల్సిందేనని జాయింట్ కలెక్టర్ నగేష్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సీతరామరావు వారిని ఒప్పించడంతో అతికష్టంమీద అంగీకరించారు. విడుదల కానీ హమాలీ చార్జీలు.. గత సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్‌కు సంబంధించి హమాలీ డబ్బులు రైతులకు రూ.కోటి రావాల్సి ఉంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని బస్తాల్లో నింపి తూకం వేసి లారీల్లో లోడ్చేసినందుకు గాను హమాలీలకు రైతులు క్వింటాలు రూ.23 చొప్పున చెల్లిస్తున్నారు. ఇందుకు సంబంధించి చార్జీల్లో క్వింటాలుకు రూ.5 చొప్పున ప్రభుత్వం హమాలి కింద రైతులకు చెల్లించాలి. రెండు సీజన్లుగా సివిల్సప్లై సంస్థ హమాలీ చార్జీలను విడుదల చేయడం లేదు. దీంతో రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పూర్తి చార్జీలను వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం హమాలీ కోసం క్వింటాలుకు ఇచ్చే రూ.5 మినహాయించి మిగతా డబ్బులు మాత్రమే రైతుల నుంచి తీసుకోవాలి. కానీ ప్రభుత్వం సకాలంలో డబ్బులు విడుదల చేయకపోవడంతో చేసేదిలేక రైతుల నుంచే ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. తాము ఇవ్వమని రైతులు నిరాకరిస్తే ధాన్యం తూకం వేయమని నిర్వాహకులు పేర్కొనడంతో గత్యంతరం లేక చెల్లిస్తున్నారు. మరికొన్ని చోట్ల అదనంగా క్వింటాలుకు రూ.25 వరకు వసూలు చేస్తున్నారు. ఫలితంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంఘాలకు కమీషన్‌తో పాటు హమాలీ చార్జీలను సకాలంలో విడుదల చేయాలని కొనుగోలు కేంద్రాల సంఘాలు, రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
ధాన్యం.. దైన్యం..
బూర్గంపాడు: రబీ ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాలలో నిరీక్షిస్తున్నారు. రబీ పంట చేతికంది 20 రోజులు దాటినా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఇంకా ప్రారంభించనే లేదు. మార్కెట్‌కు, కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తున్న రైతులకు రోజుల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదు. గత వారం రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అక్కడక్కడా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లాలో ఈ ఏడాది రబీ సీజన్లో సుమారు 20 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రభుత్వం పంటల సాగుకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పంట దిగుబడి పెరిగింది. గత ఇరవై రోజులుగా జిల్లా వ్యాప్తంగా వరి నూర్పిళ్లు జరుగుతున్నాయి. రైతులు ఎప్పటికప్పుడు ధాన్యాన్ని ఆరబెట్టి విక్రయానికి మార్కెట్‌కు తరలిస్తున్నారు. అయితే ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవటంతో తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. సరైన వసతులు లేక ఇక్కట్లు.. పినపాక, భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాలలో చాలా ప్రాంతాలలో రబీ వరికోతలు ప్రారంభమయ్యాయి. ఒక్క బూర్గంపాడు మార్కెట్ యార్డులోనే సుమారు 70 లారీల ధాన్యం అమ్మకానికి వచ్చింది. పీఏసీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆరు రోజుల క్రితం ప్రారంభించారు. అయితే జియో ట్యాంగింగ్ ప్రక్రియ పూర్తికాలేదని ఇప్పటి వరకు కొనుగోళ్లు ప్రారంభించలేదు. ఇరవై రోజులుగా ధాన్యం అమ్మకాలు కాకపోవటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సాధ్యమైనంత తొందరగా ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. దీనికి తోడు కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మొన్నటి వరకు లోక్‌సభ ఎన్నికల హడావిడిలో జిల్లా అధికార యంత్రాంగం తలమునకలైంది. పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖల అధికారులకు కూడా ఎన్నికల విధులు కేటాయించారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయినందున ఇకనైనా కొనుగోళ్లకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. 20 రోజులైనా కొనుగోళ్లు లేవు మార్కెట్‌యార్డుకు వడ్లు తీసుకొచ్చి 20 రోజులైంది. ఎప్పుడు కొంటారో తెలియటం లేదు. రేయింబవళ్లు యార్డులో కాపలా కాస్తున్నాం. అకాల వర్షాలు కురుస్తున్నాయి. ధాన్యం పాడవుతుందేమోనని భయమేస్తోంది. ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకు అడుగుతున్నారు. – కైపు చంద్రశేఖర్‌రెడ్డి, రైతు, రెడ్డిపాలెం అడిగేవారే లేరు యాసంగి వడ్లు అడిగే వారే లేరు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు మొదలు కాలేదు. పది రోజులు నుంచి వడ్ల అమ్మకాలకు ఎదురుచూస్తున్నాం. అధికారులు కొనుగోలు కేంద్రం ప్రారంభించి నాలుగు రోజులైన ఇప్పటి వరకు కేజీ వడ్లు కొనలేదు. – పేరం రామాంజిరెడ్డి ధాన్యం కొనుగోళ్లకు చర్యలు ఈ రబీలో సుమారు 30 వేల టన్నుల ధాన్యం సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నాం. ఎన్నికల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడం కొంత ఆలస్యమైంది. ఒకట్రెండురోజుల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. పీఏసీఎస్, డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తాం. – లక్ష్మణరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి -
సన్నరకానికి పెరిగిన ధర
మోర్తాడ్(బాల్కొండ): నిన్న మొన్నటి వరకు చిన్న బోయిన సన్న రకాల ధర క్ర మ క్రమంగా పెరుగుతుండటంతో రైతు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరి కోత లు ఆరంభమైన సమయంలో సన్న రకం వరి ధాన్యానికి తక్కువ ధర ఉండటంతో ముందుగా పంటను విక్రయించిన రైతులు నష్టాలను చవి చూశారు. అయితే వా రం రోజుల నుంచి సన్న రకం వరి ధాన్యానికి మార్కెట్లో డిమాండ్ ఏర్పడటంతో ధరకు రెక్కలు తొడిగాయి. బీపీటీ రకం వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.1,650 నుంచి రూ.1,750 వరకు ధర పలుకుతోంది. అయితే సన్న రకాల్లో అత్యంత సన్నవిగా గుర్తింపు పొందిన జై శ్రీరాం, సూపర్ సీడ్, తెలంగాణ సోన రకాలకు మాత్రం క్వింటాలుకు రూ.2,100 నుంచి రూ.2,200 ధర పలుకుతోంది. గతంలో క్వింటాలుకు రూ.2,100 ధర ఉండగా ఈ సారి రూ.100 ఎక్కువగా ధర పెరిగింది. ఖరీఫ్ సీజనుకు గాను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపు 3.50 లక్షల ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేశారు. ఇందులో అధిక భాగం సన్న రకాలను సాగు చేశారు. సన్న రకాల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్న కొత్త రకాలను రైతులు సాగు చేయడం విశేషం. సన్న రకాలకు మార్కెట్ ఆరంభంలో క్వింటాలుకు రూ.1,500 నుంచి రూ.1,600 వరకు మాత్రమే ధర పలికింది. సన్న రకం బియ్యానికి మార్కెట్లో డిమాండ్ ఉన్నా వ్యాపారులు సిండికేట్ కావడంతో ధర ఎక్కువగా పలుకడం లేదని రైతులు వాపోయారు. ఈ సీజనులో సుమారు 60 శాతం సన్న రకాలనే రైతులు సాగు చేశారు. కేవలం 40 శాతం మాత్రమే దొడ్డు రకం వరి ధాన్యం సాగు అయ్యింది. అయితే దొడ్డు రకానికి కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్ ధర లభించింది. ప్రభుత్వం ఏ గ్రేడ్ రకానికి రూ.1,750 మద్దతు ధరగా ప్రకటించింది. దొడ్డు రకాలను సాగు చేసిన రైతులు ధాన్యాన్ని వ్యాపారులకు కాకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. సన్న రకాలకు మాత్రం కొనుగోలు కేంద్రాల్లో బీ గ్రేడ్ రకం ధరను వర్తింప చేశారు. కొనుగోలు కేంద్రాల్లో బీ గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ.1,720 మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించింది. సన్న రకాలను కొనుగోలు కేంద్రాల్లో కాకుండా వ్యాపారులు, రైస్ మిల్లర్లకు విక్రయించడం వల్ల ఎక్కువ ధర పొందవచ్చని రైతులు భావించారు. వ్యాపారులు మొదట్లో ఎక్కువ ధర చెల్లించకపోవడంతో రైతులు నష్టపోయారు. ఎగుమతులకు డిమాండ్ పెరగడంతో సన్న రకాల ధర గతంలో కంటే ఎక్కువ పెరిగింది. రోజు రోజుకు సన్న రకాల ధర పెరుగుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా తమ వద్ద ధాన్యం నిలువలు తగ్గిపోయే వరకు ఇదే ధర కొనసాగితేనే ప్రయోజనం అని రైతులు పేర్కొంటున్నారు. -
చిన్నబోయిన సన్నరకం
జిల్లాలో 60 శాతం వరకు బీపీటీ, హెచ్ఎంటీ, జై శ్రీరాం, సాయిరాం తదితర సన్న రకాలను రైతులు సాగు చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ‘బి’ గ్రేడ్ ధరను ఇవ్వడం తో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. గతంలో పెద్ద మొత్తంలో సన్న రకం వరి ధాన్యం సేకరించిన కొంద రు వ్యాపారులు బిచానా ఎత్తివేయడంతో రైతులు రూ.3 కోట్ల వరకు నష్టపోయారు. మోర్తాడ్ (బాల్కొండ): ఖరీఫ్ సీజనులో రైతులు పండించిన సన్న ర కం వరి ధాన్యానికి కొనుగోలు కేం ద్రాల్లో ఆశించిన ధర లేకపోవడం తో రైతులు అసంతృప్తిని వ్యక్తం చే స్తున్నారు. జిల్లాలో దాదాపు 92 వేల హెక్టార్లలో వరి సాగైంది. ఇందులో 60 శాతం వరకు సన్న రకాలనే పండించారు. బీపీటీ, హెచ్ఎంటీ, జై శ్రీరాం, సాయిరాం తదితర సన్న రకాలను రైతులు సాగు చేశారు. ఎక్కువ మంది తమ భోజనంలో సన్న రకం బియ్యం తినడానికి ఆసక్తిని చూపడంతో రైతులు కూడా సన్న రకాల సాగుకే మొగ్గు చూపారు. రబీ సీజనులో పూర్తిగా దొడ్డు రకాలనే సాగు చేయడం వల్ల ఖరీఫ్‌లో సన్న రకాల సాగుకు రైతులు ప్రాధాన్యం ఇచ్చారు. సన్న రకాలకు మార్కెట్లో క్వింటాలుకు రూ.1,800 నుంచి రూ.2000 వరకు ధర పలుకుతుంది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ‘ఎ’ గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ.1,770, ‘బి’ గ్రేడ్ రకానికి రూ.1,750 మద్దతు ధర ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకాలకే ఎ గ్రేడ్ ధరను వర్తింప చేస్తున్నారు. సన్న రకాలకు మాత్రం బి గ్రేడ్ ధరను కల్పిస్తున్నారు. దీంతో సన్న రకాలను సాగు చేసిన రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించకుండా వ్యాపారులు, రైస్ మిల్లర్లకే అమ్మాల్సి వస్తోంది. కాగా వ్యాపారులు, రైస్ మిల్లర్ల ద్వారా మోసాలకు గురికాకుండా రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం అమ్మాలని ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. అయితే సన్న రకాలకు కొనుగోలు కేంద్రాల్లో తక్కువ ధర వర్తించడంతో రైతులకు ప్రయోజనం లేకుండా పోతోంది. సన్న రకం వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించగా ఆచరణలో విఫలం అయ్యింది. దీంతో సన్న రకాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు కాలేదు. మార్కెట్లో సన్న రకాలకు ఉన్న ధరను గుర్తించి ప్రత్యేక కౌంటర్ల ద్వారా సేకరించి రైస్‌మిల్లర్లకు తామే విక్రయిస్తామని ప్రభుత్వం పేర్కొంది. కానీ ఏ సీజనులోను సన్న రకాల కొనుగోలుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు తమ వద్ద ఉన్న ధాన్యం విక్రయించడానికి వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. గతంలో పెద్ద మొత్తంలో సన్న రకం వరి ధాన్యం సేకరించిన వ్యాపారులు బిచానా ఎత్తివేయడంతో మోర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్పల్లి, వేల్పూర్, బాల్కొండ, మెండోరా, ముప్కాల్ మండలాల్లోని రైతులు దాదాపు రూ.3 కోట్ల వరకు కోల్పోయారు. ఎక్కువ ధరకు సన్న రకం వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పిన వ్యాపారులు టోకరా ఇవ్వడంతో రైతులు పెద్ద మొత్తంలో నష్టపోయారు. ఇలా ఎన్నో మార్లు వ్యాపారులు రైతులను ముంచడంతో ప్రభుత్వమే స్పందించి ప్రత్యేక కౌంటర్ల ద్వారా సన్న రకాలను కొనుగోలు చేస్తామని ప్రకటించింది.కాగా సన్న రకాల కొనుగోలుపై ప్రభుత్వం స్పందించడం లేదు. ఫలితంగా సన్న రకాలను సాగు చేసిన రైతులు నష్టాలను మూటగట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సన్న రకాలకు మద్దతు ధరను పెంచి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. సన్న రకాలను ప్రభుత్వం కొనుగోలు చేయాలి సన్న రకాలు సాగు చేసిన రైతులకు ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం స్పందించాలి. ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి సన్న రకం వరి ధాన్యంను కొనుగోలు చేయాలి. ప్రభుత్వం వీలైనంత తొందరగా స్పందిచాలి. – కొప్పుల రాజశేఖర్, రైతు, మోర్తాడ్ -
సేకరణ లక్ష్యం
సాక్షి, వరంగల్ రూరల్: అన్నదాతలు ఆరుగాలం కష్టించి పండించిన పంటలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ఖరీఫ్‌లో పండించిన ధాన్యం కొనుగోలు చేయడానికి శ్రీకారం చుట్టనున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే కలెక్టర్ ముండ్రాతి హరిత, జేసీ మహేందర్ రెడ్డి అధికారులతో సమీక్షలు నిర్వహించారు. జిల్లాలో 102 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పీఏసీఎస్–67, ఐకేపీ–33, జీజేసీ–2 ఏర్పాటు చేయనున్నారు. ఖరీఫ్‌లో 20 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. దిగుబడి దాదాపు 1.35 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ధాన్యం ఏ గ్రేడ్‌కు రూ.1,770, సాధారణ రకం రూ.1,750 ధరను ప్రభుత్వం నిర్ణయించింది. లక్ష టన్నులు కొనుగోలు లక్ష్యంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల్లోనే డబ్బులు... గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన తర్వాత డబ్బుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. దీంతో అన్నదాతలు గత్యంతరం లేక ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు పంటలను విక్రయించేవారు. ప్రభుత్వం గత విధానాలకు స్వస్తి పలుకుతూ రెండు, మూడు రోజుల్లోనే అన్నదాతలకు డబ్బులు అందజేసేలా చర్యలు తీసుకోనున్నారు. ధాన్యం కొనుగోలు చేసే మహిళా సంఘాలకు ట్యాబ్‌లు అందజేసి, కొనుగోళ్లు ఏ విధంగా చేయాలి, వివరాల క్రోడీకరణ, బ్యాంకు ఖతాల సేకరణ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. గతంలో కేంద్రాల్లో పంటను విక్రయించిన అన్నదాతల వివరాలను ఖాతాల్లో నిక్షిప్తం చేశారు. లాగిన్‌లో రైతు వివరాలు పొందుపర్చిన తర్వాత పౌరసరఫరాల సంస్థకు వివరాలను అందజేస్తారు. అనంతరం డీఎం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఆన్లైన్లో జరగడంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. 26.50 లక్షల గన్నీ బ్యాగులు ఈ సారి 26.50 లక్షల గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచబోతున్నారు. గన్నీ బ్యాగుల కొరతతో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే 9.50 లక్షల బ్యాగులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించేందుకు తూకం మిషన్లు, గన్నీ బ్యాగుల కోసం ఐదుగురు కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు.17 లక్షల బ్యాగులు ఇంకా రావాల్సి ఉంది. ఆరబెట్టి తీసుకురావాలి.. రైతులు పంట పొలం నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకురాకుండా ఆరబెట్టి తీసుకురావాలి. 17 శాతం కంటే ఎక్కువ తేమ ఉండకుండా తీసుకరావాలని అధికారులు అంటున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టకుండ తమ పొలాల వద్దనే ఆరబెట్టుకుని తీసుకరావాలని అధికారులు సూచిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేస్తున్నాం.. నవంబర్ మొదటి వారం నుంచి పంట చేతి కొస్తుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ సారి రెండు రోజుల్లోనే డబ్బులు రైతులకు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. 17 శాతం కంటే ఎక్కువ తేమ ఉంటే కొనుగోలు చేయరు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం. రైతులకు నేరుగా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వస్తాయి. –వెంకటేశ్వర్లు, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ -
వరి కోతలు షురూ..
సాక్షి, మెదక్‌జోన్ : జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది సరైన వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఫలితంగా పంటలు సగం మేర ఎండిపోయాయి. గతేడాదితో పోల్చుకుంటే దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉంది. చేతికందిన కొద్దిపాటి ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారోనని రైతులు ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా సాధారణ వరిపంట సాగు 38,068 హెక్టార్లుకాగా వర్షాబావ పరిస్థితుల కారణంగా 36,165 హెక్టార్ల మేర పంటలను సాగు చేశారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో 40శాతం పంటలు ఎండిపోయియి. మిగిలిన 60 శాతం పంట ద్వారా కేవలం 95వేల క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చేఅవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో సాధారణ వరి సాగు 36,165 హెక్టార్లుకాగా 42,150 హెక్టార్లలో సాగు చేశారు. పంటలు సంవృద్ధిగా పండాయి. దీంతో 1.60 లక్షల మెట్రిక్‌టన్నుల దిగుబడి వచ్చింది. ఈలెక్కన గతేడాదితో పోల్చితే 65వేల మెట్రిక్‌టన్నుల దిగుబడి తక్కువగా వచ్చే పరిస్థితి నెలకొంది. వేలాది రైపాయల అప్పులు చేసిపంటలను సాగుచేస్తె నీటితడులు అందక పంటలు ఎండిపోయి అప్పులుగా మిగిలాయి. అడపాదడప పండిన పంటలను సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తేనే రైతుకు కాస్త ఊరట లభిస్తోంది. లేనిచో దళారులను ఆశ్రయించి మరింత నష్టపోయే పరిస్థితి ఉంది. మక్కలు దళారులపాలు... జిల్లాలో ఇప్పటికే 80శాతం మక్క పంట రైతులకు చేతికందింది. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయక పోవటంతో మధ్యదళారులను ఆశ్రయించి తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం క్వింటాల్ రూ. 1700 ప్రకటించగా దళారులు రూ.1,400 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. మక్కల విక్రయాలు ప్రారంభమై 20 రోజులు కావస్తోంది. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఆదుకోవల్సిన అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులోనూ జాప్యం జరిగితే వరి రైతులు కూడా నష్టపోయే అవకాశం ఉంది. కొనుగోలు కేంద్రాలను అధికారులు వెంటనే ప్రారంభించి రైతులను ఆదుకోవాలని వారు కోరతున్నారు. 20 వ తేదీన ప్రారంభిస్తాం.. అఈ విషయంపై డీసీఓ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను 20వ తేదీ నంచి ప్రారంభిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 190 సెంటర్లను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు. గతేడాది 170 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 1.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రూ. 453 కోట్లను పంపిణీ చేశాం. చేయటం జరిగింది. ఈయేడు ఖరీఫ్‌లో మరో 20 అధనంగా కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నామన్నారు. గతేడాదితో పోల్చితే దిగుబడి భారీగా తగ్గే పరిస్థితి జిల్లాలో ఉందన్నారు. అలాగే ఈనెల 10 నుంచి మక్క కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. మక్కలు తక్కువగా ఉన్నందున 6 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. మెదక్, రామాయంపేట, చేగుంట, నర్సాపూర్, శివ్వంపేట, వెల్దుర్తి మండలాల్లో ఏర్పాటు చేస్తామాన్నరు. అవసరాన్ని బట్టి మరో రెండు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
ప్యాడీ క్లీనర్లు లేనట్లే!
‘‘కడ్తా పేరుతో తూకంలో కోతకు అడ్డుకట్ట వేసేందుకు ఖరీఫ్ కొనుగోలు సీజను నాటికి జిల్లాలో 90 అధునాతన ప్యాడీ క్లీనర్లను కొనుగోలు చేస్తాం.. సహకార సంఘా ల ద్వారా 50, మార్కెటింగ్ శాఖ ద్వారా 40 ప్యాడీ క్లీనర్లను కొనుగోలు చేస్తాం.. ముందుగా ధాన్యం వచ్చే కొనుగోలు కేంద్రాల్లో వీటిని అందుబాటులో ఉంచుతాం ’’ ఇదీ గత రబీ కొనుగోలు సీజనులో రైస్‌మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల అడ్డగోలు దోపిడీని దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు గత మే నెలలో తీసుకున్న నిర్ణయం. కానీ ఈ నిర్ణయం కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈ ఖరీఫ్ కొనుగోలు సీజనులో కూడా మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట పడే పరిస్థితి కనిపించడం లేదు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: గత సీజనులో రైస్‌మి ల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ‘కోత’ పేరిట భారీగా దండుకుంటున్నారు. తాలు పేరుతో క్వింటాలుకు రెండు నుంచి ఐదు కిలోల వరకు తూకంలో కోత విధించారు. జిల్లా ఉన్నతాధికారులు మిల్లర్లకు వత్తాసు పలకడంతో కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు యథేచ్చగా కొనసాగాయి. ఈ ఖరీఫ్ సీజన్లో కూలీలు అవసరం లేని అధునాతన ప్యాడీ క్లీనర్లను ఏర్పాటు చేసి ఇలాంటి అక్రమాలకు చెక్ పెడతామని అధికారులు ప్రకటించారు. కానీ వీటిని తెప్పించడంలో విఫలమయ్యారు. కొనుగోళ్లకు ఏర్పాట్లు.. అక్టోబర్ మొదటి వారం నుంచి జిల్లాలో ధాన్యం రాక ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అధికారులు కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నా రు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ఈసారి మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముందుగా వరి కోతలు జరిగే కో టగిరి, వర్ని, బాన్సువాడ, బోధన్ తదితర ప్రాం తాల్లో అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కేంద్రాలను ప్రారంభించి, కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలని ఇటీవల జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు గన్నీ బ్యాగులు, ధాన్యం రవాణా ఏర్పాట్లను వెంట వెంటనే పూర్తి చేయాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. తేమ పేరుతో.. ఈసారి మాయిశ్చర్ (తేమ) పేరుతో రైతులను నిండా ముంచేందుకు రంగం సిద్ధమవుతోంది. ఎఫ్ఏక్యూ (ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ) నిబంధనల ప్రకారం ధాన్యంలో తేమ 17 శాతం వరకు అనుమతి ఉంటుంది. అయితే, గత ఏడాది ఖరీఫ్ కొనుగోలు సీజనులో ఈ తేమ శాతాన్ని సాకుగా చూపి పెద్ద ఎత్తున దోపిడీకి తెర లేపారు. తూకం లో క్వింటాలుకు రెండు నుంచి ఐదు కిలోల వరకు కోత విధించి రైతులను నిండా ముంచారు. పీఏసీ ఎస్ చైర్మన్ల కనుసన్నల్లోనే ఈ కొనుగోలు కేంద్రా లు నడిచాయి. రైస్ మిల్లర్లతో కుమ్మక్కైన ఈ కేం ద్రాల నిర్వాహకులు కడ్తా పేరుతో దోపిడీకి తెర లేపారు. సీజను మొత్తానికి రూ.కోట్లలో రైతులు నష్టపోయారు. ఈసారి తేమ పేరుతో దోపిడీ జరగకుండా జిల్లా అధికార యంత్రాంగం కట్టడి చే యాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతుల ప్రయోజనాలను గాలికొదిలేసి గత సీజన్ల మాదిరి గానే రైస్‌మిల్లర్లకు వత్తాసు పలికితే ఈసారి కూడా ధాన్యం రైతులు నిండా మునగడం ఖాయం. రబీ సీజన్ నాటికి అందుబాటులోకి తెస్తాం ఈ సీజను నాటికే ప్యాడీ క్లీనర్లు కొనుగోలు చేయాలని నిర్ణయించినప్పటికీ.. వీటి అవసరం ఇప్పుడు అంతగా ఉండదు. వచ్చే రబీ సీజన్ నాటికి వీటిని అందుబాటులో ఉంచుతాం. వీటి అవసరం రబీ సీజన్లోనే ఎక్కువగా ఉంటుంది. – హరికృష్ణ, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం -
కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి
ఆర్థికశాఖ మంత్రి ‘ఈటల’ నిర్మల్‌టౌన్: రైతులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనుగోళ్లు చేపట్టాలని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు జిల్లా అధికారులకు సూచించారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం జిల్లా అధికారులతో సమీక్షించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల కోసం ఐకేపీ, డీసీఎంఎస్, పీఏసీఎస్ ద్వారా సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాల వద్ద ‡గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలన్నారు. అలాగే అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా టార్ఫాలిన్లు ఉంచుకోవాలని సూచించారు. ఎండాకాలం ఉన్నందునా, రైతులకు టెంట్ సౌకర్యంతో పాటు తాగునీరు, మెడికల్ టీంను కూడా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కేంద్రాల వద్ద ధాన్యం బస్తాలు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలన్నారు. సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది హమాలీలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే వారి కూలి చెల్లింపుల్లో జాప్యం చేయరాదన్నారు. కేంద్రాల వద్ద తప్పనిసరిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు ధాన్యం విక్రయించిన రైతులకు 48గంటల్లో వారికి డబ్బులు అందజేయాలన్నారు. ఈ సందర్భంగా జేసీ శివలింగయ్య స్పందిస్తూ ధాన్యం విక్రయించిన రైతులకు ఎప్పటికప్పుడు డబ్బులు అందజేస్తామని తెలిపారు. ఆర్డీవో ప్రసూనాంబ, డీఎస్వో సుదర్శన్, మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్, డీఏవో గంగారాం, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, డీపీఎం సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి
ఎమ్మెల్యే రేఖానాయక్ దస్తురాబాదు(కడెం) : దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకని ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, రైతులందరూ ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రేఖానాయక్ రైతులను కోరారు. దస్తురాబాదు మండల కేంద్రంతో పాటు మండలంలోని మున్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె బుధవారం ప్రారంభించారు. కేంద్రాలు రైతు వద్ద చివరి ధాన్యం అమ్మే వరకు పనిచేస్తాయని, కేంద్రాల వద్ద రైతులకు అందుబాటులో గన్నీ బ్యాగులుంచాలని తేమ విషయంలో నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఐకేపీ సిబ్బందిని ఆదేశించారు. ఎ గ్రేడు రకానికి క్వింటాలుకు రు.1510, బీ గ్రేడు రకానికి క్వింటాలుకు రు.1470 లుగా ప్రభుత్వం నిర్ణయించిందని, రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో అమ్మి వారం రోజుల్లో డబ్బులు పొందొచ్చని ఐకేపీ ఏపీఎం వనజ రైతులకు వివరించారు. కార్యక్రమంలో తహసీల్ధార్ నర్స య్య, ఎంపీడీఓ విలాస్‌గౌడ్, సింగిల్ విండో చైర్మన్ చుంచు భూమన్న, డెరైక్టర్లు నల్గొండ, ఐలయ్య యా దవ్, దస్తురాబాదు, మున్యాల, బుట్టాపూర్ గ్రామాల సర్పంచులు జీ గంగామణి, ఎస్ సంతో ష్, హన్మాగౌడ్, ఎంపీటీసీ వీ మల్లేష్, టీఆర్ఎస్ కడెం మండలాద్యక్షుడు నల్ల జీవన్‌రెడ్డి, నాయకులు సాగర్, జీ రాజేశం, దొనకంటి స్వామి, బుక్యా రాజు, జీ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. పాండ్వాపూర్ గ్రామంలో. . . కడెం మండలం పాండ్వాపూర్ గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే రేఖానాయక్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సంతోష్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు జీవన్‌రెడ్డి, నల్గొండ, నాయకులు గోపు రాజమౌళి, పాలకాని గంగాధర్, వుల్వకాని మల్లయ్య, పిన్నం మల్లేష్, ఐకేపీ సీసీ స్వామి, సిబ్బంది గోపి, రైతులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
టేకులపల్లి: ఖమ్మం జిల్లా టేకులపల్లిలో సహకార సంఘం ఆధ్వర్యంలో శనివారం ఉదయం ధాన్యం కొనుకోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు సొసైటీ అధ్యక్షుడు దళపతి శ్రీనివాస్‌రాజు, సొసైటీ సీఈవో ప్రేమాచారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం డెరైక్టర్లు, రైతులు పాల్గొన్నారు. -
మాకే అమ్మాలె!
పరిగి: తాము పండించిన మక్కలు, ధాన్యం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్ముకునే పరిస్థితి లేకుండా పోతోంది. రైతులు పెట్టుబడుల కోసం తీసుకున్న అప్పులు.. వాళ్ల రాబడికి ఎసరు పెడుతున్నాయి. మార్కెట్లో కమీషన్ ఏజెంట్లు(అడ్తిదారులు)గా పనిచేస్తున్న వారే వడ్డీ వ్యాపారుల అవతారమెత్తి రైతులను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలతో పోలిస్తే క్వింటాలుకు రూ.200 నుంచి రూ. 300 తక్కువైనా అడ్తాదారులకే అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఈ కారణంగా సర్కారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతు లు మద్దతు ధర దక్కే పరిస్థితి కన్పిం చడం లేదు. పరిగిలో మొక్కజొన్నలు, ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన నాటి నుంచి అటు కొనుగోలు కేంద్రాలకు, ఇటు పరిగి వ్యవసాయ మార్కెట్లో అడ్తీదారుల వద్దకు వస్తున్న రైతు ఉత్పత్తులే ఇందుకు నిదర్శనం. మార్కెట్‌కు ఒక్కరోజే నాలుగు వేల క్వింటాళ్ల మక్కలు.. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు పరిగిలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసి 15రోజులైంది. వేల కొలది ఖాళీ సంచులు సైతం అందుబాటులో ఉంచారు. ఐదారుగురు సిబ్బంది, కూలీలను కొనుగోలు కేంద్రం వద్ద ఉంచుతున్నారు. కానీ 15 రోజుల్లో కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చి విక్రయించిన మక్కలు కేవలం 500 క్వింటాళ్లు మాత్రమే. అదే గత శుక్రవారం ఒక్కరోజే ఆ పక్కనే ఉన్న వ్యవసాయ మార్కెట్లో అడ్తీల వద్దకు 4వేల క్వింటాళ్ల మక్కలు వచ్చాయి. కొనుగోలు కేంద్రంలో క్వింటాలుకు రూ.1,310 చెల్లిస్తుండగా.. మార్కెట్లో రూ.1000 నుంచి రూ.1,150 మాత్రమే ఇస్తున్నారు. రైతులు క్వింటాలుకు రూ.200 నుంచి రూ.300 వరకు నష్టపోతున్నారు. ఇప్పటికే రైతులు ఇలా రూ.10 లక్షల వరకు నష్టపోయారు. అధికారికంగా మాత్రమే ఈ లెక్కులు. పరిగిలో జీరో మార్కెట్ నిర్వహిస్తున్నందున.. ఆ సంఖ్య రెట్టింపు ఉండే అవకాశం ఉంది. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడమే కారణం రైతులు కొనుగోలు కేంద్రాలకు విక్రయించకుండా అడ్తీదారులకు విక్రయిస్తూ ప్రభుత్వ మద్దతు ధర పొందక పోవడానికి ఈ సారి బ్యాంకులు రుణాలివ్వకపోవటమే ప్రధాణ కారణంగా చెప్పవచ్చు. బ్యాంకుల్లో రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు అడ్తాదారుల వద్ద, ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్ల వద్ద అప్పులు తీసుకోవాల్సి వచ్చింది. దీంతో తప్పని పరిస్థితితో పండించిన పంటను అడ్తీదారుల వద్దకు తీసుకు వెళ్లి తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. అప్పులు ఇచ్చిన అడ్తీదారులు, వ్యాపారులు పండించిన పంటను తమకే విక్రయించాలని ముందే కండీషన్ పెట్టడడంతోపాటు వందకు నెలకు రూ. మూడు.. అంతకంటే ఎక్కువ వడ్డీ కూడా వసూలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రంలో సవాలక్ష నిబంధనలు.. మొక్కజొన్నలు, ధాన్యానికి మద్దతు ధరలు ప్రకటించిన ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు అనేక నిబంధనలు పెట్టింది. తేమశాతం మొక్కజొన్నలకు 14, ధాన్యానికి 17 ఉండాలనే నిబంధన ఉంది. ఏమాత్రం తేమశాతం ఎక్కువగా ఉన్నా కొనడం లేదు. బీ, సీ గ్రేడ్ మక్కులు సైతం కొనుగోలు చేస్తామని ప్రకటించినా వాటిని రెండో, మూడో గ్రేడ్లలోకి నెట్టేస్తున్నారు. ఒక వేళ తేమ శాతం నిర్దేశించిన విధంగా ఉండి కొనుగోలు చేసినా డబ్బులు 15 రోజుల తర్వాత చెల్లిస్తారు. ఒక్కోసారి నెలలు పడుతుంది. పండించిన ఉత్పత్తులు తమవేనని రెవెన్యూ అధికారులతో ధ్రువీకరించాలి. ఇవన్నీ దాటుకుని కొనుగోలు కేంద్రంలో విక్రయించినా.. డబ్బులు చెక్కురూపంలో ఇస్తారు. ఆ చెక్కును మార్చుకునేందుకు బ్యాంకులకు వెళితే అధికారులు పాత బకాయిల కింద జమచేసుకుంటారనే భయం. ఇవన్నీ రైతులకు మద్దతు ధరను దూరం చేయడంతోపాటు వ్యాపారుల ఉచ్చులో చిక్కుకునేలా చేస్తున్నాయి. -
ధాన్యం కొనుగోలు కేంద్రం ఉన్నట్టా..? లేనట్టా..?
- ఆసక్తి చూపని మహిళా సంఘం సభ్యులు - గతేడాది నిర్వహణ ఖర్చులు ఇంకా చెల్లించకపోవడమే కారణం - ఖర్చులు తాము భరించి అప్పుల్లో కూరుకుపోయామని మహిళల ఆవేదన - బకాయిలు చెల్లిస్తేనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని స్పష్టీకరణ యాచారం: డ్వాక్రా సంఘాల మహిళలు ఈ ఏడాది మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి ఆసక్తి చూపడం లేదు. గతేడాది ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన నిర్వహణ బిల్లులు ఇంకా చెల్లించకపోవడమే దీనికి కారణం. తమ బకాయిలు చెల్లించాలని డీఆర్డీఏ, సివిల్ సప్లై అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఫలితం కనబడకపోవడంతో మహిళలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు వారం రోజుల్లో మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం మండలంలోని చింతపట్లలో ఉన్న పీఏసీఏస్ భవనాన్ని ఇందుకోసం అధికారులు పరిశీలించారు. కొన్నిరోజుల పాటు ఇక్కడే ధాన్యం కొనుగోలు కేంద్రం కొనసాగించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. అయితే మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రానికి శాశ్వత గిడ్డంగి లేకపోవడంతో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యేటా ధాన్యం నిల్వలకు కొత్త కొనుగోలు కేంద్రాలు వెతకాల్సిన పరిస్థితి. చింతపట్ల, నందివనపర్తి గ్రామాల్లో గిడ్డంగి భవనాల నిర్మాణాల కోసం ప్రభుత్వం భూమి కేటాయించినప్పటికీ నిధులు మంజూరు కాకపోవడంతో భవనాలు మాత్రం నిర్మించలేదు. అందాల్సిన బకాయిలు రూ. 5 లక్షలు చాలా వ్యయప్రయాసలు కూర్చి మహిళలు ధాన్యం కొనుగోలు చేస్తున్నా వారికి మాత్రం లబ్ధి చేకూరడం లేదు. ధాన్యం కొనుగులు కేంద్రం నిర్వహణ కింద మ హిళా సంఘాలకు చెల్లించాల్సిన కమిషన్‌ను సకాలంలో విడుదల చేయకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. గతేడాది మొక్కజొన్న, ఈ ఏడాది జూన్‌లో వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి చింతపట్ల డ్వాక్రా సంఘం మహిళలకు రూ.5లక్షలకు పైగా నిర్వహణ బిల్లులు అందాల్సి ఉంది. డ్వాక్రా సం ఘాల మహిళలు కూలీల ద్వారా కొనుగోళ్లు జరిపించి అప్పులుచేసి వారికి డబ్బులు చెల్లించారు. నిర్వహణ చేపడితే లాభాలు వస్తాయని ఆశపడిన మహిళలకు అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారి అప్పుల పాలయ్యే పరిస్థితి నెలకొంది. గతేడాది మొక్కజొన్న కొనుగోలు సంబంధించి రూ. లక్ష వరకు, వరి ధాన్యం కొనుగోలు జరిపినందుకు గాను రూ.4లక్షలకుపైగా బకాయి అందా ల్సి ఉంది. నిర్వహణ బిల్లులు ఇప్పించాలని చిం తపట్ల గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘాల మహిళలు పలుమార్లు నగరంలోని అధికారులతోపాటు స్థానిక అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేకపోయిం ది. దీంతో గత బకాయిలు చెల్లిస్తేనే ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు ఈసారి ముందుకు వస్తామని మహిళ సంఘం తేల్చిచెప్పింది. దీంతో మరో వారం రోజుల్లో మండలంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు అవుతుందా? లేదా? అనేది సందిగ్ధంగా మారింది. -
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
మహబూబ్‌నగర్ టౌన్: జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ పార్థసారధి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం ధాన్యం కొనుగోలుపై తెలంగాణ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజన్ ప్రారంభమవుతున్నందున రైతులకు అందుబాటులో ఉండే విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయూలన్నారు. అక్టోబర్ 1 నుంచి ఈ కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. ధాన్యాన్ని సేకరించేందుకు అవసరమైన గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఏటా గన్నీ బ్యాగుల సమస్య కారణఃగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. రైతుల నుండి కొనుగోలు ధాన్యాన్ని వెంటనే సమీపంలోని రైస్ మిల్లులకు తరలించేందుకు అవరసమైన వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. రైతులకు ఆన్లైన్లో డబ్బులు చెల్లించాలని, చెల్లింపులో జాప్యం జరగకుండా చూడాలన్నారు. ధాన్యం తడవకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 176 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు: జిల్లా కలెక్టర్ ప్రియదర్శిని జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు 176 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.డి.ప్రియదర్శిని తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జిల్లాలో నవంబర్ రెండవ వారంలో ధాన్యం మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందన్నారు. కొనుగోలు చేసి ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించేందుకు రవాణా సదుపాయాలు సిద్ధం చేశామన్నారు. ధాన్యం సేకరణకు 9,75లక్షల గోనె సంచులను అందుబాటులో ఉంచామని, మరో 9, 75 లక్షల సంచులు అవసరం ఉందన్నారు. ఆన్లైన్లో డబ్బులు చెల్లించేందుకు చర్యలు తీసుకన్నట్లు కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో జా యింట్ కలెక్టర్ ఎల్.శర్మన్, జిల్లా పౌర స రఫరాల మేనేజర్ ప్రసాద్‌రావు, డీఎస్ఓ మహమ్మద్ యాసిన్, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ జెడీ భగవత్ స్వరూప్ పాల్గొన్నారు. -
నష్టం రూ.85 కోట్లపైనే..
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. కళ్లముందే కొట్టుకుపోతూ, తడిసి ముద్దవుతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానాతంటాలు పడ్డారు. గురు, శుక్రవారాల్లో కురిసిన వర్షంతో జిల్లాలో నష్టం రూ.85 కోట్లపైమాటే. వరి, మామిడి రైతులను ఈ వర్షం కోలుకోలేని దెబ్బతీసింది. ఇంత జరిగినా అధికారులు మాత్రం నష్టం లేదంటూ ఒక్కమాటలో తేల్చిచెబుతున్నారు. ఎన్నికల పేరు చెప్పి సర్వేలకు నిరాకరిస్తున్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రెండు రోజులపాటు కురిసిన వర్షం కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యాన్ని ముంచెత్తింది. శనివారం తెరిపినివ్వడంతో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. జిల్లాలో కల్లాలు, మార్కెట్‌యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం విలువ రూ.60 కోట్లపైమాటే అని ప్రాథమిక అంచనా. కోతకు వచ్చి నేలవాలిన వరి, కాయలు రాలిన మామిడితో మరో రూ.25 కోట్ల నష్టం రైతులకు వాటిల్లినట్లు అంచనా. కొన్నది 10 శాతమే... సాగునీటి వనరులు పుష్కలంగా ఉండడంతో ఈసారి రబీలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 13.25 లక్షల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేశారు. రబీలో ధాన్యం ఒక్కసారిగా ముంచెత్తుతుందని తెలిసీ అధికారులు ఎన్నికల పేరుతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేశారు. చివరకు 5 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని నిర్ణయించి 619 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించారు. ఇప్పటివరకు 10 శాతం కొనుగోళ్లు కూడా చేపట్టలేదు. కేవలం 314 కేంద్రాలు ఏర్పాటు చేసి 30,982 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కొనుగోలు బాధ్యత మిల్లర్లకే అప్పగించడంతో తేమ సాకుతో వారు జాప్యం చేస్తున్నారు. రవాణా ఆలస్యమవుతుండడంతో కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతోంది. ధాన్యం తూకం కోసం ఎదురుచూస్తున్న క్రమంలోనే దిగుబడంతా వర్షార్పణమైంది. చాలాచోట్ల టార్పాలిన్లు అందుబాటులో లేక తడిసిపోయింది. మార్కెట్‌యార్డుల్లోనూ ఇదే పరిస్థితి. తడిసిన ధాన్యం రంగు మారి, ఇప్పుడు మొలకెత్తుతోంది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నా పట్టించుకునేవారే లేరు. పర్యవేక్షణ కరువు వర్షంతో పంట నష్టం జరిగినప్పుడు పంటచేలల్లోకి వెళ్లి ప్రాథమిక అంచనా వేయాల్సిన వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల పేరు చెప్పి క్షేత్రస్థాయికి వెళ్లకుండానే.. ఎలాంటి నష్టం వాటిల్లలేదని తేల్చిచెబుతున్నారు. కల్లాలు, మార్కెట్‌యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఆయా శాఖలు లెక్కలోకే తీసుకోవడం లేదు. దీంతో ధాన్యం కొనుగోలు చేయాలని అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. తమను ఆదుకోవాలని కోరుతున్నారు. కాగా, కొనుగోళ్ల సమయంలో అన్ని శాఖలను సమన్వయం చేసే జిల్లాస్థాయి ఉన్నతాధికారి పర్యవేక్షణ లేకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారి స్థాయిలో కొనుగోళ్ల పర్యవేక్షణ చేయాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో 12.3 మి.మీ. వర్షపాతం కలెక్టరేట్ : జిల్లాలో శుక్రవారం నుంచి శనివారం ఉదయం 8 వరకు సగటున 12.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 39 మండలాల్లో వర్షం కురిసింది.