సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఆరుగాలం శ్రమించి, కష్టనష్టాలకు ఓర్చి పండించిన పంటను అమ్ముకుని రోజుల తరబడి డబ్బుల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. కనీస మద్దతు ధర అందించేందుకు, రైతులకు అండగా నిలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరా సంస్థ ద్వారా ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేయించి, కొనుగోలు చేస్తోంది. ఈ సంస్థ, పీఎసీఎస్, ఐకేపీల ద్వారా ధాన్యం కేంద్రాలు నిర్వహిస్తోంది. అంచనాలకు తగ్గట్టు రైతులకు మద్దతు ధర చెల్లిస్తూ ధాన్యం కొనుగోలు చేస్తున్నా.. వాటికి చెల్లింపుల విషయంలో మాత్రం చేతులు ఎత్తేస్తోంది. వివిధ సాంకేతిక కారణాల సాకుతో రోజుల తరబడి రైతులకు చెల్లింపులు జరగడం లేదు. ఆయా కేంద్రాల్లో అసౌకర్యాలను ఎదుర్కొంటూ.. అకాల వర్షాలకు ధాన్యాన్ని కాపాడుకుంటూ.. ఇలా, అన్ని గండాలు దాటుకుని అమ్ముకున్న ధాన్యానికి వెంటనే డబ్బులు అందక అన్నదాత అరిగోస పడుతున్నాడు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 508 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు రూ.769.45కోట్ల విలువైన 4.35లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కాగా, ఈ మొత్తంలో ఇప్పటి వరకు రైతులకు చెల్లించిన సొమ్ము కేవలం రూ.118.88కోట్లు మాత్రమే కావడం గమనార్హం. అంటే ప్రభుత్వం రైతులకు ఇంకా.. రూ.650.57కోట్లు బకాయి పడ్డట్టయ్యింది. కొత్త సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయడం వల్ల చెల్లింపులకు ఆలస్యం జరుగుతోందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను బుక్ కీపర్లు ట్యాబ్‌లో అప్‌లోడ్ చేసిన 48గంటల లోగా రైతు ఖాతాలో నగదు జమ కావాల్సి ఉంటుంది. కానీ, ఇరవై రోజులు గడిచినా డబ్బులు అందని రైతులు వేలాది మంది ఉన్నారు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే ముప్‌పై ఆరు వేల మంది రైతులు ఇప్పటి దాకా ధాన్యం అమ్ముకుంటే పట్టుమని మూడు వేల మందికి కూడా డబ్బులు అందలేదు. ఆన్‌లైన్ సమస్యలు అన్నదాతకే కష్టాలు తెచ్చిపెడుతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిన సంబంధిత అధికారులు మాత్రం చేతులు ఎత్తేస్తున్నారు.
ఇదీ .... లెక్క
సూర్యాపేట : యాసంగిలో సాగు చేసిన వరి ధాన్యం కొనుగోలు కోసం జిల్లా వ్యాప్తంగా 140 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా 136 కేంద్రాలలలో ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది. వీటిలో సహకార సంఘాల ద్వారా 70 కేంద్రాలు, ఐకేపీ ద్వారా 66 కేంద్రాలను ఏర్పా?టు చేశారు.ఈ ఏప్రిల్ మొదటి వారంలో కొనుగోలు ప్రారంభం కాగా, నేటి వరకు ఈ కేంద్రాల ద్వారా 1,29,774.800 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని∙కొనుగోలు చేశారు. ఈ ధాన్యం విలువ రూ. 2,29,68,23,376. మొత్తం17,920 మంది రైతులు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని అమ్ముకోగా .. 3,984 మంది రైతులకు రూ. 48,68,49,156లను ఖాతాలలో జమ చేశారు.
యాదాద్రి : యాదాద్రిభువనగిరి జిల్లాలో 143 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఇప్పటి వరకు 9వేల మంది రైతుల నుంచి 65వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈమొత్తం ధాన్యానికి రూ.115కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. రైతులకు సకాలంలో డబ్బులు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు రూ.25కోట్ల మేరకు ట్యాబ్‌లో అప్‌లోడ్ చేయడం వల్ల రైతుల ఖాతాల్లో జమ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment