Grain centers
-
ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ కీలక ట్వీట్
సాక్షి, హైదరాబాద్: వ్యాపారులు, మార్కెట్ అధికారులు కుమ్మక్కై ధాన్యానికి తక్కువ ధర చెల్లిస్తున్నారంటూ రైతులు జనగామ వ్యవసాయ మార్కెట్లో ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రేడర్లపై కేసులు, మార్కెట్ కార్యదర్శి సస్పెన్షన్‌కు అదనపు కలెక్టర్ ఆదేశాలిచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఎక్స్(ట్విటర్) వేదికగా ట్వీట్ చేశారు. ‘‘ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు… వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు. జనగామ వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి.. రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించడం.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ గారికి నా అభినందనలు’’ అంటూ సీఎం ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
‘తక్కువ ధరకు ధాన్యం విక్రయించొద్దు’
సాక్షి, కాకినాడ: జిల్లా వ్యాప్తంగా 271 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. అదనంగా మరో 100 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. రైతులు ఎవ్వరూ తక్కువ ధరకు తమ ధాన్యాన్ని విక్రయించవద్దని ఆయన సూచించారు. రైతులు తమ పంటను విక్రయించాలనుకుంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలకే రానవసరం లేదని.. మొబైల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని లేదా 1902 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 1.65 లక్షల ఎకరాల్లో రబీ పంట సాగు అయ్యిందన్నారు. 878 వరి కోత యంత్రాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. 13 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా అని.. దాంట్లో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని లక్ష్మీ షా వివరించారు. -
గుత్తాధిపత్యానికి చెక్
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : సర్కారు ధాన్యంతో సొంత వ్యాపారాలకు మరిగిన కొందరు రైస్‌మిల్లర్లకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ నిర్ణయం ఝలక్ ఇచ్చినట్లయింది. ఈ సీజన్లో రైతుల వద్ద సేకరించిన ధాన్యంలో కొంత మొత్తాన్ని సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ ) కోసం జగిత్యాల జిల్లా రైస్‌మిల్లర్లకు అప్పగిస్తూ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇన్నాళ్లూ జిల్లాలో గుత్తాధిపత్యాన్ని చెలాయించిన రైస్‌మిల్లర్లకు ఈ నిర్ణయం చెక్ పెట్టినట్లయింది. ఇప్పటి వరకు ఇతర జిల్లాల నుంచే నిజామాబాద్ జిల్లాకు ధాన్యం వచ్చేది. ఈసారి ఇక్కడి ధాన్యం ఇతర జిల్లాలకు వెళ్లడం జిల్లా చరిత్రలో ఇదే మొదటి సారి. ఈ నిర్ణయంతో సర్కారు ధాన్యంతో అక్రమాలకు పాల్పడితే అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుందనే సంకేతాలను పంపినట్లయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుండగా, మరోవైపు మిల్లర్లను ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. 15 వేల మెట్రిక్ టన్నులు.. రబీ కొనుగోలు సీజనులో జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు పెద్ద మొత్తంలో ధాన్యం వచ్చింది. మొత్తం 3.64 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ఇందులో నుంచి సుమారు 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జగిత్యాల జిల్లా పరిధిలోని 18 రైస్‌మిల్లులకు కేటాయిస్తూ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో ఉన్న అన్ని రైస్‌మిల్లుల మిల్లింగ్ సామర్థ్యం సుమారు 3.50 లక్షల మెట్రిక్ టన్నులు. అయితే ఈ కొనుగోలు సీజనులో సామర్థ్యానికి మించి ధాన్యం రావడంతో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు సీఎంఆర్ కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలని కమిషనర్‌ను కోరారు. దీంతో కమిషనర్ సమీపంలోని జగిత్యాల జిల్లాకు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సుమారు 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం జగిత్యాలకు వెళ్లింది. ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇక్కడికి.. ఏటా ఇతర జిల్లాల నుంచి నిజామాబాద్ మిల్లుల కు ధాన్యం వచ్చేది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా నుంచి ధాన్యం ఇక్కడికి పంపేవారు. ఇలా ఇతర జిల్లాల నుంచి వచ్చిన ధాన్యాన్ని మరఆడించి బియ్యం ఇవ్వాల్సి ఉండగా, ఆ ధాన్యాన్ని కొందరు మిల్లర్లు తమ సొంత వ్యాపారాలకు వాడుకున్నారు. రూ.కోట్లు విలువ చేసే సర్కారు ధాన్యాన్ని బహిరంగమార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఈ సొమ్మును ఇతర వ్యా పారాలకు వాడుకుని చేతులెత్తేశారు. దీంతో నోటీసులు, కేసులు అంటూ అధికారులు డిఫాల్టర్ల వద్ద బియ్యాన్ని రాబట్టడంలో విఫలమయ్యారు. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కు కావడంతోనే ఇది సా ధ్యమైంది. ఇందుకు భిన్నంగా ఇక్కడి ధాన్యాన్ని ఇప్పుడు ఇతర జిల్లాలకు కేటాయించడంతో మిల్ల ర్లు ఆలోచనలో పడ్డారు. -
ధాన్యం డబ్బులేవి..!
వీణవంక(హుజూరాబాద్): కరువు పరిస్థితులను అధిగమించి ధాన్యం పండించిన రైతులకు విత్తనోత్పత్తి కంపెనీలు మొండి చేయి చూపాయి. సీడ్(ఆడ, మగ)ను తీసుకెళ్లి.. పది రోజుల్లో సొమ్ము చెల్లిస్తామని చెప్పి 40రోజులు దాటినా చిల్లిగవ్వ ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నాయి. మరోవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో చేతిలో పెట్టుబడికి డబ్బులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు గత్యంతరం లేక ప్రైవేటు అప్పును ఆశ్రయిస్తున్నారు. రబీలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 48వేల ఎకరాల్లో హైబ్రీడ్ వరి సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల 8వేల ఎకరాలలో పంట ఎండిపోయింది. సుమారు 2.52లక్షల క్వింటాల ధాన్యం దిగుబడి వచ్చింది. ఈ లెక్కన రూ.100కోట్లు రైతులకు కంపెనీలు బకాయి పడ్డట్లు సమాచారం. రాష్ట్రంలోనే హైబ్రీడ్(ఆడ, మగ)సీడ్ వరి సాగులో కరీంనగర్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. విత్తనోత్పత్తికి ఇక్కడి నేలలు అనువుగా ఉన్నాయి. అందుకే జిల్లాలో సాగు చేయడానికి కంపెనీలు పోటీపడుతున్నాయి. 30 ఏళ్లుగా ఇక్కడి రైతులు హైబ్రీడ్ వరిని సాగు చేస్తున్నారు. ప్రతీ కంపెనీ రైతుల పేరున బ్యాంకు ఖాతాలో జమ చేయాల్సి ఉండగా, ఆ నిబంధనలను పాటించడం లేదు. రెండు మూడు కంపెనీలు మాత్రమే రైతులకు చెక్కు రూపంలో ఇస్తున్నాయి. మిగిలిన కంపెనీలు తమ ఏజెంట్ల ఖాతాలో జమ చేస్తున్నాయి. దీంతో ఏజెంట్లు డబ్బులను తమ స్వంత అవసరాలకు వాడుకొని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అసలే కరువుతో గత మూడేళ్లుగా ఆశించిన దిగుబడి లేక రైతులు కుదేలయ్యారు. ఇప్పుడు సకాలంలో డబ్బులు ఇవ్వకుండా కంపెనీలు మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. శ్రమకు తగిన ఫలితం లేక.. శ్రమకు తగిన ఫలితం లేక రైతులు కుదేలవుతున్నారు. క్వింటాల్‌కు రూ.4వేల నుంచి 8వేల వరకు చెల్లిస్తుండడంతో సీడ్ వరి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. పంట దిగుబడి వచ్చినా రాకపోయినా ఒప్పందం ప్రకారం చెల్లిస్తామని కంపెనీల ప్రతినిధులు చెప్పడంతో రైతులు సాగు చేశారు. కానీ ఖరీఫ్ ప్రారంభమైనా ఇంత వరకు డబ్బులు ఇవ్వలేదు. సీడ్ కంపెనీలు మరో మాయాజాలానికి తెరలేపాయి. క్వింటాల్‌కు 10కిలోల చొప్పున తరుగు పేరుతో నిలువు దోపిడీకి దిగుతున్నారు. ఈ లెక్కన అదనంగా రూ.800 నష్టపోతున్నారు. అదేవిధంగా కాంటాలలో 4నుంచి 5కిలోల వ్యత్యాసం వస్తుందని రైతులు వాపోతున్నారు. ఆర్గనైజర్ల చేతివాటం.. సీడ్ కంపెనీలు నేరుగా రైతుకు విత్తనం ఇవ్వకుండా ఆయా గ్రామాల్లో డీలర్లు(ఆర్గనైజర్లు)ను నియమిస్తుంది. వారి ద్వారా విత్తనం సాగు చేయిస్తుంటారు. ఇక్కడ డీలర్లు తమ మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు. ఓ మల్టినేషన్ కంపెనీ క్వింటాల్ రూ.7వేలు చెల్లిస్తుండగా సదరు డీలర్లు రూ.6వేలకే రైతులతో ఒప్పందం చేసుకున్నారు. ఈ లెక్కన క్వింటాల్‌కు వెయ్యి అదనంగా లబ్ధి పొందుతున్నారు. ఇలా కొద్ది రోజుల్లోనే రైతులను నిలువున ముంచుతూ రూ.లక్షలు సంపాదిస్తున్నారు. కొన్ని కంపెనీలు నాలుగు రోజుల క్రితం ఏజెంట్లకు డబ్బులు ఇచ్చారని తెలిసింది. కానీ ఏజెంట్లు తమ స్వంత అవసరాలకు వాడుకొని రైతులకు మొండి చెయ్యి చూపారనే ఆరోపణలు ఉన్నాయి. రూ.100కోట్లు పెండింగ్.. హైబ్రీడ్ వరిని శంకరపట్నం, మానకొండూరు, వీణవంక, జమ్మికుంట, పెద్దపల్లి జిల్లాలోని ఓదెల, కాల్వశ్రీరాంపూర్, ముత్తారం, ఓడేడుతోపాటు జగిత్యాల జిల్లాలో సాగు చేస్తున్నారు. ఎకరాకు 15క్వింటాల దిగుబడి వస్తుందని కంపెనీలు చెప్పినా 6 నుంచి 8క్వింటాలలోపు దిగుబడి వస్తోందని రైతులు తెలిపారు. ఈ లెక్కన 2.52లక్షల క్వింటాల దిగుబడి వచ్చిందని అంచనా. సుమారు రూ.100కోట్ల పైగా కంపెనీలు రైతులకు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు కలుగజేసుకొని సకాలంలో డబ్బులు వచ్చేలా చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలి.. రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వని కంపెనీలపై అధికారులు చర్యలు తీసుకోవాలి. ఖరీఫ్ ప్రారంభమైనా ఇంత వరకు చిల్లిగవ్వ రైతులకు అందలేదు. పది రోజుల్లో ఇస్తామని రైతులకు చెప్పి నెలల కొద్ది తిప్పుతున్నారు. గతంలో కంపెనీల తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. తరుగు, తేమ పేరుతో క్వింటాల్‌కు 10కిలోలు తీసేస్తున్నారు. కొన్ని కంపెనీలు బహిరంగ దోపిడీకి దిగుతున్నాయి. పద్ధతి మార్చుకోకపోతే రైతులతో కలిసి ఆందోళనలు ఉధృతం చేస్తాం.– మడుగూరి సమ్మిరెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి -
అమ్మేందుకూ అవస్థలే..
ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతన్నను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. రబీ సీజన్లో సాగునీటి కోసం తిప్పలు పడిన రైతు చేతికి అరకొరగా వచ్చిన పంట అమ్ముకుందామన్నా అవస్థలే ఎదురవుతున్నాయి. ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు అమ్మడం శక్తికి మించిన శ్రమగా మారింది. జిల్లాలోని కొన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు సక్రమంగా జరగక.. మరికొన్ని కేంద్రాల్లో నగదు కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఇక వర్షం వస్తే ధాన్యంపై కప్పేందుకు పట్టా కూడా లేని పరిస్థితి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. సాక్షిప్రతినిధి, ఖమ్మం : జిల్లాలో ఈ ఏడాది 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. డీఆర్డీఏ ఐకేపీ గ్రూపుల ఆధ్వర్యంలో 2,728 మంది రైతుల నుంచి గ్రేడ్–‘ఏ’ ధాన్యం 19,143.480 మెట్రిక్ టన్నులు, కామన్ రకం ధాన్యం 1,752.200 మెట్రిక్ టన్నులు.. మొత్తం 20,895.680 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాయి. పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 8,760 మంది రైతుల నుంచి గ్రేడ్–‘ఏ’ రకం ధాన్యం 81,082.760 మెట్రిక్ టన్నులు, కామన్ రకం ధాన్యం 3,711.280 మెట్రిక్ టన్నులు.. మొత్తం 84,794.040 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. డీఆర్డీఏ, పీఏసీఎస్‌లు కలిపి 11,488 మంది రైతుల నుంచి గ్రేడ్–‘ఏ’ రకం ధాన్యం 1,00,226.240 మెట్రిక్ టన్నులు, కామన్ రకం 5,463.480 మెట్రిక్ టన్నులు.. అంటే మొత్తం 1,05,689.720 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. సమస్యల కేంద్రాలు.. కొనుగోలు కేంద్రాల్లో అనేక సమస్యలు నెలకొన్నాయి. రైతు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకెళ్తే.. వెంటనే కొనుగోళ్లు చేపట్టడం లేదు. తేమ శాతం ఎక్కువగా ఉండడంతో రైతులు రోజులతరబడి కొనుగోలు కేంద్రాల వద్దే ధాన్యాన్ని ఆరబోసుకుంటున్నారు. దీనికితోడు ఎండలు ఎక్కువగా ఉండడంతో కాంటాలు వేయడం ఆలస్యమవుతోంది. హమాలీల కొరత కూడా అనేక కొనుగోలు కేంద్రాల్లో ఉంది. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఉండేందుకు సౌకర్యాలు లేకపోవడంతో వేసవి కాలంలో విపరీతమైన ఎండతో అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో తాగేందుకు మంచినీరు కూడా దొరకని పరిస్థితి. మధిర కొనుగోలు కేంద్రంలో పందులు సంచరిస్తుండడంతో ధాన్యం ఎక్కడ పాడు చేస్తాయోనని రైతులు కాపలా ఉండాల్సి వస్తోంది. కొణిజర్ల మండలం పెద్దమునగాలలో ఊరి బయట పొలాల్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో ఏ చిన్న గాలిదుమారం వచ్చినా రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా పాట్లు పడాల్సి వస్తోంది. ఇక కొన్ని కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత వెంటాడుతోంది. పురికోసలు కూడా తెచ్చుకోవాలని నిర్వాహకులు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. వేసవి కాలం కావడంతో అకాల వర్షాలు, ఈదురు గాలులు తరచూ వస్తున్నాయి. వర్షం వస్తే ధాన్యాన్ని కాపాడుకునేందుకు పట్టాలు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. సకాలంలో అందని నగదు.. ఎలాగోలా కష్టపడి ధాన్యం అమ్ముకున్నా.. అందుకు సంబంధించిన నగదు మాత్రం సకాలంలో అందడం లేదు. నిబంధనల ప్రకారం ధాన్యం అమ్మిన 48 గంటల్లోగా రైతులకు నగదు చెల్లించాల్సి ఉంటుంది. అయితే జిల్లాలోని అనేక చోట్ల రైతులు ధాన్యం అమ్మి 15 రోజులు గడుస్తున్నా.. ఇంకా నగదు అందజేయలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం 11,488 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయగా.. ఇప్పటివరకు 2,147 మందికి డబ్బులు చెల్లించారు. ఇంకా 9,341 మందికి నగదు చెల్లించాల్సి ఉంది. మూడు రోజుల నుంచి.. నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి మూడు రోజులైంది. నేటి వరకు కూడా నేను తెచ్చిన ధాన్యం కొనలేదు. రోజూ కొనుగోలు చేయాలని కోరుతున్నా.. నా ధాన్యం అలాగే ఉంది. వర్షం వస్తే తడిసిపోతుందని ఆందోళనగా ఉంది. – చెరుకు వెంకటేశ్వర్లు, రైతు, నేలకొండపల్లి వర్షం వస్తే ఇబ్బందే.. ధాన్యం కొనుగోలు కేంద్రం ఊరి చివర రైతుల భూమి లీజుకు తీసుకుని ఏర్పాటు చేశారు. ధాన్యం నిల్వ చేసుకునేందుకు ఏర్పాట్లు లేవు. వర్షం వస్తే ధాన్యం కాపాడుకునేందుకు పట్టాలు అందుబాటులో లేవు. రైతుల పూచీకత్తు మీద ఇస్తామంటున్నారు. వర్షం వస్తే ఆరుకాలం కష్టపడి పండించిన పంట నాశనమే. – వీరబాబు, రైతు, మునగాల, కొణిజర్ల -
రూ.20.17 కోట్లు కడ్తా పేరిట దోపిడీ
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: కొనుగోలు కేంద్రాల్లో దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది.. రైతాంగం రూ.కోట్లల్లో నష్టపోతోంది.. తరుగు పేరుతో మిల్లర్లు, కేంద్రాల నిర్వాహకులు కలిసి రూ.కోట్ల విలువైన ధాన్యం కొల్లగొడుతున్నారు. కడ్తా అంటూ విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. దళారుల కంటే దారుణమైన రీతిలో సర్కారీ కొనుగోలు కేంద్రాల్లో అంతు లేని అవినీతి కొనసాగుతోంది. ఆయా కేంద్రాల్లో తరుగు పేరుతో రైతుల ధాన్యం క్వింటాలుకు ఐదు కిలోల చొప్పున కోత పెడుతున్నారు. తూకం వేసినప్పుడు రెండు నుంచి నాలుగు కిలోల వరకు, అలాగే తూకం వేసిన ఈ ధాన్యం లారీని దించుకునేటప్పుడు రైస్‌మిల్లరు మరో రెండు నుంచి నాలుగు కిలో.. ఇలా కనీసం క్వింటాలుకు ఐదారు కిలోల వరకు కోత పెడుతున్నారు. ఇలా తరుగు పేరుతో ఇప్పటివరకు నిర్వాహకులు, మిల్లర్లు కలిసి చేసిన దోపిడీ విలువ అక్షరాల రూ.20.20 కోట్లకు పైమాటే. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలను లోతుగా పరిశీలిస్తే కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూస్తున్నాయి. జిల్లాలో ఏర్పాటు చేసిన సర్కారు కొనుగోలు కేంద్రాల్లో శుక్రవారం (ఈ నెల 3) నాటికి 2.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. క్వింటాలుకు ఐదు కిలోల చొప్పున లెక్కేస్తే.. 2.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి తరుగు పేరిట 1.14 లక్షల క్వింటాళ్లు ధాన్యం కోత విధించారు. ధాన్యం ధర క్వింటాలుకు రూ.1,770 చొప్పున 1.14 లక్షల క్వింటాళ్లకు రూ.20.17 కోట్లు అవుతుంది. ఈ డబ్బంతా రైతులకు చెందాల్సింది. కానీ, నిర్వాహకులు, మిల్లర్లు అక్రమంగా కాజేస్తున్నారు. నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మక్కు.. జిల్లాలో 291 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 262 కేంద్రాలను పీఏసీఎస్‌లకు అప్పగించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు నిర్వహిస్తున్న కేంద్రాలను మినహాయిస్తే, పీఏసీఎస్‌లు నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాల్లో మాత్రం యథేచ్ఛగా> దోపిడీ జరుగుతోంది. ఆయా కేంద్రాలకు అలాట్ చేసిన రైస్‌మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కలిసి ధాన్యం విక్రయించేందుకు వచ్చిన రైతులను నిండా ముంచుతున్నారు. ఒక్కో సీజనులో మిల్లర్లు, కొందరు పీఏసీఎస్ చైర్మన్లు రూ.లక్షల్లో అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఆందోళన చేస్తున్నా ఆగని అక్రమాలు.. సర్కారు కేంద్రాల్లో నిలువు దోపిడీకి గురవుతున్న రైతులు ఆందోళనకు దిగినా అధికారులు పెద్దగా స్పందించిందీ లేదు.. అక్రమాలు ఆగిందీ లేదు. తరుగు పేరుతో తమను నిండా ముంచుతున్నారని ఇటీవల నవీపేట్లో రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. అంతకు ముందు నాళేశ్వర్ గ్రామానికి చెందిన రైతులు సుమారు 30 మంది కలెక్టరేట్‌కు వచ్చి జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. అయినా కడ్తా విషయంలో పెద్దగా మార్పు రాలేదు. దళారులకు మించి.. ఆరుగాలం శ్రమించి, తీవ్ర ప్రతికూల పరిస్థితులను అధిగమించి రైతులు ధాన్యాన్ని పండిస్తున్నారు. చేతికందిన పంటను దళారులకు విక్రయిస్తే నష్టపోతామని భావిస్తున్న రైతులు ఎంతో ఆశతో సర్కారు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలిస్తున్నారు. తీరా ప్రభుత్వ కేంద్రాల్లోనూ దళారుల మాదిరిగా దగా జరుగుతుండటంతో రైతులు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ప్రకటనలు చేస్తున్న అధికారులు.. మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల దోపిడీకి అడ్డుకట్ట వేయకపోవడం వెనుక తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అధికార యంత్రాంగం ఈ దోపిడీని చూసీ చూడనట్లు వదిలేస్తుండటం విమర్శలకు దారితీస్తోంది. ఈ దోపిడీపై ఇప్పటికే రైతులు రోడ్డెక్కి ఆందోళన బాట పడుతున్నారు. ఈ దోపిడీ ఇలాగే కొనసాగితే ధాన్యం రైతులు పోరాటాలకు దిగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కుమ్మక్కు!
మిర్యాలగూడ : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మక్కై దోచుకుంటున్నారు. యాసంగిలో సన్న ధాన్యం నేరుగా మిల్లుల వద్ద విక్రయించుకుంటున్న రైతులు.. 1010 రకం ధాన్యం మాత్రం ఐకేపీ కేంద్రాల్లో అమ్ముకుంటున్నారు. సన్న ధాన్యం విక్రయించుకోవడానికి మిల్లులకు వెళ్లిన వారికి మిల్లర్లు వివిధ కారణాలతో కుచ్చుటోపీ పెడుతుండగా ప్రభుత్వ ఐకేపీ కేంద్రాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. వీరి నిర్వాకం ఇటీవల విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడుల్లో బయటపడింది. ఐకేపీల్లో ఇక్కడ 40 కిలోల బస్తాకు ఒక కిలో అదనంగా తీసుకుంటున్నారు. మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతాల్లో 90 రైస్ మిల్లులు ఉన్నాయి. ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని అధికారులు కేటాయించిన రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు. దీంతో ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు.. ముందస్తుగా మిల్లర్లతో కుమ్మక్కై రైతుల వద్దనుంచి అదనంగా తూకం వేసుకున్న ధాన్యానికి డబ్బులు తీసుకొని పంచుకుంటున్నారు. లారీ ధాన్యానికి నాలుగు క్వింటాళ్ల దోపిడీ ఒక్క లారీ ధాన్యానికి నాలుగు క్వింటాళ్ల ధాన్యం దోపిడీ చేస్తున్నారు. రైతులనుంచి అదనంగా తూకం వేసుకుంటున్న ధాన్యాన్ని మిల్లు వద్దకు చేర్చుతున్న ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు అదనంగా ఉన్న ధాన్యంలో మిల్లర్లతో కలిసి వాటా పంచుకుంటున్నారు. నాలుగు క్వింటాళ్ల ధాన్యంలో ఒక క్వింటా మిల్లర్‌కు, మూడు క్వింటాళ్లు ఐకేపీ కేంద్రం వారు తీసుకుంటున్నా రు. ప్రస్తుతం ఉన్న ధాన్యం ధరల ప్రకారం క్వింటా ధా న్యానికి 1770 రూపాయలు చెల్లిస్తుండగా నాలుగు క్విం టాళ్లకు 7080 రూపాయల మేర దోచుకుంటున్నారు. వే బ్రిడ్జి తూకాల్లో మోసం.. వే బ్రిడ్జిలలో తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఒక్కో రైస్‌మిల్లుకు ప్రత్యేకంగా వే బ్రిడ్జి కాంటా ఉంటుంది. ఆ బ్రిడ్జిలో తూకం వేసిన ధాన్యానికి మరో వేబ్రిడ్జిలో వేసిన తూకానికి తేడా వస్తోంది. రైస్ మిల్లర్ల ఆధీనంలో ఉండే వే బ్రిడ్జిలలో తక్కువ తూకం వేస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఇటీవల తూనికల కొలతల అధికారులు చేపట్టిన తనిఖీలలో వాస్తవాలు వెల్లడయ్యాయి. రైతులు నేరుగా మిల్లుల్లో ధాన్యం విక్రయించుకోవడానికి ట్రాక్టర్లలో ధాన్యం తీసుకవస్తుండగా వేబ్రిడ్జిలోనే తూకం వేయించాల్సి వస్తుంది. తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న మిల్లర్ల వద్ద వేబ్రిడ్జిలో తూకం వేసి ట్రాక్టర్ ధాన్యం విక్రయించుకుంటే సుమారుగా రెండు నుంచి మూడు క్వింటాళ్ల ధాన్యాన్ని రైతులు నష్టపోతున్నారు. అంటే రైతులు 5వేల రూపాయల నుంచి 5500 రూపాయల వరకు నష్టపోతున్నారు. సంఘ బంధాలను మార్చకపోవడం వల్లనే.. ఐకేపీ ధాన్యం కొనుగోలుకు మహిళా సంఘబంధాలను ప్రతి ఏటా మారుస్తూ ఉండాలి. కానీ అధికారులు నిర్లక్ష్యం వహించి ప్రతి ఏటా కొనుగోలు చేసిన సంఘాలకే యధావిధిగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో వారికి, మిల్లర్లకు మధ్య మంచి సంబంధాలు ఏర్పడి రైతులను దగా చేస్తున్నారు. ఇదే విషయం మిర్యాలగూడ మండలంలోని గూడూరులో తూనికల కొలతల అధికారులు ఇటీవల తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. ఐకేపీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన నాటి నుంచి ఆ సంఘానికే కొనుగోలు బాధ్యతలు ఇస్తున్నారు. అలాకాకుండా కేంద్రాల నిర్వహణ గ్రామంలోని అన్ని సంఘాలకు అవకాశం కల్పించే విధంగా మార్పులు చేస్తే ఇలాంటి అక్రమాలకు తావుండే అవకాశాలు లేవన్న వాదన వినిపిస్తోంది. -
వేగం పెరగాలి..
సాక్షి ప్రతినిధి, వరంగల్: రైసు మిలర్ల వివాదం సమసిపోవడంతో రబీ ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ దృష్టి సారించింది. రబీ ధాన్యం ఇప్పుడిప్పుడే కొనుగోలు కేంద్రాలకు చేరుతుండగా... రా రైస్ విషయంలో నెలకొన్న వివాదం కారణంగా మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ బియ్యం(సీఎంఆర్) కింద ధాన్యం తీసుకునేందుకు నిరాకరించారు. ఈ మేరకు శుక్రవారం నుంచి సహాయ నిరాకరణకు రైసుమిల్లర్ల సంఘం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పౌరసరఫరాలశాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి రైస్ మిల్లర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర, జిల్లా నేతలతో గురువారం జరిపిన చర్చలు ఫలించాయి. రా రైస్ విషయంలో ఏర్పడిన సమస్యలను వారం, పది రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సహాయ నిరాకరణను విరమించుకున్నట్లు ప్రకటించిన మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకునేందుకు అంగీకరించారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరగకుండా చూడాలని, రైతులు పడిగాపులు కాచే పరిస్థితి ఉండకూడదని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రబీ కొనుగోళ్లలో వేగం పెంచడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. 613 కొనుగోలు కేంద్రాలు, 5.04 లక్షల మెట్రిక్ టన్నులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రబీ సాగు విస్తీర్ణం ఆధారంగా ఈ సీజన్లో 5,04,602 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 613 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేశారు. గురువారం నాటికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 538 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన అ«ధికారులు ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్ సంస్థల ద్వారా 1,17,289 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 63 కేంద్రాల ద్వారా 63,665 మె.టన్నులు, వరంగల్ రూరల్ జిల్లాలో 95 కేంద్రాల ద్వారా 22,406, జయశంకర్ భూపాలపల్లి (ములుగు జిల్లా కలిపి) జిల్లాలో 239 కేంద్రాల ద్వారా 33,507, మహబూబాబాద్‌లో 69 కేంద్రాల ద్వారా 14,250, జనగామ జిల్లాలో 72 కేంద్రాల ద్వారా 23,465 మె.టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మొత్తం 5,04,602 మె.టన్నుల లక్ష్యానికి 1,17,289 మె.టన్నులు (23.24 శాతం) ధాన్యాన్ని సేకరించారు. ఈ నేపథ్యంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ల విషయంలో మరింత స్పీడ్ పెంచాలని గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించిన పౌరసరఫరాలశాఖ కమిషనర్ డాక్టర్ అకున్ సబర్వాల్ అధికారులను ఆదేశించారు. రేషన్‌షాపులు, కొనుగోలు కేంద్రాల పరిశీలన ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గురువారం పర్యటించిన పౌరసరఫరాలశాఖ కమిషనర్ డాక్టర్ అకున్ సబర్వాల్ కొనుగోలు కేంద్రాలు, రేషన్ దుకాణాలను పరిశీలించారు. హైదరాబాద్ నుంచి ఉదయమే హన్మకొండకు చేరుకున్న ఆయన పోలీస్ గెస్ట్‌హౌజ్‌లో ఆబ్కారీ, ప్రొహిబిష¯Œన్, పౌరసరఫరాల శాఖ, డీఆర్డీఏ అధికారులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ధర్మసాగర్ మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన రైతులతో మాట్లాడారు. తేమ గుర్తింపు విధానం, యంత్రాల పనితీరుపై ఆరా తీశారు. ఇక కాజీపేట మండలం బాపూజీనగర్‌లోని 12వ నెంబర్ చౌకధరల దుకాణాన్ని తనిఖీ చేశారు. అనంతరం కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. తాగునీరు, నీడ, టార్పాలిన్లు, తూకం, తేమ యంత్రాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తూకాల్లో మోసాలను అరికట్టేందుకు ప్రతీ కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేయాలని లీగల్ మెట్రాలజీ అధికారులకు స్పష్టం చేశారు. అక్కడక్కడా తేమ పేరున తూకాలలో తగ్గింపులు జరుపుతున్నట్లు విమర్శలపై దృష్టి సారించాలని సూచించారు. -
మిల్లుల్లోనే లారీలు
ఇందూరు/ఇందల్వాయి: కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం బస్తాలను రైస్ మిల్లులకు తరలించడానికి సరిపడా లారీలున్నప్పటీకీ... మార్కెట్లో ఏర్పడిన హమాలీల కొరత కారణంగా మిల్లర్లు లారీల్లోంచి బస్తాలను దింపుకోవడం లేదు. నాలుగైదు రోజులుగా ఆయా మిల్లుల్లోనే లారీలు ఉండిపోవడంతో తూకం వేసి ఉంచిన ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రాల్లో, రోడ్లపైనే ఉన్నాయి. లారీల సమస్యతో కొన్ని చోట్ల కొనుగోళ్లు కూడా చేపట్టడం లేదు. ఇటు మారుతున్న వాతావరణ పరిస్థితులతో వర్షం పడితే ఏం చేయాలో అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రబీ సీజన్‌కు గాను 3 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని సివిల్ సప్లయి అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 291 కొనుగోలు కేంద్రాల్లో ప్రస్తుతం ధాన్యం సేకరణ సాగుతోంది. ఇప్పటి వరకు 2లక్షల 10వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు. అయితే అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతుల నుంచి సేకరించిన ధాన్యం లారీల్లో తరలించడానికి దాదాపు 450 లారీలు ఏర్పాటు చేశారు. అదనంగా మరికొన్ని లారీలను పక్క జిల్లాల నుంచి తెప్పించారు. జిల్లా వ్యాప్తంగా 64 మిల్లులకు సీఎంఆర్ బాధ్యతలు ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల నుంచి లారీల్లో బస్తాలను నింపుకుని నేరుగా మిల్లులకు పంపిస్తున్నారు. అయితే కొనుగోలు కేంద్రాల్లో ప్రయివేటు కూలీలకు తూకం వేసి లారీల్లో ఎక్కించినందుకు గాను ఒక క్వింటాలుకు రూ.25 వరకు లభిస్తోంది. అదే రైస్ మిల్లుల్లో లారీల్లోంచి బస్తాలను దింపినందుకు గాను కేవలం రూ.6 వరకే మిల్లర్లు ఇస్తున్నారు. దీంతో అధికంగా కూలీ వస్తున్న కొనుగోలు కేంద్రాల వైపే కూలీలు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా మిల్లులకు చేరిన లారీల్లోంచి ధాన్యం దింపేవారు కరువయ్యారు. ఐదారు మంది హమాలీలతోనే రోజుకు రెండు లారీల వరకు దింపుకుంటున్నారు. అన్లోడింగ్ సమస్య ఏర్పడడంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 380 వరకు లారీలు మిల్లుల్లోనే ఉన్నట్లు సమాచారం. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించడానికి లారీల కొరత ఏర్పడుతుందని, వెంట వెంటనే లారీలను అన్లోడ్ చేసి పంపాలని మిల్లర్లకు పదే పదే సూచిస్తున్నా పరిస్థితి అంతే ఉంది. మరోపక్క రైతులేమో లారీల కోసం, కాంటాల ఏర్పాటు కోసం జిల్లాలో ఎక్కడో ఒక చోట రోడ్డెక్కుతూనే ఉన్నారు. డీటీలను రంగంలోకి దింపిన జేసీ సివిల్ సప్లయి అధికారులు మిలర్లకు ఎన్నిసార్లు చెప్పినా అన్లోడ్ చేసి లారీలను పంపకపోవడంతో జేసీ వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే జేసీ ఐదుగురు ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్లను రంగంలోకి దింపారు. ఏయే మిల్లుల్లో అన్లోడింగ్ కావడం లేదో తెలుసుకుని ప్రతి గంటకు సమాచారం అందించడానికి ప్రత్యేకంగా వీరిని నియమించారు. రోజుకు 20 మిల్లులు తిరిగి వచ్చిన లారీలను అన్లోడింగ్ చేయించి కొనుగోలు కేంద్రాలకు పంపించాలని వారికి ఆదేశాలు ఇచ్చారు. అన్లోడింగ్ చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్న మిల్లుల సమాచారం ఇవ్వాలన్నారు. దీంతో రెండు రోజులుగా టీడీలు ప్రధానంగా నగర శివార్లలో ఉన్న మిల్లులను తిరుగుతున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం.. – హరికృష్ణ, డీఎం, సివిల్ సప్లయి కార్పొరేషన్ జిల్లాలో ఉన్న అన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రారంభం కావడంతో ఎక్కువ మొత్తంలో ధాన్యం వస్తోంది. తూకం వేసిన బస్తాలను వెంటనే సంబంధిత మిల్లులకు లారీల ద్వారా పంపుతున్నాం. కానీ మిల్లర్లు బస్తాలను దింపుకోకపోవడంతో లారీల కొరత ఏర్పడుతోంది. వెంటనే అన్లోడ్ చేసి పంపితే లారీలతో ఇబ్బందులు ఉండవు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిస్థితిని చక్కబెడుతున్నాం. ఐదు రోజులవుతున్నా లారీలు రావడం లేదు 300 బస్తాల ధాన్యం అమ్మి ఐదు రోజులవుతున్నా లారీ రావడం లేదు. దీంతో పట్టాల కిరాయి అదనంగా భరించాల్సి వస్తుంది. మొదట్లో గన్నీ బస్తాల కొరత ఉంటే ఇప్పుడు లారీల కొరత అంటున్నారు. వర్ష సూచన ఉన్నందున లారీల కొరత తీర్చి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. –జమీల్ పాషా, రైతు, సిర్నాపల్లి కడ్తాతో పాటు ధర తక్కువ అంటున్నారు నేను నల్లవెల్లి కొనుగోలు కేంద్రంలో 120 బస్తాల ధాన్యాన్ని ఎగబోసి శుధ్ధిచేసి విక్రయించాను. ధాన్యం మిల్లుకు చేరాక ఇప్పుడు తాలు గింజలు ఉన్నాయని 3 కిలోల కడ్తా, సన్నగా ఉందని కామన్ గ్రేడ్ ధర రూ. 1750 ఇస్తామని అంటున్నారు. ఈ లెక్కన మాకు 3 వేల రూపాయల నష్టం వస్తుంది. ఇకనైనా అధికారులు ఇలా జరగకుండా చర్యలు చేపట్టాలి. –గోపాల్ రెడ్డి, నల్లవెల్లి లారీల కొరత గన్నీ బస్తాలు లేక ధాన్యం కుప్పబోసిన వారం రోజులకు కాంట అయ్యాయి. ఇప్పుడు లారీలు లేక మరో వారం రోజులు ఆగాల్సి వచ్చేలా ఉంది. తీరా మిల్లుకు తరలిన ధాన్యంలో మరెన్ని లోపాలు ఎత్తి చూపిస్తారోనన్న భయం ఉంది. ఇవ్వన్ని పూర్తయినా డబ్బుల కోసం కూడా చాలా కాలం వేచి చూడాల్సి వస్తుంది. ఇకనైనా అధికారులు ఈ సమస్యలపై దృష్టి సారించి కొనుగోళ్ల వేగవంతానికి కృషి చేయాలి. –నోముల తిరుపతిరెడ్డి, నల్లవెల్లి -
భారమంతా రైతులపైనే!
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): కష్టాలన్నీ రైతులకే.. విత్తనం వేసింది మొదలు, పంట చేతికొచ్చే వరకూ ఎన్నో కష్టాలు పడుతున్న రైతులకు.. వచ్చిన పంటను అమ్ముకునేందుకూ తిప్పలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు అనేక రకాలుగా నష్టపోతున్నారు. అండగా నిలబడాల్సిన కేంద్రం ప్రభుత్వం కూడా రైతుల పట్ల చిన్నచూపు చూస్తోంది. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు భరించిన హమాలీ చార్జీలను కేంద్రం తిరిగి ఇవ్వకుండా మెండిచేయి చూపుతోంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) అభ్యంతరం కారణంగా గత రెండు సంవత్సరాలుగా జిల్లాకు ఈ నిధులు రావడం లేదు. దీంతో గత మూడు సీజన్లుగా హమాలీ చార్జీల భారం రైతులపైనే పడుతోంది. 2017–18 సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లు కలిపి 2.40 కోట్లు, 2018–19 సంవత్సరంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన రూ.2.50 కోట్లు కలిపి మొత్తంగా జిల్లాకు రూ. 5కోట్ల వరకు హమాలీ డబ్బులు రైతులకు రావాల్సి ఉంది. అయితే, ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్‌కు హమాలీ చార్జీలు ఇప్పించాలని రైతులు కోరారు. కేంద్ర ప్రభ్వుతానికి విన్నవిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం చార్జీలను విడుదల చేయకపోవడం వెనుక ఓ కారణం ఉంది. హమాలీ చార్జీలను నిజంగా రైతులు చెల్లించింది నిజమో కాదోనని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను సమర్పించాలని కాగ్ కోరింది. ఇందుకు జిల్లా నుంచి సివిల్ సప్లయి కార్పొరేషన్ అధికారులు ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. బస్తాకు రూ.5 చొప్పున.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం బస్తాలను తూకం వేసి లారీల్లో ఎక్కించడానికి హమాలీల ఖర్చును ముందుగా సంబంధిత రైతులే భరించాల్సి ఉంటుంది. ఒక్కో బస్తాకు రూ.5 వరకు హమాలీలకు చెల్లిస్తారు. అయితే, కొన్ని రోజుల తరువాత హమాలీ చార్జీలను కేంద్ర ప్రభుత్వం తిరిగి సంబంధిత రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. కానీ 2016–17 సంవత్సరం వరకే రైతులకు హమాలీ చార్జీలు అందాయి. 2017–18, 2018–19 కలిపి 60 వేల మంది రైతులకు సంబంధించిన మూడు సీజన్ల డబ్బులు రూ.5 కోట్ల వరకు రావాల్సి ఉంది. ఇప్పటికే మూడు సీజన్లు ముగిసి ప్రస్తుత రబీ సీజన్లో కూడా హమాలీ చార్జీలను రైతులే భరిస్తున్నారు. వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వం నుంచి హమాలీ చార్జీలను ఇప్పించాలని రైతులు అధికారులను కోరుతున్నారు. ఇచ్చి లాగేసుకున్న కేంద్రం.. రైతులకు తిరిగి చెల్లించాల్సిన హమాలీ చార్జీలను 2016–17 వరకు చెల్లించింది కేంద్రం. అయితే, చెల్లించిన ఏడాది వరకు మూడు, నాలుగు సీజన్లకు సంబంధించిన చార్జీలను కేంద్ర ప్రభుత్వం రూ.27.53 కోట్లు సివిల్ సప్లయి కార్పొరేషన్‌కు ఇచ్చింది. అదే సమయంలో కాగ్ ఈ నిధులపై ఆడిట్ చేసింది. అయితే, అప్పటికే జిల్లాకు వచ్చిన హామాలీ చార్జీల డబ్బులను సివిల్ సప్లయి కార్పొరేషన్ అధికారులు రైతుల ఖాతాల్లో జమ చేశారు. అదే సమయంలో ఇచ్చిన నిధులను తిరిగి ఇచ్చేయాలని కేంద్రం సూచించింది. కానీ డబ్బులు రైతులు ఖాతాలో జమ కావడంతో వీలు కాలేదు. ఇందుకు ఎఫ్‌సీఐ నుంచి సివిల్ సప్లయి కార్పొరేషన్‌కు రావాల్సిన నిధుల్లోంచి రూ.27.53 కోట్లు హమాలీ చార్జీల రూపంలో తీసేసుకుంది. దీంతో ఈ భారం మొత్తం సివిల్ సప్లయి కార్పొరేషన్‌పై పడింది. -
అన్నదాత ... అరిగోస
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఆరుగాలం శ్రమించి, కష్టనష్టాలకు ఓర్చి పండించిన పంటను అమ్ముకుని రోజుల తరబడి డబ్బుల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. కనీస మద్దతు ధర అందించేందుకు, రైతులకు అండగా నిలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరా సంస్థ ద్వారా ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేయించి, కొనుగోలు చేస్తోంది. ఈ సంస్థ, పీఎసీఎస్, ఐకేపీల ద్వారా ధాన్యం కేంద్రాలు నిర్వహిస్తోంది. అంచనాలకు తగ్గట్టు రైతులకు మద్దతు ధర చెల్లిస్తూ ధాన్యం కొనుగోలు చేస్తున్నా.. వాటికి చెల్లింపుల విషయంలో మాత్రం చేతులు ఎత్తేస్తోంది. వివిధ సాంకేతిక కారణాల సాకుతో రోజుల తరబడి రైతులకు చెల్లింపులు జరగడం లేదు. ఆయా కేంద్రాల్లో అసౌకర్యాలను ఎదుర్కొంటూ.. అకాల వర్షాలకు ధాన్యాన్ని కాపాడుకుంటూ.. ఇలా, అన్ని గండాలు దాటుకుని అమ్ముకున్న ధాన్యానికి వెంటనే డబ్బులు అందక అన్నదాత అరిగోస పడుతున్నాడు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 508 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు రూ.769.45కోట్ల విలువైన 4.35లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కాగా, ఈ మొత్తంలో ఇప్పటి వరకు రైతులకు చెల్లించిన సొమ్ము కేవలం రూ.118.88కోట్లు మాత్రమే కావడం గమనార్హం. అంటే ప్రభుత్వం రైతులకు ఇంకా.. రూ.650.57కోట్లు బకాయి పడ్డట్టయ్యింది. కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం వల్ల చెల్లింపులకు ఆలస్యం జరుగుతోందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను బుక్ కీపర్లు ట్యాబ్‌లో అప్లోడ్ చేసిన 48గంటల లోగా రైతు ఖాతాలో నగదు జమ కావాల్సి ఉంటుంది. కానీ, ఇరవై రోజులు గడిచినా డబ్బులు అందని రైతులు వేలాది మంది ఉన్నారు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే ముప్పై ఆరు వేల మంది రైతులు ఇప్పటి దాకా ధాన్యం అమ్ముకుంటే పట్టుమని మూడు వేల మందికి కూడా డబ్బులు అందలేదు. ఆన్లైన్ సమస్యలు అన్నదాతకే కష్టాలు తెచ్చిపెడుతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిన సంబంధిత అధికారులు మాత్రం చేతులు ఎత్తేస్తున్నారు. ఇదీ .... లెక్క సూర్యాపేట : యాసంగిలో సాగు చేసిన వరి ధాన్యం కొనుగోలు కోసం జిల్లా వ్యాప్తంగా 140 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా 136 కేంద్రాలలలో ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది. వీటిలో సహకార సంఘాల ద్వారా 70 కేంద్రాలు, ఐకేపీ ద్వారా 66 కేంద్రాలను ఏర్పా?టు చేశారు.ఈ ఏప్రిల్ మొదటి వారంలో కొనుగోలు ప్రారంభం కాగా, నేటి వరకు ఈ కేంద్రాల ద్వారా 1,29,774.800 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని∙కొనుగోలు చేశారు. ఈ ధాన్యం విలువ రూ. 2,29,68,23,376. మొత్తం17,920 మంది రైతులు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని అమ్ముకోగా .. 3,984 మంది రైతులకు రూ. 48,68,49,156లను ఖాతాలలో జమ చేశారు. యాదాద్రి : యాదాద్రిభువనగిరి జిల్లాలో 143 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఇప్పటి వరకు 9వేల మంది రైతుల నుంచి 65వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈమొత్తం ధాన్యానికి రూ.115కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. రైతులకు సకాలంలో డబ్బులు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు రూ.25కోట్ల మేరకు ట్యాబ్‌లో అప్లోడ్ చేయడం వల్ల రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. -
‘నిధి’వంచితులు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రైతులకు మద్దతు ధరను అందించి ధాన్యం కొనుగోళ్లు నిర్వహించిన ఇందిరాక్రాంతి పథం (ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి (పీఏసీఎస్) సంఘాల వారికి రావాల్సిన కమీషన్ నిలిచి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చే కమీషన్‌తో తమ తలరాత మార్చుకుందామనుకుంటే..సీజన్లవారీగా శ్రమించిన వీరికి మాత్రం డబ్బులు ముట్టక తిప్పలు మామూలే అన్నట్లుగా పరిస్థితి మారింది. గత ఖరీఫ్, రబీ, ఈ ఏడాది ఖరీఫ్‌లో ఎంతో కష్టపడి ధాన్యం సేకరించి, కాంటాలు, తరలింపు, రికార్డుల నిర్వహణ ప్రక్రియ చేసిన వీరికి ఆర్థిక చేయూత లేక అవస్థలు పడుతున్నారు. మూడు వ్యవసాయ సీజన్లకు సంబంధించిన సొమ్ము రాకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలంలో ఎంతో కష్టపడ్డామని, రైతులను చైతన్యవంతం చేసి ధాన్యం తీసుకొచ్చేలా చూశామని, రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే అధిక సమయం వెచ్చించి..ధాన్యం సేకరణను విజయవంతం చేశామని వీరు చెబుతున్నారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల బాధ్యులు, సొసైటీల వారు డబ్బులు అందక తమ విధిరాత మారట్లేదని ఆవేదనగా చెబుతున్నారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో 2017–18లో ఖరీఫ్, రబీతోపాటు 2018–19 ఖరీఫ్‌లో వడ్ల కొనుగోళ్లు నిర్వహించారు. గ్రేడ్–ఏ రకం ధాన్యం కొన్నందుకు క్వింటాకు రూ.32, సాధారణ రకం ధాన్యం క్వింటాకు రూ.31.25 కమీషన్ కింద చెల్లించాలి. మొత్తం మూడు సీజన్లకు సంబంధించిన కమీషన్ రూ.10,82,53,703 రావాల్సి ఉంది. 2017–18 నుంచి 2018–19 సీజన్లలో ఇలా.. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్, రబీ సీజన్లకు ఐకేపీ, పీఏసీఎస్ సిబ్బందికి రూ.5,67,37,911 కమీషన్ రావాల్సి ఉంది. 2017–18 ఖరీఫ్‌లో ఐకేసీ, పీఏసీఎస్ సిబ్బంది కలిపి 60 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీరు 4,296 మంది రైతుల వద్ద నుంచి 39,360మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి రైతులకు నగదు చెల్లింపులు పూర్తి చేశారు. అయితే గ్రేడ్–ఏ రకం ధాన్యానికి రూ.1,02,33,088, కామన్ రకానికి సంబంధించి రూ.23,06,963 ఐకేపీ, పీఏసీఎస్ సిబ్బందికి కమీషన్ చెల్లించాలని తేలింది. మొత్తం 1,25,40,051 కమీషన్ రావాలి. రబీ సీజన్‌కు సంబంధించి 90 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 16,566 మంది రైతుల నుంచి 1,38,154 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నారు. ఐకేపీ, పీఏసీఎస్ సిబ్బందికి గ్రేడ్–ఏ రకం ధాన్యానికి రూ.4,37,12,204, కామన్ రకానికి సంబంధించి రూ.4,85,656 చొప్పున మొత్తం రూ.4,41,97,860 కమీషన్ రూపంలో రావాల్సి ఉంది. 2018–19 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యానికి కూడా పీఏసీఎస్, ఐకేపీ సిబ్బందికి కమీషన్ పెండింగ్‌లో ఉంది. ఈ ఖరీఫ్‌లో 86 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి..20,327 మంది రైతుల నుంచి 1,61,665 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. గ్రేడ్–ఏ రకం ధాన్యానికి రూ.4,24,70,742, కామన్ రకానికి సంబంధించి రూ.90,45,050 మొత్తం కలిపి రూ.5,15,15,792 పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది 98 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు 76 కేంద్రాలను ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన కొనుగోళ్లు కూడా చేస్తున్నారు. తమకు పెండింగ్‌లో ఉన్న కమీషన్‌ను చెల్లించకుండానే మళ్లీ పని చేయించుకుంటున్నారని వీరంతా బాధ పడుతున్నారు. ఇకనైనా నిధులు మంజూరు చేయాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వానికి నివేదించాం.. ఐకేపీ, పీఏసీఎస్ సిబ్బందికి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కమీషన్ చెల్లింపు అంశాన్ని ప్రభుత్వానికి నివేదించాం. మాకు ఫండ్స్ రాగానే నిర్వాహకులకు అందిస్తాం. ఎవరూ కంగారు పడొద్దని కోరుతున్నాం. – వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్, ఖమ్మం కష్టపడ్డందుకు లాభమేది? కూసుమంచి మండలంలోని పాలేరులో శ్రీవాణి గ్రామ సమాఖ్య ఆధ్వర్యంలో గ్రూపు సభ్యులమంతా కలిసి ధాన్యం కొనుగోలు చేశాం. మొత్తం 10,551 క్వింటాల వడ్లు కొన్నాం. క్వింటాకు రూ.32 చొప్పున కమీషన్ ఇవ్వాలి. ఇలా మాకు రూ.3.50లక్షల కమీషన్ డబ్బులు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూపాయి కూడా ఇయ్యలే. మళ్లీ కొత్తగా రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న డబ్బులు ఇలా ఆపుజేస్తే.. మేం కష్టపడ్డందుకు ఏం లాభం ఉంటదండి. అధికారులు మా గోస తీర్చాలని కోరుతున్నాం. -
ధాన్యం కొనేవారేరి..?
వీణవంక(హుజూరాబాద్): పంట పండించడం ఒక ఎత్తయితే.. వచ్చిన దిగుబడిని విక్రయించడం రైతులకు కత్తిమీద సాములా మారుతోంది. ఇక మగ వడ్లు సాగు చేసిన అన్నదాతలు కల్లాల్లో ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆడ, మగ వరి సాగుకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడ పండించిన ధాన్యం ఆరేళ్లయినా మొలకెత్తే స్వభావం కలిగి ఉంటుంది. హైబ్రీడ్ వరిని 32 ఏళ్లుగా ఇక్కడి రైతులు సాగు చేస్తున్నారు. గత ఏడాది మగ వడ్లను ప్రభుత్వ రంగసంస్థలు కొనుగోలు చేయకపోవడంతో ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురించగా.. అప్పటి పౌరసరఫరాల శాఖ మంత్రి.. ప్రస్తుత వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెంటనే స్పందించి మగ వడ్లను కొనుగోలు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను ఆదేశించారు. అప్పుడు కొనుగోలు చేసిన సంస్థలు మళ్లీ ఈ రబీలో ముఖం చాటేశాయి. కేంద్రాలకు తరలించిన మగ ధాన్యం కొనుగోలుకు తిరస్కరిస్తున్నారు. దీంతో రైతులు మగ వడ్లను అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర గ్రేడ్–ఏకు క్వింటాల్‌కు రూ.1770, కామన్ రకం రూ.1750 ఉండగా మిల్లర్లు మగ వడ్లను రూ.1200కే అతికష్టం మీద కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. గింజ పొట్టిగా ఉంటుందనే సాకుతో.. మగ(హైబ్రీడ్) ధాన్యం గింజ పొట్టిగా ఉంటుందనే సాకుతో కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని తిరిగి పంపిస్తున్నారు. కనీసం గ్రేడ్ బీ(కామన్‌రకం) కింద కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వ రంగసంస్థలు చేతులెత్తేశాయి. మగ ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా అధికారులకు రైతులు విన్నవించినా ఫలితం లేకుండా పోతోంది. గ్రామాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయి విక్రయించడం సవాల్‌గా మారింది. కొందరు రైతులు గత్యతంరం లేక మిల్లర్లకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా మిల్లర్లు రైతులను దోపిడీకి గురి చేస్తున్నారు. ఆడ వడ్లను విత్తన కంపెనీలు కొనుగోలు చేస్తాయి. వీటికి మాత్రమే అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. మగ ధాన్యాన్ని రైతులే మార్కెట్లో అమ్ముకోవాలి. రైతులతో కంపెనీలు ముందస్తుగా అలా ఒప్పందం చేసుకుంటున్నాయి. మార్కెట్లో మగ ధాన్యానికి డిమాండ్ లేకపోవడంతోపాటు కనీసం కొనేవారు లేక నానా తంటాలు పడుతున్నారు. సాగుకు అనుకూలం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 45వేల ఎకరాలలో హైబ్రీడ్ వరి సాగులోకి వచ్చింది. ఇందులో 8వేల ఎకరాలు ఎండిపోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1.75 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. ఇందులో 40 నుంచి 50 వేల క్వింటాళ్లు మగ ధాన్యం పండినట్లు సమాచారం. ప్రస్తుతం వరి కోతలు 60శాతం పూర్తయ్యాయి. హైబ్రీడ్ వరి సాగులో రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఈసారి ఎకరాకు 6నుంచి 9క్వింటాల దిగుబడి వస్తుందని అంచనా. ఆడ వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.5 వేల నుంచి రూ.8వేల వరకు కంపెనీలు ధర చెల్లిస్తున్నాయి. ఎకరాకు రూ.38వేల వరకు పెట్టుబడి పెట్టామని, మగ ధాన్యం కొనుగోలు చేస్తేనే కష్టాల నుంచి గట్టేక్కుతామని రైతులు అంటున్నారు. కొనుగోలు చేయని ప్రభుత్వ రంగసంస్థలు.. ప్రభుత్వ రంగ సంస్థలు మగ ధాన్యం కొనుగోలు చేయడంలో చేతులెత్తేసింది. గ్రేడ్ ఏ రకం కింద 1010ధాన్యం, కామన్ రకం కింద మరి కొన్ని రకాల వడ్లను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మగ ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాలేదని కేంద్రాల నిర్వాహకులు తెలిపారు. కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందనే ఆశతో కొందరు రైతులు కళ్లాల వద్ద రాశులు పోసి వేచి చూస్తున్నారు. ధాన్యం మిల్లర్ల పాలు.. మగ ధాన్యం మిల్లర్ల పాలవుతోంది. రైతులకు తక్కువ ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నారు. ఈ నెలలో వివాహ శుభకార్యాలు ఉండడంతో ఖర్చుల కోసం రైతులు గత్యంతరం లేక మిల్లర్లకే విక్రయిస్తున్న సంఘటనలు ఉన్నాయి. క్వింటాల్‌కు ప్రభుత్వ మద్దతు ధర రూ.1770 ఉండగా మిల్లర్లు రూ.1200లోపే చెల్లిస్తున్నారు. తరుగు, తేమ పేరుతో మరింత కోత విధిస్తున్నారు. జిల్లా మంత్రి ఈటల రాజేందర్ చొరవ తీసుకొని మగ ధాన్యం ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మగ ధాన్యం కొనుగోలు చేయాలి.. మగ ధాన్యాన్ని ప్రభుత్వ రంగసంస్థలు కొనుగోలు చేయాలి. గింజ పొట్టిగా ఉంటుందని కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. ఇదేం పద్ధతి, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకపోతే ఎలా..? రైతులు సెంటర్లకు ధాన్యం తరలిస్తే వెళ్లగొడుతున్నరు. మిల్లర్లు రూ.1200కే అడుగుతున్నరు. కనీసం కామన్ రకం కిందనైన కొనుగోలు చేయాలి. ఎక్కువ మంది రైతులు మగ వడ్లనే పండించారు. ఎవ్వరూ కొనకపోవడంతో ఇబ్బంది పడుతున్నరు. – అంబాల రంగయ్య, రైతు ఐక్యవేదిక నాయకులు ఆదేశాలు రాలేదు.. మగ వడ్లను కొనుగోలు చేయాలని ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఉన్నతాధికారుల సూచన మేరకే గ్రేడ్ ఏ, గ్రేడ్ బీ రకాలను మాత్రమే కొనుగోలు చేస్తున్నాం. మా పరిధిలో 14సెంటర్లను ప్రారంభించాం. గతంలో జమ్మికుంట మార్కెట్లో మాత్రమే మగ వడ్లను కొనుగోలు చేశారు. రైతులు మగ వడ్లను సెంటర్లకు తరలించ వద్దు. – ప్రకాశ్‌రెడ్డి, పీఏసీఎస్, సీఈవో -
మిల్లర్ల దోపిడీ అ‘ధనం’
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. కొనుగోలు కేంద్రంలో తీస్తున్న తరుగు కాకుండా, అదనంగా రైస్‌మిల్లర్ల దోపిడీతో రైతులు లబోదిబోమంటున్నారు. తరుగు ఇవ్వని పక్షంలో ధాన్యం దించుకోబోమని మిల్లర్లు బెదిరింపులకు దిగుతున్నారని రైతులు వాపోతున్నారు. ముందే అకాల వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ తరుణంలో తమ ధాన్యాన్ని విక్రయించుకుంటే చేతికందిన కష్టం వర్షానికి తడిసిపోకుండా ఉంటుందనే ఆత్రుతతో రైతులున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని మిల్లరు దోపిడీకి తెరలేపారు. కొనుగోలు కేంద్రంలో తీస్తున్న తరుగు కాకుండా, అదనంగా మరో రెండు కిలోలు ఇస్తేనే ఆ లారీలో వడ్లను దిగుమతి చేసుకుంటామని, లేని పక్షంలో ధాన్యాన్ని తీసుకెళ్లాలని సదరు రైతులకు ఫోన్లు చేసి చెబుతున్నారు. దీంతో రైతులు ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. పైన పేర్కొన్న ఉదాహరణేæ ఇందుకు నిదర్శనం. నిత్యం వందలాది మంది రైతుల కష్టాన్ని అప్పనంగా కాజేస్తున్నారు. అధికారులకు రైతుల ఫోన్లు.. ఇటు కొనుగోలు కేంద్రాలు, అటు రైస్‌మిల్లులో రైతులను అడ్డగోలుగా దోపిడీ చేస్తుంటే కడుపు మండిన రైతులు జిల్లా ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి తమ బాధను చెప్పుకుంటున్నారు. కడ్తా ఇవ్వకపోతే ధాన్యం తిరిగి తీసుకెళ్లమంటున్నారని, ఏమి చేయాలో తెలియడం లేదని రైతులు అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. దీంతో మొక్కుబడిగా స్పందిస్తున్న జిల్లా ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందిని మిల్లులకు పంపుతున్నారు. ఈ సిబ్బంది నాణ్యత పరిశీలన పేరుతో మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు వంత పాడుతున్నారు. దీంతో రైతులు ఇంకా ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంత కోత విధిస్తే అంత ఒప్పుకుని మిన్నకుండి పోతున్నారు. కడ్తా ఇవ్వకపోతే నాణ్యత తిరకాసు.. కడ్తా ఇస్తేనే ధాన్యం తీసుకుంటామని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్‌మిల్లర్లు స్పష్టం చేస్తున్నారు. రైతు ఒప్పుకోని పక్షంలో ధాన్యంలో తాలు గింజలున్నాయని, తేమ శాతం అధికంగా ఉందని సాకులు చెబుతూ వేధిస్తున్నారు. ఎవరైనా రైతులు ధైర్యం చేసి అధికారులకు ఫిర్యాదు చేస్తే వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. వారం రోజులైనా వారి ధాన్యం కాంటా చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే.. కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని అధికారులు ఎప్పటి మాటే చెప్పుకొస్తున్నారు. ఎవరైనా రైతులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే సదరు రైస్‌మిల్లును బ్లాక్ లిస్టులో పెడతామని చెబుతున్నారు. కానీ నిత్యం అక్రమాల దందా కొనసాగుతున్నప్పటికీ.. గత ఐదేళ్లలో ఏ ఒక్క మిల్లును కూడా బ్లాక్ లిస్టులో పెట్టిన దాఖలాలు లేవు. వారిపై కనీస చర్యలు తీసుకున్న ఘటనలు కూడా లేవు. కోత విధించే మిల్లులపై చర్యలు రైస్‌మిల్లులో కోత విధించడం నిబంధనలకు విరుద్ధం. ఎవరైనా నాణ్యత లేదని ధాన్యం దించుకోని పక్షంలో రైతులు మాకు ఫిర్యాదు చేయవచ్చు. అధికారులను సంబంధిత రైస్‌మిల్లుకు పంపి ధాన్యం నాణ్యత పరిశీలిస్తాం. అక్కడ నాణ్యత బాగుందని తేలితే సంబంధిత రైస్‌మిల్లుపై చర్యలు తీసుకుంటాము. –వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు నల్లమాటి నరేష్, బోధన్ మండలం శ్రీనివాస్క్యాంపు. తనభూమి, కౌలు భూమి కలిపి 16 ఎకరాలు వరి సాగు చేస్తే సుమారు 150 క్వింటాళ్ల ధాన్యం వచ్చింది. దీన్ని కొనుగోలు కేంద్రానికి తరలిస్తే కాంటా వేసేటప్పుడు రెండు కిలోలు కోత విధించారు. తర్వాత ధాన్యాన్ని రైస్‌మిల్లుకు తరలించాక అక్కడ మరో రెండు నుంచి మూడు కిలోలు తగ్గిస్తామని చెబుతున్నారని నరేష్ వాపోతున్నారు. ఇలా క్వింటాలుకు నాలుగు కిలోలంటే 150 క్వింటాళ్లకు ఆరు క్వింటాళ్ల ధాన్యం అక్రమార్కుల పరం అవుతోంది. ఇలా తరుగు పేరుతో నష్ట పోతున్న ఆరు క్వింటాళ్ల ధాన్యం విలువ సుమారు రూ.10,600. -
ఎలా కొనేది ?
మెదక్ జోన్: రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్న కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం కమీషన్ విడుడల చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో కేంద్రాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతోంది. ధాన్యం సేకరణ (కొనుగోలు)కు ఐకేపీ సంఘాలు ససేమీరా అంటున్నాయి. సాధారణంగా ధాన్యం సేకరణ ముగిసి రైతులకు చెల్లింపులు పూర్తి కాగానే కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వం కమీషన్ మంజూరు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే గతేడాది రబీ, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లకు సంబంధించి కమీషన్ విడుదల చేయలేదు. ఇందుకు సంబంధించి కొనుగోలుదారులకు, రైతులకు చెల్లించే హమాలీ రూ.2.5 కోట్లు జిల్లాకు రావాల్సి ఉంది. ప్రస్తుతం మూడో సీజన్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కమీషన్ రానిదే ఊరికే ఎందుకు చేయాలని నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. రెండు సీజన్లుగా అందని కమీషన్... రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి పౌరసరఫరాల సంస్థకు అందించినందుకుగాను పీఏసీఎస్, ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.2.50 చెల్లిస్తుంది. ఈ కమీషన్ నుంచే కేంద్రాలకు సంబంధించిన ధాన్యం సేకరణ ఖర్చులను వెచ్చిస్తారు. మిగిలిన డబ్బులను మహిళా సంఘాల సభ్యులు పంచుకుంటారు. సహకార సంఘాల్లో అయితే సంఘాల నిల్వలకు జమచేసుకుంటారు. గత రెండు సీజన్లకు సంబంధించి ప్రభుత్వం కమీషన్ చెల్లించలేదు. గత ఖరీఫ్‌లో జిల్లాలో పీఏసీఎస్ ద్వారా 130 కేంద్రాలు, ఐకేపీ ద్వారా 40 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 170 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి రైతులకు సుమారు రూ.300 కోట్లకు పైగా చెల్లించారు. ప్రభుత్వం నుంచి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు రెండు సీజన్లకు సంబంధించి కమీషన్ రానందున సంఘాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు రూ.1.50 కోట్లు రావాల్సి ఉండగా, హమాలీ చార్జీ కింద రూ.కోటి రైతులకు రావాల్సి ఉంది. మొత్తంగా రూ.2.50 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అధికారుల చొరవతో.. ఈఏడాది రబీసీజన్‌కు సంబంధించి ఎప్పటిలాగే ఐకేసీ, పీఏసీఎస్ సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా ఐకేసీ సంఘాల సభ్యులు తమకు రావాల్సిన కమీషన్ ఇచ్చేంతవరకు కొనుగోలు చేయలేమని ఖరాకండీగా తేల్చి చెప్పారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో ధాన్యం దిగుబడులు వచ్చాయి. త్వరలో రావాల్సిన కమీషన్ ఇప్పిస్తాని.. కొనుగోలు తప్పకుండా చేయాల్సిందేనని జాయింట్ కలెక్టర్ నగేష్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సీతరామరావు వారిని ఒప్పించడంతో అతికష్టంమీద అంగీకరించారు. విడుదల కానీ హమాలీ చార్జీలు.. గత సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్‌కు సంబంధించి హమాలీ డబ్బులు రైతులకు రూ.కోటి రావాల్సి ఉంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని బస్తాల్లో నింపి తూకం వేసి లారీల్లో లోడ్చేసినందుకు గాను హమాలీలకు రైతులు క్వింటాలు రూ.23 చొప్పున చెల్లిస్తున్నారు. ఇందుకు సంబంధించి చార్జీల్లో క్వింటాలుకు రూ.5 చొప్పున ప్రభుత్వం హమాలి కింద రైతులకు చెల్లించాలి. రెండు సీజన్లుగా సివిల్సప్లై సంస్థ హమాలీ చార్జీలను విడుదల చేయడం లేదు. దీంతో రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పూర్తి చార్జీలను వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం హమాలీ కోసం క్వింటాలుకు ఇచ్చే రూ.5 మినహాయించి మిగతా డబ్బులు మాత్రమే రైతుల నుంచి తీసుకోవాలి. కానీ ప్రభుత్వం సకాలంలో డబ్బులు విడుదల చేయకపోవడంతో చేసేదిలేక రైతుల నుంచే ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. తాము ఇవ్వమని రైతులు నిరాకరిస్తే ధాన్యం తూకం వేయమని నిర్వాహకులు పేర్కొనడంతో గత్యంతరం లేక చెల్లిస్తున్నారు. మరికొన్ని చోట్ల అదనంగా క్వింటాలుకు రూ.25 వరకు వసూలు చేస్తున్నారు. ఫలితంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంఘాలకు కమీషన్‌తో పాటు హమాలీ చార్జీలను సకాలంలో విడుదల చేయాలని కొనుగోలు కేంద్రాల సంఘాలు, రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
ఊపందుకోని వరి ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రైతులు ధాన్యాన్ని అమ్మకానికి మార్కెట్లకు తరలిస్తున్నారు. ఈ సీజన్లో జిల్లాలో 1.02లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. గ్రేడ్‌ను బట్టి రేటును నిర్ణయించారు. రైతులకు మద్దతు ధర కల్పించి ధాన్యం కొనాలని భావించినా అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. స్థానికంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రవాణా భారంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో నీళ్లు ఉండటం, 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా కావడంతో అధికారులు వద్దని చెప్పినా వినకుండా రైతులు రబీలో వరి సాగు చేశారు. తీరా సాగునీరు సరిపోక చాలాచోట్ల పంటలు ఎండిపోయిన పరిస్థితి. అయితే గతంతో పోలిస్తే సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ, పంట కోతదశలో ఉన్న సమయంలో నాలుగైదు రోజులుగా వాతావరణంలో మార్పులు రావడం, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పంటను తీస్తే కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. రబీలో 11,993 హెక్టార్లలో సాగు జిల్లాలో ఈ రబీలో 11,923 హెక్టార్ల విస్తీర్ణంలో వరిపంటను సాగు చేశారు. ఎత్తిపోతల పథకాల ద్వారా చెరువులు నింపడం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందింది. జిల్లాలోని కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, నియోజకవర్గాలకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలోని గుడిపల్లి రిజర్వాయర్ నుంచి కాల్వల ద్వారా చెరువులోకి నీటిని విడుదల చేశారు. కాల్వలకు సమీపంలో వ్యవసాయ భూములు కలిగిన రైతులు మోటార్ల ద్వారా వరి పంటకు సాగు నీటిని అందించారు. బోరుబావుల కింద కూడా వరి పంటలను సాగు చేశారు. పౌర సరఫరాల శాఖ ద్వారా ఈ ఏడాది జిల్లాలో 61 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా.. ఐకేపీ ద్వారా 17 కొనుగోలు కేంద్రాలు, మెప్మా ఆధ్వర్యంలో 3, పీఏసీఎస్‌ల ద్వారా 41 కేంద్రాలను ఏర్పాటు చేసి 1.02లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ప్రభుత్వం ఏ–గ్రేడ్ రకం వరి ధాన్యానికి రూ.1,770, బీ–గ్రేడ్ రకం ధాన్యానికి రూ.1,750 మద్దతు ధరగా నిర్ణయించింది. దానితో పాటు అనేక నిబంధనలు విధించింది. రైతాంగం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా ధాన్యం విక్రయించాలంటే నిబంధనలు పాటించాలని మార్కెటింగ్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ధాన్యం నాణ్యతగా ఉండటంతో పాటు 17శాతం కంటే తక్కువ తేమ ఉండాలని తప్పనిసరిగా ఆరబెట్టిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే 61 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఇప్పటివరకు కేవలం పీఏసీఎస్ ఆధ్వర్యంలో గంట్రావ్‌పల్లి, లక్నారంలో, మెప్మా ఆధ్వర్యంలో కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌లో మాత్రమే ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు మార్కెట్‌కు తరలించేందుకు ఇబ్బంది పడుతున్నారు. అయితే నాలుగు రోజులుగా కోత దశలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో వారు మరింత ఆందోళన పడుతున్నారు. ధాన్యాన్ని పొలాల వద్ద ఆరబెట్టేందుకు కూడా భయపడుతున్నారు. ప్రభుత్వం అన్ని మండల కేంద్రాల్లో, ఎక్కువగా పంటలు ఉన్న ఊర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని కోరుతున్నారు. అక్రమాలకు జియో ట్యాగింగ్‌తో చెక్ ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు అధికారులు జియోట్యాగింగ్‌ను వినియోగించుకుంటున్నారు. కొందరు సిబ్బంది దళారులతో కుమ్మక్కై కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి అనధికారికంగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి, అక్రమంగా రైసు మిల్లులకు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు నేపథ్యంలో ప్రభుత్వం వరిధాన్యం కొనుగోళ్లలో పారదర్శకతను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను జియోట్యాగింగ్ విధానాన్ని అనుసంధానించాలని నిర్ణయించారు. ఈ విధానం వల్ల అధికారులు తమ కార్యాలయాల నుంచే ధాన్యం కొనుగోలు తీరును పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. జియో ట్యాగింగ్ అమలు వల్ల కేంద్రాల్లో దళారుల అక్రమాలకు అడ్డుకట్ట వేసి వరి ధాన్యాన్ని పారదర్శకంగా కొనుగోలు చేసి రైతులకు లబ్ధి చేకూర్చవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. అవసరానికి అనుగుణంగా కేంద్రాలు పంట పొలాల నుంచి వస్తున్న ధాన్యానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. జిల్లాలో మొత్తం 61 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మరికొన్ని కేంద్రాలను త్వరలో ప్రారంభిస్తాం. ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ బ్యాగులు, హమాలీలు, టార్ఫలిన్లు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి విక్రయించాలి. కేంద్రాల్లో వరి ధాన్యాన్ని విక్రయించాలనుకున్న రైతులు తమ వెంట పట్టాదారు పాసు పుస్తకాలు, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్‌లను తీసుకురావాలి. – మోహన్‌బాబు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సింగిల్‌విండో ద్వారా కొనుగోలు చేస్తామన్నారు చాలా ఏండ్ల నుండి తెల్కపల్లిలో సింగిల్‌విండో ద్వారా కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు తెల్కపల్లిలో కొనుగోలు చేయలేదు. ప్రతి ఏడాది నాగర్‌కర్నూల్ మార్కెట్ యార్డుకు తీసుకువచ్చి వడ్లు అమ్ముకుంటాం. మా ఊరి నుండి ఇక్కడి వరిధాన్యాన్ని తీసుకురావాలంటే చాలా ఖర్చు అవుతుంది. – వెంకట్‌రెడ్డి, రైతు, గడ్డంపల్లి, తెలకపల్లి -
చకచకా..సీఎంఆర్
నల్లగొండ / మిర్యాలగూడ : జిల్లాలో సివిల్ సప్లయీస్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సేకరణ వేగవంతంగా సాగుతోంది. ఖరీఫ్ – 2018–19లో రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు ఇచ్చి, వారి నుంచి బియ్యం సేకరణ కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా బియ్యం సేకరణ చేపట్టిన అధికారులు గడువులోగా వందశాతం పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 74 శాతం బియ్యం సేకరించారు. మార్చి నెలాఖరు వరకు సీఎంఆర్ సేకరణకు గడువు ఉన్నప్పటికీ ఫిబ్రవరి 15లోగా సేకరించాలని అధికారులు భావిస్తున్నారు. సేకరించిన బియ్యం నిల్వ ఉంచడానికి గాను గోదాములలో ఖాళీల కోసం ఉన్నతాధికారుల అనుమతికి కూడా లేఖ రాశారు. మరో రెండు మూడు రోజుల్లో మరిన్ని నిల్వలు పెట్టుకోవడానికి అనుమతి కూడా వచ్చే అవకాశం ఉంది. ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోళ్లు ఇలా ఖరీఫ్ 2018–19లో జిల్లాలో ప్రభుత్వం భారీగా ధాన్యం కొనుగోళ్లు చేసింది. జిల్లాలో 58 ఐకేపీ, 48 పీఏసీఎస్ కేంద్రాలు మొత్తం 106 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. ఆయా కేంద్రాల ద్వారా 43,598 మంది రైతులనుంచి 391.08 కోట్ల రూపాయలు వెచ్చించి 2,20,949 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం ఎప్పటికప్పుడు జిల్లాలోని 50 రైస్‌మిల్లులకు దిగుమతి చేశారు. ప్రతి ఏటా ఇలా ... గతంలో ప్రతిఏటా ప్రభుత్వం ఐకేపీ, పీఏసీఎస్‌ల ద్వారా కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం కొనుగోలు చేస్తుంది. ఐకేపీ కేంద్రాలకు కేవలం దొడ్డు ధాన్యం మాత్రమే వచ్చేది. మిల్లర్లే రైతుల వద్దకు వెళ్లి అవసరమైతే ఐకేపీ వద్ద చెల్లించే ధరనే చెల్లించి సన్నధాన్యాన్ని కొనుగోలు చేసేవారు. పెద్దఎత్తున నిల్వ చేసి ముందుగా వాటిని మర ఆడించి ఇతర రాష్ట్రాల్లో అమ్ముకునేవారు. వారికి ధాన్యం కంటే బియ్యం ధరలు అధికంగా ఉండేవి. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని సకాలంలో ఇవ్వకుండా వారు వ్యాపారం చేసుకొని మిల్లులకు పనిలేని సందర్భంలో తిరిగి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలనుంచి వచ్చిన ధాన్యాన్ని మర ఆడించి ఇచ్చేవారు. మరికొన్ని సందర్భాల్లో ప్రభుత్వ బియ్యాన్ని కూడా వ్యాపారం చేసుకొని రబీ సీజన్లో ఖరీఫ్‌కు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని ఇచ్చేవారు. ఈసారి కథ అడ్డం తిరిగింది మిల్లర్లు ప్రతిసారి మాదిరిగా ఈ ఖరీఫ్‌లో సన్నధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ధాన్యానికి ఎంఎస్పీ ధర పెంచింది. గతంలో క్వింటాకు కామన్ ధాన్యానికి ధర రూ.1550 ఉండగా గ్రేడ్ ఏకు రూ.1,590 ఉండేది. దాన్ని కామన్ రకానికి రూ.1750, గ్రేడ్ ఏ ధాన్యానికి రూ.1770కి పెంచడంతో రైతులకు గిట్టుబా టు ధర లభించినట్లయ్యింది. ధాన్యం ధరలకు అనుగుణంగా బహిరంగ మార్కెట్లో బియ్యం రేటు పెరగలేదు. దీంతో మిల్లర్లు ధాన్యాన్ని కొని మర ఆడించి బియ్యాన్ని అమ్మడం వల్ల నష్టం వస్తుందని భావించి సన్నధాన్యాన్ని కొనలేదు. దీంతో ఈసారి సన్నధాన్యం కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే వచ్చింది. 74 శాతం సీఎంఆర్ సేకరణ : రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు దిగుమతి చేసిన అధికారులు వెంటనే సీఎంఆర్ సేకరణ కూడా ప్రారంభించారు. కస్టమ్ మిల్లింగ్ బియ్యానికి సంబంధించి మార్చి 31 వరకు అప్పగించాల్సి ఉంది. ప్రతి ఏటా మిల్లర్లు ఆలస్యంగా బియ్యాన్ని అప్పగిస్తున్నారన్న ఉద్దేశంతో ఫిబ్రవరి 15ను గడువుగా నిర్ణయించారు. మిల్లులకు ఇచ్చిన 2,20,949 మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను 1,48,035 మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు 1,09,404 మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించారు. ఇంకా 38,631 మెట్రిక్ టన్నులు సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు 74 శాతం సీఎంఆర్ సేకరణ పూర్తి చేశారు. ఇక 26 శాతం బియ్యం మాత్రమే ప్రభుత్వానికి రావాల్సి ఉంది. అది ఈనెల పూర్తయ్యేలోపే వచ్చే అవకాశం ఉంది. గడువుకు ముందు సేకరిస్తాం జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 74 శాతం కస్టమ్ మిల్లింగ్ బియ్యం సేకరించాం. గడువుకు ముందే నూరుశాతం బియ్యం సేకరిస్తాం. ఫిబ్రవరి 15వ తేదీ వరకు పూర్తిస్థాయిలో బియ్యం ఇవ్వాలని మిల్లర్లను ఆదేశించాం. గోదాములలో నిల్వ ఉంచడానికి కూడా ఖాళీ స్థలం కోసం ఉన్నతాధికారులకు లేఖ రాశాం. – ఉదయ్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, నల్లగొండ -
లక్ష్యానికి మించి..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: బియ్యం సమకూర్చుకునే విషయంలో జిల్లా అధికారులు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తూ.. ధాన్యం కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్స్ మిల్లింగ్ రైస్ విధానంతో మిల్లర్లకు కేటాయించి.. మిల్లింగ్ చేయించే ప్రక్రియకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరించిన అధికారులు.. అంచనాలకు మించి కొనుగోలు కేంద్రాలకు రావడంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. దీంతో జిల్లాలో సంక్షేమ పథకాలకు వినియోగించే బియ్యానికి ఇబ్బంది లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అధికారులు సేకరించిన బియ్యాన్ని మిల్లర్ల నుంచి తీసుకుని వివిధ సంక్షేమ పథకాలకు కేటాయించనున్నారు. ప్రధానంగా జిల్లాలోని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే బియ్యం జిల్లా నుంచి సేకరించిందే కావడం విశేషం. జిల్లా అవసరాలకు మించి ధాన్యం సేకరించిన అధికారులు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు దాదాపు 7వేల మెట్రిక్ టన్నులు పంపించారు. అక్కడ అనుకున్న స్థాయిలో పంట దిగుబడులు లేకపోవడం.. ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం పూర్తి కాకపోవడంతో ధాన్యాన్ని అక్కడికి తరలించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో ఆయా రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యం దామాషా ప్రకారం మిల్లింగ్ చేసి.. బియ్యంగా చేసి.. మార్చి చివరి నాటికి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. ఇందుకోసం మిల్లింగ్ జరుగుతున్న తీరును పౌరసరఫరాల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. జిల్లాలో పండించిన ధాన్యంతో మిల్లింగ్ చేసిన బియ్యాన్ని రేషన్ షాపులతోపాటు ఐసీడీఎస్ కేంద్రాలకు, పలు సంక్షేమ పథకాలకు వినియోగించనున్నారు. అయితే ప్రభుత్వ వసతి గృహాలకు పంపిణీ చేసే బియ్యం పూర్తిస్థాయిలో సన్న రకాలుగా ఉండే బియ్యాన్ని సమకూర్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 86 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో ఐకేపీ ద్వారా 14, పీఏసీఎస్‌ల ద్వారా 72 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల ద్వారా 1.40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే ఇప్పటివరకు 1,50,551.320 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. లక్ష్యానికి మించి ధాన్యం రావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 7,349.480 మెట్రిక్ టన్నులు కేటాయించారు. దీనికి సంబంధించి మిల్లర్లు అందించిన బియ్యాన్ని ఆ జిల్లాకే ఉపయోగించనున్నారు. ఇలా కేటాయించారు.. జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన 1,50,551.320 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం రైస్ మిల్లర్లకు అందించింది. వీటిలో 67 శాతం బియ్యాన్ని మిల్లర్లు పౌరసరఫరాల శాఖకు అందించాల్సి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అందించిన 7,349.480 ధాన్యం పోను.. ఖమ్మం జిల్లాలో 1,43,201 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లకు అందజేశారు. అందులో మిల్లర్లు 95,453.011 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అందించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 40,635.420 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అందించారు. కాగా.. ఇంకా రావాల్సిన 54,817.591 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మార్చి 31వ తేదీలోగా పౌరసరఫరాల శాఖకు అందించాల్సి ఉంది. జిల్లాలో 75,817.152 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం.. జిల్లాలోని రేషన్ దుకాణాలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈ బియ్యాన్ని వినియోగిస్తారు. ఈసారి అత్యధికంగా కొనుగోళ్లు జరగడంతో ఈ అవసరాలు తీరిపోగా.. ఇంకా కొద్దిమొత్తంలో బియ్యం మిగిలే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రేషన్ దుకాణాల కోసం నెలకు 6,228.096 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం కాగా.. అంగన్వాడీ కేంద్రాలకు 90 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతాయి. అంటే నెలకు 6,318.096 మెట్రిక్ టన్నుల బియ్యం కావాల్సి ఉంటుంది. ఏడాదికి 75,817.152 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతాయి. మిల్లర్ల నుంచి దాదాపు 95,453.011 మెట్రిక్ టన్నుల బియ్యం వస్తుండడంతో ఈ అవసరాలకు పోను.. కొంత మేరకు మిగిలే అవకాశం ఉంది. అయితే వచ్చే ఈ బియ్యంలో 5వేల నుంచి 10వేల మెట్రిక్ టన్నులు ఉప్పుడు బియ్యం వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిని ఇక్కడ ఎవరూ ఉపయోగించకపోవడంతో బియ్యాన్ని ఎఫ్‌సీఐకి విక్రయించనున్నారు. అయితే పూర్తిస్థాయిలో రేషన్ షాపులు, అంగన్వాడీ కేంద్రాలకు పోను.. సుమారు 10వేల మెట్రిక్ టన్నుల బియ్యం మిగిలే అవకాశం ఉందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మద్దతు ధర పెరగడంతో.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొనుగోలు కేంద్రాల ద్వారా లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోలు చేశారు. 2017–18లో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా.. కేవలం 39,360 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. గత ఏడాది గ్రేడ్–‘ఏ’ ధాన్యం క్వింటా ధర రూ.1,590 ఉండగా.. కామన్‌కు రూ.1,550 నిర్ణయించారు. ఈ ఏడాది గ్రేడ్–‘ఏ’ క్వింటా ధాన్యం రూ.1,770, కామన్ రకం రూ.1,750 నిర్ణయించారు. దీంతోపాటు పంట దిగుబడి కూడా కొద్దిమేర ఆశాజనకంగా ఉండడంతో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వైపు మొగ్గు చూపారు. అవగాహనతోనే సాధ్యం.. ఈ ఏడాది లక్ష్యానికి మించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాం. గతంలో కంటే మద్దతు ధర పెరగడంతోపాటు నీటి సౌకర్యంతో ధాన్యం దిగుబడి కూడా పెరిగింది. దీంతో అనుకున్న లక్ష్యానికి మించి కొనుగోళ్లు చేయగలిగాం. క్షేత్రస్థాయి అధికారులు కూడా రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. – వెంకటేశ్వర్లు, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల శాఖ -
సన్నరకానికి పెరిగిన ధర
మోర్తాడ్(బాల్కొండ): నిన్న మొన్నటి వరకు చిన్న బోయిన సన్న రకాల ధర క్ర మ క్రమంగా పెరుగుతుండటంతో రైతు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరి కోత లు ఆరంభమైన సమయంలో సన్న రకం వరి ధాన్యానికి తక్కువ ధర ఉండటంతో ముందుగా పంటను విక్రయించిన రైతులు నష్టాలను చవి చూశారు. అయితే వా రం రోజుల నుంచి సన్న రకం వరి ధాన్యానికి మార్కెట్లో డిమాండ్ ఏర్పడటంతో ధరకు రెక్కలు తొడిగాయి. బీపీటీ రకం వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.1,650 నుంచి రూ.1,750 వరకు ధర పలుకుతోంది. అయితే సన్న రకాల్లో అత్యంత సన్నవిగా గుర్తింపు పొందిన జై శ్రీరాం, సూపర్ సీడ్, తెలంగాణ సోన రకాలకు మాత్రం క్వింటాలుకు రూ.2,100 నుంచి రూ.2,200 ధర పలుకుతోంది. గతంలో క్వింటాలుకు రూ.2,100 ధర ఉండగా ఈ సారి రూ.100 ఎక్కువగా ధర పెరిగింది. ఖరీఫ్ సీజనుకు గాను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపు 3.50 లక్షల ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేశారు. ఇందులో అధిక భాగం సన్న రకాలను సాగు చేశారు. సన్న రకాల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్న కొత్త రకాలను రైతులు సాగు చేయడం విశేషం. సన్న రకాలకు మార్కెట్ ఆరంభంలో క్వింటాలుకు రూ.1,500 నుంచి రూ.1,600 వరకు మాత్రమే ధర పలికింది. సన్న రకం బియ్యానికి మార్కెట్లో డిమాండ్ ఉన్నా వ్యాపారులు సిండికేట్ కావడంతో ధర ఎక్కువగా పలుకడం లేదని రైతులు వాపోయారు. ఈ సీజనులో సుమారు 60 శాతం సన్న రకాలనే రైతులు సాగు చేశారు. కేవలం 40 శాతం మాత్రమే దొడ్డు రకం వరి ధాన్యం సాగు అయ్యింది. అయితే దొడ్డు రకానికి కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్ ధర లభించింది. ప్రభుత్వం ఏ గ్రేడ్ రకానికి రూ.1,750 మద్దతు ధరగా ప్రకటించింది. దొడ్డు రకాలను సాగు చేసిన రైతులు ధాన్యాన్ని వ్యాపారులకు కాకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. సన్న రకాలకు మాత్రం కొనుగోలు కేంద్రాల్లో బీ గ్రేడ్ రకం ధరను వర్తింప చేశారు. కొనుగోలు కేంద్రాల్లో బీ గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ.1,720 మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించింది. సన్న రకాలను కొనుగోలు కేంద్రాల్లో కాకుండా వ్యాపారులు, రైస్ మిల్లర్లకు విక్రయించడం వల్ల ఎక్కువ ధర పొందవచ్చని రైతులు భావించారు. వ్యాపారులు మొదట్లో ఎక్కువ ధర చెల్లించకపోవడంతో రైతులు నష్టపోయారు. ఎగుమతులకు డిమాండ్ పెరగడంతో సన్న రకాల ధర గతంలో కంటే ఎక్కువ పెరిగింది. రోజు రోజుకు సన్న రకాల ధర పెరుగుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా తమ వద్ద ధాన్యం నిలువలు తగ్గిపోయే వరకు ఇదే ధర కొనసాగితేనే ప్రయోజనం అని రైతులు పేర్కొంటున్నారు. -
మళ్లీ ప్రా‘ధాన్యం’!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరించాల్సిన లక్ష్యాన్ని అధికారులు నిర్ణయించారు. ఈ ఏడాది 1.40 మెట్రిక్ టన్నులను కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనేందుకు నిర్ణయించారు. జిల్లాలో 89 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రాథమిక సహకార పరపతి సంఘాలవి 73 ఉండగా, ఇందిరాక్రాంతి పథం (ఐకేపీ) కేంద్రాలు 16 ఉన్నాయి. ధాన్యం కొనుగోలు కోసం ఐకేపీ, ప్రాథమిక సహకార సంఘాల సభ్యులకు శిక్షణను ఇవ్వనున్నారు. జిల్లాలో 64,200 హెక్టార్లలో వరి పంటను సాగు చేశారు. ఈసారి వర్షాలు కూడా బాగానే ఉండడంతో దిగుబడి కూడా అధికంగా వస్తుందనే ఆలోచనతో రైతులున్నారు. 2016–17లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 1.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యంగా నిర్ణయించగా 1.40లక్షల మెట్రిక్ టన్నులు కొన్నారు. నాడు ఖమ్మం జిల్లాలోని 21మండలాల పరిధిలో 34,835.609మెట్రిక్ టన్నులే సేకరించారు. గతేడాది (2017–18) ధాన్యం కొనుగోళ్లను పెంచాలని నిర్ణయించారు. 56వేల మెట్రిక్ టన్నులు సేకరించాలని నిర్ణయించగా..మొత్తం 39,323.040మెట్రిక్ టన్నులు కొన్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 1.40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకోసం 89 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. రైతుల నుంచి వచ్చే ధాన్యం తీవ్రతను బట్టి..మరిన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా..? లేకపోతే ఉన్నవాటిని తగ్గించాలా..? అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ముందస్తుగా గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం అమ్మే రైతులు నాణ్యత ప్రమాణాలు ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మే రైతులు తమవెంట ఆధార్‌కార్డు, గ్రామ రెవెన్యూ అధికారి ధ్రువీకరణ పత్రం, భూమి వివరాలు, బ్యాంకు ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ (బ్యాంక్ పాస్ పుస్తకం జత చేయాలి.), బ్యాంకులో ఖాతా పనిచేస్తున్నట్లు బ్యాంకు అధికారులు ధ్రువీకరించాలి. రైతు మొబైల్ నంబర్ లేనిపక్షంలో కుటుంబ సభ్యుల ఫోన్‌నంబర్ ఇవ్వాల్స ఉంటుంది. క్వింటా ధర రూ.200పెంపు గతంలో గ్రేడ్–ఏ రకానికి క్వింటా ధర రూ.1590 ఉండగా..కామన్ రకం రూ.1540 ఉండేది. అయితే రైతులను ఆదుకునేందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది క్వింటాకు రూ.200 ధర పెంచుతూ నిర్ణయించింది. ఈ ధర ఈ ఖరీఫ్ నుంచి అమలు కానుంది. వీటికి గ్రేడ్–ఏ రకం క్వింటా «ధాన్యం ధర రూ.1790, కామన్ రకం క్వింటా ధాన్యం ధర రూ.1740గా నిర్ణయించారు. గతేడాది మాదిరిగానే రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతుల ఖాతాల్లో 48 గంటల్లో నగదు చెల్లింపులు చేయనున్నారు. గతంలో ఆన్లైన్ తదితర సమస్యలు ఎదురవగా..ఈ సారి ముందస్తు చర్యలు తీసుకోనున్నారు. 22న శిక్షణకు ప్రణాళిక.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణకు..ఆయా సంఘాల మహిళలకు ఈనెల 22వ తేదీన ఖమ్మంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో ప్రధానంగా ధాన్యం తేమశాతం లెక్కించడం, ధాన్యంలో గ్రేడ్‌ను గుర్తించడం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. శిక్షణ అనంతరం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేయనున్నారు. -
రోడ్డెక్కిన అన్నదాతలు
సారంగపూర్(నిర్మల్) : ధాన్యం తూకంలో కోత విధించొద్దని డిమాండ్ చేస్తూ మండలంలోని మలక్‌చించోలి గ్రామ రైతులు ఆదివారం రోడ్డెక్కారు. నిర్మల్–స్వర్ణ ప్రధాన రహదారిపై ఎక్స్‌రోడ్డు వద్ద గంటపాటు రాస్తారోకో చేశారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది. సమాచారం అందుకున్న ఎస్సై సునీల్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు ససేమి రా అన్నారు. అనంతరం కౌట్ల(బి) పీఏసీఎస్ చైర్మన్ అయిర నారాయణరెడ్డి, ఏఎంసీ అధ్యక్షుడు రాజ్‌మహ్మద్, అడెల్లి ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ఆందోళన వద్దకు చేరుకున్నారు. రైతుల సమస్య పరిష్కరించడంతో వారు ఆందోళన విరమించారు. వారు మాట్లాడుతూ.. అకాల వర్షాలకు ముందే ధాన్యం కేంద్రాలకు తరలించినా కొనుగోళ్ల విషయంలో నిర్వాహకులు తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. తడవకున్నా తడిసిందంటూ తూకంలో కోతలు విధించడం సబబు కాదన్నారు. గతంలోనే చాలాసార్లు కొనుగోళ్లు వేగిరం చేయాలని పదేపదే వేడుకున్నా నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వా పోయారు. ధాన్యం తడవడానికి కారణం కేంద్రాల్లోని నిర్వాహకుల నిర్లక్ష్యమేనన్నారు. వెంటనే తడిసిన ధాన్యాన్ని కోతలు విధించకుండా కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి
నల్లగొండ : జిల్లాల్లో ఇంకా ప్రారంభం కాని చోట రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కలెక్టర్లను, జేసీలను రాష్ట్రభారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశిం చారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి కలెక్టర్లు, జేసీలు, పౌర సరఫరాల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి ధాన్యం కొనుగోళ్లపై సమీక్షిం చారు. నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేటలకు 6లక్షల 50వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో దిగుబడి ఎక్కువగా వచ్చిందన్నారు. పండిన పంట మార్కెట్‌కు పెద్ద ఎత్తున వస్తున్నందున రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. 17శాతం కన్నా తేమ ఎక్కువగా ఉంటే ప్రభుత్వం కొనుగోలు సంస్థలు కొనకపోవడంతో ప్రైవేట్ వారిని ఆశ్రయించే పరిస్థితి ఉందన్నారు. రెండు రోజులుగా సూర్యాపేటలో మద్దతు ధర లభించడం లేదని రైతులు రోడ్డు ఎక్కిన పరిస్థితులను మంత్రి గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందు కు జిల్లా యంత్రాంగానికి పూర్తిస్వేచ్ఛను ఇచ్చామని, అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. సమస్యలు ఎదురైతే జిల్లా పౌరసరఫరాల మేనేజర్ టాస్క్ ఫోర్స్‌ను సంప్రదించాలన్నారు. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు వెంటనే పంపించాలన్నారు. తూకం వేసిన ధాన్యం రెండు రోజుల తరువాత మిల్లులకు పంపిస్తే వ్యత్యాసం వచ్చి రైతులకు ధర తగ్గించే సమస్య ఎదురవుతుందన్నారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ జిల్లాలో 1లక్ష 85వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్‌మిల్లులకు పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 130 కోట్ల మేర రైతులకు ధాన్యం చెల్లింపులు చేశామన్నారు. జిల్లాకు 25లక్షల గన్నీ బ్యాగుల అవసరం ఉందని కలెక్టర్ కోరారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి అంజయ్య, పౌర సరఫరాల శాఖ అధికారి ఉదయ్‌కుమార్ జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాసవర్మ, జిల్లా వ్యవసాయశాధికారి నర్సింహరావు, మార్కెటింగ్‌శాఖ సహాయ సంచాలకులు అలీం తదితరులున్నారు. -
కొనుగోలు కేంద్రాన్ని అడ్డుకోవడం సరికాదు..
సారంగాపూర్(జగిత్యాల) : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అటవీశాఖ అడ్డుకోవడం సరికాదని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం బీర్పూర్ మండలం చెర్లపల్లిలో స్థానిక విండో ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు గురువారం బీర్పూర్ వెళ్లారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన భూమి తమదని..కేంద్రాన్ని ఎత్తివేయాలని అటవీశాఖ తొలగించాలని రేంజర్ ఉత్తంరావు సూచించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అధికారులతో చర్చించారు. భూమిపై అటవీ, రెవన్యూ శాఖలు సంయుక్తంగా సర్వే నిర్వహించి.. తేల్చాలని సూచించారు. ఉమ్మడి సర్వే కోసం కలెక్టర్‌ను కోరుతానని.. ప్రస్తుతం అభ్యంతరం చెప్పడం సరికాదని ఎమ్మెల్యే అనడంతో అటవీశాఖ అధికారులు వెనక్కు తగ్గారు. సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లో ఐకేపీ, సింగిల్‌విండోల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. లచ్చక్కపేట, రంగపేట, సారంగాపూర్, రేచపల్లి, బీర్పూర్, కొల్వాయి, మంగేళ, చెర్లపల్లి గ్రామాల్లోనూ ప్రారంభించారు. ఎంపీపీ కొల్ముల శారద, జెడ్పీటీసీ భూక్య సరళ, సింగిల్‌విండో చైర్మన్ ముప్పాల రాంచందర్‌రావు, తహసీల్దార్ వసంత, రాజేందర్, ఎంపీడీవో పుల్లయ్య, వైస్‌ఎంపీపీ కోండ్ర రాంచంద్రారెడ్డి, విండో చైర్మన్లు ముప్పాల రాంచందర్‌రావు, సాగి సత్యంరావు, మండల కోఆప్షన్ సభ్యుడు ఎండీ ఇబ్రహీం, ఐకేపీ ఏపీఎం గంగాధర్, సర్పంచులు పాల్గొన్నారు. Congress MLA Jeevan Reddy -
ధాన్యం సెంటర్లలో సౌకర్యాలేవి..?
అల్గునూర్(మానకొండూర్): వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభించిన ప్రభుత్వం సౌకర్యాల కల్పనలో మాత్రం పూర్తిగా విఫలమైందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌తో కలిసి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరుగక రైతులు రోజుల తరబడి కేంద్రాల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వానికి ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహించడంపై ఉన్న శ్రద్ధ ధాన్యం మిల్లులకు తరలించడంపై లేదని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతు చనిపోతే ఎంపీ కవిత బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందించిందని, కరీంనగర్ రూర ల్ మండలం దుర్శేడ్ గ్రామానికి చెందిన రైతు చనిపోతే ఎమ్మెల్యే, ఎంపీ పరామర్శించిన పాపాన పోలేదని మండిపడ్డారు.సమావేశంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దన్నమనేని నర్సింగరావు, నుస్తులాపూర్ సర్పంచ్ తు మ్మనపల్లి శ్రీనివాస్‌రావు, కేడీసీసీబీ డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, నాయకులు ఎస్ఎల్.గౌడ్, సురేశ్, రమేశ్, రాజు,సంపత్ రాజిరెడ్డి పాల్గొన్నారు.