ఇందూరు(నిజామాబాద్ అర్బన్): కష్టాలన్నీ రైతులకే.. విత్తనం వేసింది మొదలు, పంట చేతికొచ్చే వరకూ ఎన్నో కష్టాలు పడుతున్న రైతులకు.. వచ్చిన పంటను అమ్ముకునేందుకూ తిప్పలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు అనేక రకాలుగా నష్టపోతున్నారు. అండగా నిలబడాల్సిన కేంద్రం ప్రభుత్వం కూడా రైతుల పట్ల చిన్నచూపు చూస్తోంది. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు భరించిన హమాలీ చార్జీలను కేంద్రం తిరిగి ఇవ్వకుండా మెండిచేయి చూపుతోంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) అభ్యంతరం కారణంగా గత రెండు సంవత్సరాలుగా జిల్లాకు ఈ నిధులు రావడం లేదు.
దీంతో గత మూడు సీజన్లుగా హమాలీ చార్జీల భారం రైతులపైనే పడుతోంది. 2017–18 సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్‌లు కలిపి 2.40 కోట్లు, 2018–19 సంవత్సరంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన రూ.2.50 కోట్లు కలిపి మొత్తంగా జిల్లాకు రూ. 5కోట్ల వరకు హమాలీ డబ్బులు రైతులకు రావాల్సి ఉంది. అయితే, ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్‌కు హమాలీ చార్జీలు ఇప్పించాలని రైతులు కోరారు. కేంద్ర ప్రభ్వుతానికి విన్నవిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం చార్జీలను విడుదల చేయకపోవడం వెనుక ఓ కారణం ఉంది. హమాలీ చార్జీలను నిజంగా రైతులు చెల్లించింది నిజమో కాదోనని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను సమర్పించాలని కాగ్ కోరింది. ఇందుకు జిల్లా నుంచి సివిల్ సప్లయి కార్పొరేషన్ అధికారులు ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించారు.
బస్తాకు రూ.5 చొప్పున..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం బస్తాలను తూకం వేసి లారీల్లో ఎక్కించడానికి హమాలీల ఖర్చును ముందుగా సంబంధిత రైతులే భరించాల్సి ఉంటుంది. ఒక్కో బస్తాకు రూ.5 వరకు హమాలీలకు చెల్లిస్తారు. అయితే, కొన్ని రోజుల తరువాత హమాలీ చార్జీలను కేంద్ర ప్రభుత్వం తిరిగి సంబంధిత రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. కానీ 2016–17 సంవత్సరం వరకే రైతులకు హమాలీ చార్జీలు అందాయి. 2017–18, 2018–19 కలిపి 60 వేల మంది రైతులకు సంబంధించిన మూడు సీజన్ల డబ్బులు రూ.5 కోట్ల వరకు రావాల్సి ఉంది. ఇప్పటికే మూడు సీజన్లు ముగిసి ప్రస్తుత రబీ సీజన్‌లో కూడా హమాలీ చార్జీలను రైతులే భరిస్తున్నారు. వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వం నుంచి హమాలీ చార్జీలను ఇప్పించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
ఇచ్చి లాగేసుకున్న కేంద్రం..
రైతులకు తిరిగి చెల్లించాల్సిన హమాలీ చార్జీలను 2016–17 వరకు చెల్లించింది కేంద్రం. అయితే, చెల్లించిన ఏడాది వరకు మూడు, నాలుగు సీజన్లకు సంబంధించిన చార్జీలను కేంద్ర ప్రభుత్వం రూ.27.53 కోట్లు సివిల్ సప్లయి కార్పొరేషన్‌కు ఇచ్చింది. అదే సమయంలో కాగ్ ఈ నిధులపై ఆడిట్ చేసింది. అయితే, అప్పటికే జిల్లాకు వచ్చిన హామాలీ చార్జీల డబ్బులను సివిల్ సప్లయి కార్పొరేషన్ అధికారులు రైతుల ఖాతాల్లో జమ చేశారు. అదే సమయంలో ఇచ్చిన నిధులను తిరిగి ఇచ్చేయాలని కేంద్రం సూచించింది. కానీ డబ్బులు రైతులు ఖాతాలో జమ కావడంతో వీలు కాలేదు. ఇందుకు ఎఫ్‌సీఐ నుంచి సివిల్ సప్లయి కార్పొరేషన్‌కు రావాల్సిన నిధుల్లోంచి రూ.27.53 కోట్లు హమాలీ చార్జీల రూపంలో తీసేసుకుంది. దీంతో ఈ భారం మొత్తం సివిల్ సప్లయి కార్పొరేషన్‌పై పడింది.
Comments
Please login to add a commentAdd a comment