మెదక్ జోన్: రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్న కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం కమీషన్ విడుడల చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో కేంద్రాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతోంది. ధాన్యం సేకరణ (కొనుగోలు)కు ఐకేపీ సంఘాలు ససేమీరా అంటున్నాయి. సాధారణంగా ధాన్యం సేకరణ ముగిసి రైతులకు చెల్లింపులు పూర్తి కాగానే కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వం కమీషన్ మంజూరు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే గతేడాది రబీ, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లకు సంబంధించి కమీషన్ విడుదల చేయలేదు. ఇందుకు సంబంధించి కొనుగోలుదారులకు, రైతులకు చెల్లించే హమాలీ రూ.2.5 కోట్లు జిల్లాకు రావాల్సి ఉంది. ప్రస్తుతం మూడో సీజన్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కమీషన్ రానిదే ఊరికే ఎందుకు చేయాలని నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు.
రెండు సీజన్లుగా అందని కమీషన్...
రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి పౌరసరఫరాల సంస్థకు అందించినందుకుగాను పీఏసీఎస్, ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.2.50 చెల్లిస్తుంది. ఈ కమీషన్ నుంచే కేంద్రాలకు సంబంధించిన ధాన్యం సేకరణ ఖర్చులను వెచ్చిస్తారు. మిగిలిన డబ్బులను మహిళా సంఘాల సభ్యులు పంచుకుంటారు. సహకార సంఘాల్లో అయితే సంఘాల నిల్వలకు జమచేసుకుంటారు. గత రెండు సీజన్లకు సంబంధించి ప్రభుత్వం కమీషన్ చెల్లించలేదు. గత ఖరీఫ్‌లో జిల్లాలో పీఏసీఎస్ ద్వారా 130 కేంద్రాలు, ఐకేపీ ద్వారా 40 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 170 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి రైతులకు సుమారు రూ.300 కోట్లకు పైగా చెల్లించారు. ప్రభుత్వం నుంచి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు రెండు సీజన్లకు సంబంధించి కమీషన్ రానందున సంఘాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు రూ.1.50 కోట్లు రావాల్సి ఉండగా, హమాలీ చార్జీ కింద రూ.కోటి రైతులకు రావాల్సి ఉంది. మొత్తంగా రూ.2.50 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
అధికారుల చొరవతో..
ఈఏడాది రబీసీజన్‌కు సంబంధించి ఎప్పటిలాగే ఐకేసీ, పీఏసీఎస్ సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా ఐకేసీ సంఘాల సభ్యులు తమకు రావాల్సిన కమీషన్ ఇచ్చేంతవరకు కొనుగోలు చేయలేమని ఖరాకండీగా తేల్చి చెప్పారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో ధాన్యం దిగుబడులు వచ్చాయి. త్వరలో రావాల్సిన కమీషన్ ఇప్పిస్తాని.. కొనుగోలు తప్పకుండా చేయాల్సిందేనని జాయింట్ కలెక్టర్ నగేష్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సీతరామరావు వారిని ఒప్పించడంతో అతికష్టంమీద అంగీకరించారు.
విడుదల కానీ హమాలీ చార్జీలు..
గత సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్‌కు సంబంధించి హమాలీ డబ్బులు రైతులకు రూ.కోటి రావాల్సి ఉంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని బస్తాల్లో నింపి తూకం వేసి లారీల్లో లోడ్‌చేసినందుకు గాను హమాలీలకు రైతులు క్వింటాలు రూ.23 చొప్పున చెల్లిస్తున్నారు. ఇందుకు సంబంధించి చార్జీల్లో క్వింటాలుకు రూ.5 చొప్పున ప్రభుత్వం హమాలి కింద రైతులకు చెల్లించాలి. రెండు సీజన్లుగా సివిల్‌సప్లై సంస్థ హమాలీ చార్జీలను విడుదల చేయడం లేదు. దీంతో రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పూర్తి చార్జీలను వసూలు చేస్తున్నారు.
ప్రభుత్వం హమాలీ కోసం క్వింటాలుకు ఇచ్చే రూ.5 మినహాయించి మిగతా డబ్బులు మాత్రమే రైతుల నుంచి తీసుకోవాలి. కానీ ప్రభుత్వం సకాలంలో డబ్బులు విడుదల చేయకపోవడంతో చేసేదిలేక రైతుల నుంచే ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. తాము ఇవ్వమని రైతులు నిరాకరిస్తే ధాన్యం తూకం వేయమని నిర్వాహకులు పేర్కొనడంతో గత్యంతరం లేక చెల్లిస్తున్నారు. మరికొన్ని చోట్ల అదనంగా క్వింటాలుకు రూ.25 వరకు వసూలు చేస్తున్నారు. ఫలితంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంఘాలకు కమీషన్‌తో పాటు హమాలీ చార్జీలను సకాలంలో విడుదల చేయాలని కొనుగోలు కేంద్రాల సంఘాలు, రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment