మిర్యాలగూడ : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మక్కై దోచుకుంటున్నారు. యాసంగిలో సన్న ధాన్యం నేరుగా మిల్లుల వద్ద విక్రయించుకుంటున్న రైతులు.. 1010 రకం ధాన్యం మాత్రం ఐకేపీ కేంద్రాల్లో అమ్ముకుంటున్నారు. సన్న ధాన్యం విక్రయించుకోవడానికి మిల్లులకు వెళ్లిన వారికి మిల్లర్లు వివిధ కారణాలతో కుచ్చుటోపీ పెడుతుండగా ప్రభుత్వ ఐకేపీ కేంద్రాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది.
వీరి నిర్వాకం ఇటీవల విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడుల్లో బయటపడింది. ఐకేపీల్లో ఇక్కడ 40 కిలోల బస్తాకు ఒక కిలో అదనంగా తీసుకుంటున్నారు. మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతాల్లో 90 రైస్ మిల్లులు ఉన్నాయి. ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని అధికారులు కేటాయించిన రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు. దీంతో ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు.. ముందస్తుగా మిల్లర్లతో కుమ్మక్కై రైతుల వద్దనుంచి అదనంగా తూకం వేసుకున్న ధాన్యానికి డబ్బులు తీసుకొని పంచుకుంటున్నారు.
లారీ ధాన్యానికి నాలుగు క్వింటాళ్ల దోపిడీ
ఒక్క లారీ ధాన్యానికి నాలుగు క్వింటాళ్ల ధాన్యం దోపిడీ చేస్తున్నారు. రైతులనుంచి అదనంగా తూకం వేసుకుంటున్న ధాన్యాన్ని మిల్లు వద్దకు చేర్చుతున్న ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు అదనంగా ఉన్న ధాన్యంలో మిల్లర్లతో కలిసి వాటా పంచుకుంటున్నారు. నాలుగు క్వింటాళ్ల ధాన్యంలో ఒక క్వింటా మిల్లర్‌కు, మూడు క్వింటాళ్లు ఐకేపీ కేంద్రం వారు తీసుకుంటున్నా రు. ప్రస్తుతం ఉన్న ధాన్యం ధరల ప్రకారం క్వింటా ధా న్యానికి 1770 రూపాయలు చెల్లిస్తుండగా నాలుగు క్విం టాళ్లకు 7080 రూపాయల మేర దోచుకుంటున్నారు.
వే బ్రిడ్జి తూకాల్లో మోసం..
వే బ్రిడ్జిలలో తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఒక్కో రైస్‌మిల్లుకు ప్రత్యేకంగా వే బ్రిడ్జి కాంటా ఉంటుంది. ఆ బ్రిడ్జిలో తూకం వేసిన ధాన్యానికి మరో వేబ్రిడ్జిలో వేసిన తూకానికి తేడా వస్తోంది. రైస్ మిల్లర్ల ఆధీనంలో ఉండే వే బ్రిడ్జిలలో తక్కువ తూకం వేస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఇటీవల తూనికల కొలతల అధికారులు చేపట్టిన తనిఖీలలో వాస్తవాలు వెల్లడయ్యాయి. రైతులు నేరుగా మిల్లుల్లో ధాన్యం విక్రయించుకోవడానికి ట్రాక్టర్లలో ధాన్యం తీసుకవస్తుండగా వేబ్రిడ్జిలోనే తూకం వేయించాల్సి వస్తుంది. తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న మిల్లర్ల వద్ద వేబ్రిడ్జిలో తూకం వేసి ట్రాక్టర్ ధాన్యం విక్రయించుకుంటే సుమారుగా రెండు నుంచి మూడు క్వింటాళ్ల ధాన్యాన్ని రైతులు నష్టపోతున్నారు. అంటే రైతులు 5వేల రూపాయల నుంచి 5500 రూపాయల వరకు నష్టపోతున్నారు.
సంఘ బంధాలను మార్చకపోవడం వల్లనే..
ఐకేపీ ధాన్యం కొనుగోలుకు మహిళా సంఘబంధాలను ప్రతి ఏటా మారుస్తూ ఉండాలి. కానీ అధికారులు నిర్లక్ష్యం వహించి ప్రతి ఏటా కొనుగోలు చేసిన సంఘాలకే యధావిధిగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో వారికి, మిల్లర్లకు మధ్య మంచి సంబంధాలు ఏర్పడి రైతులను దగా చేస్తున్నారు. ఇదే విషయం మిర్యాలగూడ మండలంలోని గూడూరులో తూనికల కొలతల అధికారులు ఇటీవల తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. ఐకేపీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన నాటి నుంచి ఆ సంఘానికే కొనుగోలు బాధ్యతలు ఇస్తున్నారు. అలాకాకుండా కేంద్రాల నిర్వహణ గ్రామంలోని అన్ని సంఘాలకు అవకాశం కల్పించే విధంగా మార్పులు చేస్తే ఇలాంటి అక్రమాలకు తావుండే అవకాశాలు లేవన్న వాదన వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment