
రాష్ట్రంలో వరి సాగైన భూమి 56 లక్షల ఎకరాలు
కోటీ 40 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా
ఈ సీజన్‌లో 70.13 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు అవకాశం
నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండల్లో మొదలైన కొనుగోళ్లు
అకాల వర్షాలతో రైతుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి సీజన్ కోతలు మొదలు కావడంతో పౌరసరఫరాల సంస్థ.. రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించడం ప్రారంభించింది. ముందుగా నాట్లు వేసిన నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ, నారాయణపేట వంటి జిల్లాల్లో వరికోతలు మొదలయ్యాయి. మార్చి నెలాఖరు నుంచే పౌరసరఫరాల సంస్థ ఆ మేరకు ధాన్యం సేకరణను ప్రారంభించింది.
నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 778 మంది రైతుల నుంచి రూ.22.99 కోట్ల విలువైన 9,908 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సంస్థ కొనుగోలు చేసింది. ఈనెల 10వ తేదీ తరువాత కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. అదే సమయంలో ప్రతి ఏప్రిల్, మే నెలల్లో భయపెట్టే అకాల వర్షాలు ఈసారి కూడా రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. గురువారం కురిసిన వర్షంతో పలు జిల్లాల్లో పంటలకు నష్టం కలిగినట్లు ప్రాథమిక సమాచారం.
70.13 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు అంచనా
రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో 56.95 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఎకరాకు సగటున 25 క్వింటాళ్లకు పైన దిగుబడి వస్తుందని అనుకుంటే, ఈ సీజన్‌లో కోటీ 40 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. అయితే నిజామాబాద్, నల్లగొండ, నారాయణపేట, కామారెడ్డి, ఖమ్మం, సూర్యాపేటల్లో పండిన ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.
బి య్యానికి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా డిమాండ్ ఎక్కువగా ఉండడంతో సరిహద్దు జిల్లాల నుంచి ఆయా రాష్ట్రాలకు బియ్యం వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సీఎంఆర్ కోసం మిల్లులకు పంపించే అవకాశం ఉంది. కాగా ఇందులో 30 లక్షల మెట్రిక్ టన్నుల వరకు సన్న ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రాష్ట్రంలో ఈనెల నుంచి రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ఈ సన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసి పౌర సరఫరాల సంస్థ గోడౌన్‌లకే తరలించనున్నారు. మిగతా 40 ఎల్‌ఎంటీ దొడ్డు బియ్యాన్ని సీఎంఆర్‌గా సెంట్రల్ పూల్‌కు తరలించే అవకాశం ఉందని నిపుణులు చెపుతున్నారు.
రైతన్నకు అకాల వర్షాల భయం
ప్రతీ యాసంగి సీజన్‌లో అకాల వర్షాలు, వడగండ్ల వానలు రైతులను ముంచుతున్నాయి. ఇప్పటికే ఒకసారి వర్షాలు, వడగండ్లతో రాష్ట్రంలోని రైతులు పంట నష్టపోయారు. తాజాగా గురువారం మహబూబ్‌నగర్, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల మొదలైన జిల్లాల్లో కురిసిన వర్షం వల్ల ఎక్కుగా వరిపంటకు నష్టం వాటిల్లింది.