సాక్షి ప్రతినిధి, వరంగల్: రైసు మిలర్ల వివాదం సమసిపోవడంతో రబీ ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ దృష్టి సారించింది. రబీ ధాన్యం ఇప్పుడిప్పుడే కొనుగోలు కేంద్రాలకు చేరుతుండగా... రా రైస్ విషయంలో నెలకొన్న వివాదం కారణంగా మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ బియ్యం(సీఎంఆర్) కింద ధాన్యం తీసుకునేందుకు నిరాకరించారు. ఈ మేరకు శుక్రవారం నుంచి సహాయ నిరాకరణకు రైసుమిల్లర్ల సంఘం పిలుపునిచ్చింది.
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పౌరసరఫరాలశాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి రైస్ మిల్లర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర, జిల్లా నేతలతో గురువారం జరిపిన చర్చలు ఫలించాయి. రా రైస్ విషయంలో ఏర్పడిన సమస్యలను వారం, పది రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సహాయ నిరాకరణను విరమించుకున్నట్లు ప్రకటించిన మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకునేందుకు అంగీకరించారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరగకుండా చూడాలని, రైతులు పడిగాపులు కాచే పరిస్థితి ఉండకూడదని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రబీ కొనుగోళ్లలో వేగం పెంచడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది.
613 కొనుగోలు కేంద్రాలు, 5.04 లక్షల మెట్రిక్ టన్నులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రబీ సాగు విస్తీర్ణం ఆధారంగా ఈ సీజన్‌లో 5,04,602 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 613 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేశారు. గురువారం నాటికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 538 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన అ«ధికారులు ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్ సంస్థల ద్వారా 1,17,289 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు.
వరంగల్ అర్బన్ జిల్లాలో 63 కేంద్రాల ద్వారా 63,665 మె.టన్నులు, వరంగల్ రూరల్ జిల్లాలో 95 కేంద్రాల ద్వారా 22,406, జయశంకర్ భూపాలపల్లి (ములుగు జిల్లా కలిపి) జిల్లాలో 239 కేంద్రాల ద్వారా 33,507, మహబూబాబాద్‌లో 69 కేంద్రాల ద్వారా 14,250, జనగామ జిల్లాలో 72 కేంద్రాల ద్వారా 23,465 మె.టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మొత్తం 5,04,602 మె.టన్నుల లక్ష్యానికి 1,17,289 మె.టన్నులు (23.24 శాతం) ధాన్యాన్ని సేకరించారు. ఈ నేపథ్యంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ల విషయంలో మరింత స్పీడ్ పెంచాలని గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించిన పౌరసరఫరాలశాఖ కమిషనర్ డాక్టర్ అకున్ సబర్వాల్ అధికారులను ఆదేశించారు.
రేషన్‌షాపులు, కొనుగోలు కేంద్రాల పరిశీలన
ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గురువారం పర్యటించిన పౌరసరఫరాలశాఖ కమిషనర్ డాక్టర్ అకున్ సబర్వాల్ కొనుగోలు కేంద్రాలు, రేషన్ దుకాణాలను పరిశీలించారు. హైదరాబాద్ నుంచి ఉదయమే హన్మకొండకు చేరుకున్న ఆయన పోలీస్ గెస్ట్‌హౌజ్‌లో ఆబ్కారీ, ప్రొహిబిష¯Œన్, పౌరసరఫరాల శాఖ, డీఆర్‌డీఏ అధికారులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ధర్మసాగర్ మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన రైతులతో మాట్లాడారు. తేమ గుర్తింపు విధానం, యంత్రాల పనితీరుపై ఆరా తీశారు.
ఇక కాజీపేట మండలం బాపూజీనగర్‌లోని 12వ నెంబర్ చౌకధరల దుకాణాన్ని తనిఖీ చేశారు. అనంతరం కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. తాగునీరు, నీడ, టార్పాలిన్లు, తూకం, తేమ యంత్రాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తూకాల్లో మోసాలను అరికట్టేందుకు ప్రతీ కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేయాలని లీగల్ మెట్రాలజీ అధికారులకు స్పష్టం చేశారు. అక్కడక్కడా తేమ పేరున తూకాలలో తగ్గింపులు జరుపుతున్నట్లు విమర్శలపై దృష్టి సారించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment