సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరించాల్సిన లక్ష్యాన్ని అధికారులు నిర్ణయించారు. ఈ ఏడాది 1.40 మెట్రిక్ టన్నులను కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనేందుకు నిర్ణయించారు. జిల్లాలో 89 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రాథమిక సహకార పరపతి సంఘాలవి 73 ఉండగా, ఇందిరాక్రాంతి పథం (ఐకేపీ) కేంద్రాలు 16 ఉన్నాయి. ధాన్యం కొనుగోలు కోసం ఐకేపీ, ప్రాథమిక సహకార సంఘాల సభ్యులకు శిక్షణను ఇవ్వనున్నారు. జిల్లాలో 64,200 హెక్టార్లలో వరి పంటను సాగు చేశారు. ఈసారి వర్షాలు కూడా బాగానే ఉండడంతో దిగుబడి కూడా అధికంగా వస్తుందనే ఆలోచనతో రైతులున్నారు. 2016–17లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 1.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యంగా నిర్ణయించగా 1.40లక్షల మెట్రిక్ టన్నులు కొన్నారు.
నాడు ఖమ్మం జిల్లాలోని 21మండలాల పరిధిలో 34,835.609మెట్రిక్ టన్నులే సేకరించారు. గతేడాది (2017–18) ధాన్యం కొనుగోళ్లను పెంచాలని నిర్ణయించారు. 56వేల మెట్రిక్ టన్నులు సేకరించాలని నిర్ణయించగా..మొత్తం 39,323.040మెట్రిక్ టన్నులు కొన్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 1.40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకోసం 89 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
రైతుల నుంచి వచ్చే ధాన్యం తీవ్రతను బట్టి..మరిన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా..? లేకపోతే ఉన్నవాటిని తగ్గించాలా..? అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ముందస్తుగా గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం అమ్మే రైతులు నాణ్యత ప్రమాణాలు ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మే రైతులు తమవెంట ఆధార్‌కార్డు, గ్రామ రెవెన్యూ అధికారి ధ్రువీకరణ పత్రం, భూమి వివరాలు, బ్యాంకు ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ (బ్యాంక్ పాస్ పుస్తకం జత చేయాలి.), బ్యాంకులో ఖాతా పనిచేస్తున్నట్లు బ్యాంకు అధికారులు ధ్రువీకరించాలి. రైతు మొబైల్ నంబర్ లేనిపక్షంలో కుటుంబ సభ్యుల ఫోన్‌నంబర్ ఇవ్వాల్స ఉంటుంది.
క్వింటా ధర రూ.200పెంపు
గతంలో గ్రేడ్–ఏ రకానికి క్వింటా ధర రూ.1590 ఉండగా..కామన్ రకం రూ.1540 ఉండేది. అయితే రైతులను ఆదుకునేందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది క్వింటాకు రూ.200 ధర పెంచుతూ నిర్ణయించింది. ఈ ధర ఈ ఖరీఫ్ నుంచి అమలు కానుంది. వీటికి గ్రేడ్–ఏ రకం క్వింటా «ధాన్యం ధర రూ.1790, కామన్ రకం క్వింటా ధాన్యం ధర రూ.1740గా నిర్ణయించారు. గతేడాది మాదిరిగానే రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతుల ఖాతాల్లో 48 గంటల్లో నగదు చెల్లింపులు చేయనున్నారు. గతంలో ఆన్‌లైన్ తదితర సమస్యలు ఎదురవగా..ఈ సారి ముందస్తు చర్యలు తీసుకోనున్నారు.
22న శిక్షణకు ప్రణాళిక..
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణకు..ఆయా సంఘాల మహిళలకు ఈనెల 22వ తేదీన ఖమ్మంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో ప్రధానంగా ధాన్యం తేమశాతం లెక్కించడం, ధాన్యంలో గ్రేడ్‌ను గుర్తించడం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. శిక్షణ అనంతరం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment